"ఎక్కడ" శశాంక అడిగాడు సాలోచనగా..
"అతని మందుల కంపెనీ కాలనీలో వార్షికోత్సవానికి హోం మినిష్టర్ సదాశివయ్యతో సహా వస్తున్నాడు."
"ఐసీ" తల పంకించిన శశాంక కిటికీ దగ్గరకి వెళ్ళి నిలబడ్డాడు కొంతసేపు..
అరుదైన అవకాశమిది.
సామాన్యంగా తన భవంతి దాటి రాని వ్యక్తి... వచ్చినా మంది మార్బలంతో తప్ప బయట తిరగని వ్యక్తి ఇప్పుడు ఓ ఫంక్షన్ కు వెళ్ళబోతున్నాడూ అంటే ఇబ్బందితో కూడిన విషయమైనా దెబ్బతీయడానికి ఇంతకన్నా మంచి అదను రాకపోవచ్చు ఇప్పటిలో.
పథకమూ తనదే, ఆచరణా తనదే.
ఫలితం అదృష్టవశాత్తు అనుకూలించినా, లేదూ ప్రతికూలించినా పరిణామాల్ని ఎదుర్కోవాల్సింది తనే కాబట్టి ఈ ఛాన్సు చేజార్చుకోకూడదు.
దేశంలోని ఓ పెద్ద మాఫియా లీడర్ ని ప్రత్యక్షంగా ఎదుర్కోడానికి మార్గాల కోసం అన్వేషిస్తూ ఇక్కడిలా ఆలోచనలలో మిగిలిపోయిన శశాంక మరో పది నిమిషాలలో జాకీతో బయలుదేరాడు.
తన కారులో కాక ఓ ప్రైవేట్ టాక్సీ అద్దెకి తీసుకున్నారు అనుమానం రాకుండా.
ఓ పది నిమిషాలలో బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ ఎనిమిదిని చేరుకున్నాక జయచంద్ర ఇంటికి ఓ ఫర్లాంగు దూరంలో టాక్సీని ఆపించాడు శశాంక.
పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలించాడు.
చుట్టూ పెద్ద ప్రహరీతో వున్న ఓ లోగిలిలాంటి జయచంద్ర భవంతి చుట్టూ మరెన్నో షాప్ బంగళాలు. అతడింటి కభిముఖంగా పూర్తికాని నిర్మాణంలో వున్న అపార్ట్ మెంట్స్.
చాలా ఖరీదైన వ్యక్తులుండే ప్రాంతం కావడంతో మామూలు రోడ్లలా మడ్డి లేదు. ఒకటీ అరా అప్పుడప్పుడూ వెళ్ళే ఇంపోర్టెడ్ కార్లు తప్ప ఇంచుమించు నిర్మానుష్యంగా వుంది.
చివరగా జయచంద్ర ఇంటివేపు చూశాడు.
దేశ ఆర్థిక వ్యవస్థని విచ్చిన్నం చేయగల ఎన్నో పథకాలు ప్రత్యర్ధుల్ని కడతేర్చడానికిగాని, ప్రభుత్వాలని పడగొట్టడానికి గాని వ్యూహాలు ఇక్కడే అదే ఇంటిలో పాక్షికంగానైనా చర్చించబడతాయి.
సమాంతర ప్రభుత్వాన్ని నడపగల ఓ మేథావి తన సేనతో నిరంతరం నివసించే 'విల్లా'ని, పరిసరాల్ని ఓరకంట గమనిస్తూనే పోనియ్" అన్నాడు డ్రైవర్ తో..
బయలుదేరుతుండగా టైం చూసుకుని "జయచంద్ర కంపెనీ కాలనీకి గైడ్ చెయ్" అన్నాడు జాకీతో.
బాలానగర్ దాటేక నర్సాపూర్ రోడ్డు చేరడానికి సుమారు ఇరవై రెండు నిమిషాలు పట్టింది.
రోడ్డు ప్రక్కనే వున్న మందుల ఫ్యాక్టరీ వేపు అతడు చూస్తుండగానే టాక్సీ మలుపు తిరిగి కాలనీని చేరుకుంది మరో మూడు నిమిషాలలో.
సిటీకి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న కాలనీ చాలా విశాలంగా వుంది.
ఎగ్జిక్యూటివ్స్ కి విడిగా క్వార్టర్సంటే వర్కర్స్ కి ఫ్లాట్స్ రూపంలో ఇళ్ళు నిర్మించబడ్డాయి.
సన్నని తారురోడ్డుపై నుంచి మరో రెండు నిమిషాలలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ని చేరుకుంది టాక్సీ.
టాక్సీ దిగిన శశాంక మళ్ళీ టైం చూసుకోవడం మర్చిపోలేదు.
అప్పటికే జరగబోయే ఫంక్షన్ కోసం ఏర్పాట్లు ప్రారంభమైన సూచనగా కొందరు వ్యక్తులు ఆడిటోరియంకి కొద్ది దూరంలో'ఆర్బెన్' నిర్మిస్తున్నారు.
ఆడిటోరియంకి అభిముఖంగా పెద్ద గ్రౌండ్, డాని సమీపంలో స్కూలు బిల్డింగూ వుంది.
దూరంగా కిలోమీటరు దూరంలో గుట్టలు. అక్కడ నుంచి చిన్న చిన్న పొదలు, రాళ్ళు. ఆడిటోరియంకి కుడిప్రక్కన వున్న గుడిదాకా విస్తరించి వున్నాయి.
శశాంక దృష్టి అప్రయత్నంగా కాలనీ డిస్పెన్సరీపై పడింది. ఆడిటోరియంకీ, డిస్పెన్సరీకి మధ్య వున్న దూరం సుమారు నూటఏభై అడుగులుంటుంది.
నెమ్మదిగా వెనక్కి నడిచి గ్రౌండు కానుకుని వున్న చింతచెట్ల దగ్గర నిలబడ్డాడు కొంతసేపు.
అతి ప్రమాద భూయిష్టమైన ఆలోచనలతో వేగిపోతున్న శశాంక కళ్ళలో ఒక అనుభవంగల షూటర్ టార్గెట్ చూస్తూ ట్రిగ్గర్ నొక్కేటప్పటి నిశ్చలత మాత్రమే కనిపిస్తూంది.
ఉద్విగ్నతని ఏకాగ్రత అదుపుచేస్తూంది.
మూడో చింత చెట్టు దగ్గర నిలబడి ఓమారు ఆడిటోరియంకేసి చూశాడు.
సుమారు తొంభై అడుగుల దూరం వుంటుంది.
తల పైకెత్తి చూశాడు. గుబురుగా వున్న చెట్టు కూర్చోడానికి అనుకూలంగా వుంది.
జాకీ నిశ్శబ్దంగా శశాంకనే గమనిస్తున్నాడు తప్ప డిస్టర్బ్ చేయడం లేదు.
శశాంక పరిసరాలను మరిచి ఎప్పుడో ఒక ధ్యానంలోకి జారిపోయాడు అని జాకీ గ్రహించాడు.
