బాస్ ముఠాలోనివాడే ఒకడు ఫోన్ చేసి 'ఫలానా చోట బాస్ దాక్కున్నాడని' చెప్పటంతో ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వెళ్ళటం జరిగింది.
బాస్ హార్ట్ ఎటాక్ తో మరణించినందువల్ల బాస్ ని సజీవంగా పట్టుకోలేకపోయినను బాస్ శవాన్నయినా పట్టుకొన్నందుకు ఇన్ స్పెక్టర్ వర్ధనరావుని అభినందిస్తూ దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
అక్కడితో ఒకపని మాది పూర్తయింది. ఈ సాయం నేనే మీకు చేశానని చెప్పొచ్చు. కాని ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఎంత మంచివాడో అంత తిక్క మనిషి. కొత్త అనుమానంతో కొత్త కేసు తయారుచేసి మమ్మల్ని బొక్కలోకి తొయ్యొచ్చు.
ఇప్పుడు నేను ముఖ్యంగా గాలించాల్సింది. బాస్ స్థావరంలోంచి మాయమైన టోపీ కోసం. బాస్ స్థావరం మీద పోలీసులు దండెత్తినప్పుడు ఏ పోలీసువాడో టోపీ చూసి మోజుపడి చంకన పెట్టుకొని వెళ్ళుంటాడు. ఆ టోపీ ఏ పోలీసువాడి ఇంట్లోనన్నా వుందా? లేక ఇంకా ఇంకా చేతులు మారి ఎటైనా పోయిందా? అర్జంట్ గా ఈ విషయం తెలుసుకొన్న తరువాత గాని నేను మరో పని చేయదల్చుకోలేదు.
రాంసింగ్ ని ఒక పనిమీద పంపించి నేను ఆ రోజు రైడ్ చేసిన పోలీసులు ఎవరెవరన్నది ఆరా తీయటానికి మరో మార్గాన వెళ్ళాను. మాటలు కలుపుతూ కాఫీ హోటల్ కి తీసికెళ్ళి కాస్ట్ లీ ఫుడ్ కడుపునిండా పెట్టించి ఒక పోలీస్ తో స్నేహం కలిపాను.
"ఈ స్నేహాన్ని ఇలాగే మరో నాలుగురోజులు సాగనిచ్చి అసలు విషయం కూపీ లాగుదాం" అనుకొని మళ్ళీ నా రూమ్ కి బయల్దేరాను.
హోటల్ అల్లంత దూరాన వుందనగా రాంసింగ్ నాకెదురు వచ్చాడు.
"ఏమిటి? ఏవన్నా కొత్త వార్తలు తెలిశాయా?" నెమ్మదిగా అడిగాను.
"కొత్త వార్తలేమోగాని కొత్త పని ఒకటి చేసుకొచ్చాను భాయ్. నువ్వు చూస్తే చాలా ఆశ్చర్యపోతావ్. మన రూమ్ కెళ్ళి చూడు. నేనలా ఒక గంట బయట తిరిగొస్తాను" అన్నాడు రామ్ సింగు.
"రూమ్ లో ఏముంది?" ఆత్రుతగా అడిగాను.
"చెప్పను. వెళ్ళి నువ్వే చూడు. ఆశ్చర్యంతో కిందా మీదా పడతావ్. నేను పక్కనే వున్నాననుకో! ఎందుకీ పని చేశావని నాలుగు పిడి గుద్దులు గుద్దినా గుద్దుతావ్. వెళ్ళి చూడు అంతే" అని చెప్పి మారు మాటకి ఆస్కారం ఇవ్వకుండా రామ్ సింగు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
రాంసింగ్ చెప్పింది ఎంత ఆలోచించినా నాకు ఒక్క ముక్కా అర్థంకాలేదు. 'తినబోతూ రుచులడగటం దేనికి? ఎవరికైనా టోకరా కొట్టి ఏ బ్యాగ్ నైనా దొంగిలించు కొచ్చాడేమో! చెప్పేదొకటి చేసేదొకటి' అలా ఆలోచిస్తూ విసుక్కుంటూ రూమ్ లో అడుగుపెట్టాను.
నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయ్. నా బుర్ర పనిచేయటం మానేసింది. ఎదురుకుండా సుస్మిత...నా సుస్మిత. తనూ అలాగే కళ్ళార్పకుండా ఎన్నో యుగాల తరువాత కలుసుకొని అపురూప వస్తువుని చూసినట్టు నన్నే చూస్తున్నది.
ఇరువురిలో ఒకేసారి చలనం కలిగింది. "సుస్మీ" అంటూ రెండు చేతులూ చాచి ముందుకి అడుగువేశాను. సుస్మీ కూడా చేతులు జాచి "విజయ్!" అంటూ నాదగ్గరకొచ్చింది. క్షణంలో వకరి కౌగిలితో వకరున్నాం. మేమలా వున్న సంగతి కూడా మాకు తెలీదేమో!
"సుస్మీ! నిజంగా నువ్వేనా! నిజంగా నాదగ్గరి కొచ్చావా! ఇది కలకాదు కదా!" సుస్మిత మొహంలోకి చూస్తూ ఆత్రుతగ అడిగాను.
"నాకు తెలీదు విజయ్! నువ్వే చెప్పాలి. నేను మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. నేను నిజంగా నిన్ను చూస్తున్నానా! నువ్వేనా నా విజయ్ వి" సుస్మిత అది ఆనందమో, ఆశ్చర్యమో తెలియని స్థితిలో అంది.
ఇరువురం విచిత్రావస్థలో మునిగి కొద్దిసేపు అలా ఉండిపోయాం. ముందుగ తెలివితెచ్చుకొన్న నేను రూమ్ తలుపులు లోపలవేసి స్మిత నడుం చుట్టూ చేయివేసి నడిపించుకొంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టాను. "ఇప్పుడు చెప్పు. నామీద కోపం లేదా!" అడిగాను.
"నీమీద కోపమా! ఈ జన్మకి కాదుగదా పైజన్మకి కూడా రాదు" అంది సుస్మిత.
"నేనిక్కడున్నట్టు ఎలా తెలుసు? ఎలా రాగలిగావ్ సుస్మీ?"
"రాంసింగ్ లక్ష్మణుడి అవతారం ఎత్తాడు. నిన్నటిరోజు భయపడుతూ నాదగ్గరకొచ్చి నీ గురించి రెండు ముక్కలు చెప్పాడు. "మీకు విజయ్ మీద కోపం లేదా?" అని అడిగాడు. "నేను జీవిస్తున్నది విజయ్ కోసమే. విజయ్ మీద నాకు కోపమేమిటి? అతనెక్కడైనా కనబడతాడేమోనని వేయి దేవుళ్ళకు మొక్కుకొన్నాను... వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను." అని చెప్పంగానే రాంసింగు మీ ఇద్దరి పరిస్థితి' పూర్తి కథ అంతా చెప్పాడు. నిన్నటిరోజున నీవేదో పనిమీద వెళ్ళావని... ఏ అర్థరాత్రికోగాని రావని... ఈపూట కలుసుకునే ఏర్పాటు చేస్తానని... చెప్పాడు. ఈ సాయంత్రం రాంసింగు నాదగ్గర కొచ్చి నన్నిక్కడకి తీసుకొచ్చాడు. నీరాకకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. నీవొచ్చేసావ్. నేనెక్కడున్నానో తెలిసి అప్పుడే నా దగ్గరకెందుకు రాలేదు విజయ్!" అన్నీ చెప్పి చిరుకోపంతో అడిగింది సుస్మిత.
"నేను నిర్ధోషినని నిరూపించుకొనేదాకా నీదగ్గరకి రాకూడదనుకొన్నాను. అంతులేని ధనం సంపాదించిన తర్వాతే మీ డాడీ ముందుకు రావాలనుకొన్నాను." నా మనసులోని మాట దాచుకోకుండా చెప్పాను.
