Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 62


    అదేశాతంలో రోహిత్ ఫెయిల్యూర్ కూడా పెరగనినాడు అది తనకీ ఇబ్బందిగా గుర్తించాడు ఆదిత్య.
    
    అలా అని రోహిత్ లా ఇక ఇబ్బందికరమయిన ప్రశ్నలతో దాడి చేయకూడదనుకున్నాడు- "తెలుగువాడిగా తెలుగు చరిత్రకి సంబంధించిన ప్రశ్నల్ని మీరు అంగీకరించకపోతే పోనీ, భారతీయుడిగా భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలకి జవాబు చెబుతారనుకుంటాను."
    
    "ఇలా దయచూపాల్సిన ఆగత్యం లేదు మిస్టర్ ఆదిత్యా...! ఐ హేటిట్! అడగండి" మొండిగా అన్నాడు రోహిత్ "కాని రుద్రమదేవి పెళ్ళి ఏ రోజు జరిగింది? తాండ్రపాపారాయుడు పుట్టినతేదీ అంటూ క్విజ్ విషయాల్ని ఉల్లంఘించకండి.
    
    గట్టిగా జవాబు చెప్పేవాడే ఆదిత్య-కాని వాగ్వివాదం ఆదిత్య ఉద్దేశ్యం కాదు.
    
    "వెల్.... మీరు కోరిన పద్ధతినే అనుసరిస్తాను. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా తొలి మహిళ ఎవరు?"
    
    "కుమారి బచేంద్రీ పాల్."
    
    "ప్రముఖ విప్లవకారుడు భగత్ సింగ్ తల్లిదండ్రులెవరు?"
    
    "విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్."
    
    "మనదేశంలో కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని మొదటగా నిర్వహించిన రాష్ట్రం?"
    
    "కేరళ..."
    
    "ఎయిడ్స్ వ్యాధితో మరణించిన తొలి భారతీయుడు ఎవరు?"
    
    "ఇట్స్ నాన్సెన్స్" అడ్డుపడ్డాడు రోహిత్. "ఇది అర్ధంలేని ప్రశ్న. చాలామంది పోయుంటారు."
    
    "నేనడిగేది రికార్డ్ చేయబడిన తొలి వ్యక్తి గురించి."
    
    "ఇది క్విజ్ లో అడగదగ్గ ప్రశ్న కాదు."
    
    "ఓ నిముషం పూర్తయింది" గుర్తుచేసింది ప్రణయ.
    
    "అలా మరణించిన వ్యక్తి పేరు బేహారీలాల్ రామచంద్ర ముఖీజా" జవాబు చెప్పాడు ఆదిత్య.
    
    రోహిత్ ఇబ్బందిగా చూస్తున్నాడు.
    
    "మాతృభాష మరాఠీ అయినా రచనలు మాత్రం కన్నడంలో చేస్తూ జ్ఞానపీఠ్ బహుమతి పొందిన రచయితెవరు?"
    
    "తెలీదు."
    
    "దత్తాత్రేయ రామచంద్ర బేంద్రే..." చెప్పాడు ఆదిత్య.
    
    "ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విహంగం పేరు?"
    
    "తెలీదు."
    
    "పాలపిట్ట."
    
    "పాండవులు రాజ్యంలో తమ భాగం క్రింద అయిదు ఊర్లు కోరుకున్నారు. వాటిపేర్లు?"
    
    రోహిత్ నిశ్శబ్దంగా చూస్తూండిపోయాడు.
    
    నిముషం తర్వాత చెప్పాడు ఆదిత్య- "కుశస్థలం, వక్షస్థలం, వాసంతి, వారణాంతం- ఈ నాలుగూ కాకా మరేదన్నా ఓ గ్రామం కూడా కావాలని అడిగారు పాండవులు."
    
    "వానపాముకి ఏ భాగంలో కళ్ళుంటాయి?"
    
    "దానికి కళ్ళుండవు."
    
    "నైస్..." మృదువుగా నవ్వాడు ఆదిత్య.
    
    "మహిళల్నే బాడీగార్డ్స్ గా ఉపయోగించుకునే ఓ దేశాధినేత?"
    
    "లిబియాకి చెందిన కల్నల్ గడ్డాఫీ."
    
    "వాత్సాయనుడి కామసూత్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన మొదటి రచయిత?"
    
    "రిచర్డ్ బర్టన్."
    
    "ప్రపంచ కథల పోటీలో మొట్టమొదటిసారిగా బహుమతి పొందిన తెలుగు కథానిక పేరు?"
    
    "పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన."
    
    "భారతీయ వైద్యశాస్త్రంలో శస్త్ర చికిత్సా పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి?"
    
    "తెలీదు."
    
    "ఆలోచించి చెప్పండి" అవకాశం ఇచ్చాడు ఆదిత్య.
    
    "అలా స్టూడెంట్ ని డీల్ చేసినట్టు మాట్లాడకండి..." ఇంకా తన అహాన్నే ప్రదర్శించాడు రోహిత్.
    
    "వెల్....శుశ్రుతుడు..." జవాబు చెప్పిన ఆదిత్య టైమ్ చూసుకున్నాడు. మిగిలింది మూడు నిముషాలు.
    
    " 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గేయ రచయిత ఎవరు?"
    
    అసహనంగా చూశాడు రోహిత్.
    
    "తెలుగు జాతికి అపురూపమైన గేయమది" గుర్తుచేశాడు ఆదిత్య.
    
    "తెలీదు."
    
    "శంకరంబాడి సుందరాచారి."
    
    మిగిలింది ఒకటిన్నర నిముషం.
    
    "పెరూకి చెందిన జాతీయ గీతాన్ని ఇంగ్లీషు భాషలో మొదటి వాక్యాన్ని చెప్పండి?"
    
    "వియార్ ఫ్రీ, వియ్ విల్ ఆల్వేస్ బి ఫ్రీ..." టక్కున జవాబు చెప్పాడు రోహిత్.
    
    నవ్వుకున్నాడు ఆదిత్య. మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసింది తెలీదుగాని పెరూ జాతీయగీతం గురించి టక్కున చెప్పాడు. నిజానికి ఆ గీతం గురించి ఆదిత్యకీ తెలీదు. అయినా ఆమోదించాడు.
    
    "ఆముక్తమాల్యద అంటే...?"
    
    "షిట్!" ఉక్రోషంగా అరిచాడు రోహిత్- "నన్ను గెలవటమే ధ్యేయంగా పెట్టుకుని అడుగుతున్నారు."
    
    "పొరపాటుపడుతున్నారు మిస్టర్ రోహిత్" నచ్చచెప్పాడు ఆదిత్య. "అలాంటి ఉద్దేశాన్ని మీ పోటీద్వారా మీరు ఎక్స్ ప్రెస్ చేశారు. కాని నేను అడుగుతున్నది ప్రముఖులు, ప్రముఖుల చరిత్రలు లేదూ కావ్యాలకి సంబంధించిన ప్రశ్నలు."
    
    "నిమిషం అయిపోయింది" ఉత్సాహంగా అంది ప్రణయ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS