నీవు ఏమైపోయావో తెలియదు. నా పాత స్నేహితుల్ని కలుసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళెవరికి నీ సంగతి తెలియదు. ఏం చేయను.
ఏదో ఒకనాడు నీవు కనపడతావని ఆశతో ప్రాణాలతో జీవించి వున్నాను విజయ్! ఈ నాటికి నా ఆశ ఫలించింది." అంటూ క్లుప్తంగా అసలేం జరిగింది అన్నది సుస్మిత చెప్పింది.
"నన్ను జైలుపాలు చేసి నా జీవితం నాశనం చేసింది మీ డాడీ జైలు దగ్గరకి వచ్చి నన్ను కలుసుకుని, నామీద ఎంత తెలివిగ ఉచ్చు బిగించి జైలు అనే నరకంలోకి తోసింది చెప్పి సుస్మితకి ఇదే నెలలో మ్యారేజ్ అని_ మ్యారేజ్ కాంగానే ఫారెన్ వెళుతుందని, ఇంక అక్కడ నీ నివాసం అని వివరంగా చెప్పి నా ముఖాన నవ్వి వెళ్ళిపోయాడు. జీవితంలో అంతులేనంతగ డబ్బు సంపాదించి మీ డాడీ ముఖాన కొట్టి...
గౌరవమయిన నా పాత జీవితం నాకివ్వు. నా సుస్మితని నాకివ్వు" అని అడగాలి. ఆ ధ్యేయంతో మంచి పనులు చేయబోయినా దొంగగా ముద్రపడ్డ నేను దొంగ నయ్యానుగాని ఏమీ సాధించలేక పోయాను. డబ్బు ఎలాగయినా సంపాదించగలను గాని నా సుస్మితని పొందలేను కదా! అన్న నిరాశ నన్ను అనుక్షణం బాధిస్తుండేది."
నా మాటలు వింటూ సుస్మిత కళ్ళనీళ్ళు కారుస్తుంటే ఓదారుస్తూ దగ్గరికి తీసుకున్నాను. ఒకరి కౌగిలిలో ఒకరం తన గురించి నేను నా గురించి తను ఏమేమో చెప్పుకున్నాం.
అలా...
క్షణాలు...నిమిషాలు...గంటలు...రోజులు...నెలలు__ ఏమో ఎంతసేపు గడిచిందో తెలియదు. బహుశా గంటన్నర కాలమే కావచ్చు. మాకలా అనిపించింది.
రాంసింగ్ వచ్చి తలుపు తట్టేదాక మా మాటలు అలా సాగుతూనే వున్నాయి.
తలుపు తీశాను తేలికపడ్డ మనసుతో.
రాంసింగ్ నవ్వుతూ లోపలికి వచ్చాడు.
28
కొత్త పోలీస్ ఫ్రెండ్ నాకు బాగానే ఉపయోగపడ్డాడు.
అతను కుర్రవాడు. కొత్తగా ఉద్యోగంలో చేరినవాడు. ఉద్యోగంలో అయితే చేరాడు గాని నేరస్తుల ప్రపంచం గురించి పూర్తిగా అవగాహన లేనివాడు.
ఆ రోజు కాఫీ హోటల్లో అతనితో కలిసి తీరుబడిగా టిఫిన్ తింటూ "మా అంకుల్ ఒకాయన కూడా పోలీస్ ఇన్ స్పెక్టరేను. కాని ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఆయన దగ్గర కూర్చుంటే బోలెడు కబుర్లు చెబుతాడు.
పోలీసులకి గాని, దొంగలకిగాని ఏ అలవాట్లు ఉండకూడదుట. మారువేషాలు వేసినప్పుడు అలవాటుని మర్చిపోయి ప్రవర్తించడంతో వాళ్ళెవరో ఇతరులకు తెలిసిపోతుందట...అంటూ మామూలుగా మాట్లాడుతున్నట్లు పోలీసుల వ్యవహారాలు నా సంభాషణలోకి తీసుకొచ్చాను.
పెరుగు ఆవడ, మసాలా దోసె బాగుంది. నా ఖర్చుతో యిప్పిస్తుండే సరికి కుర్ర పోలీస్ కి మెదడు నాలిక మీదికి వచ్చింది.
"తమ ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారికి కూడా మాటకుముందు ముక్కు ఎగబీల్చే అలవాటుందని...అన్నీ తెలిసినట్టు మాటాడతాడని... అంతలోనే కోపం అంతలోనే ఆప్యాయత ప్రదర్శిస్తూ ఏ నిమిషాన ఎలా ఉంటాడో...మహానుభావుడు అవతారాలు తెలియక ఛస్తున్నాం." అంటూ కాస్త చిరాకుతోను, కాస్త హేళనగాను ఇన్ స్పెక్టర్ గారి గురించి చెప్పాడు.
చెప్పినవాడు అంతటితో వూరుకోక "నేను ఉద్యోగంలో చేరిందే కొత్త. రావడం రావడం ఈ ఊరే వచ్చాను. ఈయన చేతికిందపడ్డాను. నా కో కానిస్టేబుల్స్ కి ఇన్ స్పెక్టర్ గార్ని చూస్తే ఒకటే నవ్వు. ఆయన ఎదుట "సార్! సార్" అంటుంటారు. ఆయనటు వెళ్ళంగానే ఆయనమీద ఒకటే చెప్పుకుంటుంటారు."
"ఏమని?" క్యాజువల్ గా అడిగాను.
"ఈయనకి మారువేషాలు వేసుకునే పిచ్చి మహావుందట. పాపం పెద్ద పెద్ద లంచాలు తీసుకోడానికి భయపడతాడుగాని ఆయనకేదన్నా వస్తువు కనబడితే అది కాస్త విచిత్రంగా ఉన్నా లేక ఆకర్షించినా ఇంటికి తీసికెళ్ళి పోతాడుట.
అది తన కెంతవరకు ఉపయోగపడుతుందన్నది చూడడు. అది చేతి కర్ర అయ్యేది, కాలిబూటు అయ్యేది ఇంటికి చేరాల్సిందే. ఇదేం పిచ్చో!" అంటూ నవ్వాడు కుర్ర కానిస్టేబుల్.
అది విన్న తరువాత నా బుర్రలో ఒకేసారి వంద ట్యూబ్ లైట్లు వెలిగాయి. 'గాలిలో ఒక బాణం వేస్తే' అప్పటికప్పుడే చకచక ఆలోచించాను.
