జగదాంబ వాడి తల ప్రేమగా నిమిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కైలాసానికి పొరబడి దగ్గు వచ్చేసింది.
"అవువూ... నువ్వు ఈ వూరు ఏం పనిమీద వచ్చావ్?" శంభులింగం ప్రశ్నించాడు.
"ఏదో కోర్టు పనిమీద వచ్చాలే... ఒకట్రెండు రోజులు ఉంటాను." బెదురు బెదురుగా చంటివాడివైపు చూస్తూ అన్నాడు కైలాసం. వాడు మళ్ళీ ఏ బాంబు పేలుస్తాడోనని భయం.
"ఇంతకీ ఎక్కడ దిగావ్?"
"మా అక్కయ్య. ఈ వూర్లోనే ఉంటున్నది-అక్కడ దిగాను."
"అబ్బ... మనం కలిసి నాలుగేళ్ళు పైనేకదూ అయ్యింది! ఇంతకీ నీకు ప్రమోషనేమైనా వచ్చిందా?"
"లేదు... మరి నీకో?"
"ఉహుఁ.... లేదు... ఈ సంవత్సరం ఆఖరికి రావచ్చు.
"అన్నట్లు కాలేజీలో చదివేటప్పుడు నీకు సాంస్కృతిక కార్యక్రమాల పిచ్చి ఉండేదిగా? అటువంటిది ఇప్పుడేమైనా ఉన్నాయా?" కైలాసం ముందుకి వంగి ప్రశ్నించాడు.
చంటివాడు కిలకిలా నవ్వాడు. కైలాసం భయంగా వాడివంక చూశాడు-మళ్ళీ ఏమంటాడోనని
"ఈమధ్య అవీ ఇవీ రాయడం మొదలుపెట్టానులే" అన్నాడు శంభులింగం గర్వంగా రొమ్ము విరుచుకుని.
"అమ్మో..అమ్మో.. రచయితవై పోయవన్నమాట! ఇప్పటిదాకా ఏమేం ప్రచురించావ్?"
"అబ్బే... ఇంకా అంత పెద్ద ఎత్తుకు ఎదగలేదు... ఇప్పటిదాకా నాలుగైదు 'ఉత్తరాలు శీర్షిక' కింద ప్రచురించబడ్డాయ్. 'సాహిత్యశ్రీ' అనే కలం పేరుతో రాశాను ఆ ఉత్తరాలు. నువ్వు చదివే ఉంటావ్....."
"ఆఁ..ఆఁ... చదివాను. నీ ఉత్తరాలు పత్రికకే హైలైట్. చదువుతున్నంత సేపూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయ్. శైలి ఎంతో బావుంటుంది. పాఠకుల్ని ఉర్రూతలూగించే విధంగా ఉన్నాయి." తను చదవకపోయినా చదివినట్టు అబద్దం ఆడేశాడు కైలాసం. శంభులింగం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
"కొన్ని కథలుకూడా రాశాను. అవి ఏ పత్రికలోనూ పడలేదు. అందరూ తిప్పి పంపేశాను. మొన్న ఈ మధ్యనే ఒక పెద్ద నవల రాసి పత్రిక్కి పంపించాను. వాళ్ళేం చేస్తారో మరి."
కెవ్వున కేకవేశాడు కైలాసం - "ఏకంగా నవలే రాశావన్న మాట!!"
"ఏవండోయ్! అన్నట్టు నవలంటే గుర్తుకు వచ్చింది" వంటింట్లోంచి జగదాంబ వచ్చింది. "ఈ వేళ ఆ పత్రికనుండి మీకు మనియార్డురు వచ్చింది"
"చూశావా? చూశావా? .... ఇన్నాళ్ళకు రచయితగా గుర్తింపు వచ్చింది. నా నవల సీరియల్ గా ప్రచురించబడుతుంది" లేచి నిలబడి డాన్సు చెయ్యడం మొదలు పెట్టాడు శంభులింగం.
"సీరియలా, శార్దమా? మీ నవలని తూకానికి అమ్మి ఒక నాలుగు రూపాయలు పంపించారు. అలా అని మనియార్డరు స్లిప్పుమీద రాసివుంది. దాంతో కూరగాయలు కొన్నాను" అనేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. కీ అయిపోయిన బొమ్మలా కుర్చీలో టకీమని కూలబడిపోయాడు శంభులింగం. అతన్ని చూస్తే కైలాసానికి జాలివేసింది.
"చూశావ్ రా... ఈ పత్రికలవాళ్ళు పేరున్న రచయితలవే ప్రచురిస్తారు. నాలాంటి కొత్తవారికి ప్రోత్సాహం ఇస్తే వారి సొమ్మేంపోతుందో!" దీనంగా అన్నాడు శంభులింగం.
"పత్రికల సర్క్యులేషన్ పడిపోతే మరి వాళ్ళసొమ్ము పోయినట్టేగా? వహ్వహ్వహ్వ....."
"బూచి మామయ్యా! నీ పళ్ళు అక్కడక్కడా నల్లగా ఉన్నాయేం? నువ్వు పళ్ళు తోముకోవా?" చంటిగాడు మరో బాంబు పేల్చాడు.
కైలాసం నోరు టక్కున మూతపడిపోయింది.
"అయినా! దీనికి పరిష్కార మార్గమే లేదట్రా?" గుండెదగ్గర చొక్కాని నలిపేస్తూ దుఃఖపూరితమైన గొంతుతో ప్రశ్నించాడు శంభులింగం.
"ఏ పరిష్కారమో, ఏమిటో... నేను రోజూ పళ్ళు తోముతూనే ఉన్నామరి.... పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి" పైకి చూస్తూ అన్నాడు కైలాసం.
"నీ సిగ్గోసి.... నేను మాట్లాడుతున్నది నీ పళ్ళగురించి కాదు. నా కథల గురించి" తన గోడు పట్టించుకోని కైలాసం మీద కొత్తగా పెళ్ళయి మొదటి పండక్కి వెళితే బట్టలైనా పెట్టకుండా పంపిస్తే, మామగారిమీద అల్లుడికొచ్చినంత కోపం వచ్చేసింది శంభులింగానికి.
కైలాసం కాస్సేపు ముఖం సీరియస్ గా పెట్టి అటూ ఇటూ పచార్లు చేశాడు. తనకు పరిష్కారమార్గం సూచించడానికి అలా తిరుగుతున్నాడని పసిగట్టిన శంభులింగం గుడ్లప్పజెప్పి కైలాసాన్ని చూస్తున్నాడు. ఉన్నట్టుండి గావుకేక పెట్టాడు కైలాసం. ఆ దెబ్బకి కుర్చీతో సహా పల్టీకొంటాడు శంభులింగం. ఉయ్యాలలోని చంటిది ఏడుపు లంకించుకుంది. చంటివాడు కొయ్యబారి పోయాడు. వంటింట్లో స్టప్ మీది గిన్నె దించబోయి కాలిమీదేస్కుని శాపనార్థాలు పెట్టసాగింది జగదాంబ.
నడ్డిపట్టుకుని లేచి, "అసలేమైందిరా?" అని ఆత్రంగా అడిగాడు శంభులింగం.
"నువ్వు దైవాదీనం పేరు విన్నావా?" శంభులింగం భుజాలు కుదిపేస్తూ అడిగాడు.
"ఎవరూ సినిమా డైరెక్టరేనా?"
"ఆ...ఆ..... వాడే. వాడెవరనుకున్నావ్?..... మా వేలు విడిచిన మేన బాపగారి తమ్ముడి పెళ్ళానికి అన్న అవుతాడు. నేను వాడికి బాగా తెలుసు. నా మాటన్నా కూడా మంచి గురి ఉంది. వాడికి మంచి సుడి ఉంది. సినిమా ఫీల్టులో దూరగానే పైకి వచ్చేశాడు. అయినా, నన్ను మర్చిపోలేదు. మొన్ననే ఉత్తరం రాశాడు. ప్రస్తుతం ఇక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు.
"ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నట్టూ?"
"ఎందుకేమిటీ?.... నిన్ను సినీ ఫీల్డులో పైకి తీసుకుని వద్దామని. దైవాదీనం తన ప్రతి సినిమాలో కొత్తవాళ్ళకి ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. నిన్ను రచయితగా తెరకు పరిచయం చేస్తాను. పాటలో, డైలాగులో రాయడానికి అవకాశం ఇస్తాడు. రేపే మనం ఇద్దరం దైవాదీనం దగ్గరికి వెళ్దాం...."
సంతోషం పట్టలేని శంభులింగం కెవ్వుమని కేకేశాడు. కైలాసం చెవులు గళ్ళుపడ్డాయి. అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి పూరుకుంటున్న చంటిది మళ్ళీ ఏడుపు లంకించుకుంది. చంటివాడు మరోసారి కొయ్యబారిపోయాడు.
స్టౌమీద మరుగుతున్న చారు గిన్నెను దింపబోయిన జగదాంబ మళ్ళీ రెండో కాలిమీద వేడివేడి చారును వలక బోసుకుని చిందులు వేసింది.
ఆ మర్నాడు ఉదయమే కైలాసం శంభులింగం ఇంటికి వచ్చి అతన్ని దైవాదీనం ఉంటున్న హోటలుకు తీసుకెళ్ళాడు. గది తలుపులు దగ్గరికి వేసున్నాయి. శంభులింగం చొరవగా తలుపులు తోశాడు.
"ఎవడ్రా వాడు?" లోపలినుండి ఎవరో రంకె వేశారు.
హడలిపోయిన శంభులింగం మళ్ళీ తలుపులు దగ్గరికి వేసేశాడు.
"సినిమా వాళ్ళ సంగతి నీకు బొత్తిగా తెలీదు. అట్లా తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళిపోవడమే?.... లోపల ఏమేం వ్యవహారాలు ఉంటాయో, ఏమో... అందుకని తలుపులు తట్టి రావచ్చా అని అడిగి గానీ వెళ్ళకూడదు" శంభులింగం మీద విసుకున్నాడు కైలాసం. శంభులింగం అయోమయంగా బుర్ర గోక్కున్నాడు.
