Previous Page
త్రీ -ఇన్- వన్ పేజి 65

    "లిల్లీ ఎవరండీ?"

    "అదే మా సెగట్రీ..." మెలికలు తిరిగాడు దైవాదీనం
   
    "హి...హి...హి" శంభులింగం కూడా మెలికలు తిరిగాడు.

    "నువ్వెందుకు అట్ట ఇదయిపోతున్నావ్? నీ యవ్వారం నాకేం నచ్చడంలేదు" దైవాదీనం రంకె వేశాడు. శంభులింగం చెంపలు వేసుకున్నాడు.

    "మీరు ఇలా నేను చెప్పేది వినండి... ఇప్పుడు 'తమలపాకు' సినిమా గురించి! ఈ సినిమా అంతా త్యాగాలమయం. కథ మొత్తం ఒక త్యాగమయి చుట్టూ తిరుగుతుంది. మనం తమలపాకు వేసుకుని నముల్తాం. అప్పుడు మన నోటిని ఎర్రగా చేసి అది మాత్రం పిప్పిగా మట్టిలో కలిసిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ జీవితంకూడా అలాంటి త్యాగాలే ఉంటాయి.

    అందుకే ఆమెను తమలపాకుతో పోల్చి చిత్రానికి 'తమలపాకు' అని పేరు పెట్టారు. ఈ సినిమా ఆడాళ్ళని బ్రహ్మాండంగా ఆకర్షించింది."

    "అవునండీ... మా ఆవిడ ఈ సినిమా నాలుగుసార్లు చూసింది. ఈ సినిమా చూసినదగ్గరనుండి తమలపాకులంటే చెడ్డ ఇష్టపడి కిళ్ళీలు తెగ తినడం మొదలు పెట్టింది. ఇప్పుడు మొలలో ఆకులున్న గుడ్డసంచి కూడా దోపుకుంటుంది. ఒక అరలో ఆకులు, ఇంకో అరలో వక్కపొడి, మరో అరలో సున్నం వగైరా వగైరా..."

    "వహ్వహ్వ" కైలాసం గుక్కలు పట్టాడు.

    "నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడుతావయ్యోయ్..." దైవాదీనం సంబరపడిపోయాడు.

    "చాలు చాలు. ఇంతవరకూ చెప్పింది చాలు. దైవాదీనంగారి టేస్టు నాకు బాగా తెలిసిపోయింది. రెండ్రోజుల్లో ఆయనగారి టేస్టుకు తగినట్లు కథరాసి పట్టుకొస్తాను..." శంభులింగం మహా ఉత్సాహంగా అన్నాడు.

    "నీకు పెతీదానికీ కంగారెక్కువయ్యా... నేను సెప్పేదికూడా కాస్త ఇను. మా టేస్టుకు తగిన ఇసయం ముందే నిర్ణయం సేసెట్టుకున్నాం. దాని మీద నువ్వు కత అల్లాల" దైవాదీనం కేకలేశాడు.

    "అప్పుడే వేరే సినిమాకి ప్లాను రెడీచేసి పెట్టుకున్నారన్నమాట!!" కైలాసం ముక్కున వేలేసుకున్నాడు.

    "మీ థీమేంటో చెప్పండి!" కుతూహలంగా కుర్చీలోంచి ముందుకు వంగి అంచున కూర్చోడంవల్ల బోర్లా పడిపోయి ముక్కు చితక్కొట్టుకున్నాడు శంభులింగం.

    "హ...హ.....హ.... అందుకనే నీకు కంగారెక్కువని అన్నది. సెగట్రీ! ఈనకి మన సబ్జెక్టు గురించి చెప్పు."

    శంభులింగం ముక్కు రుద్దుకుంటూ లేచి కుర్చీలో కూర్చున్నాడు.

    "మేము ఇప్పుడు తీయబోయే సినిమా ధీమ్ ఇంచుమించు తమల పాకులానే ఉంటుంది. తమలపాకు సినిమాని జనం ఆదరించారు కాబట్టి అదే కోవలో మరో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. అందుకనే మా సినిమాకి 'చింతపండు' అనే పేరు నిర్ణయించాం.

    "చింతపండా?" ఇద్దరూ ఒకేసారి అని ముఖముఖాలు చూసుకున్నారు కైలాసం, శంభులింగాలు.

    "హ....హ...హ.... పేరు వినగానే డంగై పోతారని నాకు తెల్సు" వారి ఆశ్చర్యం దైవాదీనంకెంతో ఆనందాన్నిచ్చింది.

    "ఇంతకీ ఏ పేరెందుకు పెట్టారండీ?" శంభులింగం అయోమయంగా ప్రశ్నించాడు.

    "చూశారా... పేరులోనే ఎంత సస్పెన్సుందో. మీలాగ జనాలుకూడా మన పిక్చరు విడుదల కాంగానే ఇదేట్రా నాయనా పేరిట్లాగుంది అని తికమకలు పడిపోయి, అదేదో తెలుసుకుందామని సినిమా సూడ్డానికి ఎగబడ్తారు. ఒక్కోపాలి సినిమా యిట్టవడానికి వేరే కారణమవుద్ది. కిటుకంతా అక్కడే  ఉంది. హ..హ...హ... అన్నట్లు ఆ పేరెందు కెట్టామని కదూ అడుగుతున్నారు. కొవ్వొత్తి అది కరిగిపోతూ యెలుగిత్తాదని దాన్ని ఆడదాంతో పోలుత్తారు. మా కిట్టాంటి పాత పోలికలు గిట్టవు... అందుకే తమలపాకు సినిమా తీశాం. ఇప్పుడు 'సింతపండు' తీస్తున్నాం. అసలు సింతపండులో ఎంత తేగం ఉందో తెల్సా?" ముందుకు వంగి రెట్టించి అడిగాడు శంభులింగాన్ని.

    శంభులింగం తనకు తెలీదన్నట్టు తల అడ్డంగా వూగించాడు. విసురుగా తల వూగించాడు వల్లేమో మెడనరం పట్టేసి "అబ్బా" అన్నాడు.

    "తెలీకపోతే పర్లేదు. నువ్వేమీ అంత బాధపడక్కర్లేదు... నే సెప్పాగా! సింతపండు తన సారాన్నంతా సాంబారుకిచ్చి దానికి గొప్ప రుసిని అమర్చేసి తాను పిప్పైపోయి మట్టిలో కలిసిపోద్ది... సూసాలా ఎంత తేగమో!! ఆడదాని జీవితం సింతపండుతో పోల్సి సూపిత్తాం ఈ సిన్మాలో"

    శంభులింగం ఒక్క దూకు దూకి దైవాదీనం కాళ్ళమీద పడిపోయాడు.

    "ఆహా! దైవాదీనంగారూ! మీ బ్రెయిల్ ఎంత గొప్పదండీ... దాంట్లో ఎన్ని ఆలోచనలో - హెన్ని ఆలోచనలో!!"
    దైవాదీనం గగ్గోలెత్తిపోయాడు- "అబ్బా... మళ్ళీ కాళ్ళట్టేసుకున్నా వేటయ్యా... అయ్యబాబోయ్ ... వదలవయ్యా నెప్పెట్టి సచ్చిపోతున్నా..."

    "వదలండీ... నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తేగానీ వదలను."

    "వదలకపోతే నీకు సినిమా శాన్సివ్వనంతే..." నొసలు కొట్టుకుంటూ అన్నాడు దైవాదీనం.

    అంతే! చటుక్కున దైవాదీనం కాళ్ళు వదిలి "అపచారం... అపచారం" అని లెంపలేసుకున్నాడు శంభులింగం.

    "కాళ్ళు కిందికెట్టడం నీతో పెమాదంగా ఉందయ్యా.. నీతో ఇట్టా నాబంనేదు... బాసిపట్టేస్కుని కూర్చోవాల్సిందే" ఎడంకాలు పైకెత్తి రుద్దుకుంటూ అన్నాడు దైవాదీనం.

    "ఏదో.. మీమీద గౌరవంతో ... హి హి హి."

    "మంచి గౌరవమే. తొక్కరేగ్గొడుతున్నావ్... సర్లె.... అట్లాకూకో. సెగట్రీ! ఇతనికి కత ఎలా రాయాలో సెప్పు.."

    "ఇందాక మా గురూగారు టైటిలు ప్రత్యేకత గురించి చెప్పారుకదా. స్ర్తీని చింతపండుతో పోలుస్తూ కథను మలచాలి. ఆ కథను తీసుకొస్తే మాకు నచ్చితే దానికి డైలగ్సుకూడా రాయిస్తాం. సినిమా ఆఖరున మా గురూగారు చింతపండు గురించి ఒక స్పీచి ఇవ్వడానికి వీలుగా డైలాగులు కూడా రాయాలి... మా గురుగారికి సినిమాల్లో స్పీచిలివ్వడం అలవాటు. అదిస్తేగానీ ప్రజలకు అర్థంగాదని..."

    "అవునవును..." శంభులింగం తల వూపబోయాడు గానీ, ఇందాక మెడ ఇరుకు పట్టడం వల్ల వూపలేకపోయాడు.

    దైవాదీనం నీటిగుర్రంలా నోరు తెరిచి ఆవలించాడు. " మద్దేసం నాకు పడుకునే అలవాటుందయ్యా... ఇహ నేను పడుకుంటాను. నేను హైద్రాబాదులో ఇంకా రెండ్రోజులుంటాను... ఈలోగా కత ఆలోచించి రాసి పట్రా..."

    "అలాగేనండీ... ఒక్కసారి పాదాభివందనం చేసి..."

    "అట్టాంటి కోరికలు కోరావంటే సినిమా శాన్సు లేదంతే..." రంకె వేసాడు దైవాదీనం.

    శంభులింగం లెంపలేసుకున్నాడు.

    కైలాసం, శంభులింగాలు దైవాదీనందగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయారు. శంభులింగం ఆఫీసుకు శలవు పెట్టి రెండ్రోజులు ఇంటి దగ్గరే ఉండి బుర్రమీద జుట్టంతా రాలిపోయేంత ఇదిగా ఆలోచించి 'చింతపండు' సినిమాకి కథరాసి పట్టుకెళ్ళి దైవాదీనం కిచ్చాడు.

    "ఈయాల మద్రాసెల్లి పోతున్నాం. కత సదివిన తరవాత కబురెడతా. మద్రాసొచ్చి డవిలాగులు రాద్దూగాని. మరేం కంగారు పడమాకు. వూరికే కాదులే.. అయిదువేలిస్తా... హ....హ....హ...." అన్నాడు దైవాదీనం.

    దైవాదీనం మద్రాసు వెళ్ళాడుగానీ, ఎన్నాళ్ళయినా శంభులింగానికి ఉత్తరం మాత్రం రాలేదు. నాలుగైదు నెలలకు 'చింతపండు' సినిమా విడుదలయ్యింది. శంభులింగానికి మూర్చవచ్చినంత పనైంది-తన సినిమా ఛాన్సు పోయినందుకు. 'చింతపండు' సినిమా తనుకూడా చూశాడు. అందులో కొన్ని సంఘటనలు తను రాసినవే. శంభులింగానికేం తెలుసు-దైవాదీనం తనకి చెప్పినట్టే ఇంకా చాలామందికి చెప్పి కథలు రాయించుకుని అందరి కథల్లోంచి కాస్త కాస్త తీసుకుని సినిమా తీస్తాడని? అన్నట్టు ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ దైవాదీనం అని తెరమీద పడింది. మొత్తానికి 'చింతపండు' గొప్ప సినిమా అనీ, దైవాదీనం గొప్ప దర్శకుడనీ ప్రజలు పొగిడారు.


                                          అయిపోయింది
                                               ***              
      


 Previous Page

WRITERS
PUBLICATIONS