చటుక్కున మౌనంగా వుండిపోయింది.
ఐదు నిమిషాలు.
ఆమె శ్వాస దీర్ఘంగా వినిపిస్తోంది.
చెయ్యి నెమ్మదిగా జరుపుకుని, చెంపకిందినుంచి తప్పించి _ ఆమె తల నిమిరి_ ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూచున్నాడు. 'మూర్ఖిస్టులు ఆమె మనసును బాగా గాయపరిచి వుంటారు' అనుకున్నాడు.
గంటసేపు.
ముందు గదిలో శ్రీపతి అలాగే కూర్చుని వున్నాడు.
లోన గదిలో గాయత్రి గాఢంగా నిద్రపోతోంది.
అంతలో మోహన్ రెడ్డి వచ్చాడు.
మౌనంగా__కూర్చోమని చేత్తో సూచించాడు శ్రీపతి.
"యింతవరకు గాయత్రి యింటికి రాలేదు. సుధీర్ కలిసి చెప్పాడు. యివాళ విరసం మీటింగులో అందరి జాతకాలూ చదివి బయటపెట్ట అందరితో దెబ్బలాడి వచ్చిందట. యిటు వెళ్ళిందో _ వాళ్ళింటికీ వెళ్ళలేదు. ఐనా అటువంటి మూడ్ లో వాళ్ళింటికి పోదు" అన్నాడు దిగులుగా.
"గాఢంగా నిద్రిస్తున్న ఆ శ్వాస విను" అన్నాడు శ్రీపతి.
"యెవరు?" అన్నాడు మోహన్ రెడ్డి.
"యెవరో ఐతే యిప్పుడు నీకు చెప్పటం దేనికి!"
మోహన్ రెడ్డి అమాంతం లేచాడు.
గుమ్మంలోకి అడుగులు వేస్తున్న అతనితో, "డిస్టర్బ్ చెయ్యకు" అన్నాడు శ్రీపతి.
మోహన్ రెడ్డి మంచం దగ్గిరికి వెళ్ళి గాయత్రి వంక చూస్తూ నిలుచునిపోయాడు.
పది నిమిషాలు.
శ్రీపతి లోనకి వెళ్ళి మోహన్ రెడ్డి భుజంమీద చెయ్యివేసి ముందు గదిలోకి నడిపించుకొచ్చాడు.
102
సాయంత్రం ఆరున్నర వేళ.
శ్రీపతి తను వుంటున్న మేడ మెట్లెక్కి ధనలక్ష్మి వాటావైపుకి నడిచాడు మొదటిసారిగా.
నిన్న సాయంత్రం వచ్చి కాసేపు అవీ ఇవీ కబుర్లు చెప్పి, "రేపు నా పుట్టినరోజు. మీరు తప్పకుండా మా యింటికి రావాలి" అంది ధనలక్ష్మి.
"యెన్నో పుట్టినరోజు?" అన్నాడు.
"మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదంటారు?" అంది ధనలక్ష్మి.
"సంపాదన లేని మగాణ్నికదా అందుకని అడిగాను. ఐనా మీరు సంపాదిస్తూ పురుషస్థానంలోనూ రాణిస్తున్నారుగా!" అన్నాడు.
"ఆఁ, నా సంపాదన దేముందిలెండీ. మీకు చెప్పకూడనిది నాకేముంటుందండీ! యిరవై మూడో సంవత్సరం" అంది.
"యేం ఖర్మండి ధనంచిట్టీ, ఐదారేళ్ళే తగ్గించి చెప్పుకున్నావు _ పదహారేళ్ళ బాలకుమారనో, పసికోనలరో_ అని చెప్పుకుంటే మాత్రం కాదంటానా?" అని అనుకుంటూ, "చూస్తే అలా అనిపించరు. పందొమ్మిదేళ్ళనిపిస్తారు!" అన్నాడు.
"సంతోషంతో వుబ్బి తబ్బిబ్బవుతూ, "మీరు యిన్నాళ్ళుగా యిక్కడ వుంటున్నా ఒక్కసారైనా మా యింటికి రానేలేదు. రేపు తప్పకుండా రావాలి. సాయంత్రం ఐదు తరవాత మీ వీలును బట్టి. ఇంకా మా ఫ్రెండ్స్ కి చెప్పాలి మళ్ళీ వస్తాను" అని చెప్పి వెళ్ళింది.
శ్రీపతి వెళ్ళేసరికి ఆమె ఆఫీసువాళ్ళూ యితరులూ వచ్చి వెళ్ళారు. సద్దుమణిగాక వెళ్ళి ఓ ఐదు నిమిషాలు కూర్చుని వద్దాం అని అనుకున్నందున ఆరున్నరదాకా ఆగాడు.
"రండి, రండి" అని సంతోషంగా ఆహ్వానించింది.
లోన ముగ్గురు కూచుని వున్నారింకా.
"ఒకే బంగళాలో ఉంటూ నా బర్త్ డే సందర్భంగా రాక తప్పక యిన్నాళ్ళకి వచ్చారు!" అంది ధనలక్ష్మి.
ఓ కుర్చీలో కూర్చున్నాడు.
"వీరు శ్రీపతిగారని పోస్ట్ డాక్టొరల్ రీసెర్చి చేస్తున్నారు!" అని వొకామెవంక చూపెట్టి, "యీ అమ్మాయి నాకు పినతల్లి కూతురు. బియస్సీ చదువుతోంది వుమెన్స్ కాలేజీలో. ఇతను మా ఆఫీసులో స్టెనో. యీవిడ మృదుల సుప్రసిద్ధ నవలా రచయిత్రి. మీకు తెలిసే వుండాలి సాహిత్యం బాగా తెలిసినవారు." అని పరిచయాలు చేసింది ధనలక్ష్మి.
అందరికీ నమస్కారాలు చేస్తూ "ములక్కాడలా వుంది. వైరుధ్యాలంకారం అంటూ లేకపోతే; యీవిడనీ యీవిడ పేరునీ జోడించి కొత్తగా సృష్టించవచ్చు' అనుకున్నాడు.
"మృదులగారు రాసిన 'శ్రీమంతులు_గుణవంతులు' నవల చాలా ప్రసిద్ధమైంది. నాకెంతో నచ్చింది." అంది ఆ బియస్సీ విద్యార్థిని.
__తామర తంపరగా వస్తున్న వీళ్ళందరూ యెక్కడ గుర్తుంటారు. కనీసం పేరు చూసిన గుర్తు కూడా లేదు! ఐనా నేను వారపత్రికలూ యీ పుట్టగొడుగు నవలలూ చూస్తున్నదెక్కడ? యీవిడ__
అందరూ అతనివైపే చూస్తూంటే__
"నేను ఇంగ్లీషు, తెలుగు కవిత్వం యెక్కువగా చదువుతుంటానండీ. నవలలూ కథలూ అంతగా చదివే అలవాటు లేదండి" అని నసిగాడు శ్రీపతి.
_అందరూ పోయివుంటారని ఇప్పుడు వస్తే చివరికి యీ నవలా కెరటంలో పడ్డానే వచ్చొచ్చి....
"సులోచనారాణి కంటే గొప్పగా రాస్తాడండీ_" అని యింకేదో చెబుతోంది ఆ బియస్సీ విద్యార్థిని.
"మీకు ఆవిడ తెలియదాండీ. యీ వూళ్ళోనే వుంటారు." అంది ఆ విద్యార్థిని.
"లేదమ్మా. తెలియదు. నాకు రాసే వాళ్ళెవరూ తెలియదు. ఇదుగో ఇప్పుడీ మృదులగారు పరిచయం అయ్యారు."
"మృదులగారు కొత్తగా ఒక నవల రాయబోతున్నారండీ. చాలా ప్రత్యేకమైన నవల.
