Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 63


    
    జవాబు చెప్పాడు ఆదిత్య నియమం ప్రకారం- "ఆముక్తమాల్యద అంటే తాను కొప్పులో ధరించిన పూలదండను సమర్పించిన కన్య అని అర్ధం.... ఇది రాసింది....కృష్ణదేవరాయల గురించి ఆదిత్య చెప్పకముందే చేతిని అడ్డం వుంచాడు రోహిత్ అక్కర్లేదన్నట్టుగా.
    
    "టైమైంది" చెప్పింది ప్రణయ.
    
    అరనిమిషంపాటు కాగితంపై ఏదో కాల్క్యులేట్ చేసిన ప్రణయ అంది న్యాయనిర్ణేతలా.
    
    "మొత్తం అరగంట వ్యవధిలో ఆదిత్య అడిగిన ప్రశ్నలు ముఫ్ఫై రోహిత్ జవాబు చెప్పలేకపోయింది పన్నెండు ప్రశ్నలకి. అంటే ఫెయిల్యూర్ నలభై శాతం" ప్రణయ గొంతులో చిరు గర్వం. "ఇందాక ఆదిత్య విఫలమైంది ఇరవై అయిదు పాయింట్ తొమ్మిది రెండు శాతం మాత్రమే సో....గెలిచింది ఆదిత్య."
    
    "బుల్ షిట్" ఉద్విగ్నంగా లేచాడు రోహిత్- "ఇదొక పోటీ, ఆ పోటీలో అతను గెలవటం అర్ధమైపోయింది ప్రణయా! యూ వాంట్ హిమ్. నీకు అతడు కావాలి కాబట్టి ఇద్దరూ కలిసి నన్ను ఓడించితీరాలనే ఆలోచనలతో కలిసికట్టుగా ఫ్లాన్ చేశారు."
    
    ఆదిత్య జవాబు చెప్పలేదు.
    
    గెలుపు అందించిన రిలీఫ్ కావచ్చు. లేదూ అంటే ఓడిన రోహిత్ పై అణువంత జాలి కావచ్చు. నిశ్శబ్దంగా చూస్తున్నాడు.
    
    వెళ్ళబోతున్న రోహిత్ తో అంది- "నువ్వు స్పోర్టివ్ గా తీసుకోలేక పోతున్నావ్"
    
    చివాల్న వెనక్కి తిరిగేశాడు- "హౌ కె నై...ఇంత తెలివిగా ప్లాన్ చేసిన మిమ్మల్ని చూసి..."
    
    "రోహిత్!" ప్రణయ కంఠం తీవ్రంగా మారిపోయింది- "బహుశా ఓడిన దుగ్ధతో నువ్విలా మాట్లాడుతున్నావనుకుంటాను."
    
    "సమర్ధించుకోవాలని ప్రయత్నించకు."
    
    "తెలివన్నది నీ ఒక్కడి సొత్తు కాదు."
    
    "అది నీకన్నా తెలివైనవాళ్ళు చెప్పాల్సింది."
    
    "ఎవరు తెలివైన వ్యక్తో ఇప్పుడు నిర్ధారణయిపోయిందిగా."
    
    "ఇది నిజానికి పోటీ కాదు."
    
    "అని ఓడిన తరువాత కాదు చెప్పాల్సింది."
    
    "సో..."
    
    "నన్ను మాట్లాడనియ్ మిస్టర్ రోహిత్! నన్ను పోగొట్టుకున్నానన్న బాధతో నువ్విలా మాట్లాడుతున్నావు. బహుశా ఆ బాధకంటే ఓడిపోయినందుకు నువ్వెక్కువ బాధపడుతున్నావేమో కూడా నాలో నిజాయితీయే లోపించిననాడు నీతో పోటీకి సిద్దపడేదాన్ని కాదు. ఎందుకు సిద్దపడ్డానూ అంటే మాటకు కట్టుబడాలని అంతే తప్ప నీకు భయపడి కాదు. నువ్వెవరూ....అన్న ఒక్క మాట నా పెళ్ళి విషయంలో నా నిర్ణయం నాదే తప్ప శాసించటానికి నువ్వెవరూ అన్న ఒక్క వాక్యంతో నిన్ను నేను తిరస్కరించగలను. కాని అలా అనకపోవటానికి కారణం మాటకు నిలబడాలన్న ఒకే ఒక్క ఆలోచన అహం చల్లారితే అతిథిగా నా ఇంట్లో వుండు. లేదూ అంటే....గుడ్ బై!"
    
    అప్పుడు చూశాడు ఆదిత్య... ప్రబంధ నిలబడి వుంది ద్వారం దగ్గర ఎప్పుడు వచ్చిందో, వారి చర్చ ఎంతసేపటినుంచి వింటూందో తెలీదు.
    
    కాని ఆమె మొహం వివర్ణమై వుంది.
    
    రోహిత్ ఏం గ్రహించాడో వెంటనే మొహానికి నవ్వు పులుముకుంటూ, ప్రణయని అభినందించాడు- "ఎనీ హౌ కంగ్రాట్స్ మిస్ ప్రణయా! ఆదిత్యని నువ్వు గెలుచుకున్నావో, లేక ఆదిత్యే నిన్ను గెలుచుకున్నాడో నాకు తెలీదు కానీ మిమ్మల్ని చూస్తే ఆనందంగా వుంది.
    
    అతడి మాటలు వింటూ తొట్రుపడిన ప్రణయ సాదరంగా ప్రబంధని ఆహ్వానించబోయింది- "రా ప్రబంధా!"
    
    "నేను వచ్చింది నీతో మమాటాడ్డానికి కాదు. ఆదిత్యని తీసుకు వెళ్ళటానికి."
    
    బోధపడిపోయిన రోహిత్ ఉత్సుకతగా చూస్తూ వుండిపోయాడు చాలా అర్ధమైనట్టుగా.
    
    అక్కడ క్షణాలు టెన్షన్ గా గడుస్తున్నాయి.
    
    ప్రబంధ దుడుకుతనం తెలిసిన అమ్మాయి ప్రణయ ఆమెను అపార్ధం చేసుకోలేదు- "కూర్చో ప్రబంధా!" అంది ప్రసన్నంగానే.
    
    "మిమ్మల్నే!" రెట్టించింది ప్రబంధ ఆదిత్యని చూస్తూ- "మీ కోసం హాస్పిటల్లో మీ చెల్లి ఎదురుచూస్తోంది."
    
    ఆదిత్య సందిగ్ధంగా చూస్తున్నాడు. ప్రణయ ముందు ప్రబంధ ఇలాంటి చనువుని ప్రదర్శించడం బొత్తిగా నచ్చలేదు.
    
    "అక్కడ మీ బామ్మగారి గురించి చెప్పాలని వచ్చాను. మీ ఇష్టం" ఆదిత్య మీద కోపం వచ్చిందేమో ప్రబంధ వెంటనే బయటకు నడిచింది.
    
    "అక్కడ మీ బంమాగ్రి గురించి..." అనడంతో తేరుకున్న ఆదిత్య వెంటనే పైకి లేచాడు.
    
    ఏమైంది బామ్మకి? ఆందోళనగా బయటకు నడిచి పిలిచాడు కారెక్కుతున్న ప్రబంధని- "బామ్మ కేమైంది?" అని అడిగాడు.
    
    "ఆ విషయం ఇక్కడే వుండి తెల్సుకోవాలనుకుంటున్నారా?" తను పిలిచాక కూడా ప్రణయ యింటినుంచి కదలటంలో ఆలస్యం చేస్తున్న ఆదిత్యని చూడకుండానే అంది...."కావాలంటే రండి....లేదంటే మీ యిష్టం."
    
    కంగారెక్కువైన ఆదిత్య మౌనంగా కారులో కూర్చున్నాడు ఇక్కడ ఆదిత్య చేసిన పొరపాటు ప్రణయకి మాటమాత్రం చెప్పకుండా బయలుదేరటం. అది బామ్మకేంజరిగిందో అన్న అలజడిలో జరిగిందే తప్ప, నిర్లక్ష్యం కాదు.
    
    కాని ప్రణయ అపార్ధం చేసుకుంది కారులో వెళుతున్న అతన్ని చూస్తూ.
    
    అయిదు నిమిషాల్లో హాస్పిటల్ కు చేరుకున్న ఆదిత్య వార్డులోకి అడుగుపెడుతూనే అప్రతిభుడయ్యాడు.
    
    బామ్మా స్పృహలోకి రావడమే కాదు. మనవడిని చూడగానే పలకరింపులా నవ్వింది.
    
    "బామ్మా!" ఒక్క అంగలో బెడ్ ని చేరుకున్నాడు.
    
    "పిచ్చి నాన్నా!" ఆప్యాయంగా తల నిమిరింది- "ఇందాకట్నుంచి చూస్తున్నాను....ఇప్పటికి తీరికయిందన్నమాట."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS