తనలో తానే ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తలూపిన శశాంక టాక్సీ దగ్గరకు నడవబోతూ టక్కున ఆగి మరో మారు డయాస్ కేసి చూశాడు.
"ఏమైంది" అప్పుడు పెదవి విప్పాడు జాకీ.
"ఇందాక వేదికపై కూర్చున్న వ్యక్తి దూరం కలుపుకోలేదు జాకీ. తొంభై అడుగులు కాదు, తొంభై అయిదు" స్వగతంలా అన్నాడు.
తనకోసం గాలిస్తున్న ప్రత్యర్థుల స్థావరంలోకి వచ్చి అంతసేపు నిలబడడం సాహసమే అనిపించిన శశాంక "కమాన్, క్విక్" అంటూ టాక్సీలో కూర్చున్నాడు.
శశాంక అంచనా తప్పు కాలేదు.
ఎదురుగా వున్న మేడపై నుంచి సర్కార్ ఇదంతా గమనిస్తూనే వున్నాడు. మరో రెండు నిమిషాలలో జయచంద్రకీ వార్త చేరవేయబడింది.
ఒక మాఫియా కింగ్ తన రాకపోకల్ని ఎంత అద్భుతంగా ప్లాన్ చేసేదీ అప్పటికి శశాంకకి అనుభవం కాలేదు.
* * * *
సరిగ్గా సాయంకాలం అయిదున్నరకి శశాంక సోఫియా బంగళాలో అడుగు పెట్టాడు.
ఇది ఆమె వూహించని విషయమే.
అందుకే ముందు తత్తరపడింది. మరుక్షణం "వెల్ కమ్" అంది. మొన్న జరిగిన విషయం గుర్తులేనంత మామూలుగా "నీ కోసమే చూస్తున్నాను"
శశాంక భృకుటి ముడిపడింది. "దేనికి?"
"నువ్వు సాధించిన రెండు కోట్ల రూపాయిల గోల్డ్ కి సంబంధించిన పది లక్షల రూపాయిల వాటా కోసం ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను" ఓ నిమిషం వ్యవధిలో కరెన్సీ వున్న బ్రీఫ్ కేస్ సందించింది.
ఇప్పుడు తత్తరపడడం శశాంక వంతైంది.
"ఏం. ఇస్తానని అనుకోలేదు కదూ."
"నీ వ్యాపారదక్షత మీద నమ్మకముంది సోఫియా. వ్యవహారాన్ని వ్యాపారానికి ముడి పెట్టవని నాకు తెలుసు."
"సగం అర్థమైపోయాను" యథాలాపంగా అంది.
"కామసూత్రాల్ని కాదు కౌటిల్యుడ్ని చదివుంటావు"
"అవును చిన్నతనంలో కౌటిల్యుడ్ని, వయసొచ్చాక వాత్సాయనుడ్నీ చదివాను. కాబట్టే ఆ రోజు నీ తెలివికి క్షణం ఆవేశపడ్డా తర్వాత ఆనందించాను. నిజం శశాంకా.. గాడి తప్పుతున్న నన్ను కాస్త ఎలర్ట్ చేశావు. పోయింది అతి ముఖ్యుడైన ఓ అనుచరుడే అయినా ఇక ముందు గురితప్పకుండా జాగ్రత్తపడే అనుభవాన్నిచ్చావు. అదిచాలు" నవ్వేసింది. "ఇక నీతో అనుభవం అంటావా... సింపుల్. నీ అంత నువ్వు నా పడకని చేరవని తెలిసింది కాబట్టి కావాలనిపిస్తే నా దగ్గరున్న ఓ అస్త్రంతో ఎప్పుడూ నిన్ను రప్పించుకోగలను."
"ఏమిటా అస్త్రం"
"నా అమ్ములపొదిలో పదిలంగా దాచుకున్న ఓ సమ్మోహనాస్త్రం. అవసరం వచ్చినప్పుడు అది చూపిస్తాను కాని... చెప్పు. ఏంటి ఇలా వచ్చావు."
సోఫియాని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు. వెంటనే తేరుకుని "నీ దగ్గరున్న ఆయుధాలు ఓసారి చూడాలి" అడిగాడు నిర్లిప్తంగా.
ఆమె దేనికీ అని అడగలేదు. రెండే రెండు క్షణాలు ఆలోచించి అతడ్ని వెంటబెట్టుకుని ఆమె బెడ్ రూం వెనుక భాగంలోని ఓ నేలమాళిగలోకి నడిచింది.
సెల్లర్ లో లైటు వెలిగించింది.
గోడలకున్న రేక్స్ లో వరుసగా ఉంచబడిన మారణాయుధాల్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు.
ఇండియాలో తయారయ్యే రైఫిల్స్ తో బాటు ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, అమెరికా దేశాల రివాల్వర్సూ, షాట్ గన్స్, స్టెన్ గన్సూ వున్నాయి.
"ఎలా సంపాదించావివన్నీ" ఒక ఆడది ఎంత గేంగుని మైంటైన్ చేస్తే మాత్రం ఇలాంటి మారణాయుధాల్ని సేకరించగలగడం శశాంక వూహించలేకపోతున్నాడు.
"స్మగ్లింగ్ ద్వారానే... అవును శశాంకా... ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకోవాలీ అంటే ఇలాంటివి తప్పవుగా"
మన దేశ రక్షణ వ్యవస్థలోని ఆయుధాలకన్నా అత్యాధునికమైన వాటిని తేరిపారా చూస్తూ ఓ రేక్ దగ్గర ఆగాడు. "యస్... ఐ గాటిట్" తను అమలుచేయబోయే పథకానికి చాలా అనుకూలమైన ఆయుధం లభించిందన్న సంతృప్తి మెదిలింది శశాంక కళ్ళలో.
"డాని వివరాలు కావాలా?" టెక్నికల్ డేటాని సూచించే మాన్యువల్ అందించబోతుంటే వారించాడు.
"కావలసింది ఈ రైఫిల్ మాత్రమే సోఫియా... వివరాలు అక్కర్లేదు" భావరహితంగా చూసాడు సోఫియాని. "ఏనుగులు కాని, ఏనుగు లాంటి మనిషిని కాని నేలకూల్చాలన్నా, బులెట్ ప్రూఫ్ జాకెట్ ని చీల్చి కాంక్రీటు చేయబడ్డ గుండెని పీలికలు చేయాలన్నా ఉపయోగించాల్సిన ఒకే ఒక్క ఆయుధం మోస్ బర్గ్ మోడల్ ATP 500-6... పన్నెండు మిల్లీమీటర్ల బోర్ నుంచి ఏభై సెంటీమీటర్ల బేరల్ ని దాటిన కార్డ్రిడ్జ్ ఎంతటి ఏక్సిలరేషన్ తో శత్రువుని చేరుకుంటుందీ అంటే ఆ గాలి రాపిడికే గుండె కవాటాలు భయంతో స్తంభించిపోతాయి"
"స్పెండిడ్" అభినందనగా చూసింది. "నువ్వొకనాడు అన్నట్టుగా నీకు ఆయుధ శాస్త్రంలో అపారమైన నాలెడ్జి వున్నట్టు నేను అంగీకరిస్తున్నాను. కాని తొందరపడి విష వలయంలో చిక్కుకోకు శశాంకా... ఏనుగుని అంకుశంతోనే పొడవాలన్న సూత్రాన్ని బట్టి జయచంద్ర కోసం మంచి ఆయుధాన్నే ఎన్నుకున్నావు కాని అదంత సులభంగా సాధ్యమయ్యేది కాదు."
