అతను అందుకుంటుంటే ఆ కళ్ళల్లోకి తీక్షణంగా చూశాను. 'వసంతలాగా నన్ను ట్రీట్ చేస్తున్నావా? వసంతని కూడా ఇలా చీటికీ మాటికీ మట్టుకుని, ఒళ్ళంతా తడుముతావా? ఆముక్తలాంటి అమాయకపు పిల్లమీద అధికారం చెలాయిస్తూ స్వంతం చేసుకోవడం థ్రిల్ గా ఉంటుంది కానీ ఇలా మాటిమాటికి ఒకడ్ని ప్రేమించి భంగపడి విచారించే పిల్లని పెళ్ళాడ్డంలో ఏం ఆనందం?
అందుకని కట్టె విరగకుండా, పాము చావకుండా నాతల్లితండ్రులతో 'మీ కొడుకులాంటివాడ్ని' అనే సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి ఇంట్లో నీ స్థానం పదిలం చేసుకుంటున్నావు.
అన్నలాంటి వాడివేగానీ అన్నవికాదు కాబట్టి నా ఒళ్ళంతా నిమిరీ, తాకీ శునకానందాలు పొందుతుంటావు. అంతేనా? 'యూ ఆర్ ఎ ఉల్ఫ్... ఎప్పుడో కబళిస్తావు'. ఇదంతా నేను మనసులో అనుకుంటూ కళ్ళతో ఎక్స్ ప్రెస్ చేశాను.
అతను పెద్దగా పట్టించుకోడని నాకు తెలుసు. నా వీక్ పాయింట్స్ అతనికి తెలుసు. అవి తను స్ట్రాంగ్ గా ఉపయోగించదలుచుకుంటున్నాడు. కానీ అతనికి తెలియనిదల్లా నేను అప్పటి ఆముక్తని కాదని!
మాధవ్ వెళ్ళిపోయేముందు "ఉద్యోగంపోతే ఇంకోటి దొరకడం కష్టం. సాయంత్రం నుండి వెళ్ళు" అన్నాడు.
అవును! నేను ఉద్యోగానికి వెళ్తేనే తను నాకు ఫోన్స్ చెయ్యగలడు. నేను సాయంత్రాలు ఏ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు కొట్టకుండా బుద్ధిగా కొట్లో కూర్చుంటాను! ఏ హక్కూ లేకపోయినా ఎంత పోజిసీవ్ నెస్?
"మానెయ్యదలుచుకున్నాను." ఠకీమని చెప్పాను.
"ఏం?" కాస్తగట్టిగా అడిగాడు.
"పరీక్షలొస్తున్నాయి" అన్నాను.
"మరి డబ్బూ..." అడిగాడు!
"ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకుంటాను" అన్నాను.
ఏమీ అనలేక "నీ ఇష్టం" అని వెళ్ళిపోయాడు.
అతను అలా లోలోన ఉడికిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతటితో ఆపాలనిపించలేదు!
కాలేజీకి వెళ్తూ వసంతకి ఫోన్ చేసి సాయంత్రం రమ్మని చెప్పాను.
ఆమెని నాతోపాటు లిల్లీ దగ్గరికి తీసుకెళ్ళాలనిపించింది. వసంతని మాధవ్ ఎంత కట్టడిలో పెడ్తాడో నాకు తెలుసు! ఇంటర్ తప్పితే మళ్ళీ చదివించాలని ప్రయత్నం కూడా చెయ్యలేదు!
ఆమెకి ఎవరూ స్నేహితులుకూడా లేరు. ఆడపిల్ల అలాగే పెరగాలనీ తన వర్దీలోంచి ఆమె భర్త ఆధీనంలోకే వెళ్ళాలనీ నమ్ముతాడు.
వసంతకూడా అదే నమ్మితే ఫర్వాలేదు. కానీ ఆమెకంటూ వేరే అభిప్రాయాలూ, కోరికలూ ఉంటే మాత్రం అణిచిపెట్టడం అన్యాయం! బావిలో కప్పలాంటి వసంతని కాస్త పైకి తీయాలనిపించింది.
* * *
వసంతతో కాసేపు మాట్లాడాక నా అంచనాలూ, అభిప్రాయాలూ తప్పని తెలిసింది. ఆమెకి నాకన్నా ఎక్కువే ప్రపంచం తెలుసు. నైల్స్ దగ్గర నుండి తలలో కర్ల్స్ వరకూ ఎలా మెయిన్ టైన్ చెయ్యాలో లేటెస్ట ఫ్యాషన్స్ ఏవిటో కంఠతా పట్టినట్లు చెప్పెయ్యగలదు.
ఆంజనేయులు అనే కుర్రాడికి మనసుకూడా ఇచ్చేసి రెండు సంవత్సరాలవుతోందిట. మనసిచ్చేశాకా అతని పేరు తెలిసి నచ్చక మార్చేసిందట! అతన్ని కాదు... పేరు! అంజనీకుమార్ అని పెట్టిందట.
"మరి మీ అన్నయ్యతో నీ ప్రేమ విషయం చెప్పావా?" అని అడిగాను.
"లేదు. అంజనీకుమార్ కి ఇంకా ఉద్యోగం దొరకలేదు. దొరకగానే చెప్తాను" అంది.
నాకు ఆ నిమిషంలో మాధవ్ మీదవున్న కోపం అంతా పోయి పుట్టెడు జాలేసింది.
తను ఎంతో అమాయకురాలనుకుంటున్న తన చెల్లెలు, తను నోట్లో వేలుపెడ్తే కొరకలేదు అనుకుంటున్న చెల్లెలు, ఇలా తన పెళ్ళి తనే సెటిల్ చేసుకుని, అది అతని దగ్గరే దాచిపెట్టి, అవసరం తీరగానే ఎనౌన్స్ చేస్తుందని తెలిస్తే ఎలా తట్టుకుంటాడో అనిపించింది!
నాకు అమ్మా, నాన్నా కళ్ళల్లో మెదిలారు. వాళ్ళకి తెలీకుండా కాలేజీలో, బయటా ఎన్నో ప్రేమలు వెలగబెట్టాను. ఎంత అమాయకంగా నన్ను నమ్ముతారూ!
అలా వాళ్ళని మోసం చేసిన నాకు, ఇంకో మగాడు నన్ను మోసం చేశాడనీ, నిజాల్ని నా దగ్గర దాచిపెట్టి తన పబ్బం గడుపుకోజూశాడనీ, ఏడ్చే హక్కు ఎక్కడుంది?' నేను మోసగత్తెని కానా?
కళ్ళల్లో కనుపాపల్ని నమ్మినట్లు తల్లితండ్రులు పిల్లల్ని నమ్ముతారు. వాళ్ళని మోసం చెయ్యగలిగితే రేపు ఇంకోళ్ళని మాత్రం మోసం చెయ్యలేరా? నాలో అంతర్మధనం మొదలయింది. లిల్లీని...వసంతనీ గమనించాకా, లిల్లీ కన్నా వసంత హాయిగా ఉందని తెలిసింది.
తనకు తెలిసిన చిన్న ప్రపంచంలో వసంత చాలా హాయిగా వుంది. ఆ అమ్మాయి చెప్పే కబుర్లలో అన్నీ తన మంచితనం గురించీ ఇతరుల చెడు గురించే!
'పక్కింటావిడ వాళ్ళాయనని 'నువ్వూ' 'ఏమోయ్' అంటుంది. ఛ! నేను పెళ్ళయ్యాక చస్తే అలా పిలవను. మీరు అనే అంటాను. ఎదురింటావిడ ఎప్పుడూ కిటికీలోనుండి మా అన్నయ్యనే కన్నార్పకుండా చూస్తుంటుంది. ఆవిడ మొగుడేం బావుండడులే పాపం!'
ఇలా సాగుతాయి ఆమె మాటలు. అటువంటి అమ్మాయితో ఏం మాట్లాడాలో నాకు అర్థంకాలేదు.
"బయటికి వెళ్దాం అన్నావూ?" అడిగింది.
వసంతని తీసుకుని లిల్లీ దగ్గరికి వెళ్ళే ధైర్యం నాలో లేదు. ఈవిడ లిల్లీ జీవిత విధానం గురించి బాకా ఊదినట్లుగా రేపట్నుండీ ఏం ప్రచారం చేస్తుందో నాకు తెలుసు. తాను నమ్మిన బాటలో నిర్భయంగా నడిచే లిల్లీలాంటి వాళ్ళని చూస్తే, ఇతరులు గీసిన వృత్తంలో గింగిరాలు తిరుగుతున్న వసంతలాంటి వాళ్ళకి మంటగా ఉంటుంది. అందుకే నాకు తలనెప్పిగా వుందని తప్పించేశాను!
