దైవాదీనం భయంగా కాళ్ళు మంచంమీద పెట్టేసుకున్నాడు.
"రావే రావే రాజమండ్రి గుంట్రా
నీకు నేనే రాజునౌతానంటా
నువ్వు రాకుంటే నాకొళ్ళు మంటా
వేసేయ్ వే నిలువెల్లా చలిమంటా
రావే రావే!!
నీతో వూగేస్తా ఉయ్యాల
నువ్వు తోడుంటే బతుకంతా జంపాల
ఉయ్యాల జంపాల...ఉయ్యాల జంపాలా
ఆ...ఆ...ఆ...ఓ....ఓ...ఓ...
రావే రావే!!
పాట ఆపి- "ఎలాగుందండీ?" అని ఉత్సాహంగా అడిగాడు శంభులింగం.
దైవాదీనం సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాడు. "చాలా గొప్పగా రాశావయ్యా...ఇట్టాంటి పాట మన పిచ్చర్ లో ఎట్టేసి నటవీరమీద సిత్రీకరిస్తే తెరమీద డబ్బులడిపోతాయ్....కానీ, మరి కాసిని బూతులుండాలి"
" ఆ దిగులు నువ్వేం పెట్టుకోకు. కాలేజీలో చదివే రోజుల్లో వీడు తిట్టినన్ని బూతుతిట్లు వేరే ఎవరూ తిట్టి ఎరగరు... వహ్వహ్వ" గుక్క పట్టి నవ్వాడు కైలాసం.
"కాస్త శాంపిల్ గా వినిపించమంటారా?" ఉత్సాహంగా ముందుకు వంగి ప్రశ్నించాడు శంభులింగం.
"వద్దొద్దులే.... మా కైలాసం మాటమీద నాకు నమ్మకం ఉంది. మన సినిమాకి డవిలాగులు రాద్దారని పెద్ద మనసు పడ్తున్నావ్ గదా, నేను తీసిన సిన్మాలు సూశావా?.... నేను తీసిన సిన్మాలు సూత్తే అప్పుడు నా సినేమాలకి డవిలాగులు ఎట్టా రాత్తే నాకిట్టవోం నీకు తెలుసుద్ది...."
శంభులింగం గది సీలింగ్ వైపు బుర్ర గోక్కున్నాడు. "మీరు తీసిన సినిమాలన్నీ చూడలేదండీ... ఏదో ఒకట్రెండు చూశానంతే"
"నా సినిమాలు చూడకపోతే నా టేస్టెలా తెలుసుద్ది? అదిడ్ తెలీకపోతే నా సినిమాకి డవిలాగులెట్లా రాస్తావ్?" దైవాదీనం విలాసంగా కాళ్ళూగిస్తూ అన్నాడు.
శంభులింగం దీనంగా ఆ కాళ్ళవంక చూస్తూ నిలబడ్డాడు. దైవాదీనం భయంగా కాళ్లు మళ్ళీ పైకి పెట్టుకుని కూర్చున్నాడు.
"సర్లె... సర్లె.... నీకు శాన్సివ్వనని సెప్పనేదుగదా?....సూద్దాం... మళ్ళీ కాళ్ళట్టుకోకు."
ఇంతలో ఒక యువకుడుద్ దూకుడు దూకుడుగా ఆ గదిలోకి తలుపులు తోసుకు వచ్చాడు. తలుపులు దగ్గరికి వేసి ఉండడంవల్ల అది ధడాలున తెరుచుకుని అతను బోర్లా పడ్డాడు.
"సమయానికి మా సెగట్రీకూడా వచ్చేశాడు" అన్నాడు దైవాదీనం.
"మరి ఇందాక ఆవిడ్నెవర్నో సెక్రట్రీ అన్నారు కదండీ?" అమాయకంగా అడిగాడు శంభులింగం లేచి బట్టలు దులుపుకుంటున్న అతన్ని చూసి.
"ఏం? ఆడ సెగట్రీ ఒకరు, మగ సెగెట్రీ ఒకరు ఉండకూడదా? నీకు సిన్మా శాన్సు అక్కర్లేదునాగుంది?" రంకెవేశాడు దైవాదీనం.
"క్షమించండి, తెలీక అన్నాను. తప్పైపోయింది" లెంపలేసుకున్నాడు శంభులింగం.
"అద్గది, అట్టారా దారికి. నీ లెంపలేవాయించుకో... నా కాళ్ళట్టుకోకు. సూడు సెగట్రీ... ఇతను సాయిత్య స్రీ... మన బొమ్మకి కత, మాటలు, పాటలు రాద్దారని వచ్చాడు. ఇతను నా సెగెట్రీ శంకర్రావు" అంటూ పరస్పర పరిచయం చేశాడు దైవాదీనం.
శంకర్రావు కాళ్ళుకూడా పట్టుకోవాలో లేదా నమస్కరిస్తే చాలో తెలీక అయోమయంలో పడిపోయిన శంభులింగం మళ్ళీ బుర్ర గోకున్నాడు. ఈ లోగా శంకరరావు నమస్కరిస్తే తనుకూడా నమస్కారం పెట్టి చేతులు దులుపుకున్నాడు.
"మరి నా సిన్మాగురించి నీకు తెలియదంటున్నావే!" ఈసారి బుర్ర గోక్కోవడం దైవాదీనం వంతయింది.
"ఏముందీ... ఇప్పటిదాకా నువ్వు తీసిన సినిమాలేవో, అవి ఎలాంటివో చెప్పు. దాన్ని బట్టి కథ రాసిస్తాడు. కథ నచ్చితే డైలాగులు రాయించొచ్చు"అన్నాడు కైలాసం.
"నీ అవిడియా బావుందయ్యా.... అట్టాగే సేద్దాం... సెగట్రీ! మన సిన్మాల లిస్టంతాఈనకి సెప్పు."
శంకర్రావు గొంతు సవరించుకున్నాడు.
"చూడండి శంభులింగంగారూ! మా గురూగార్ని బాగా పైకి తీసుకొచ్చిన సినిమా 'స్వర్గలోకం-నరకలోకం.' ఈ సినిమాలో అందరు కొత్త యాక్టర్లే. అయినా, గురూగారి దర్శకత్వం ప్రతిభవల్ల యమహిట్టయింది. సంసారం సరిగ్గా సాగితే స్వర్గలోకంలో ఉన్నట్టుంటుందనీ గురూగారు ఈ చిత్రంద్వారా తెలియజెప్పారు."
"ఓహోహో...బావుంది" మెడలో కీళ్ళన్నీ వదులయినట్టు తల వూపాడు శంభులింగం.
"మీరు 'పరపతి' సినిమా చూశారా?"
"చూడకేం- అది ఒక హిందీ సినిమాకి మక్కీకి మక్కీ కాపీ" తనో పచ్చి నిజాన్ని కనిపెట్టానని ఉత్సాహంతో అన్నాడు శంభులింగం.
"కాపీ అని అన్నదెవడెహె" రంకెవేశాడు దైవాదీనం.
"అపచారం అపచారం. అది కాపీ సినిమా అంటే కళ్ళుపోతాయ్. ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ మా గురువుగారే" అన్నాడు శంకర్రావు కంగారుపడిపోతూ.
వ్యవహారం ఇలా బెడిసికొట్టినందుకు కంగారుపడిపోతూ మొహానికి పట్టిన చెమటను రుమలతో తుడుచుకుని వెంటనే చెంపలు వాయించుకున్నాడు శంభులింగం.
"మా వాడికెవరో నీమీద గిట్టనివాళ్లు అలా చెప్పివుంటారు" శంభులింగాన్ని సమర్ధించాడు కైలాసం. దైవాదీనం శాంతించాడు.
"పరపతి సినిమాలో అమాయకుడైన పల్లెటూరి వాడు పట్నానికి వచ్చి ఎలా కష్టాలుపడ్తాడో కళ్ళకు కట్టినట్టు చూపించారు మా గురూగారు. ఆ సినిమా మీరు చూశారుగాబట్టి దాని గురించి అంతగా చెప్పక్కర్లేదు."
"అవునవును. చెప్పక్కర్లేదు" చప్పట్లు కొట్టాడు శంభులింగం సంతోషంతో.
ఒక్క క్షణం బిత్తరపోయి, మరుక్షణం అయోమయంగా చూసి మళ్ళీ మొదలుపెట్టాడు శంకర్రావు.
"ముసలమ్మా-మనవరాలు' సినిమాలో గురూగారు వాళ్ళ మధ్య అనుబంధం యొక్క పవిత్రత గురించిన్నూ, వారి అనురాగం గురించిన్నూ. ఆత్మీయత గురించిన్నూ తెలియజేశారు. అదీ హిట్టే... 'కూరగాయల కాంతమ్మ' సినిమాలో కూరగాయల వ్యాపారం చేసే ఆడదాని సమస్యలు చక్కగా చిత్రించారు గురూగారు."
"అవునవును... ఆ సినిమా నేనూ చూశాను. చివరికి హీరోయిన్ను ఆమె భర్త నరికి చంపేస్తాడు కదండీ... ఆ సీను చూసి నేను ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాను. దారి పొడుగునా ఏడుస్తూనే ఉన్నాను. చివరికి ఇంటికి వెళ్ళాకకూడా అట్టా గట్టిగా ఏడుస్తూనే ఉన్నాను. ఇరుగూ పొరుగూ అందరూ మా ఆవిడకేమైనా అయిందేమోనని పరుగెత్తుకొచ్చారు. కానీ... ఆ సీను తలచుకుంటూంటే ఇప్పటికీ ఏడుపొస్తూంది" ముక్కు చీది రుమాలతో కళ్ళు ఒత్తుకోసాగాడు శంభులింగం.
"ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఏడవమాకు. నాకేదయినా అయ్యిందని పక్క గదిలోని మా లిల్లీ గుండెలు బాదుకుని వచ్చేత్తాది" దైవాదీనం గాబరాపడ్డాడు.
