ఏమైందేమయిందని గాబరా పడి పోయాడు కైలాసం.
"ఇంకేం కావాల్రో నాయనోయ్! ఒకటి మిస్సయిపోయింది దేవుడోయ్!"
కేసు అర్థమయిన కైలాసం చిద్విలాసంగా నవ్వాడు.
"ఒరే-చిన్నప్పుడు నీకు లెక్కల్లో ఎప్పుడూ సున్నా మార్కులే వచ్చేవి గుర్తుందా? అయితే, ఇప్పటికీ నువ్వు లెక్కల్లో పూరేనన్నమాట! వహ్వహ్వహ్వ-మళ్ళీ ఒకమారు లెక్కట్టుకో సరిపోతుంది."
శంభులింగం చొక్కా పైకెత్తి నోట కరిచిపెట్టి , రెండు చేతుల్తో జాగ్రత్తగా తడుముతూ పక్కటెముకలు లెక్కబెట్టి గుక్కలు పట్టి నవ్వాడు.
"మిస్సవలేదోయ్, అన్నీ ఉన్నాయ్" అన్నాడు కళ్ళలో తిరిగిన నీళ్ళని తుడుచుకుంటూ.
"ఆ ఏమిటోయ్ సంగతి? ఎక్కడున్నావ్ ఇన్నాళ్ళూ? ఏమైనా పిల్లాజల్లా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపంచాడు కైలాసం.
ఆ ప్రశ్నల వర్షపు జల్లులు పడి, తడి తగిలి నిజంగా వర్షం పడుతున్నదేమోనని కంగారుపడి తలెపైకెత్తి ఆకాశంవైపు చూశాడు శంభులింగం ముఖం తుడుచుకుంటూ, ఆకాశం ఆకలిలో ఉన్నవాడు నాకేస్తూ తిన్నపళ్ళెంలా శుభ్రంగా ఉంది.
"అలా పైకి చూస్తున్నావేమిటోయ్? ఏ శరీరవాణో నిన్ను ప్రశ్నంచలేదు.. నేనే"
మళ్ళీ శంభులింగం మొహంమీద జల్లు కురిసింది. చొక్కా పైకెత్తి మొహం తుడుచుకుని ఆ జల్లు వర్షంకాదనీ, అది కైలాసం నోటినుంచి వస్తున్న తుంపరలనీ గ్రహించి తను వర్షంగా పొరబడినందుకు తలపంచి సిగ్గుపడ్డాడు శంభులింగం.
"పిల్లా జల్లా గురించి అడగ్గానే తల వంచేస్కుంటున్నావ్.... కొంపదీసి డజన్ల కొద్దీ కనెయ్ లేదు గదా?"
"అదేం లేదులే... పిల్లలు ఇద్దరే. ఇలా రోడ్డుమీద నిలబడి ఏం మాట్లాడుతాం? పద మా యింటికి పోయి మాట్లాడుకుందాం" అన్నాడు శంభులింగం కైలాసం భుజంమీద చెయ్యేస్తూ.
ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.
"అంబా-అంబా"
కంగారుపడి చుట్టూ కలియజూశాడు కైలాసం." మీ ఫెన్సింగ్ లో గేద జొరబడి నట్టుందోయ్... మొక్కలన్నీ నాశనం చేస్తుంది. ఏ మూల నక్కిందో చూడు" అన్నాడు. కిసుక్కున నవ్వాడు శంభులింగం ."చిన్నప్పుడు నువ్వూరికే కన్ ప్యూజు అయ్యే వాడివి. నీకు తెలుగు వాచకానికీ - చరిత్ర పుస్తకానికీ భేదం తెలిసేది కాదు.... అలా కన్ ప్యూజు కావడం పెద్దయ్యాక మరీ ఎక్కువైనట్టుందే" జాలిగా కైలాసం వైపు చూశాడు.
"నా చెవులు నన్ను మోసం చెయ్యవు. గేదె అరవడం నేను విన్నాను."
మళ్ళీ కిసుక్కున నవ్వి " అదేం కాదులే నేనే." అని తలుపుతడుతూ "అంబా! అంబా!" అని పిలిచాడు శంభులింగం.
"అదేమిటి?" ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకోబోయి మళ్ళీ తనకు పిప్పి పన్నుందని గుర్తుకొచ్చి మానేశాడు కైలాసం.
"మా ఆవిడను పిలుస్తున్నానులే. దాని పేరు జగదాంబ. నేను అంబా అని పిలుస్తాను" శంభులింగం అలా అనడమేమిటి.తలుపులు భళ్లున తెరుచుకుని లోపలినుండి ఒక లావుపాటి గాజుల చెయ్యి సర్రున దూసుకుని వచ్చి శంభులింగం కాలరు పట్టుకుని లోపలికి లాక్కుని ధడాలున కైలాసం ముఖంమీద తలుపులు మూసుకోవడం-అంతా ఒక్కక్షణంలో జరిగిపోయింది. కైలాసం బిక్కచచ్చిపోయి నిలబడిపోయాడు.
"కూరగాయలకని వెళ్ళినవారు ఇంతసేపూ ఎక్కడ చచ్చారు? నేను ఎప్పుడు వండేది, పిల్లలకు ఎప్పుడు పెట్టేదీ, మనం ఎప్పుడు మింగేది?" పెద్దగా అరుపు టప్ టప్ మని శబ్దం, తరువాత శంభులింగం మెల్లగా ఏదో గొణగడం - కైలాసానికి వినిపించింది. తలుపులు మళ్ళీ భళ్ళు భళ్ళున తెరుచుకున్నాయి. కైలాసం భయంగా నాలుగడుగులు వెనక్కు వేశాడు-మళ్ళీ ఏ చేయి సర్రున వచ్చి తన కాలరు పట్టి లోపలికి లాగుతుందోనని.
"నమస్కారమండీ అన్నయ్యగారూ! మిమ్మల్ని చూడలేదు, తలుపువేసేశాను" గుమ్మానికి అడ్డంగా నిలబడి అంది జగదాంబ
"న. న. న. నమస్కారం చె.... చెల్లెమ్మా" తడబడుతూ ప్రతినమస్కారం చేశాడు కైలాసం.
"లోపలికి రండి" గుమ్మంనుండి పక్కకి తొలిగి అంది.
వణికే కాళ్ళతో లోపలికి అడుగు పెట్టాడు కైలాసం. పీపామీద చెంబు బోర్లించి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది జగదాంబ అనుకున్నాడు.
"కూర్చోండి"
గబుక్కున కూర్చున్నాడు.
"మావారెప్పుడూ మీ గురించే చెబుతుంటారు."
వహ్వహ్వహ్వ. వాడూ నేనూ ప్రాణస్నేహితులం లెండి. ఉద్యోగరీత్యా చెరోవూరూ పోయి విడిపోవాల్సివచ్చింది కానీ, మా చదువుకునే రోజుల్లో ఇద్దరం భార్యభర్తల్లా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం" ఆమె కాస్త నవ్వుతూ మాట్లాడేసరికి ధైర్యం వచ్చింది కైలాసానికి.
"మీరు పెళ్ళికి రానందుకు చాలా బాధపడ్డారు ఆయన."
"మరే! రాలేకపోయినందుకు నేనూ బాధపడ్డాను. అప్పుడు నాకు సుస్తీచేసింది."
అప్పుడే అక్కడికి ఒక మూడేళ్ళ పిల్లవాడు లోపలి గదిలోంచి వచ్చాడు. వాడు కైలాసాన్ని ఎగాదిగా చూశాడు.
"అమ్మా, ఎవడే వీడు? బూచా!" అని అడిగాడు.
"తప్పమ్మా. అలా అనకూడదు. ఈయన నీకు మామయ్య అవుతారు."
"మామయ్యలు బూచుల్లా ఉంటారా?" వాడికి మరో సందేహం.
"మీ అబ్బాయా?" ఏమనాలో తోచని కైలాసం అంతవరకూ నోరు మూసుకుని కూర్చున్న శంభులింగాన్ని అడిగాడు.
"ఆ ఆ." తొండలా తల కిందికి మీదికీ వూపాడు శంభులింగం.
"ఎంత ముద్దుస్తున్నడో!" మొగమాటానికి వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నిజానికి వాడికో టెంకిజల్ల ఇవ్వలనిపించింది కైలాసానికి ఆ సమయంలో.
"ఇందాక ఇద్దరు పిల్లలన్నావ్?"
"చంటిది లోపల ఉయ్యాల్లో నిద్దరోతుంది."
"మీరిద్దరూ మాట్లాడుతూ వుండండి. నేనిప్పుడే కాఫీ పట్టుకొస్తాను అన్నయ్యగారూ! ఈ పూట మీకు భోజనం ఇక్కడే!" అనేసి లోపలికి వెళ్ళిపోయింది జగదాంబ.
"నేనూ లోపలికి పోతా" అన్నాడు చంటివాడు.
కైలాసం వాడిని ఒళ్లోంచి కిందికి దించాడు. వాడు తుపుక్కున కైలాసం ముఖంమీద ఉమ్మి వ్వెవ్వెవ్వె అని లోపలికి పరుగుతీశాడు.
"మీ వాడు చాలా చిలిపివాడోయ్. వహ్వహ్వహ్వ" ఏడవలేక నవ్వుతూ జేలు రూమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు.
"ఇదిగో అన్నయ్యా! కాఫీ తీసుకోండి" జగదాంబ కాఫీ అందించింది.
చంటివాడు కైలాసం కాఫీ తాగుతుంటే ఎదురుగా నిలుచుని పరిశీలనగా చూసి కిలకిలా నవ్వి-" అమ్మా, బూచి మామయ్య కాఫీ తాగుతుంటే మూతి ముందుకు వచ్చి ఆంజీలు సామిలా ఉన్నాడు కదే?" అన్నాడు.
