సదాశివయ్యతో బాటు వేదికపై కూర్చున్న జయచంద్ర చిన్న చప్పుడికి సైతం ఉలిక్కిపడుతున్నాడు.
అప్పటికే ఫర్లాంగు వ్యాసార్థంలో జయచంద్ర తన బలగాన్ని మోహరింపచేసాడు. పైగా హోం మినిస్టర్ కూడా పోలీసుల్ని రంగంలోకి దింపాడు.
అవినాశ్ పకడ్బందీగా చుట్టూ పచార్లు చేస్తున్నాడు.
"అయినా ఇదేంటీ... ప్రసాద్ ఫోన్ చేసాడంటాడు. సదాశివయ్యకు మతి భ్రమించిందా" ఉన్మాదిలా తనలో తానే మధనపడుతున్నాడు జయచంద్ర.
సర్కార్ చంపేసి శవాన్ని ఏసిడ్ లో పడేసి ఉడకబెట్టానన్నాడే... కొద్దు తప్ప మరేం మిగల్లేదని మరీ మరీ చెప్పాడే...
ఎక్కడ పొరపాటు జరిగింది.
ఆవరణలో కుర్చీల్లో కూర్చున్న జనంకేసి తేరిపార చూడడంలేదు జయచంద్ర...
దూరంగా చీకటిలో ఎక్కడో కాపువేసిన శశాంక గురించి ఆలోచిస్తున్నాడు...
అసహనంగా వుంది.
అప్పటికే చీఫ్ గెస్టు సదాశివయ్య తన ఉపన్యాసం మొదలుపెట్టాడు.
జయచంద్ర స్థిమితంగా వుండలేక పోతున్నాడు.
సర్కార్ ని పిలిచి వివరణ అడగాలని సైడ్ వింగ్ వేపు తల తిప్పి చూసిన జయచంద్ర పక్కలో బాంబు పడ్డట్టు అదిరి పడ్డాడు.
అక్కడ ఫేక్టరీ యూనిఫాంలో కర్టెను పక్కనే నిలబడి వున్నాడు శశాంక.
శశాంక చేతిలో సైలెన్సర్ అమర్చబడిన రివాల్వర్ కాటేయబోతున్న నాగులా క్రూరంగా మెరుస్తూంది.
ఇంతటి రక్షణ వలయాన్ని దాటుకుని అంత సమీపంలోకి ఎలా వచ్చాడు శశాంక...
నిశ్శబ్దంగా కూచున్న కార్మికులు గాని, వారినుద్దేశించి మాటాడుతున్న సదాశివయ్య గాని ఆ క్షణంలో జయచంద్రకి గుర్తుకు రాలేదు.
టప్ మన్న చప్పుడు.
అంతే...
జయచంద్ర కుర్చీలో నుంచి నేలకొరిగాడు ఓ ఆర్తనాదంతో.
ఒక్కసారిగా అక్కడి వాతావరణం చెదిరిపోయిన సూచనగా కొందరు కార్మికులు కకావికలై పరుగెత్తగా మరికొందరు వేదికవేపు దూసుకొచ్చారు.
అప్పటికే ఉపన్యాసాన్ని ఆపిన సదాశివయ్య ఒక్క అంగలో నేలమీద పడ్డ జయచంద్రని సమీపించి "ఏమైంది" అంటూ ఒడిలోకి తీసుకున్నాడు.
ఎక్కడో చీకటిలో శతృవుకోసం కాపువేసిన అవినాశ్ వేగంగా డయాస్ ని చేరుకుని "డోంట్ మూవ్" మైకులో హెచ్చరించాడు ఎవరూ కదలడానికి వీల్లేదన్న భావం స్పురించేలా. "నేను ఆదేశించేవరకు ఎవర్నీ బయటికెళ్ళనివ్వద్దు" అంటూ తన పోలీస్ బలగానికి ఇన్ స్ట్రక్షన్స్ జారీ చేశాడు.
అప్పుడు చూసాడు అవినాశ్.
రక్తంతోకాక చెమటతో తడిసిపోయిన జయచంద్రని.
"సాబ్" సర్కార్ జయచంద్రని పైకి లేవదీస్తూ "మీరనుమానించినట్లు మీకేం కాలేదు" అన్నాడు రహస్యంగా.
తన నిఘంటువులో భయమన్న పదాన్ని ఏనాడో చెరిపేసుకున్న జయచంద్ర ఎందుకిలా ప్రవర్తించిందీ వూహకందక సదాశివయ్య రెప్పలార్చకుండా చూస్తున్నాడు.
"అవును మరి వాడు..." గొణుగుతున్నాడు జయచంద్ర.
"ఇందాక ఇక్కడ నిలబడి నన్ను షూట్ చేయబోయాడే"
"ఎవరు... ఎవరతను" అడిగాడు అవినాశ్.
"వాడే... ప్రసాదు" టక్కున జవాబిచ్చాడు సదాశివయ్య బిడియాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తలూపాడు సదాశివయ్య సమయస్ఫూర్తికి తనూ వంత పలుకుతూ. శశాంక పేరు చెప్పడానికి మనస్కరించలేడు.
తన స్వహస్తాలతో చంపిన ప్రసాదు ఇక్కడికి రావడమేమిటి... నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు సర్కార్.
వార్షికోత్సవ సభ సాంవత్సరీకంలా అర్ధంతరంగా ముగిసింది.
"ప్రసాద్ ని గాలించండి" వాడు తప్పించుకోకూడదు. ఇక్కడే నక్కి వుంటాడు" సదాశివయ్య అవినాశ్ కేసి చూస్తూ అంటుండగానే జయచంద్ర కారు కదిలింది.
కారులో అతడికిరుపక్కలా సాయుధులై కూచున్నారు సర్కార్, కుమార్ దాదాలు.
తన బంగళాకి తిరిగొచ్చి పై అంతస్తులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తీసి అదురుపాటు నుంచి నెమ్మదిగా తేరుకుంటూ సోఫాలో రిలాక్సయిన జయచంద్ర ఇంకా ఆలోచిస్తున్నాడు.
శశాంక ఫోన్ చేసి చెప్పింది తను వేదికపై వుండగానే కాల్చి చంపుతానని.
అంటే ఇందాక తను భ్రాంతిచెందాడా...
ఒక వ్యూహంతో శతృవుపై దాడి చేస్తున్నట్టు తెలిపేలా చేసి బలాన్ని అక్కడ మోహరింపచేశాక మరో వ్యూహాన్ని అమలుపరిచి నిశ్శబ్దంగా దాడిచేసే ఓ యుద్ధ నీతే ఇక్కడ శశాంక ఆచరింపబోతున్నాడని పోరాటంలో అంతటి అనుభవంగల జయచంద్ర సైతం వూహించకపోవడం దురదృష్టమే.
* * * *
