Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 64


    ఆదిత్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఇక మాట్లాడదనుకున్న బామ్మ ఎప్పటిలాగే మాట్లాడ్డమే కాదు, అసలు అనారోగ్యంగా లేనట్టు బోలెడంత ధైర్యం చెప్పేస్తూంది.
    
    "ఇక బ్రతకననుకున్నావు కదూ?"
    
    "అవునే... ఇన్ని రోజులుగా కంగారు పెట్టేశావు."
    
    "ఓరి పిచ్చికుంకా! నేను ఇప్పుడప్పుడే ఎక్కడికి పోతాన్రా? నీకు పెళ్ళిచేయాలి. మనవళ్ళ నెత్తుకోవాలి. అనితని ఓ అయ్యచేతిలో పెట్టి."
    
    ఎందుకో ప్రబంధ ముందు బామ్మ అలాంటి టాపిక్ తీసుకురావడం యిబ్బందిగా వుంది.
    
    "ఇదమ్మా ప్రబంధా!" చాలా కాలంనుంచి ప్రబంధతో పరిచయమున్నట్టు మాట్లాడుతూంది లక్ష్మమ్మ. "ఎదిగాడు కాని ఇంకా నా ఒడిలోనే తలపెట్టుకు పడుకోవాలనుకుంటాడు. పోనీ నీకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకోరా అంటే ఆడపిల్లలా సిగ్గుపడుతుంటాడు" పైకి లేచిన అదిత్యని చూస్తూ అంది ఎక్కడికిరా?"
    
    "నీకు భోజనం ఏర్పాటు చేయాలిగా?"
    
    "నీకా శ్రమక్కర్లేదు అమ్మాయి కేరియర్ తెచ్చింది. అప్పుడే పథ్యం గురించి పట్టించుకోకుండా తినేశాను కూడా."
    
    ప్రబంధ బిడియంగా నేల చూపులు చూస్తుంటే ఆదిత్యతో అంది అనిత- "చిత్రం చూశావా అన్నయ్యా! ప్రబంధఅగరు కేరియర్ ఈ రోజు నుంచీ తీసుకురావడం ముందే తెలిసినట్టు టక్కున లేచి కూర్చుంది బామ్మ. అంతేకాదు. నీకోసం ప్రబంధగారు బయలుదేరి వెళ్ళాక మీ ఇద్దరి గురించి చాలా చాలా ఆలోచించేసింది కూడా."
    
    ఆదిత్య ఫాలభాగంపైన స్వేదం పేరుకుపోయింది.
    
    నిజానికి చాలా ఉత్సాహపూరితమైన సమయమది. రోజుల తరబడి టెన్షన్ మరపిస్తూ బామ్మ గడగడా మాట్లాడుతుంటే ఆనందంగా వుంది. కాని తన చెల్లితోపాటు బామ్మకూడా ప్రబంధ విషయంలో అంతదూరం ఆలోచించడం ఇబ్బందిగా అనిపిస్తూంది.
    
    "ఇప్పుడెలా వుంది బామ్మ?" అడిగాడు టాపిక్ మార్చాలని.
    
    "ముందు నీకెలాగుందో చెప్పరా?" రెట్టించింది లక్ష్మమ్మ.
    
    "ప్రబంధలాంటి స్నేహితురాలు దొరకగానే ఇక బామ్మతో పనేముందీ అనిపించి వుంటుంది కదూ?"
        
    "అది కాదే!"
    
    "సిగ్గుపడకురా భడవా! నేనంతా ఊహించాను."
    
    "బామ్మా!" తల పట్టుకున్నాడు.
    
    "నువ్వు జుట్టు పీక్కున్నాసరే నేనిక పట్టువదల్నొరే! ఈ ఏడాదిలోనే నీకు పెళ్ళి జరిపించి అప్పుడు..."
    
    "వెళతాను..." అసహనంగా అన్నాడు-" పరీక్షలు దగ్గరకొస్తున్నాయి."
    
    దూకుడుగా బయటకు నడిచాడు. ప్రబంధ అనుసరించింది.        
    
    "డాక్టరుగార్ని అడిగాను....మీ బామ్మగారి ఆరోగ్యం పూర్తిగా నయం కాకపోయినా ఇక ప్రస్తుతానికి ఫర్వాలేదన్నారు..." చెప్పింది చీకటిలోకి చూస్తూ బామ్మగారి మాటల్ని ఆమె కూడా మననం చేసుకుంటూంది.
    
    "థాంక్యూ ప్రబంధా!"
    
    "దేనికి?"
    
    "నా మనుషుల గురించి ఇంత శ్రద్ద తీసుకుంటున్నందుకు."
    
    ప్రబంధ జవాబు చెప్పలేదు.
    
    "బామ్మ గురించి చెప్పాలని వచ్చానూ అని ఇందాక మీరనేసరికి చాలా ఆందోళన పడ్డాను. కొంతసేపు టెన్షన్ లోవున్నా మంచే జరిగినందుకు సంతోషంగా వుంది."
    
    "రండి" కారెక్కి డ్రయివింగ్ సీటులో కూర్చుంది.
    
    అర్ధంకాలేదు ఆదిత్యకి. అయినా ఆమెను కాదనే మూడ్ లో లేడు.
    
    కారు బయలుదేరింది.
    
    సరిగ్గా ఇదే సమయంలో...
    
    ప్రబంధ ఇంటిలోని సౌదామిని, ముఖ్యమంత్రి వాసుదేవరావుతో ఫోన్లో మాట్లాడి రిసీవర్ క్రెడిల్ చేసింది.
    
    వచ్చే నెలలోనే ప్రబంధ పెళ్ళికి సంబంధించిన నిశ్చితార్ధం నిర్ణయించారు. అలా కాబోయే వియ్యంకుడు రాయ్ ని వప్పించానని చెప్పాడు కొన్ని నిముషాల క్రితమే.
    
    ప్రబంధ అంగీకరించదని తెలుసు. అయినా తన ప్రణాళికను మరింత పటిష్టం చేయాలనుకుంది. ప్రబంధలాంటి మొండిపిల్లని యింకా మొండి దాన్నిగా మార్చాలీ అంటే కొంత ప్రతిఘటన కావాలి.
    
    అందుకే సుధీర్ తో ఏం వద్దని చెప్పిందో ఇప్పుడు ఆ పని తనే చేయాలనుకుంది.
    
    శౌరి గదిదాకా వెళ్ళింది.  స్నేహితులతో మాట్లాడుతున్నాడు.
    
    "బాబూ శౌరీ!"
    
    బీరు బాటిల్ పక్కనపెట్టి బయటకు నడిచాడు. "ఏంటి ఆంటీ?" సౌదామిని మొహంలో ఆందోళనలాంటిది కనిపిస్తుంటే అడిగాడు- "ఏమిటలా వున్నారు?"
    
    తాత్సారం చేస్తూనే అంది- "నేను మీ యింటి ఉప్పు తిన్నదాన్ని శౌరీ! అందుకే కొన్ని చూస్తూ జీర్ణించుకోలేక పోతున్నాను."
    
    తన మందు విషయం మాట్లాడుతుందేమో అనుకున్నాడు.
    
    "నేను అంటున్నది నీ గురించి కాదు. మగాడన్నాక కొన్ని తప్పవు అని నాకు తెలుసు."
    
    శౌరి మనసు తేలికపడిపోయింది. "దేనిగురించి ఆంటీ? ఇప్పుడేమైంది?"
    
    "ప్రబంధ!" నిట్టూర్పులా క్షణం ఆగింది. "వయసులో ఉన్న అమ్మాయి ఇలా రాత్రిదాకా తిరిగిరావడం చూడలేకపోతున్నాను. అలా అని ప్రబంధ మీద నాకు నమ్మకం లేక కాదు కాని ఆ వయసు గురించే భయపడుతున్నాను."
    
    ఈ మధ్య చూచాయగా విన్నాడు ప్రబంధ ఆదిత్యతో పెంచుకుంటున్న స్నేహం గురించి అయినా వారించలేదు. వారించే ప్రయత్నం చేస్తే మరింత మొండికేస్తుంది. అందుకే ఏం చేయాలా అని లోలోన ఆలోచిస్తున్నాడు కూడా.
    
    ఒకవేళ ఆదిత్య ఆమె వెంటపడితే బుద్దిచెప్పగలడు. కాని ప్రబంధే ఆదిత్యవైపు మొగ్గుతూంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS