Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 61


    వీధి దాటి యింకా పెడగా వెళ్ళి __ రాళ్ళ గుట్టలు దాటి, పచ్చిక వాలులోకి వెళ్ళారు.
    దూరంగా వున్న దీపాల మసక కాంతిలో__
    స్వప్నరాగలీనని కన్నార్పకుండా చూస్తూ, "స్వప్నా" అన్నాడు.
    "వూఁ" అంది__సహస్ర తంత్రుల వీణ 'కుహూ' అన్నట్లుగా.
    సంచి ముందు కొస వొక చేత్తోనూ రెండో కొస యింకో చేత్తోనూ పట్టుకుని వంచాడు, పూలు__రంగురంగుల రకరకాల పూలు __ ఆమె పాదాలమీద రాలుతున్నాయి.
    అతని చేతులు పైకి లేచాయి. పూలు ఆమె తల మీద భుజాలమీద వక్షం మీద రాలుతున్నాయి.
    ఖాళీ సంచి అవతల పడేశాడు.
    కన్నార్పకుండా ఆమెని చూస్తున్నాడు.
    ఆమె రెండడుగులు ముందుకు వేసి__అతని వక్షం మీద చెక్కిలి ఆనించింది. ఆమె తల అతని చెంపకి ఆనుతోంది.
    ఆమె వీపు చుట్టూ చెయ్యి వదులుగా తిప్పి__
    "స్వప్నా" అన్నాడు. అదే గాఢత్వంలో.
    "వూఁ" అదే స్వర్గం.
    తాపీగా కిందకి కుదించుకుంటూ__పచ్చికమీద కూర్చున్నారు.
    "యిన్ని రోజులు నిన్ను చూడకుండా యెట్లా వుండగలిగినావో నాకే అర్ధమవటం లేదు" అన్నాడు.
    "నేను అనాల్సిన మాట అది మీకు అంత ఇదేం లేదు. మీ రీసెర్చ్ లో మీరు మునిగిపోయారు"
    "నువ్వు మాత్రం రీసెర్చ్ చెయ్యటంలేదా!"
    "నా రీసెర్చ్ చెప్పాలా! యేదో కాలక్షేపానికి" అంది.
    "ప్రభుత్వ దానం! ప్రజల సొమ్ము!"
    "నేనేం యెవరి సొమ్మూ తినలేదు. నాకోసం యూనివర్శిటీ వాళ్ళతో ఒక్క పైసా ఖర్చు పెట్టించుకోలేదు. నా రీసెర్చి మీకోసం యెదురుచూస్తుండే రీసెర్చి. మధ్యమధ్యలో ఒక్కోనెల వూరెళ్ళి మా వాళ్ళ దగ్గిరవుండి వచ్చేదాన్ని. యింతకీ యెన్ని గంటలకి వచ్చారు యివాళ?"
    "మార్నింగ్ వెంకటాద్రిలో. స్టేషన్ కి శ్రీపతి వచ్చినాడు. అతనిదగ్గిరే వుండినాను."
    "శ్రీపతిగారు కలిసి మాట్లాడి చాలా రోజులైంది. ఆ మొన్న వొక పెళ్ళిలో చూశాను. అంతే. అమెరికా కబుర్లు చెప్పు. సీమ పిల్లలతో యేఁవేం చేశారో__"
    "నువ్వు చూడమన్నవన్నీ చూసినాను. వేరే యింకేమీ చూసే టైం లేకపోయింది. మిసిసిపీ......"
    అతను కబుర్లు చెబుతూంటే వింటోంది.
    అతని చేతివేళ్ళను తన చేతుల్లోకి తీసుకుని తన పెదాలకి తాకించుకోబోతే, ఆమె చేతిని తన వైపుకి లాక్కుని, ఆమె చేతివేళ్ళను తన పెదాలకు తాకించుకున్నాడు. కనురెప్పలు వాల్చాడు.
    చూపుడు వేలితో పెదవిమీద నొక్కింది.
    రెప్పలు విప్పి, కాళ్ళు జాపుకుంటూ కూర్చున్నాడు.
    ఆమె పాదాలమీద చేతులు వేసి స్పర్శిస్తూ, వొంగి ఆమె పాదాలమీద చెంప ఆనించుకున్నాడు.
    రెండు చేతుల్తో అతని భుజాలు పట్టుకుని వొళ్ళోకి జరుపుకుంది. వెల్లకిలా పడుకుని ఆమె గెడ్డం కొసవంక చూస్తున్నాడు.
    అతని వక్షంమీద అతని చేతివేళ్ళలో ఆమె చేతివేళ్ళు.
    "మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం?" యిద్దరూ ఒకేసారి అన్నారు.
    అందుకు_ యిద్దరూ ఒకేసారి నవ్వారు. సెలయేటి వాలులో ఇసకలో కదిలిన గులకరాళ్ళ సవ్వడిలో గవ్వల చప్పుడు కలిసినట్లు కలగలిసిన గలగలస్వరం.
    "నువ్వు చెప్పు" అన్నాడు.
    "మీరే చెప్పండి" అంది.
    "నువ్వు ఎప్పుడంటే అప్పుడు. రిజిస్ట్రాఫీసులో అంటే రేపే నోటీసు ఇస్తాను. గుళ్ళో అంటే మంచిరోజు చూసి నాలుగు రోజుల్లో ఆ పని శ్రీపతి మీద వేద్దాం" అన్నాడు.
    "నేనెప్పుడనటం కాదు. మీరెప్పుడనేదీ చెప్పండి."
    "నేనైతే యిప్పుడే అంటాను. యీ క్షణంలో నీ మెడలో తాళికట్టి"
    "రిజిస్ట్రరాఫీసులు, గుళ్ళో పెళ్ళి, గాంధర్వాలు దేనికి? రేపు నేను మా వూరు వెళతాను. మా నాన్నకి చెబుతాను. నా మాట కాదనడు. కాగా అనాల్సిన అవసరమూ లేదు. అన్నీ సాంప్రదాయకంగా పెద్దల ద్వారానే జరగనిద్దాం. ఎంతైనా పెళ్ళికూతురు వాళ్ళమేకదా మేం_మా వాళ్ళొచ్చి మీ వాళ్ళని అడుగుతారు, పోలీసు ఆఫీసరుగారు కాదు పొమ్మంటే _ పాపం మీరు బిక్కమొహం వేస్తారు కాబోలు!" అని నవ్వింది పత్తికాయ చిట్లిన చప్పుడు.
    "బిక్కమొహం కాదు స్వప్నముఖమేస్తాను" అని నవ్వి, "యీ రీసెర్చికి అమెరికా పంపించకపోతే ఇన్నేళ్ళు__" అని ఆగిపోయాడు.
    "అనంత్ యీ ఒడి, యీ ఒడి మీకు అప్పగించాను."
    సంతోషపు వొత్తిడికి అతని కళ్ళలో తడి ఉబికింది.

                                101

    రాత్రి తొమ్మిది. శ్రీపతి అప్పుడే హోటల్లో భోంచేసి వచ్చాడు. తాళం తీసి_బట్టలు మార్చుకోవటానికి లోన గదిలోకి వెళ్ళబోతూంటే గుమ్మంలో అడుగుల సవ్వడి.
    తల పక్కకి తిప్పిచూశాడు గాయత్రి.
    మోహన్ రెడ్డీ గాయత్రీ కలిసి ఒకటి రెండుసార్లు వచ్చారుగానీ గాయత్రి ఒక్కతే రాలేదెన్నడూ. యేదో సమస్య వచ్చిపడి వుండాలి_ అనుకున్నాడు శ్రీపతి.
    "లోపలికి రా గాయత్రీ. యిప్పుడే భోంచేసి వచ్చా. కూర్చో అలా" అన్నాడు శ్రీపతి.
    మౌనంగా కూర్చుంది కుర్చీలో.
    "యెటునుంచి? వొంట్లో యెలా వుంటోంది" అన్నాడు.
    ఆమె మౌనంగా వుండిపోయింది.
    ఆమె ముఖంలోకి చూసి, "గాయత్రీ, యెవరితోనన్నా గొడవపడ్డావా?" అన్నాడు.
    "లేదు" అన్నట్లు తల వూపింది.
    "మోహన్ యెక్కడ?" అన్నాడు.
    "కోర్టులో. పేద ప్రజలకి సేవ చేస్తాడట. యీ చెవిటి గాడిదల కొట్టంలో అరుస్తూ" అంది.
    "అతను ప్రాక్టీసు చెయ్యటం నీకిష్టం లేకపోతే మానేస్తాడు చెప్పు. నిన్ను కష్టపెట్టటం అతని అభిమతంకాదు. నువ్వు బాధపడితే సహించలేడు"
    "మోహన్ గురించి కాదు" అంది.
    "మరి"
    "నాకు ఈ ప్రపంచాన్ని వదిలిపోవాలనిపిస్తోంది. ఈ విరసాన్ని గిరసాన్ని యీ చవటల్ని యీ అల్పుల్ని _ సిగ్గు లేకుండా యింకా నాతో వాదనకి దిగుతారు. విప్లవ రచయితలు జైళ్ళలో చిత్రహింసలు అనుభవిస్తూంటే, విప్లవ వీరులు అడవుల్లో అహోరాత్రులు వ్యూహం పన్నుతూంటే _ ఇక్కడెందుకుండాలి? యేం చెయ్యాలి? నాకేమీ చేతకాదిక్కడ, నేను పసిదాన్ని. చిన్నారి అరుణని_" అని చటుక్కున లేచి లోన గదిలోకి వెళ్ళి, మంచం మీద బొక్కబోర్లా వొరిగింది.
    గది గుమ్మంలోకి అడుగులు వేసి_ ఆమెను గమనించి__ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు శ్రీపతి.
    ఆమె వెక్కి వెక్కి పడటం వినిపిస్తోంది ఇవతలికి.
    లోనకి వెళ్ళి, ఆమె వీపు మీద చెయ్యి ఆన్చి, "అసలేం జరిగిందో చెప్పు గాయత్రీ" అన్నాడు శ్రీపతి ఆప్యాయంగా.
    అతని చేతిని దిండుమీదకి తీసుకుని, అతని అరచేతిలో ముఖం ఆన్చి వెక్కి వెక్కి పడుతూ__
    "యీ వెధవలు యేమన్నారో తెలుసా శ్రీపతీ. నేను పొగరుబోతు ముండనట. చవట వెధవలు. నంగి వెధవలు. చొంగవెధవలు. దొంగ వెధవలు. పోచుకోలు కబుర్ల వెధవలు. విరసం వాళ్ళంటేయె రంగుతో గోడలు ఖరాబు చేసే వాళ్ళనిపించుకునేవాళ్ళు_ రచయితలా దేనికి__రాయటం దేనికి_ యెవరు రాసేది_ రాస్తే తనసంగతేఁవిఁటసలు? ఒకరో ఇద్దరో ముగ్గురో అట్లా కొందర్ని తప్పించి వీళ్ళంతా బూర్జువాల కంటే నీచులు_" అని ఆయాసపడుతోంది.
    "మోహన్ వున్నాడా ఆ సమయంలో?"
    "లేడు. వుంటే యేం చేస్తాడు? అటూ యిటూ శాంతింపజేయటానికి యత్నిస్తాడు. ఒక్కోసారి అతనిని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా_ గాంధీజీ స్టాలిన్ వేషం వేసినట్లుగా. మోహన్ మోహన్ __ నా మోహన్ నాకెంత యిష్టమో _ నా మనసు రవ్వంత నొచ్చితే గిలగిల్లాడిపోయే మోహన్_ కానీ యీ గాయత్రిని మోహన్ యేం చేసుకుంటాడు_ యీ గాయత్రి పసిది. పసి అరుణ. అరుణ కిరణాలలో, అరుణా రణా రణ్యంలో తొలి వేకువ రేకుల ఎర్రగులాబీ పసి అరుణ_"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS