Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 64


    ఆ తరువాత


    కుర్ర కానిస్టేబుల్ చెప్పింది రాంసింగ్ తో చెప్పాను. నా ప్లాన్ కూడా చెప్పాను.


    "ఇందులో మనకి పోయేదేమీలేదు. పాచిక పారిందంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. కాని చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా మెలగాలి సుమా!" అని రాంసింగ్ కి ప్లాన్ చెబుతూ ఒకటికి రెండుసార్లు గట్టిగా హెచ్చరించాను.


    ఆ సాయంత్రం.


    రాంసింగ్ చెప్పిన విధంగా పోలీస్ కానిస్టేబుల్ దుస్తులు ధరించి వర్ధనరావు ఇంటికి వెళ్ళాడు.


    ఇక్కడున్న నేను పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో దూరి ఫోన్ అందుకున్నాను. ముందుగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. స్వరం మార్చి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుతో మాట్లాడాను.


    "అయ్యో ఇన్ స్పెక్టర్ గారూ! ఒంటరిగా నేనింట్లో ఉంటే ఒక దొంగ ఇంట్లో దూరాడు. బెడ్ రూమ్ లోకెళ్ళి బీరువా కెలుకుతుంటే చాటుగా చూసిన నేను ధైర్యం తెచ్చుకుని గబుక్కున బెడ్ రూమ్ తలుపులు బయట వేసేశాను. వాడు లోపలనుంచి అరుపులు.


    "తలుపు  బద్దలు కొట్టుకొని బయటికి వస్తాను...నా చేతిలో కత్తి వుంది... రివాల్వర్ వుంది... దొంగని నీ ప్రాణం తీస్తాను__తలుపు తీస్తావా లేదా" అని అరుపులు.


    మా ఇల్లు ఊరికి కాస్త పక్కగా కట్టుకున్నాం. ఇళ్ళన్నీ దూరం దూరంగానే వున్నాయ్. ఇటుపక్క వాళ్ళు సినిమాకి, అటు పక్కవాళ్ళు ఊరికి వెళ్ళారు. నాలుగిళ్ళ అవతల వున్న ఇళ్ళన్నీ సింధీ వాళ్ళవి. నా భాష వాళ్ళకి రాదు. వాళ్ళ భాష నాకు రాదు.


    దొంగల్ని పట్టుకోవడంలో మీరు చాలా ప్రతిభాశాలురని మొన్నీమధ్య పేపరులో మీ గురించి ఫోటోతో సహా వేసి రాశారు అందుకని మీకే ఫోన్ చేస్తున్నాను. ఏ కానిస్టేబుల్నో పంపించక హుటాహుటిన మీరే బయల్దేరివచ్చి శ్రీకృష్ణ పరమాత్మలాగ చక్రం అడ్డువేసి, ఈ దొంగ బారినుంచి నన్ను రక్షించి వీడ్ని స్వయంగా మీరే పట్టుకెళ్ళండి.


    నా ఎడ్రస్ ఇది...తొందరగా వచ్చేయండి" అంటూ కంగారు కంగారుగా ఆడ గొంతుకతో ఫోన్ చేసి పెట్టేశాను.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు హుటాహుటిన బయల్దేరి వెళ్ళినా అక్కడి కెళ్ళేసరికి ముప్పావుగంట పడుతుంది. రాను ముప్పావుగంట పోను ముప్పావుగంట. ఆ ఇల్లు వెతుక్కోటానికి మరికొంత టైము. నా పని పూర్తి కావడానికి ఈ టైము చాలు.


    అయిదు నిమిషాలాగి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి మళ్ళీ ఫోన్ చేశాను.


    అయిదు నిమిషాలాగి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి మళ్ళీ ఫోన్ చేశాను.


    "అర్జంట్ కేసు ఏదో వస్తే ఆయన బైటికి వెళ్ళారు" అని అక్కడున్న కానిస్టేబుల్ చెప్పాడు.


    నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాను.


    ఈ తఫా ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఇంటికి ఫోన్ చేశాను.


    ఆయన భార్య లైన్ లోకి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గొంతుని అనుకరిస్తూ చెప్పాను.


    "ఆమధ్య ఒక దొంగల ముఠా స్థావరంమీద రైడ్ చేసినప్పుడు అక్కడున్న కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొచ్చాను. వాటిల్లో బ్రౌన్ కలర్ టోపీ ఒకటి తెచ్చాను గుర్తుందా!" అని అడిగాను.


    "గుర్తుంది. మీరు తెచ్చిన అడ్డమైనవీ గుర్తుంటాయ్. ఇప్పుడా టోపీతో ఏం పని? మారు వేషాలకి పనికొస్తుందంటూ బీరువాలో భద్రంగా దాచారుకదా! మళ్ళీ ఏదన్నా దిక్కుమాలిన మారువేషం వేయబోతున్నారా? లేక ఆ టోపీ నేను పెట్టుకొని ఇల్లంతా ఊరేగమంటారా!" కోపంగా అడిగింది మిసెస్ వర్ధనరావు.


    ఆమె మామూలుగా మాట్లాడదని...మాటకు ముందు గద్దిస్తూనో, గాండ్రిస్తూనో మాట్లాడుతుందని... ఆవిడముందు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పిల్లి అని...నాకు ఇదివరకే తెలుసు.


    జైల్లో వున్నప్పుడు ఆయన ఎదురుగుండా వున్న సెల్లోనే వుండేవాడిని కాబట్టి.


    "ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మనింటికి కొద్దిసేపట్లో ఫైవ్ నాట్ ఫైవ్ కానిస్టేబుల్ పి.వి.సింగ్ ని పంపిస్తున్నారు. వాడికి తెలుగు సరీగా రాదు. "సాబ్... టోపీ" అని రెండు ముక్కలే అంటాడు. ఆ టోపీని వాడికిచ్చి పంపించు. ఇక్కడ ఫారిన్ టోపీల వేలంపాటలు జరుగుతున్నాయ్. ఇలాంటి టోపీని పదివేలిచ్చి కొనిక్కెళ్ళారు. అది చూశాక తర్వాత నాకో ఐడియా వచ్చింది. దిక్కుమాలిన మారువేషాల కోసం ఏదో ఒక టోపీ తగిలించుకోవచ్చు. ఇది అమ్మేస్తే పదివేలు వస్తాయ్. పదివేలకన్నా టోపీ ఎక్కువకాదు కదా."


    "అమ్మో! పదివేలే" అవతలనించి మిసెస్ వర్ధనరావ్ ఆనందాశ్చర్యాలతో అడిగింది.


    "అవును. అక్షరాలా పదివేలు" అన్నాను నేను.


    "పదివేలతో పైసా తగ్గకుండా ఇంటికి తీసుకొచ్చి నాకివ్వండి. ఆరోజున 'ఎందుకీ దిక్కుమాలిన టోపీతెచ్చి బీరువాలో పెడుతున్నారు?' అని కోప్పడ్డాను గాని అది ఇంత చేస్తుందనుకోలేదు. తొందరగా వాణ్ని పంపించండి" అంది మిసెస్ వర్ధనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS