Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 65


    "ముందు ఫైవ్ నాట్ ఫైవ్ ని ఇంటికి వెళ్ళమని చెప్పి ఇటు నీకు ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఈ విషయం నాకు ఫోన్ చెయ్యొద్దు. ఏ కానిస్టేబుల్ అయినా ఫోనెత్తితే బావుండదు. నేను ఇంటికి ఈ పూట తొందరగా వచ్చేస్తాను."


    "ఆ మాత్రం నాకు తెలీదా ఏమిటి? మీకన్నా కాస్త ఎక్కువే తెలివి వుందిలెండి నాకు" అంది మిసెస్ వర్ధనరావు.


    ఆ తరువాత అటు ఆమె ఇటు నేను ఫోన్ పెట్టేశాం.


    నా ప్లాన్ సక్సెస్ అయింది...నా ఊహ నిజమైంది...నా కల ఫలించింది.


    టోపీతో సహా అరగంటలోపే రామ్ సింగ్ తిరిగొచ్చాడు.


    ఇరువురం అక్కడేమీ మాట్లాడుకోలేదు. మా రూమ్ కి చేరాం.


    రూమ్ లో తలుపులు బిడాయించుకొని టోపీ లోపలవున్న గుడ్డని బ్లేడుతో కోసి వజ్రాల మూటని పైకి తీశాం.


    మూటని విప్పి చూశాం.


    మా కళ్ళు ఒక్కసారిగా జిగేల్ మన్నాయ్. అవి గుప్పెడు వజ్రాలు. వాటి విలువ కోటీ యాభై లక్షల రూపాయలు.


    ఇప్పుడు మేము కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలకి అధిపతులం.


    కాని మేము మానవత్వంగల మనుషులమని నిరూపించుకోవాలనుకుంటున్నాం.


                                           29


    ముకుందదాస్ ఇంటికి


    నేను, రామ్ సింగ్ ముందే ఫోన్ చేసి వెళ్ళాం.


    ముకుందదాస్ మా కెదురొచ్చి లోపలికి గౌరవంగా తోడ్కొని వెళ్ళాడు.


    ఆయన భక్తి పరుడయ్యుంటాడు. మొహాన బొట్టు...మాటల్లో వినమ్రత...అంత డబ్బుండికూడా కించిత్ గర్వంకూడా లేకుండా అతి మామూలుగా వున్నాడు.


    మేము కూర్చున్న తరువాత మామధ్య సంభాషణ మొదలయ్యింది.


    "కోటీ యాభై లక్షల రూపాయల విలువచేసే వజ్రాలు పోయినట్టు ఆనాడే పోలీసులకి కంప్లయింట్ ఇచ్చాను. వాటిని ఎవరూ దొంగతనం చేయలేదు. నేనే జర్నీ చేస్తూ పొరపాటున అంత విలువగల వజ్రాలున్న బ్యాగ్ ని పోగొట్టుకొన్నాను. 'ఎవరి చేతికైనా చిక్కితే నాకు అందిచ్చమని...తగిన బహుమతి ఇస్తానని...' పేపరులో ప్రకటిద్దామను కొన్నాను. కాని పోలీస్ వారు 'పేపర్ ప్రకటన ఇచ్చి లాభంలేదు. మీ బ్యాగ్ ఎవరో కొట్టేసినట్టు కంప్లయింట్ రాసివ్వండి' అని కోరడంతో అలాగే రాసి యిచ్చాను. కోటీ యాభై లక్షల రూపాయిల విలువగల వజ్రాలంటే మాటలు కాదు. పోయినవాటి ఆచూకీ తీసి నాకు సురక్షితంగ అప్పజెప్తే ఇన్ స్పెక్టర్ గారికి లక్ష రూపాయలు, కానిస్టేబుల్స్ కి పాతికవేల చొప్పున నా సంతోషం కొద్దీ ఇస్తానని ఆనాడే చెప్పాను. ఇన్నాళ్ళయినా కూడా నా వజ్రాలు నాకు దొరకలేదు. "పోయిన వజ్రాల గురించి మాకు తెలుసు. అవెక్కడున్నాయో మీకు చెబుతాము" అని మీరు ఫోన్ చేయటము, నేను రమ్మంటము జరిగింది. మీరెవరో నాకు తెలీదు. వజ్రాల సంగతి మీరేం చెప్పగలరు? నాకు చాలా ఆశ్చర్యంగా వుంది" ముకుంద దాస్ మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.


    నేను మారు మాట్లాడకుండా జేబులోంచి మూట తీశాను.


    ఖర్చీఫ్ మూట విప్పి "మీ పోయిన వజ్రాలు ఇవేనా?" అన్నాను.


    ముకుందదాస్ కళ్ళల్లో చెప్పలేనంత ఆశ్చర్యం. రెండు మూడింటిని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూశాడు.


    ఆ తరువాత మొత్తం అవెన్ని ఉన్నాయో లెక్కబెట్టాడు.


    జేబులోంచి భూతద్దం తీసి వజ్రాలను అటు ఇటు తిప్పుతూ మరింత పరీక్షగా చూశాడు.


    అప్పుడు... "నా చేయి జారిన వజ్రాలు ఇవే. ఇవి నావే. దొరకవు అనుకుని నిరాశ చెందుతున్న సమయంలో మళ్ళీ నా ఇంటికి లక్ష్మీ దేవిలా నడిచి వచ్చాయ్. మీరెవరు? నా పాలిత దేవదూతలా!" ఆయన ఆనందంగా మా ఇద్దరి చేతులూ పట్టుకొని ఊపుతూ అన్నాడు.


    "మారో పెద్ద కథ. మొదట్నుంచీ చెబుతాను. విని అర్థం చేసుకోండి చాలు" అన్నాను.


    "చెప్పండి. మీరేం చెప్పినా నమ్ముతాను. ఇంత విలువైన వజ్రాలను ఎవరూ తెచ్చి ఇవ్వరు. మీరు తెచ్చి ఇవ్వటాన్నిబట్టే మీరెలాంటివారో గ్రహించాను.


    అయినా చెప్పండి. వింటాను" అన్నాడు ముకుందదాస్.


    నేను, నా కాలేజీ జీవితం దగ్గర్నుంచి ఈరోజు వరకు ఏమి జరిగిందీ అక్షరం పొల్లుపోకుండా అరగంటసేపు నా కథని వినిపించాను.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS