ఆ గదిలో రెండు నిముషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పథకాన్ని చాలా వేగంగా గెస్ చేయగలిగింది... అందుకే కాస్త నివ్వెరపోయాడు.
"ఆశ్చర్యపోకు శశీ... ఇద్దరికీ ఒకే శత్రువున్నపుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు శత్రువులైనా శత్రువు కోసం స్నేహితులౌతారని చెప్పిందీ అర్ధశాస్త్రమే.. కాబట్టి నీ ఏర్పాట్లని బట్టి ముందే వూహించాను. అయితే ఒక్క విషయం... ధనుష్కోటి బలవంతుడే కాదనను... కాని ఇప్పుడు లేడు... అతడే కాదు, నీ దెబ్బతో ఇన్వెస్టిమెంటు కంపెనీని రక్షించే చేవగల మొగాడు లేక అతడి ఆస్తి మొత్తం వేలం వేయబడింది. జయచంద్ర అలా బలహీనుడు కాడు. ఈ వ్యవహారాల్లో చాలా అనుభవం గల వ్యక్తి. కాబట్టి శతృవు దెబ్బతీసే వరకు ఆగడు... ఆగినట్టు కనిపిస్తాడు... అంతే... అజాగ్రత్తగా వున్నట్టుండే చావుదెబ్బ తీస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే... అవినాశ్ ని కాపాడాలనుకున్న నువ్వు ఫోటోలు తీయిస్తే తప్పించుకున్న ప్రసాద్ అనబడే ఆ గూండా పోలీసులకి శాశ్వతంగా చిక్కకుండా చేసాడు."
ఇన్ని వివరాలు ఆమెకు ఎలా తెలిసాయో అంతుచిక్కని శశాంక విభ్రమంగా ఆమెను చూశాడు. "అంటే"
"సాగర్ ని ప్రసాద్ చేత చంపించాడు...పోలీసులు వెదుకుతున్న ప్రసాద్ ని సర్కార్ చేత చంపించాడు అంతే తన గురించి వివరాలు చెప్పగల రెండు ఆధారాల్నీ రూపుమాపాడన్నమాట"
సాలోచనగా తల పంకించిన శశాంక "ఇవన్నీ నీకెలా తెలుసు" అడిగాడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతూ.
"నాకున్నది చాల హైలెవల్ ఇన్ ఫార్మర్స్ శశాంకా... పదవి సంపాదించుకోవడానికి జయచంద్ర అండ తీసుకున్న సదాశివయ్య అందమైన ఆడపిల్లల కోసం నా దగ్గరకొస్తుంటాడు. అతనే చెప్పాడు ఆశ్చర్యంగా వుందా?"
ఆశ్చర్యపోలేదు శశాంక. "ఇప్పుడు ప్రసాద్ అవినాశ్ కి దక్కకపోయినా ప్రమాదం లేదు సోఫియా... కాని ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారే, అతడి హత్యని జయచంద్ర ఎలా దాయగలడు?"
"సింపుల్... ప్రసాద్ పరారీలో వున్నట్టు పోలీస్ రికార్డ్సులో ఉంటుంది శాశ్వతంగా... జయచంద్ర అవినాశ్ కి తెలియకుండా ఆ ఏర్పాట్లూ పూర్తి చేసాడు."
ఆమె మాటల్ని మననం చేసుకుంటూ "చాలా తెలివైన మేధావి. తను చేసిన తప్పులో తానే ఇరుక్కునే అరుదైన క్షణాలు కొన్ని వుంటాయి సోఫియా... జయచంద్ర ఇప్పుడలాంటి పొరపాటే చేసాడు" అన్నాడు శశాంక.
ఇది ఆమెకు అర్థం కాలేదు...
కాని అప్పటికే వెళ్ళిపోయాడు శశాంక.
* * * *
కాలనీ వార్షికోత్సవం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయం...
ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి జాకీ చేత సెక్రటేరియట్ లో హోంమినిస్టర్ సదాశివయ్య ఛాంబర్ కి ఫోన్ చేయించాడు శశాంక.
"ఎవరు కావాలి?" మంత్రి పియ్యే ఫోన్ అందుకున్నాడు.
"నా పేరు ప్రసాద్" జాకీ జవాబు చెప్పాడు. "మరేం లేదు. నేనే మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సాగర్ ని చంపి తప్పించుకున్నది. నాకు షెల్టర్ ఇవ్వాల్సిన జయచంద్ర నన్ను చంపి శాశ్వతంగా సాక్ష్యం సమాధి చేయాలనుకుంటున్నాడు... కాబట్టి ఈ రోజు గౌరవనీయులైన మంత్రిగారితో బాటు వేదికపై వుండగానే జయచంద్రని షూట్ చేయబోతున్నాను. మెస్సేజ్ అందించండి."
కంగారుపడిన పియ్యే రెండు నిముషాలలో ఛాంబర్ లోకి పరుగెత్తుకెళ్ళాడు.
ఆ సమయానికి డిజిపి పోలీస్ కమీషనరుతో శాంతి భద్రతల పరిరక్షణ విషయం చర్చిస్తున్న సదాశివయ్య మెస్సేజ్ ని చదివి నుదుట చెమట పడుతుంటే అసంకల్పితంగా డిజిపి కందించాడు కాగితాన్ని.
"ఏంటీ... చంపేసానన్నాడు... వాడు ఫోన్ చేయడమేంటీ. జయచంద్ర పొరపడి మరోడ్ని లేపేసాడా' ఇదీ సదాశివయ్య ఆ క్షణంలో ఆలోచిస్తున్నది.
సరిగ్గా అదే సమయంలో...
శశాంక జయచంద్రకి ఫోన్ చేశాడు పబ్లిక్ బూత్ నించే.
జయచంద్ర లైనులోకి రావడానికి అరనిముషం పట్టింది.
"నేను జయచంద్రా! ఒకనాడు నువ్వు కాళ్లు కడిగి కన్యాదానం చేయాలనుకున్న శశాంకని. ఇప్పుడు నీ పని పూర్తిచేసి నా భార్య ఆత్మకి సంతృప్తినివ్వబోతున్న సమర్థుడైన భర్తని...ఆగు... ఫోన్ పెట్టేయకు... ఈరోజు సాయంకాలం అంటే మరో రెండు గంటల్లో నేనూ ఫంక్షన్ కొస్తున్నాను. నిన్నక్కడే - అంటే అందరి ముందే చంపబోతున్నాను..."
గొప్పగా ఈ వివరాల్ని సేకరించానని ముందే అన్ని రక్షణ ఏర్పాట్లను పూర్తిచేసుకున్న జయచంద్ర ఇది వూహించలేదు.
ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడమని తానే కాలు దువ్వుతున్నాడు శశాంక.
"బ్రతికున్న నువ్వు నీ పుట్టినరోజు చెప్పగలవు గాని పోయేరోజుని ముందే వూహించలేవు... మరణ వాంజ్మూలానికి ముందే ఏర్పాట్లు చేసుకో" శశాంక ఫోన్ క్రెడిల్ చేశాడు...
శశాంక పేరు వినబడగానే సింహస్వప్నంలా ఉలికిపడుతున్న జయచంద్ర నుదుట చెమట పట్టేసింది.
మరోమారు తన రక్షణ ఏర్పాట్ల గురించి సర్కార్ తో చర్చించాడు ఆస్థిమితంగా.
సరిగ్గా సాయంకాలం ఆరున్నరకి ఫంక్షన్ మొదలైంది.
