నేను తలవూపక తప్పలేదు.
ముకుందదాస్, ఇన్ స్పెక్టర్ వర్ధనరావు సమక్షంలో సుస్మిత మెడలో తాళికట్టాను. పదిలక్షల రూపాయలతో వజ్రాల వ్యాపారం రాంసింగ్ ని అర్థపార్టనర్ గా చేసుకుని ప్రారంభించాను.
సుస్మితని వాళ్ళనాన్నగారి దగ్గిరకెళ్ళి ఒకసారి చూసి రమ్మన్నాను. సుస్మిత నిరాకరించింది. "నేనూ ఆయన మొహం చూడదలచుకోలేదు. అందువల్ల నేను ఇప్పుడు లక్షాధికారినైనా ఆయన దగ్గరకెళ్ళి మాటలతో అవమానపరచదలచుకోలేదు. అసలు ఆయన్ని చూడడానికే ఇష్టపడలేదు.
"కొందరు పరిస్థితుల ప్రభావానికి లోనై నేరస్థులవుతారు. మరికొందరు ఏ నేరమూ చేయకుండానే లోకం దృష్టిలో నేరస్థులుగా ముద్రించ బడతారు. చివరికి వాళ్ళు నిర్దోషులుగా నిరూపించబడతారు. పరిస్థితులు చక్కదిద్దుకుని మంచి వాళ్ళవుతారు..."
అది నేను...నా జీవితం...నేరస్థుడు గుండూరావ్ ఏనాడో మరణించాడు. ఇప్పుడు బతుకుతున్నది నేను...దటీజ్ విజయ్ రాజ్!
కొందరన్నీ వుండి ధనమదంతో, అధికారంతో అన్నీ నేరాలే చేస్తారు. మంచివాళ్ళ మనసుని తూట్లుతూట్లు పొడుస్తారు. ఆ పనుల వల్ల వాళ్ళు ఏం సాధిస్తారో తెలీదుకాని చివరకి అతి విలువైనవి శాశ్వితంగ బ్రతికివుండగానే దూరం చేసుకుంటారు. సుస్మితని దూరంచేసుకున్నాడు సుస్మిత ఫాదర్. కన్న బిడ్డ కన్న తండ్రి మొహాన్ని చూడక పోవటానికి మించిన శిక్షకన్నా వేరేశిక్ష ఏముంటుంది ఆ తండ్రికి!
కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలకన్నా విలువైన వజ్రం ఇప్పుడు నా చెంతనవుంది. ఆమె చాలు నాకు.
30
"కొత్త కేసులు యీ మధ్య తగలటం లేదేమిటి?"
ఇనస్పెక్టర్ వర్ధనరావు రెండు కాళ్ళు టేబుల్ మీద పారేసి పై కప్పుకేసి చూస్తూ దీర్ఘాలోచన చాలించి అడిగాడు.
"రోజూ వకటో రెండో తగులుతూనే వున్నాయి కద్సార్!" హెడ్ కానిస్టేబుల్ అహోబిలం హెడ్ మీదనున్న టోపీని సవరించుకుంటూ అన్నాడు.
"కేసులు తగులుతున్నాయా! నీకేమన్నా పిచ్చా వెర్రా! కొత్త కేసులు రాక నేను అఘోరిస్తుంటే!" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
ఇన్ స్పెక్టర్ కి పిచ్చో ఆయన మాటలు అర్థంకానందుకు తనకి వెర్రో తెలియక హెడ్ మీదున్న టోపీని తీసి హెడ్ ని ఓ సారి గోక్కుని "ఈరోజు కూడా ఓ సారా కేసు, రెండు పిక్ పాకెట్ గాళ్ళ కేసులు దొరికాయి కద సార్!" అన్నాడు అయోమయంగా ముఖం పెట్టి అహోబిలం.
"ఏం బుర్రయ్యా నీది టు నాట్ టు! ఇవి కేసులా ఇవసలు కేసులా అని. లాకప్ మరణాలు కూడా వెంట్రుక ముక్క సమానంతో ఆ ... కేసుల్ని కూడా తీసిపారేస్తున్న ఈ రోజుల్లో వీటిని కేసులంటే ఎవరన్నా నవ్విపోతారు. కేసంటే ఎలా వుండాలి రూపాయి పెట్టి లాటరీ టిక్కెట్టు కొంటే లక్ష రూపాయల ప్రైజు తగిలినట్లు కేసు వుండాలి. సరీగ చెప్పాలంటే కోటీయాభై లక్షల రూపాయల విలువగల వజ్రాల కేసులాగా కేసు వుండాలి అర్థమైందా!"
"ఇప్పుడు అర్థమైంది సార్! కానీ మళ్ళీ ఏ ముకుందదాస్ లాంటి కోతికి పడగలెత్తిన మహానుభావుడో కోటీయాభయ్ లక్షల విలువగల వజ్రాలు పారేసుకోవాలి... విజయ్ లాంటి వాళ్ళు మనకి తగలాలి..." వజ్రాలు దాచిన టోపీ మీకు దొరకాలి...
"ఆపెయ్! ఇంక ఆపెయ్! హెడ్ లేని హెడ్ కానిస్టేబుల్ వి నీవు. దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావుని నేను ఎందుకయ్యానో తెలుసా! నీకు తెలియదు ఎందుకంటే..."
"మీరు నా పైవారు. నేను మీకింద వాడిని కాబట్టి. అంతేసార్! సరీగ అంతే" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆ మాటలకి మధ్యలో అడ్డు తగిలి అన్నాడు అహోబిలం.
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆ మాటలకి పొంగిపోయాడు (పొగడ్తకి పొంగిపోనివాడు మనిషెలా అవుతాడు!)
"యూ ఆర్ కరెక్ట్! ఇప్పుడు చెపుతాను విను. తాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసాలు, హత్యలు ఇవి నిత్యం జరిగే వకేరకం కేసులు. ఈ కేసులు లేకపోతే పోలీసు డిపార్టుమెంటే వుండదు. అలాంటి కేసులు పదికాలాలపాటు సాగుతూనే వుండాలి. మన పోలీసు స్టేషన్ లు ఎర్రగ మనం పచ్చగ పదికాలాలపాటు వుండాలి. ఇట్సాల్ రైట్. ఇంత చిన్న విషయాల గురించి మనం ఆలోచించకూడదు.
ఇందాక ఏమన్నావ్! అలాంటికేసే మళ్ళీ దొరకాలి కద సార్! అలాంటి కేసే అక్షరాలా అలాగే మళ్ళీ ఎలా దొరుకుతుంది! దొరుకుతుందని అసలెలా అనుకున్నావ్! ఇంతకుముందే నా ఊహకి అందింది. అక్షర లక్షలు అంటే కోటానుకోట్లు అన్నమాట అలాంటి కేసు తగులుతుంది అని..."
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అలా అంటుంటే వళ్ళు మండింది. ఆహోబిలానికి "ఊహ రాంగానే కేసు తగులుతుందేమిటి?" అని లోపల అనుకున్నాడు పైకి అనే ధైర్యం లేక.
"ఈ కేసు మనం పడితే నీకు లక్ష నాకు పదిలక్షల పారితోషికం ముడుతుందని నా సిక్త్ సెన్స్ అదేపనిగ చెపుతున్నది." ఇన్ స్పెక్టర్ వర్ధనరావు బల్లగుద్ది మరీ చెప్పాడు.
"నా బొంద" అనుకున్నాడు అహోబిలం పైకిమాత్రం "మంచిదేకద సార్!" అన్నాడు.
"అయితే నా మాటల మీద నమ్మకం కుదిరింది కదా! సరే రేపటి నుంచే ఆలోచించు."
"ఏ విషయం సార్!"
"అదేనయ్యా! మనకి తగలబోయే కోటానుకోట్లు కేసులో మళ్ళీ మనం మారువేషాలు వేయాలికదా! వెరైటీ మారువేషాల గురించి ఆలోచించు. అప్పటికప్పుడంటే ఏం వేషాలు వేయాలో తెలియక కంగారయి పోతుంది. నేనూ ఆలోచిస్తాను నీవూ ఆలోచించు వెరైటీ వేషాల గురించి..." అని చెప్పి దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అప్పటి కప్పుడే ఊహాలోకంలోకి వెళ్ళిపోయాడు.
"ఆ...!" అంటూ నోరు తెరిచాడు అహోబిలం.
* సమాప్తం *
