Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 63


    "అవునండీ విప్లవాత్మకంగా కొత్త ధోరణిలో రాయబోతున్నాను. టెక్నిక్కు శైలీ అన్నీ కొత్త పద్ధతిలో_" అని చెప్పుకుపోతుంది మృదుల.
    _కొత్త కొత్త శైలిల్ని అవలంబించగలిగే ఈవిడికి శైలి అంటే....
    "పేరుకూడా నవలకీ, థీమ్ కి తగినట్లుగా విప్లవాత్మకంగా పెట్టానండీ_ బియ్యపు గింజలో వడ్లగింజ అని. తెలుగు నవలా విధానాన్నే తారుమారుచేసే ఈ పేరులో వున్న భావంతో కోకొల్లలుగా వస్తున్న రచనలు ఆగిపోతాయనుకోండి. అక్షరాలు నేర్చుకున్న ప్రతివాళ్ళూ మొదలెట్టారు రాయటం ఏమీ తెలియకపోయినా_"
    లోపల్నుంచి ధనలక్ష్మి తండ్రి ముష్టి రంగనాధం దగ్గు వినిపిస్తోంది. మృదుల చెప్పేది వినకుండా ఆ దగ్గు వింటున్నాడు శ్రీపతి.
    ఈ దగ్గులో ఒక లయా శైలీ వున్నట్లుగా వుంది. దగ్గేవాడి బాధ సంగతి వదిలేస్తే _ ఆ దగ్గులో ఒక వొడుపు వుంది. తెరలు తెరలుగానూ మధ్యలో అటకాయింపులతోనూ వస్తోంది. లయ లయ_కుక్క మొరగటంలో కూడా లయ వుంటుంది. సందర్భాన్ని బట్టి, కుక్కని బట్టి లయ వుంటుంది. యే లయా లేకుండా యీ రాణి వాగుడు....
    శ్రీపతి, తన నవలలు కూడా తెలియనంత అల్పజ్ఞాని అని జ్ఞానోదయమైన మృదుల తను పేల్చబోతున్న నవలా బాంబు సంగతి ఆపింది.
    ధనలక్ష్మి ఫలహారాలు పుచ్చుకోమని మర్యాద చేస్తోంది శ్రీపతిని.
    అంతలో ముసలాయన లోపల్నుంచి వచ్చాడు.
    మృదుల, ఆ విద్యార్థిని, ధనలక్ష్మి సహోద్యోగి లేచారు వెళతామని, ముసలాయన దగ్గు వాలకం చూసి అయిష్టంగా అనిపించి.
    ధనలక్ష్మి తండ్రిని పరిచయం చేసింది శ్రీపతికి.
    రంగనాధానికి నమస్కారం చేసి, లేచినవాళ్ళ వంక వీడ్కోలుగా చిరునవ్వు నవ్వాడు శ్రీపతి.
    "మా ధనం తరచూ చెప్తూంటుంది మీగురించి" అన్నాడు శ్రీపతి వంక ఆసక్తిగా చూస్తూ.
    "హీఁహీఁ" అని ఇకిలించాడు శ్రీపతి మర్యాదకి.
    "ఒకసారి వచ్చి కలుసుకుందామనుకున్నానుగానీ యీ అనారోగ్యం వల్ల మెట్లు దిగాలన్నా ఎక్కాలన్నా బహుకష్టం. అమ్మాయి మూడేళ్ళుగా వుద్యోగం చేస్తోంది. ఫారెన్ ప్రైవేటు కంపెనీలో కదా బాగానే ఇస్తారు. పెద్దవాడేమో__" అని తన బిడ్డల వివరాలు ప్రారంభించాడు రంగనాధం_మధ్యమధ్యలో దగ్గుతూ ఆయాసపడుతూ.
    ధనలక్ష్మి కాఫీ కలుపుకొచ్చి శ్రీపతి చేతికి అందిస్తూ ముఖంలోకి చూసింది.
    "దానం ఒక్కతే మిగిలింది పెళ్ళికావాల్సిన__"
    ధనలక్ష్మి చటుక్కున లేచి లోనకి వెళ్ళింది.
    "మీ యెరికలో యెవరైనా యోగ్యుడైన కుర్రవాడుంటే చూడు నాయనా! నేనా సంబంధాలు చూడటానికి ఎటూ తిరగలేని స్థితిలో వున్నాను_ నీలాగ యోగ్యుడు, బుద్ధిమంతుడు అయితే కులం పట్టింపు అంతగా వుండక్కరలేదు. కాలం మారిపోతున్నది కదా! మా ధనానికి ఆ పట్టింపులు అసలే లేవు_" అని ప్రారంభించాడు_కాసేపు మీరు కాసేపు నువ్వు అని దగ్గిరతనం యేర్పరుచుకుంటూ.
    అతను చెప్పుకుపోవటం అతని దగ్గులాగా కొనసాగుతూనే వుంది.
    "ఈయనీ టాపిక్ వదిలేలా లేడు" అనుకుంటూ, "అలాగేనండీ. ధనలక్ష్మిగారికి యేం లోపమని_ మీ గోత్రీకులలోనే నాకు తెలిసినవాళ్ళు ఒకరిద్దరున్నారు చెబుతాను" అన్నాడు శ్రీపతి.
    తలుపు అవతల వుండి ఆలకిస్తున్న ధనలక్ష్మి వస్తూ, "యీ పూట మీ భోజనం మా యింట్లోనే" అంది.
    "ముందుగా తెలిస్తే మహద్భాగ్యంగా చేద్దును. కానీ యెనిమిదింటికి ఓ మిత్రుణ్ని కలుసుకుంటానని చెప్పాను. విధిగా వెళ్ళాల్సిన జరూరు పని" అన్నాడు శ్రీపతి.
    "అయ్యో అట్లాగా_ యిప్పుడు టైమెంతయిందీ." అని గోడ మూలకి చూశాడు రంగనాధం_ అక్కడేదో గోడకి గడియారం తగిలించి వున్నట్లు.
    వాచీవంక చూచుకుని, "యేడున్నర" అని ధనలక్ష్మి వంకచూసి చిన్నగా నవ్వి, "మళ్ళీ కలుసుకుందాం. వస్తా" అని లేచి బయటపడ్డాడు శ్రీపతి.
    తాళం తీసి ఉలెన్ స్వెట్టర్ తగిలించుకున్నాడు.
    వీధిలో నడుస్తున్నాడు.
    __దానం, ముష్టి రంగనాధంగారి కడపటిధనం_ ధనలక్ష్మి భోజన దానలక్ష్మి, వివాహదీనలక్ష్మి_ఆ కో స్టెనోకి పెళ్ళి అయినట్లుంది. కాకపోయినా చేసుకోడు. తనతో సమానంగా సంపాదిస్తున్న ధనలక్ష్మి అయినా పైన అసలు ధనం కాస్త పడనిదే ఈధనం కంటికి ఆనదు. అందుకే మధ్యతరగతివాళ్ళు ఆడపిల్లల చదువులకి డబ్బు ఖర్చుచేస్తే అదనంగా మరిన్ని యిబ్బందులు.... ఆ రచయిత్రి మృదులకి పెళ్ళయిందా_ మనిషి చూస్తే చాలా ముదురుగా వుంది. మెళ్ళో సూత్రాలు కనిపించలేదు. బ్లౌజు లోపలికేసిందేమో_ ఆ చప్టాలాంటి వక్షం మీద చింతాకంతటి సూత్రం బిళ్ళయినా కనపడక తప్పదు. ఆ ఉల్లిపొర చీర, వొంటిపొర పవిట తియ్యకపోతే_ కాస్త మందపాటి చీర కట్టుకోకూడదూ_ పెళ్ళికాక, అయ్యే అవకాశం కనపడక ప్రత్యామ్నాయంగా రాతలోకి దిగివుంటుంది. తెలుగు పాఠకుల రాత బాగుండి సరిపడా మేత లభిస్తోంది వీళ్ళ పుణ్యమా అని. వార, మాస, మోస, మూస పత్రికలు నడుస్తున్నాయి. వీళ్ళంతా రాయటం మానేస్తే ఆ పత్రికలేంగాను_ యీ చదివే లక్షలాది బఠానీ సాహిత్య పాఠకుల గతేంకాను. ఈ మేత లేకపోతే యేం తోచక మొగుళ్ళతో మరింతగా దెబ్బలాడతారు' ఏ మొగుడితో అయినా యే పెళ్ళాం అయినా దెబ్బలాడటం సహజం, సకారణం. మొగుడన్నవాడు పెళ్ళాం అంచనాలకి యెప్పుడూ బెత్తెడు కిందకే వుంటాడు. ఆ వయ్యారెవరో, పొడవు చేతులూ, వీపంతా మూసేస్తూ బ్లౌజు_ కొత్త ఫ్యాషను_ పెద్ద మెడా పొట్టిచేతుల బ్లౌజులేం చేస్తారో_ చిట్టి మెడా పొడవు చేతులూ అయితే సులభంగా పెద్ద మెడా పొట్టి చేతుల్లోకి మార్పించుకోవచ్చు _ ఇలాంటి ఫ్యాషన్లు వచ్చే సందర్భంలో ఇంటి ఆర్ధికస్థితి బడ్జెట్ దెబ్బతింటుంది_ క్రితం బడ్జెట్ లో రిఫ్రిజిరేటర్లకీ, ఫ్యానులకీ, టీవీ సెట్లకీ రాయితీ లిచ్చాడు. పాపం అంతంత డబ్బు పోసి కొనేవాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించాలిగా! మన సర్కారు వారికి ఆ మాత్రం యింగితం లేకపోలేదు. యీ సిటీలో టీవీ స్టేషను పెడతామని వూరిస్తూ బెదిరిస్తున్నారు. చాలాకాలంగా_ యిప్పుడే ఒకటి కొని వుంచుకోమని ధ్వని కాబోలు_ అలా బడ్జెట్ పకడ్బందీగా యేర్పాటు చేసి బయటినుంచి అప్పుమీద అప్పు పుచ్చుకుంటూ అప్పు భారతి ఎమర్జన్సీ యమదండంతో_ యెంత సజావుగా సాగిపోతోందో దేశం_ యింతీ నీవి యెంత చక్కని పెదవులే తిట్టినా అంత తియ్యగానూ వుంటాయని వాడెవడో అరబ్బీ ప్రేమ ద్రావకంలో మునిగిన కవి అన్నట్లుగా, యెంత చల్లని పాలనే ఇందిరా నీది, అంతకాలిన అట్లకాడతో వాతలెడుతున్నా యెంత సమ్మగా వున్నదే భామరో_ గప్ చిప్ గా గిప్ చుప్ గా_ గప్ చిప్ సాంబారుబుడ్డి_ ఇళ్ళల్లో వాళ్ళు ఇళ్ళలో వీధుల్లో వాళ్ళు వీధుల్లో ఆఫీసుల్లో వాళ్ళు ఆఫీసుల్లో జైళ్లలో వాళ్ళు జైళ్ళలో దొంగనోట్లలో యెందులో వాళ్ళు అందులో క్రమబద్ధంగా శ్రమించి పనిచేస్తూ_ ఇంట్లోనూ వీథిలోనూ, ఆఫీసులోనూ జైళ్ళోనూ కనిపించనివాళ్ళు పోలీసు స్వర్గ సొరంగంలోంచి ఆకాశయాన పిల్లతెమ్మెర విహారయాత్రలా ఒడుదుడుకులు లేకుండా నదురూ బెదురూ లేకుండా తొణక్కుండా బెణక్కుండా సాదాగా, సాఫీగా, నిండుగా మురుక్కాలవలో దేశం ప్రశాంతంగా సాగిపోతూంటే జోజో ముకుందా.... జో అచ్చుతానందా.... జోల పరమానందా_ జాలి భారతానందా....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS