Previous Page Next Page 
ఆలింగనం పేజి 63


    ఆ మిత్రుడు 'మీ అమ్మాయికి పోయిన ఏడు పెళ్ళయిందిగా! అల్లుడు అమెరికాలో ఉంటాడా?' అని అడిగాడు.

 

    నేను నాన్న ఏమంటాడాని చూశాను.

 

    'కాదు...వెళ్ళాలనుకుంటున్నాడు' అని నాన్న గిల్టీగా నావంకచూశాడు. నేను పరిస్థితి అర్థం చేసుకుని ఆయన తాలూకు కాదన్నట్లు దూరంగా వచ్చేశాను. ఆ రాత్రి పడుకునేముందు ఆయన నారూంలోకివచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు.

 

    నేను అవకాశం ఇవ్వకుండా 'ఏబాండ్ మన మధ్యనలేకుండా, కేవలం మానవత్వంతో మీరు మాకు చేస్తున్న సహాయాలకు చాలా కృతజ్ఞతలు సార్!' అన్నాను.

 

    చెంపదెబ్బకొట్టినా అంత బాధపడేవాడు కాదేమో! విలవిలలాడుతూ చూశాడు. ఆ చూపులో నెప్పి నేను అర్థం చేసుకోలేకకాదు! నాకు క్లాసులో ఫస్ట్ మార్కువచ్చినా, తమ్ముడు టెన్నిస్ లో కప్పు గెలిచినా, తనే గెలిచినంత సంబరపడేవాడాయన.

 

    చాలామంది చట్టసమ్మతమైన తండ్రులకంటే కూడా యెక్కువ ఎఫెక్షనే మాకు అందించాడు. కానీ...హోటల్ లో 'మా అమ్మాయి కూడా స్టేట్స్ కి వెళ్తోంది...' అని ఆ మిత్రుడికి చెప్తే...ఏం పోయేది.

 

    సోషల్ స్టేటస్! అది మా మధ్యనున్న సంబంధాన్ని మింగేసింది. పూలన్నీ వూడిపోయిన అనుబంధపు మాలలో కేవలం వాటిని కట్టిన దారం మాత్రం మిగిలింది! ఏ వాసనా లేని ఒట్టిదారం!

 

    ఏనాడూ మా నాన్న చేతిని పట్టుకుని నేను దర్జాగా బంధువుల ఇళ్ళకి వెళ్ళలేదు. 'నా కూతురు' అని ఆయనచేత చెప్పుకోబడలేదు. ఎంత ప్రేమున్నా, ఆప్యాయతున్నా అంతా దొంగాచాటు వ్యవహారమే!

 

    అమ్మ ఆనాడు వయసు తొందరచేతో, లేక ప్రేమ అనే అయస్కాంతంచేతో ఆకర్షింపబడి ఆయనకీ దగ్గిరయింది. అప్పుడు ఆమె కేవలం అది తనకు సంబంధించిన విషయం అనుకుందిగానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు.

 

    "సరే ఆమె పెద్దగా చదువుకోలేదు. అజ్ఞానం అనుకుందాం...కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి తప్పులే చేస్తున్న ఆడపిల్లల గురించి ఏమని అనుకోవాలి?" ఆవేశంగా అని లిల్లీ ఒక్క నిమిషం ఆగింది.

 

    కళ్ళు మూసుకుని తలవిదిలిస్తూ బహుశా ఏవో చేదు జ్ఞాపకాలని దూరం చేసుకోవడానికి ప్రయత్నించింది.

 

    ఆ తర్వాత కళ్ళు తెరిచి "స్టేట్స్ లో జీవితం చూశాను. ప్రేమకీ డబ్బుకీ ఉన్న లంకె తెలుసుకున్నాను.

 

    చదువు పూర్తయింది. ఇండియా వచ్చాను. హైద్రాబాద్ లో ఉద్యోగం చూసుకున్నాను. ఈ ఫ్లాట్ తీసుకుని సెటిలైపోయాను. తమాషా ఏవిటంటే అమ్మకి నా మీద కోపం! ఆవిడ దృష్టిలో నాది విచ్చలవిడితనం.

 

    ఈ స్వేచ్చ బరితెగించినతనం! పెళ్ళి చేసుకోనన్నానని నా మీద కోపం. మరి ఆవిడచేసిన పనులని ఏవంటారో! తమ్ముడిదగ్గరే ఉంటానంది. సరే అన్నాను.

 

    నాన్న ఓసారి పెళ్ళి ప్రసక్తి తెచ్చాడు.

 

    "నువ్వు వచ్చి పీటలమీద కూర్చుని జరిపిస్తావా? శుభలేఖల్లో నీ కూతురిని అని వేయిస్తావా?" అని అడిగాను.

 

    నీళ్ళు నమిలాడు. ఇప్పుడు ఆయన సోషల్ స్టేటస్ ఇంకా పెరిగింది మరి! అల్లుడు పెద్ద పేరున్న డాక్టర్. కొడుకులు పాలిటిక్స్ లో బాగా పేరు మోశారు.

 

    ఇలాంటి సమయంలో ఆయన రెండో సెటప్ గురించి లోకానికి తెలిస్తే 'అమ్మో' ఎంత చిన్నతనం?

 

    ఇప్పుడు చెప్పు ముక్తా. నాలో ఇంకా సున్నితత్వం మిగిలి ఉండాలంటావా? ఒక ఆడపిల్లకి ఇన్ని జీవిత సత్యాలూ, మానవ సంబంధాల విలువలూ తెలిశాక కూడా రాటుదేలిపోకుండా ఎలా ఉంటుంది? ఎవరినైనా ప్రేమించడం, నమ్మడం...

 

    మీ అందరూ అనుకునేటట్లు ఒక పురుషుడిచేతిలో నా జీవితాన్ని పెట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకోవడం జరుగుతుందంటావా?" అంది.

 

    నా కళ్ళు రెండూ నీళ్ళతో నిండిపోయాయి.

 

    "విక్కీ నాతో కలిసి ఉంటున్నాడని అమ్మకి కోపం. అతను నాకు రూం దొరకక అల్లాడ్తుంటే తన రూంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు అతనికి నేను ప్రత్యుపకారం చెయ్యకూడదుట! ఎందుకంటే ఇది ఇండియా! అన్నీ దొంగచాటుగానే చెయ్యాలి. ఏదీ బాహాటంగా చెయ్యకూడదు" అంది.

 

    "ఒట్టి ఫ్రెండేనా?" అడిగాను.

 

    "అవును. అంతకుమించి మరేం లేదు మా మధ్యన. ఏం నమ్మలేవా?" అంది.

 

    "నమ్ముతాను. ఉంటే నాతో దాచాల్సిన పిరికితనం నీలో లేదని నేను నమ్ముతాను" అన్నాను.

 

    "గుడ్!" అంది.

 

    లిల్లీ అంటే నాకున్న అభిమానం ఆమె గురించి తెలుసుకున్నాక రెట్టింపయింది.

 

    "పెళ్ళి అంటే విముఖతా నీకు?" అని అడిగాను.

 

    "కాదు...ఓవర్ ఎక్స్ పెక్టేషన్! ఎంతో అందంగా ఊహించుకున్నాక అది తీరదేమోనని భయం"! అంది.

 

    ఆమె ఆంతర్యం నేను అర్థం చేసుకున్నాను. లిల్లీలా కాకపోయినా ఇంకోరకమైన ఎక్స్ పోజర్ వల్ల నేనూ రాటుదేలిపోయాను కదా!

 

    "నేను మనస్ఫూర్తిగా నీకు మంచి భర్త దొరకాలని కోరుకుంటున్నాను" అన్నాను.

 

    "అంతేనా...పెళ్ళికూడా దగ్గరుండి జరిపిస్తావా?" అని అడిగింది లిల్లీ.

 

    "జరిపిస్తాను" అన్నాను.

 

    "అయితే ఒక పని చెయ్యి ముక్తా! నీకు బాగా నచ్చితే, అసలు వీడ్ని ప్రేమించకపోతే బ్రతుకేలేదనిపిస్తే - అర్జెంటుగా నాతో కుదిర్చెయి. మారు మాట్లాడకుండా వచ్చి వరమాల వేసేస్తాను" సీరియస్ గా అంది.

 

    "అంతేనా...లేక ట్రైల్ కూడా చూడమంటావా?" నవ్వుతూ అడిగాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS