"కొన్నాళ్ళు చూశాకే నాకు కబురు చెయ్యి. అప్పుడింకా హాయి. అతని గురించి ఏం తెలుసుకోవాలన్నా గైడ్ గా ఉపయోగపడ్తావు" అంది.
"సరే...ఇంక నేను బయల్దేరతాను" అన్నాను.
"పెళ్ళికొడుకు వేటకా?" అడిగింది.
"అవును!" అని వచ్చేశాను.
* * *
నిజంగానే మర్నాటినుండీ వేటలా నేనూ లిల్లీ 'చంద్ర' ఆచూకీ కోసం అన్ని డఫ్ అండ్ డమ్ స్కూల్సూ తిరిగాం. ఎక్కడా కర్నూలు నుండి వచ్చిన పిల్లలు కానీ, చంద్ర అనే పేరు కానీ కనిపించలేదు.
నేను నిరాశ పడిపోయాను.
"ఓసారి కర్నూలు వెళ్ళి ట్రై చేద్దాం" అంది లిల్లీ.
నా కళ్ళల్లో ఆశ చిగురించింది.
"చంద్ర కాకపోయినా ఆ ఊళ్ళో రషీద్ అనే అడ్వకేట్ ఉంటాడుగా! అతను చెప్తాడు చంద్ర అడ్రెస్" అంది.
లిల్లీని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాను.
"ఎందుకు నీకు అతనిమీద ఇంత ఇంట్రెస్టు?"
"నాకు ప్రాణప్రదమైన చిన్నక్క తన ప్రాణం కన్నా ఎక్కువగా భావించిన వ్యక్తి కాబట్టి. ఎంతటి అపురూపమైన వ్యక్తి కాకపోతే చిన్నక్క అంత ఇదిగా ప్రేమిస్తుందీ!" అన్నాను.
"సెంటిమెంట్సు అనేవి చాలా ఆనందాన్నిస్తాయనుకుంట" అంది లిల్లీ.
ఇద్దరం వీకెండ్ లో ఓసారి కర్నూలు వెళ్ళేటట్లు ప్రోగ్రాం ఫిక్స్ అయింది.
అమ్మకి, నాన్నకి చిన్నక్క క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళి అని ఉత్తరం వ్రాసిందని చెప్పి నమ్మించాను.
నాన్న తనూ వస్తానన్నారు. ఇది నేను ఊహించినదే! లిల్లీ వస్తోంది కాబట్టి భయంలేదనీ ఆయనకి అనవసర శ్రమ అనీ చెప్పి ఒప్పించేసరికి నా తలప్రాణం తోకకి వచ్చింది. ఏదో తెలియని ఉత్సాహం నా నరాల్లో ప్రవహిస్తూ నన్ను పరుగులు పెట్టిస్తోంది.
అతని జాడ తెలుస్తుందా?
ఎలా ఉంటాడో? ఎలా ప్రవర్తిస్తాడో? నాకు కాలు నిలవడంలేదు. ఊపిరి అందనట్లు ఒక్కటే ఉక్కిరిబిక్కిరి. కనులు మూసినా కనులు తెరిచినా ఒకటే దృశ్యం... అతను మల్లెపందిరి క్రింద కుందేలు పిల్లని ముద్దులాడ్తుండగా నేను సడెన్ గా ముందుకి వెళ్ళి నిలబడ్డాను!
అతను ఆశ్చర్యంగా నాలో ప్రస్ఫుటంగా కనిపించే అక్క పోలికల్ని చూస్తూ "నువ్వు...నువ్వు...కాళిందివి కదూ..." అంటాడు.
నేను నవ్వి "కాళింది చెల్లెల్ని" అంటాను.
అతను నా కళ్ళకి కళ్ళజోడు పెట్టి తృప్తిగా చూసుకుంటాడు...ఇదే ఊహ! అది నిజం ఎప్పుడౌతుందో?
* * *
నా ఊహల్లో నేను బిజీగా ఉండగా మాధవ్ వచ్చాడు. "ఏమ్మా ఉద్యోగానికి వెళ్ళడంలేదుట!" అన్నాడు.
"నాలుగు రోజులు రానని కబురు చేశాను" అన్నాను.
"అదే ఎందుకూ?" అడిగాడు.
నాకు చిరాకేసింది. ప్రతి విషయానికీ ప్రతి వాళ్ళకీ జవాబు చెప్పుకోవడాన్ని మించిన శిక్ష ఇంకొకటి లేదు!
"నా ఫ్రెండ్ తో కలిసి వూరెళ్ళాలి" అన్నాను.
"ఫ్రెండా?" అతని కళ్ళల్లో అనుమానం.
ఫ్రెండ్ ఆడో మగో క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు లేదనిపించింది.
"ఎవరూ?" అడిగేశాడు.
"నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళకి కలుసుకున్నాం" అతన్ని ఇంకా ఉడికించాలనిపించింది.
"పేరూ?" అడిగాడు.
నేను విసుగ్గా చూసి "మీకు కాఫీ తెస్తాను" అని లోపలికి వెళ్ళిపోయాను. నాన్నగారితో ఏదో మాట్లాడ్తున్నాడన్నమాటేకాని అతను చాలా వ్యాకులంగా కనిపిస్తున్నాడు.
"ఈ ఏడు ఆముక్తకి పెళ్ళి చేసెయ్యాలనుకుంటున్నాము" అమ్మ అతని ఆంతర్యం తెలుసుకోవడానికే ఆ సంభాషణ మొదలు పెట్టింది.
"నేనూ వసంతకి సబంధాలు చూస్తున్నాను. నాకు అది బాధ్యత కదా!" అన్నాడు.
"ఆ తర్వాత పెళ్ళిచేసుకుంటావా?" అమ్మ అంది.
"నా పెళ్ళి గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు" కాస్తా చిరాగ్గా అన్నాడు.
అమ్మ సందేహంగానే "మా ముక్త గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అంది.
వెంటనే "ఇంకా చిన్నపిల్ల!" అన్నాడు.
"ఆముక్తని చేసుకోవడం నీకు ఇష్టమేనా?"
ఆ ప్రశ్నకి నేను దిమ్మెరపోయాను. అతను ఏం చెప్తాడోనని నా గుండెలు దడదడా కొట్టుకున్నాయి.
"అయ్యో! అదేం మాటండీ? నేను ఆముక్తని ఒకలాగా వసంతని ఒకలాగా ఎప్పుడూ చూడలేదు.
"ఆముక్తని నా తోబుట్టువుగా, మీకు ఒక కొడుకుగా ఫీలవుతున్నాను" అన్నాడు.
నా గుండెలు కుదుటపడ్డాయి.
అమ్మ మొహం చిన్నబోయింది.
నాన్న 'నే చెప్పలేదూ...' అన్నట్లు నవ్వుతూ చూశారు.
నేను కాఫీ తెచ్చి అందించాను.
