"ఆ అవసరం లేదు విజయ్! నీవు నిర్ధోషివని నాకు తెలుసు." అంది సుస్మిత.
"ఎలా! అసలేం జరిగింది? మీనాన్న లక్షలకి అధికారి. ఆయన ఏకైక కూతిరివి. అంత ఆస్థిగల నీవు ఇలా బైటికి వచ్చేసి జాబ్ చేసుకుంటూ బ్రతకడమేమిటి? నాకు చాలా విచిత్రంగా వుంది. విషయం అర్థంకాక అయోమయంగాను వుంది. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. వింటేగాని నామనసు తేలిక పడదు." సుస్మిత చేతిని నా చేతిలోకి తీసుకుని ఆచేతిని ఆప్యాయంగ నిమురుతూ అడిగాను.
"నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసికెళ్ళినట్టు... నువ్వు చాలా పెద్ద నేరాల్లో ఇరుక్కునట్టు... ఇటు పేపరులోను చూశాను అటు డాడీ కూడా చెప్పారు. "మీ పలుకుబడి ఉపయోగించి విజయ్ ని విడిపించకూడదా!" అని నేను అడిగాను. "అతని పేరు పేపరులో కెక్కింది. పోలీసులు గట్టిగ వున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసు కొట్టిపారేసేలాగ చూడగలను. ఇదే విషయంలో పెద్ద లాయర్ని సంప్రదిస్తున్నాను. విజయ్ నిజంగా నిర్దోషి అయితే అతను బైటికి వస్తాడు. అతనితోనే నీపెళ్ళి జరిపిస్తాను." అని డాడీ ప్రామిస్ చేశారు.
"జైలులో వున్న నిన్ను చూస్తానని... డాడీని కోరాను. అది మంచిపని కాదమ్మా! నేను చాటుగ నాపలుకుబడి వుపయోగించి విజయ్ ని బైటికి తీసుకురావాలని చూస్తున్నాను. ఈ సమయంలో నీవు జైలు దగ్గరకి వెళ్ళి అతన్ని కదిలిస్తే పేపరువాళ్ళకి కావాల్సినంత (మేత) న్యూస్. మనం తెరచాటున వుండి ప్రయత్నం చేయటం మంచిది." అని డాడీ చెప్పాడు. లాయరుగారిచేత చెప్పించారు. వాళ్ళ మాటలని నేను అప్పుడు నమ్మాను.
ఆతర్వాత వకరోజు
ఫ్రెండ్ పుట్టినరోజు...ఉదయం నుంచి సాయంత్రందాక వాళ్ళిట్లోనే తనతో గడుపుతూ వుండాలని కోరింది. సరేనని చెప్పి ఆ విషయం డాడీతో చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఫ్రెండ్ కి యివ్వాల్సిన ప్రజంటేషన్ ఇంట్లోనే మరచిపోయాను. సగం దారిలో గుర్తు వచ్చింది. కారుని వెనక్కి తిప్పమని డ్రైవర్ తో చెప్పి ఇంటికి వచ్చాను. ప్రెజంటేషన్ తీసుకుని ఇంట్లోంచి బైటికి రాబోతూ ఆగి డాడీ ఆఫీసు రూములోకి వెళ్ళాను. లోపల డాడీను, లాయర్ గారూ మాట్లాడుకుంటున్నారు. "విజయ్ గాడికి శిక్షపడేదాకా నాకు మనశ్శాంతిలేదు." డాడీ కంఠస్వరం కఠినంగా వినిపించింది.
వాళ్ళు అటుతిరిగి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రూమ్ లోకి ఎవరూ రారన్న ధైర్యంతో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. డాడీ నోటంట నీపేరు విని టక్కున తలుపుచాటుకి తప్పుకున్నాను. వాళ్ళ మాటలు యిలా సాగాయి.
"ఆ విజయ్ గాడికి ఎంత పొగరు? ఏకంగ నా ఆస్తిమీదనే కన్ను వేశాడు. నయానభయాన చెప్పాను. నక్కకి నాగలోకానికి పొంతన ఎక్కడ? నా కూతురు నా ఆస్తి మొత్తానికి అధికారిణి. నాగలోక దేవత. వాడు గుంటనక్క. మురికినీళ్ళు తాగుతూ ఊరిచివర శ్మశానంలో వుండ వలసినవాడు. వాడికి రెండు లక్షలు ఇస్తానని ఆశపెట్టాను. "నాకు నీ ఆస్తిలో పైసా అక్కరలేదు. సుస్మితని మాత్రం వదులుకోను." అని తెగేసి చెప్పాడు.
వాడెంత మొండివాడో అప్పుడు అర్థమైంది. వెంటనే నీతో సంప్రదించి బలమైన దొంగకేసు వాడిమీద బనాయించి రాత్రికిరాత్రి జైలులో ఊచలు లెక్కపెట్టేలా చేశాను. సాక్ష్యాధారాలు రుజువయాయి. రేపే తీర్పు. అయిదేళ్ళో పదేళ్ళో శిక్షపడుతుంది. అని యిప్పుడు నీవొచ్చి చెపుతుంటే నా సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. రేపు వాడికి శిక్షపడుతుంది. నీవు నాకీ ఉపకారం చేసినందుకు నేను యిస్తానన్న రెండులక్షలు రేపు సాయంత్రం పువ్వుల్లో పెట్టి యిస్తాను.
వాడు జైలుపాలయ్యాడని తెలిసి నాలుగురోజులపాటు సుస్మిత బాధ పడుతుంది. ఆతర్వాత వాడిని మరిచిపోయి నా కోరికతీరా ఓ కోటీశ్వరుడిని పెళ్ళాడుతుంది......హహ్హాహ్హా....."
అంతవరకు వాళ్ళమాటలు డాడీ నవ్వు విన్న నేను పిచ్చకోపంతో లేచి "నాకంతా తెలిసిపోయిందని..." గట్టిగ చాలా గట్టిగ అరిచాను. అంతే. ఆ తర్వాత ఏమయిందో తెలియదు. స్పృహ తప్పిపోయింది. మళ్ళీ తెలివివస్తే ఏదైనా ఇంజక్షన్ యిచ్చి స్పృహ తప్పించారో లేక నేనే లేవలేదో తెలియదు. సరీగ మూడు రోజులకి పూర్తి తెలివిలోకి వచ్చాను. అప్పటికి కోర్టులో నీకు శిక్షపడటం అయిపోయింది. జరగవలసిన ఘోరం జరిగిపోయింది.
నా సుఖమే తన సుఖం అని నా సర్వస్వమే తన సర్వస్వమనే డాడీవి నాలుక చివరనుంచి వచ్చే పంచదార కోటింగ్ పూసిన తీపి మాటలు. ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుతుందిగాని బలి కోరదు. డాడీతో పోట్లాడి ఇంట్లోంచి బైటికి వచ్చేశాను. మళ్ళీ ఇంట్లోకి నన్ను రప్పించటానికి డాడీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. "నేను జీవించి వుండాలని కోరితే నా మానాన నన్ను వదిలెయ్యి. లేకపోతే నా శవాన్నే చూస్తావ్!" అని గట్టిగా చెప్పేశాను. నేను సాధారణంగ ఏమాట అనను. దేన్ని సీరియస్ గ తీసుకోను. గట్టిగా మాట అన్నానంటే సీరియస్ గ తీసుకున్నానన్నమాటే అదే జరిగితే ప్రాణాలకి లెక్క చేయను.
నా సంగతి బాగా తెలిసిన డాడీ నన్ను వదిలేశాడు. నేను జాబ్ చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నాను. నీ గురించి విచారిస్తే జైల్లో నీ ప్రవర్తన మంచిగ వుండటం వల్ల నిన్ను ముందే విడుదల చేయటం జరిగిందని తెలిసింది. నాకు చాతయిన విధంగా నీ కోసం వెతుకుతూనే ఉన్నాను.
