కైలాసం తలుపుమీద చిన్నగా తట్టి- "నేను కైలాసాన్ని... లోపలికి రావచ్చా?" అని అడిగాడు.
"రా...." లోపలినుండి ఒక గరుకు గొంతు వినబడింది.
కైలాసం, శంభులింగాలు తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళారు లోపలినుండి ఒక ఆడమనిషి ఒళ్ళు తిప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.
"హి.....హి.....హి.... నా సెగట్రీ!" వీళ్ళు అడక్కపోయినా - చెప్పేశాడు ప్రఖ్యాత దర్శకుడు దైవాదీనం.
"ఇతడు నా బాల్యస్నేహితుడు" కైలాసం శంభులింగాన్ని దైవాదీనంకి పరిచయం చేశాడు.
మరుక్షణం శంభులింగం దైవాదీనం కాళ్ళమీద పడిపోయాడు.
"వోరి దేవుడోయ్! ఇదేమిటీ? కాళ్ళు వదలవయ్యా..." దైవాదీనం తెగ బాధపడిపోయాడు.
"వాడికి చిన్నప్పటినుండి పెద్దలయెడల భక్తి శ్రద్ధలు ఎక్కువలే "కైలాసం శంభులింగానికి ఒక సర్టిఫికెట్ పారేశాడు.
"ఏం బత్తి శ్రద్దలయ్యా బాబూ. కాళ్ళు వదలవయ్యా. దైవాదీనం కాళ్ళు విదిలించుకోబోయాడు. శంభులింగం మరింత గట్టిగా పట్టుకున్నాడు.
"మీరు అభయం ఇస్తేగానీ కాళ్ళు వదలనుగాక వదలను..." అన్నాడు శంభులింగం.
"అమ్మో, ఇదెక్కడి గోలయ్యా!" విలవిలలాడాడు దైవాదీనం. "నీకు వేషమే కావాలంటే కాళ్ళు వదులు"
"నాకు వేషంవద్దు, మీ కాళ్ళు వదలను."
"ఎహె. కాళ్ళొదలమంటుంటే" రంకెవేశాడు దైవాదీనం.
"మా వాడికి నీ సినిమాకి దేనికైనా డైలాగులు, పాటలు రాయాలనుంది" కైలాసం మెల్లిగా చెప్పాడు.
"సర్లేవయ్యా. సూస్తాలే. ముందు కాళ్ళువదులు" దైవాదీనం నొసలు కొట్టుకుంటూ పళ్ళు బిగబట్టి అన్నాడు.
శంభులింగం దైవాదీనం కాళ్ళు వదిలేసి వగరుస్తూ లేచి నిలబడ్డాడు. దైవాదీనం "ఉస్" అంటూ మంచంమీద కూలబడి ఎడమకాలు పైకెత్తి వూదుకోసాగాడు.
"ఇతగాడి బత్తి శ్రద్దలకు నాకు చాలా ఆనందమైపోయింది. మరొకప్పుడూ మరొకప్పుడూ అయితే మరి కాస్సేపు కాళ్లు పూర్తిగా పట్టించేస్కునేవాడిని. కానీ, ఈ కాలుకి దెబ్బతగిలిందయ్యా కైలాసం. ఉస్ ఉస్ దెబ్బ రేగిపోయింది" కాలును ఊదుకోసాగాడు దైవాదీనం. శంభులింగం రుమాలుతో చేయి తుడుచుకున్నాడు.
వూదుకోవడం అయిన తరువాత దైవాదీనం తల పైకెత్తి "నిలబడ్డావేం? కూకో" అన్నాడు శంభులింగాన్ని ఉద్దేశించి.
శంభులింగం దైవాదీనం కాళ్ళ దగ్గర నేలమీద కూర్చున్నాడు. దైవాదీనం భయంగా కాళ్ళు చటుక్కున మంచంమీదకు పెట్టేసుకుని - ఫరవాలేదు. నువ్వక్కడ ఆ కుర్చీమీద కూర్చో" అన్నాడు. అక్కడ కూర్చుంటే మళ్ళీ కాళ్ళెక్కడ గట్టిగా పట్టుకుంటాడోనని అతని భయం. శంభులింగం లేచి కుర్చీలో కూర్చున్నాడు.
"మన పేరేమిటన్నావ్?"
"నా పేరు జంగాల శంభులింగం అండీ!" వినయంగా సమాధానం ఇచ్చాడు.
"సాహిత్య శ్రీ అనే పేరుతో రచనలు చేస్తుంటాడు" కైలాసం స్నేహితుడికి సపోర్టు ఇస్తూ అన్నాడు.
"అబ్బో! కలం పేరు మా పెద్దగుందే" గుండెమీద చెయ్యేసుకున్నాడు దైవాదీనం. "మరి ఏయే పత్రికల్లో అచ్చయ్యాయి?"
"ఏదో నాలుగయిదు పత్రికల్లో నేను రాసిన ఉత్తరాలు వచ్చాయండీ" సిగ్గుతో తలవంచుకుని కాళ్ళ మధ్య చేతులు పెట్టుకుని మెలి తిరిగాడు శంభులింగం.
"మావాడు కాస్త హైలెవల్లో రచనలు చేస్తాడులే అవి ఈ తెలుగు దేశం ఎడిటర్లకి అర్థంకాక వాళ్లు వీడి రచనలు వెయ్యరు" కైలాసం శంభులింగాన్ని సమర్ధించాడు.
"మనకి కావలసింది హైలెవల్ రచయితలేగదా మరి! అద్సరే కానీ, మరి మన సినిమాకి పాటలు రాయలనుందన్నావ్ గదా. ఇఅదివరకేమైనా పాటలు రాశావా?"
శంభులింగం రాశానన్నట్టు తల వూగించాడు.
"ఏవి, అవి చూద్దాం"
"తేలేదండీ, వినిపించమంటే వినిపిస్తాను."
"వినిపించు వినిపించు. లేకపోతే నీ సత్తా ఎలా తెలుస్తుంది?" అన్నాడు కైలాసం.
"వూ...వూ...వూ...." ఒకసారి దగ్గి మళ్ళీ-" వూ...వూ...వూ" అన్నాడు శంభులింగం.
"పాట వినిపించమంటే అలా మూలుగుతాడేమయ్యా నీ స్నేహితుడు?" దైవాదీనం అయోమయంగా ప్రశ్నించాడు.
శంభులింగానికి దైవాదీనం అమాయకత్వానికి చెడ్డ నవ్వొచ్చింది. కానీ నవ్వితే మళ్ళీ తనకు సినిమాలో చాన్సివ్వడేమోనని భయంవేసి బలవంతంగా నవ్వును ఆపుకున్నాడు.
"నేను గొంతు సవరించుకుని కాస్త శ్రుతి చూసుకుంటున్నానండీ" అన్నాడు గర్వంగా.
"నువ్వు పాడక్కరలేదయ్యా. పాట సదివి వినిపిస్తే చాలు. కొంపదీసి మా సినిమాలో పాటలు పాడేద్దామని అనుకోవడం లేదుకదా?" దైవాదీనం గుండెమీద చేతులేసుకున్నాడు.
"అబ్బే, అదేం కాదులెండి. పాటని రాగంతీసి పాడ్తేగానీ దాని సొగసు తెలీదు" సిగ్గుపడుతూ అన్నాడు శంభులింగం.
"సరే సరే. అయితే అట్టాగే కానీయ్"
"వూ...వూ...వూ..." మళ్ళీ రెండుసార్లు దగ్గాడు.
"దగ్గులు ఇక సాల్లేవయ్యా. పాడి ఇనిపించు"
"చిలకా చిలకా రావమ్మా
తాత పిలకామీటి పోవమ్మా
చిటారు కొమ్మన చిలకమ్మా
చిలకా చిలకా."
ఉన్నట్లుండి లేచి నిలబడి తప్పట్లు కొడుతూ గంతులేస్తూ, చుట్టూ గిరగిరా తిరుగుతూ పాడటం మొలుపెట్టాడు శంభులింగం.
"చిలకా చిలకా రావమ్మా... తాతా పిలకామీటి పోవమ్మా...చిలకా... చిలకా...."
"అయ్యబాబోయ్! నా కాలు మట్టపేడండీ..... నాయనోయ్..." గోడుమన్నాడు దైవాదీనం.
"చిలకా చిలకా రావమ్మా... చిటారు కొమ్మన చిలకమ్మా..."
"అబ్బా మంట... ఆపవయ్యా నీ పాట" దైవాదీనం ఎడమకాలు పైకెత్తి వూదుకుంటూ అన్నాడు. కైలాసం అతనివంక జాలిగా చూశాడు.
శంభులింగం కుర్చీలో కూర్చుని "ఎలాగుందండీ నే రాసిన పాట?" అని కుతూహలంగా ముందుకు వంగి అడిగాడు.
వూదుతున్న కాలు కిందికి పెట్టి-"పాటబాగానే రాశావ్ గానీ, కొంపదీసి ఈరో ఈరోయిన్లక్కూడా ఇట్టాంటి పాటలే రాయవ్ గదా?" అన్నాడు సందేహంగా దైవాదీనం.
"హీరో హీరోయిన్లకి సరిపడే పాటలుకూడా రాశానండి... పాడి వినిపిస్తాను...వూ...వూ...వూ" మరో రెండుసార్లు దగ్గాడు శంభులింగం.
