Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 65


    
    శౌరి మౌనంగా ఉండిపోవడంతో సౌదామినే అంది. "కష్టాల్లో ఉన్న స్నేహితుల గురించి ఆలోచించడం తప్పుకాదు శౌరీ. హాస్పిటల్సుకి వెళ్ళి చూసి రావాలి. ఓదార్పునీ అందించాలి. కాని అర్ధరాత్రిదాకా ఇళ్ళకు వెళ్ళడమూ, అక్కడ..." ఆగిపోయింది.
    
    "ఏమిటి ఆంటీ?"
    
    చెప్పింది క్లుప్తంగా "ఈరోజు తొలిసారి కేరియరు పట్టుకెళ్ళింది. వెళ్ళింది తిరిగి రావచ్చుగా" అక్కడనుంచి ప్రబంధ కెరీర్ కేదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుగా అంది. "ఇప్పుడు ఆదిత్యతో చెట్టాపట్టా లేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిందట. ఇలా అంటున్నది నేను కాదయ్యా కొన్ని నిముషాల క్రితం ఎవరో అబ్బాయి ఫోన్ చేశాడు. ఇవాళే కాదు, రెండు మూడు రోజులుగా ఇలా చేస్తూనే వున్నాడు. మొహం వాచేట్టు చీవాట్లు పెట్టాను. ఆదిత్య ఇంటికి వెళ్ళినంత మాత్రాన అతనితో ఏదో సంబంధం పెట్టుకున్నట్లేనా అని నిలదీశాను. ముఖ్యమంత్రి కూతురు అంత సులభంగా ఆదిత్యతో అంత దూరం వెళ్ళదని తెగేసి మరీ అన్నాను. అన్నానే కాని నా భయం నాకూ ఉంటుందిగా శౌరీ!"
    
    తాగిన మైకం పూర్తిగా దిగిపోయిందేమో- శౌరి సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
    
    అన్నిటికన్నా ప్రస్తుతం ప్రబంధ ఆదిత్య ఇంట్లో, అదీ ఒంటరిగా ఏం చేస్తుందీ అన్న ఆరాటం ఉక్రోషంగా మారిపోతుంటే ఆదిత్యకి బుద్ది చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని నిర్ణయించేసుకున్నాడు.
    
    అసలు హాస్పిటల్ నుంచి ఆదిత్యతోబాటు ప్రబంధని ఇంటిదాకా వెళ్ళమన్నదీ, అతడిని మరింత ఆకట్టుకోమన్నదీ సౌదామినే కాని, ఇప్పుడు కోరి నిప్పురవ్వని రగిల్చేసింది.
    
    బయలుదేరాడు శౌరి సుధీర్ తో బాటు.
    
                                                               * * *
    
    "ఏమిటలా ఉన్నారు?" అడిగింది ప్రబంధ అన్యమనస్కంగా మరెటో చూస్తున్న ఆదిత్యని.

    
    అయిదు నిమిషాల క్రితం ఇంటికి వచ్చారు ఇద్దరూ.
    
    ఇంటి దగ్గర డ్రాప్ చేసి ప్రబంధ వెళ్ళిపోయిందనుకున్నాడు కాని సరాసరి ఇంట్లోకి వచ్చింది. అది కాదు ఆదిత్యను ఆందోళనపరుస్తున్నది. ప్రబంధ మౌనంగా ఏ తుఫానుకో నాందిలా అనిపిస్తూంది.
    
    మామూలు స్నేహం అయితే మాటలకి కరువు ఉండదు. ఏదో అడగాలని తనూ ప్రిపేరవుతున్నట్టు అర్ధమైంది.
    
    "మీకు టైమవుతుందేమోకదూ?" అన్నాడు నీళ్ళు నములుతూ-
    
    "దేనికి?' గొణుగుతున్నట్టుగా అంది ప్రబంధ తల వంచుకుని.
    
    "ఇంటికి వెళ్ళరూ? కంగారుపడతారు."
    
    "మీకా భయం అక్కర్లేదు. ఏ స్థితిలోనూ నన్నెవరూ ప్రశ్నించరు. అలా ప్రశ్నించనివ్వను" మొండిగా అంది.
    
    "అది కాదు ప్రబంధా!" నచ్చచెప్పబోయాడు.
    
    ఒకవేళ ప్రబంధ తనపైన ఆసక్తిని ప్రదర్శించడమే నిజమైతే వెంటనే అది కూడదని చెప్పాలని ఉంది కాని, ఎందుకో ఇది సమయం కాదనిపించింది.
    
    తన మనసులోని మాటని ఖచ్చితంగా, స్పష్టంగా చెప్పటానికి ఇంతకంటే మంచి అదను రాదనుకున్న ప్రబంధ ఇక సంశయించలేదు.
    
    "మీతో ఓ విషయం మాట్లాడాలి" తల పైకెత్తకుండానే అంది.
    
    "చెప్పండి."
    
    ఎందుకో వెంటనే గొంతుపెగల్లేదు ప్రబంధకి. అసలు ఇలాంటి విషయం ఎక్కడ ప్రారంభించాలో తెలీడంలేదు. అదే క్విజ్ కాంపిటీషన్ అయితే దూకుడుగా దూసుకుపోయేది.
    
    "ఈ ప్రపంచంలోనే నెక్కువ ఇష్టపడేది...." క్షణం ఆగి అంది. "నా ఆలోచనల్ని."
    
    నిశ్శబ్దంగా చూస్తున్న ఆదిత్య అదో ప్రత్యేకమైన థియరీ అనుకోలేదు కాని ఖండించలేకపోయాడు.
    
    "బాల్యం నుంచే నేను పేర్చుకున్న ప్రపంచంలో ఒంటరిగా పెరిగిన దాన్ని కాబట్టే నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతగా ఆసక్తిని ప్రదర్శించకుండా, నా ప్రపంచాన్నే సుందరమైనదానిగా భావించడం నాకు అలవాటైంది. కొందరు దీన్ని అహం అన్నారు అయినా బాధపడలేదు. కారణం నేను ఎక్కువ ఇష్టపడేది నన్నే కాబట్టి.... అలా ఏది ఇంతకాలం మిస్సయ్యానో ఇప్పటికి బోధపడింది అంటే మీరు తొలిసారి పరిచయం అయ్యేదాకా..."
    
    నివ్వెరపోయాడు ఆదిత్య ఏ ప్రసక్తి రాకూడదనుకున్నాడో అది ప్రబంధ ప్రారంభించేసింది తనకంటే ముందుగా.
    
    "చాలా చదివాను ఆదిత్యా! విశ్లేషించడం తెలీకుండా చాలా చాలా చదవడం అలవాటు చేసుకున్నాను. అందుకే 'తొలి చూపులో ప్రేమ'న్నది ఓ ఇన్ ఫాట్యుయేషన్ గా భావించేదాన్ని. ఆ రోజు మన పోటీలో మీరు నాకు ప్రత్యర్ధిగా నిలబడ్డప్పుడు ఇతడు నన్ను ఓడించాల్సిన మనిషి అనుకుంటూనే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టే ఓడిన నేను పందెంలో చివరి ఒప్పందాన్ని అయిష్టం ప్రదర్శిస్తూనైనా అంగీకరించానేమో కూడా. కాని మీరు కాదని వెళ్ళిపోయారు. అక్కడే నేను నేర్చుకున్న ప్రపంచం కొద్దిగా కనిపించింది 'నేను' అనే అహంతో పెంచుకున్న నా వ్యక్తిత్వం నిజంగా కించపడింది కూడా అదే క్షణం. మామూలుగా అయితే మీ మీద మరోలాగా పగ తీర్చుకోవాలనుకునేదాన్ని కాని ఆ పని చేయలేదు. కారణం మీరంటే నేను పెంచుకున్న ఇష్టం."
    
    నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పుకుపోతోంది "సంశయం అన్న పదం తెలీనిదాన్ని కాబట్టి ఏకాంతంలో మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు ఆదిత్యా! తరువాత తెలిసింది ఒంటరితనానికి అర్ధం ఏమిటో, ఏ మనిషితో ప్రత్యేకించి మాట్లాడేదీ లేకపోయినా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండాలని పిస్తుందో, మౌనంగా కూర్చునే అయినా ఏ మనిషిముందు రోజుల తరబడి ఉండిపోవాలనిపిస్తుందో, ఎవర్ని కలుసుకోవడం అమితమైన అనందాన్నిస్తుందో, ఎవర్ని ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదని మనసు పదే పదే హెచ్చరించి అల్లరిచేస్తుందో, అతడే నిజమైన కంపేనియన్ గా తెలిసింది. ఆ స్థానంలో మిమ్మల్ని చూసుకోవటం అలవాటు చేసుకున్నాను."
    
    ఆదిత్య వెన్నులో చలి మొదలైంది సన్నగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS