Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 61


    "నీ భాషలో దీనికి నిర్వచనం ఏమన్నా కానీ నా పరిభాషలో గెలిచానూ అనలేకపోయినా ఓడిపోలేదు అని మాత్రం చెప్పగలను."


    "నువ్వో దురదృష్టజాతకుడివి" ఒత్తి పలికింది.


    "కాబట్టే మరో అమాయకురాలి పాలిట శాపం కాకూడదనుకున్నాను. యుక్తిగా దామోదర్ని అడ్డం పెట్టుకుని వినీలని నీ సంకెళ్ళనుంచి విడిపించాను."


    "అంటే నా మనిషిని లొంగదీసుకుని నామీదనే ప్రయోగిస్తావన్న మాట."


    "మార్జాల మూషిక న్యాయమంటారేమో దీన్ని. కాని ఆచరించడం తప్పనిసరైంది సోఫియా... నువ్వు నన్ను లొంగదీసుకోవాలని ఎలా ప్రయత్నించావో నేనూ అలాగే దామోదర్ పై ఓ అస్త్రాన్ని సంధించాను."


    "వినీల నీదగ్గరే వుందా?"


    "లేదు. నేను నీ గదిలో వుండగానే వెళ్ళిపోయింది."


    "నీకెలా తెలుసు?"


    "నువ్వున్న ఏరియా సప్లయి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి ఓ అయిదు నిమిషాల పాటు పోయేట్టు డబ్బుతో డిపార్ట్ మెంట్ ని ఇన్ ఫ్లుయెన్స్  చేసింది నేను కాబట్టి. దామోదర్ తో నా ఒప్పందం ప్రకారం వినీల వెళ్తున్నదీ లేనిదీ చెక్ చేయడానికే నేను కిటికీ వారగా నిలబడ్డాను కాబట్టి."


    సోఫియా నుదుటిపై స్వేదం మాత్రమే కాదు. ఓటమి అంగీకరించని రోషం కళ్ళలోకి నీళ్ళను తెప్పించింది. "గుడ్. చావు తెలివితేటలు"


    "నువ్వు నన్ను చంపలేవు."


    "అదేం"


    "నువ్వు విపాశావు కాబట్టి. నేను నీకిష్టుడనైన వశిష్టుడ్ని కాబట్టి" ఒకనాడు ఆమె అన్న మాటల్ని ఆమెకే తిరిగి అప్పచెప్పాడు.


    "ఎల్లకాలమూ నానుంచి తప్పించుకోగలననుకుంటున్నావా?"


    "ఆ కొద్దికాలం అనుభవాల నుంచి ఎల్లకాలం తప్పించుకోగలనన్న నమ్మకముంది."


    "నేను 'పట్టు' వదలనిదాన్నే"


    "నీకున్నది 'పట్టు' మాత్రమే అయితే నాకు 'తల' కూడా వుంది. అవును అంతటి పట్టుదల గలవాడ్ని" ఫోన్ క్రెడిల్ చేశాడు.


    ఆవేశంతో ఆమె కళ్ళు నీటికుండల అవుతుంటే ఉద్వేగంగా ఆ భవంతిలోని మరో గదిలోకి వేగంగా నడిచింది.


    నరమేధం మొదలు కాబోతున్నట్టు ఆ చీకటి గదిలో వణుకుతున్న వీరయ్య మెడ పట్టుకుంది. అదీ అరక్షణమే.


    ఆ తర్వాత అర నిముషంలో ఇంటి బయటకు గెంటేసింది. "ర్రేయ్..." ఆమె అస్థిమితంగా వూగిపోతూంది. "నా గతాన్ని గుర్తుచేసే నిన్ను చంపనూలేను. నువ్వు చెప్పని నిజం కోసం ప్రతి క్షణమూ ప్రయత్నిస్తూ వుండనూ లేను. నీ నీడ కూడా ఇక్కడ పడకూడదు. ఎందుకంటే నేను మీ అందరి పరిచయంతో మనిషినైపోతున్నాను. అదే అదేనేనిష్ట పడనిది"


    వీరయ్య కదిలాడు ఆ నిశిరాత్రిలో...


                                                    *    *    *    *


    ఆ తర్వాత రెండు రోజుల్లో చాలా సంఘటనలు వరుసగా జరిగిపోయాయి.


    శశాంక అందించిన ఫోటోలు ఆధారంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న అవినాశ్ ముందు ఆ రాత్రి తనను ఇరికించిన ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ నిద్దర్నీ సస్పెండ్ చేశాడు.


    ఫోటోల్ని ప్రెస్ కి రిలీజ్ చేయబోతుంటే డి.జి.పి. తోపాటు హోం మినిష్టరూ కంగారుపడ్డారు, వారించారు.


    నిజానికి అవినాశ్ ని మనస్పూర్తిగా అభినందించింది పోలీస్ కమీషనర్ ఒక్కడే. ఓ సమస్య సుఖాంతమై పోయింది.


    అందుకే "ఆ రాత్రి ఓ నేరంపై అరెస్ట్ చేయబడిన ప్రసాదు అనబడే మరో గూండా పాత కక్షల మూలంగా సాగర్ ని సెల్ లో హత్యచేసి తప్పించుకున్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని మాత్రమే ప్రెస్ కి తెలియపరిచారు పోలీస్ కమీషనర్ లౌక్యంగా.


    ఉన్న ఆధారాన్ని చించి జయచంద్రని సగం కాపాడిన సదాశివయ్యకి ఇది పత్రికల దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రసాదు పోలీసులకి దొరక్కుండా చూడమన్నాడు. రహస్యంగా జయచంద్రతో.


    తర్వాత ప్రసాదుని ఎలాగన్నా పట్టి బంధించి తీరుతామని ప్రెస్ ముందు మాత్రం పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు.


    ఈ పరిణామాల్ని కనిపెడుతూనే వున్నా శశాంక వినీలని కలుసుకోలేకపోయాడు.


    ఆమెను కిడ్నాప్ చేయడానికి పరోక్షంగా తను కారణమన్న విషయం ఆమెకు తెలిసి వుంటుందని మొహం చెల్లక నిశ్శబ్దంగా వుండిపోయాడు.


    అది కూడా పూర్తిగా కారణం కాదు.


    గంటలూ నిముషాలు గడుస్తున్న కొద్దీ జయచంద్రపై కక్ష రగులుకుంటూనే వుంది.


    ఒక చిన్న కారణంతో తన భార్యను కడతేర్చిన జయచంద్రని చిత్రవథ చేసి చంపితే తప్ప ప్రశాంతంగా వుండలేని స్థితికి చేరుకున్నాడు.


    సరిగ్గా అలాంటి సమయంలో...


    ఆ రోజు సాయంకాలం మూడుగంటలకి జాకీ శశాంక దగ్గరకి పరుగెత్తుకువచ్చాడు.


    నిన్న రాత్రి తాగిన నిషాలో జరిగిందంతా శశాంక చెబుతుంటే జాకీ సైతం నమ్మలేకపోయాడు.


    ఇది ఆగని పోరాటమే అయితే ఆ పోరాటంలో తన సహాయమే అవసరమైతే కొనవూపిరిదాకా తోడుంటానని హామీ ఇచ్చిన జాకీ చెప్పాడు వస్తూనే "శశాంకా... ఎల్లుండి సాయంకాలం ఆరుగంటలకు జయచంద్ర ఓ ఫంక్షన్ కి ఎటెండవుతున్నాడు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS