"యేం తెలీదు." అన్నట్లుగా తల వూగించాడు నిశ్శబ్దంగా నవ్వుతూ.
""నిన్ను నువ్వు తెచ్చి అప్పగించుకోవటం కంటే మించినదేముంటుంది. చాలారోజులైంది నేను కలిసి. క్రితం నెలలో చారుమతి పెళ్ళిలో చూశానుగానీ మాట్లాడే వీలు కలగలేదు" అన్నాడు శ్రీపతి.
"చారుమతి యెవరు?"
"మన వరాహాశాస్త్రి తెలుసుగా. అతని చెల్లెలు" అన్నాడు శ్రీపతి.
పని కుర్రాడు, ప్లాస్కు పొట్లాలు పట్టుకొచ్చాడు, టేబిల్ మీద పరిచాడు పొట్లాలు విప్పి.
కబుర్లు చెప్పుకుంటూ టిఫినూ కాఫీ ముగించారు.
"ఓ చిన్న కునుకు తీస్తావా ప్రయాణం బడలిక తీరుతుంది" అన్నాడు శ్రీపతి.
"బడలికేం లేదు. కబుర్లు చెప్పు. గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీచేసి ఓడిపోయాడట కదా__ ఆ గుంటనక్క నిరంజనరావు రాశాడు. రీసెర్చ్ చేస్తున్నాడా?" అన్నాడు అనంత్ రెడ్డి.
"చేస్తున్నాడు. ఫెలోషిప్ కంటింజెన్సీ డబ్బు కైంకర్యం చేస్తూ. ఇటీవల వాడి గైడ్ కీ వారికీ మింగడు. వాటాల్లో పేచీ వచ్చినట్లుంది. ఒకటే తిడుతున్నాడు వాడి గైడ్ ని. అగైడ్__వాడో నీచపు వెధవ.
ఒంటిగంట అయింది కబుర్లతో. హోటల్ కి బయల్దేరారు. కింగ్ కోఠీ రోడ్ లోకి మళ్ళి తాజ్ కి వెళ్ళబోతూ, "దీన్లోకా? హోటల్ అన్నపూర్ణ అని విజయవాడ ప్రముఖులు ఓ హోటల్ పెట్టారు. అటు వెళదామా?" అన్నాడు శ్రీపతి.
"ఇక్కడికి చేరినాం కదా దీన్లోకే పద.
'యీ వూరి తాజ్ మహళ్ళ ముఖ్య అధిపతి కన్నడ ఆనంద హోటలు సర్వర్ గా జీవితం ప్రారంభించాడు. సికిందరాబాద్ కింగ్స్ వేలో ఆనంద్ భవన్ తొలి హోటలు. యీ జంట నగరాల్లో యిన్ని తాజ్ లు నెలకొల్పాడు. అయితే ఒకటి మెచ్చుకోతగ్గ విషయం. భోజనం అప్పటికి యిప్పటికీ ఒకే స్థాయిలో రీతిలో మెయిన్ టెయిన్ చేస్తారు. కొందరు హోటళ్ళవాళ్ళ కథలు కట్టుకథలుగా అనిపిస్తాయిగానీ నిజానికి మహ గట్టి కథలు. ప్రపంచం అంతటా హోటళ్ళు నెలకొల్పిన బొంబాయి ఒబెరాయ్ కూడా ఆదిలో హోటల్ సర్వరే....
శ్రీపతి సాధారణంగా అతి సామాన్యమైన హోటళ్ళలో బసచేస్తాడు ఎటైనా వెళ్ళినప్పుడు. కానీ ఒక్కోసారి, ఒబెరాయ్ తాజ్ ఇంటర్ కాంటినెంటల్ షెరటాన్ అశోకా వంటి హోటళ్ళలో ఒకటి రెండురోజులు బసచేసి పరిశీలిస్తాడు__ ఆ స్విమ్మింగ్ పూల్సు, గది అలంకరణలు, యేర్పాట్లు, గది సేవికలు, పడక భామినులు_
నాలుగు నెలల క్రితం ఓ రోజున సాలార్ జంగ్ మ్యూజియం పదిహేనోసారో ఇరవయ్యోసారో చూస్తున్న శ్రీపతికి ఓ అమెరికన్ యువతీ పరిచయం అయింది. విహారయాత్రకి వచ్చినట్లు చెప్పింది. 'విహారయాత్ర అనైతే అంటోందిగా' యేదో వ్యవహార యాత్రకే ఐవుంటుంది_ ఊరకే రారు అమెరికా మహాను భామినులు!' అనుకున్నాడు. ఆమెకి శ్రీపతి నచ్చి, ఆ సాయంత్రందాకా అతనిని వాటిగురించి అడుగుతూ కలిసి తిరిగింది. 'కంటికీ మనసుకీ బాగనిపిస్తున్న యీ తెల్లబుల్లి చూడగా సబ్ మోరల్ పెరా మోరల్ యెమోరల్ కాదంటే నాన్ మోరల్ లాగా వుంది. ఏ.సి.ఐ.ఏ. తాలుకునో యేఁవోఁ_ అదంతా మనకెందుకు_అందాక రాకుండా సర్డుకుంటే సరి' అనుకున్నాడు. రిట్జ్ హోటల్లో బస అట. మ్యూజియంలో అన్నీ చూపెట్టి వివరించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, తన గదికి వచ్చి టీ తీసుకోమంది. వెళ్ళాడు. రెండురోజులుండిపోయాడు. ఆ పిల్లతో స్విమ్మింగ్ ఫూల్లో తానాలాడాడు ; పడకమీద మెహాలాడాడు. తనతో ఆమెరికా రమ్మంది పెళ్ళిచేసుకుంటుందిట. "వూరు కాని వూరు దేనికి? సొంత దేశంలో, తల్లీ కూతురూ యిద్దరూ అక్కరకొచ్చే ఇల్లరికం దొరకకనా!" అనుకుని, తనకి రష్యాలో ఫెలోషిప్ వస్తుంది వెళతానని చెప్పాడు. ఆమెకీ అక్కడికి వెళ్ళాల్సిన పని వుందనీ అక్కడ కల్సుకుందాం అనీ, ఆ మరుసటిరోజు మద్రాసు వెళ్ళి అటునుంచి సింగపూర్ వెళ్ళాలని చెప్పింది.
భోజనాలు ముగించి బయటికోస్తూ, "శ్రీపతీ నీలాంటివాడు ఓసారి అమెరికా క్లాబ్బుల్నీ ఆ ఆడవాళ్ళనీ చూడాలోయ్" అన్నాడు అనంత్ రెడ్డి.
"ఆ శాల్తీల కోసం అక్కడిదాకా దేనికి? యిక్కడ మాత్రం తటస్థపడరనుకుంటున్నావా? నీది ఉత్త స్వప్న లోకం. నీకేం తెలుసు? శ్లేషించాను సుమీ!" అని నవ్వాడు శ్రీపతి.
గూటికి చేరుకున్నారు రిక్షాలో.
గోడవారగా వున్న రెండో ఇనప మడత మంచం తీసి కుంచెతో బూజు దులిపాడు ప్లాస్టిక్ నవ్వారు పట్టీలను బట్టతో తుడిచాడు. దానిమీద దుప్పటి పరిచి పడుకుని, పరుపు వున్న మంచం వంక చూపెడుతూ, "దానిమీద నడుం వాల్చి కాసేపు" అన్నాడు శ్రీపతి.
నిద్రపోయారు.
అనంత్ రెడ్డికి గంటసేపటికే మెలుకువ వచ్చింది. స్వప్నరాగలీనను తలుచుకుంటూ పడుకున్నాడు వెల్లకిలా.
శ్రీపతి ఆరింటికి లేచాడు. అతను లేచేసరికి అనంత్ రెడ్డి స్నానించి బట్టలేసుకున్నాడు. కింద అంచులకి జిప్పు కుట్టిన ఊదారంగు. బెల్ బాటం. అదే రంగు పొడవు చేతుల చొక్కా. బెల్టు స్టెప్ కట్ జుట్టు. సన్నగా మీసం. యెలెవేటెడ్ షూజ్.
శ్రీపతి కళ్ళు తెరిచి అనంత్ రెడ్డిని చూసి, "మైడియర్ ఛామింగ్ ప్రిన్స్ యింక వెళ్ళు. వచ్చినప్పుడు తిరిగిరా. నేనెటూ వెళ్ళను. గూట్లోనే వుంటాను" అన్నాడు.
అనంత్ రెడ్డి అబిడ్స్ వైపుకి వచ్చి, క్వాలిటీలో నాలుగు బ్రెడ్ స్లయ్ సెస్ తిని కాఫీ తాగాడు. మోజంజాహి మార్కెట్ వైపు నడిచివెళ్ళి_రకరకాల పువ్వులు బుట్టెడు కొన్నాడు. పక్కన తెలిసిన బట్టల షాపులో నాన్ ట్రాన్స్ పరెంట్ పోలిథీన్ పంచి అడిగి తెచ్చాడు. పసుపు రంగుది. దానినిండా. ఆ పూలు నింపి పట్టుకుని ఆటో యెక్కాడు.
మసక చీకటి.
పావుగంట.
స్వప్నరాగలీన వుండే వీధి మొగదలలో ఆటో ఆపి దిగి, ఆటో అతనిని వుండమని చెప్పి, నడిచి వెళ్ళాడు. గేటు దగ్గిరికి వెళ్ళేసరికి__ అతనికోసం యెదురుచూస్తూ పచ్చిక మీద కూచునివున్న ఆమె చివాలున లేచి నిలుచుంది. నీలం రంగు పువ్వులతీగల తెల్లచీర.
గేటు దగ్గిరికి వచ్చి, వీధి దీపపు వెలుతుర్లో మెరుస్తున్న అనంత్ రెడ్డిని కళ్ళనిండా నింపుకుని చూస్తూ, "యింకా లోనకి రాణి నియమవేఁనా?" అంది.
అవునన్నట్లు తల వూపాడు.
గేటు తీసుకుని బయటికి వచ్చింది.
నడుస్తున్నారు.
