"ఎల్లుండి లంచ్ లో మళ్ళీ అరటిపళ్ళే తింటావ్. ఎల్లుండికూడా తొక్కక పోతే ఆ మర్నాడు కూడా అరటిపళ్ళే తింటావ్ .ఆ మర్నాడు కూడా తొక్కకపోతే-"
"ఇంక చాలు బాబూ -అర్ధం అయ్యింది - యా హూ-" సంతోషం పట్టలేక గట్టిగా అరిచాను .
"నేను తాగితే నీకు నిషాఎక్కిందేం ?"పాపారావ్ ఆశ్చర్యంగా నా వంక చూ శా డు .
ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు నాకు.రేపు గణేశ్ గాడి చాప్టర్ క్లోజ్ -ఎల్లుండి నుండి సుబ్బలక్ష్మితో పరిచయం కోసం నేను వేసే కొత్త ప్లాన్స్ -
మర్నాడు
లంచ్ టైం ...
అరటిపళ్ళు తినేశాను ,నాకే కాదు పాపారావుకీ టెన్షన్ గానే ఉంది .
లంచ్ టైం అయిపోయింది.
ఒకటి - రెండు -మూడు నిమిషాలు
అదిగో గణేశ్ రావ్ ...వాడికి వెనకాల పది గజాల దూరంలో సుబ్బలక్ష్మి .
నేను చేతిలోని అరటిపండు తొక్కని జాగ్రతగా ముందుకు విసిరాను .
"ఎందుకయినా మంచిది .ఇంకోటి రెండు గజాల అవతల విసురు -" పాపారావ్ గుస గుస లాడుతూ అన్నాడు .
నేను అలానే చేశాను.
గణేశ్ రావ్ తొక్కని సమీపిస్తున్నాడు
టక్ టక్ టక్ టక్ -
అతని బూట్ల చప్పుడు .
లబ్ డబ్ లబ్ డబ్
నా గుండె చప్పుడు.

వచ్చేశాడు-వచ్చేశాడు-అడుగు వే ...హు ...దాటేశాడు.
టక్... టక్...టక్...టక్...
లబ్ ... డబ్...లబ్..డబ్...
రెండో తొక్క !... వెయ్...అడుగు వెయ్... వేస్తున్నాడా?ప్చ్... దాన్నీ దాటేశాడు .
పాపారావు మాట ఇంకా పూర్తి కానేలేదు ధనేల్ మని శబ్దం. కెవ్వుమని -గూబ పడిపోయేలా కేక వినిపించింది .
పాపారావు నేనూ ఉలిక్కిపడ్డాం .
మా కళ్ళముందు భయంకరమైన దృశ్యం.
సుబ్బలక్ష్మి నేలమీద వెల్లకిలా పడివుంది .ఆమె తల నేలనితాకి కొబ్బరికాయ పగిలిన శబ్దం చేసింది.ముక్కుతూ ముల్గుతూ లేచింది సుబ్బలక్ష్మి .ముందు వెళ్తున్న గణేశ్ రావ్ పరుగెత్తి సుబ్బలక్ష్మి దగ్గరికి వచ్చాడు .
"దెబ్బ తగిలిందాండీ.?" అని అడిగాడు .
"నిలువునా పడితే దెబ్బ తగలదూ?"సుబ్బలక్ష్మి విసుక్కుంది .
గణేశ్ రావు చెయ్యి అందించి ఆమె లేచి నిలబడడానికి సాయపడ్డాడు.
నా నవనాడులూ కృంగిపోయాయ్.గణేశ్ రావ్ , సుబ్బలక్ష్మి నాలుగడుగులు ముందుకు వేశారు
మళ్ళీ కెవ్వున కేక ... దబ్బున శబ్దం .రెండో అరటిపండు తొక్కకూడా సుబ్బలక్ష్మినే బలితీసుకుంది .
సుబ్బలక్ష్మి వారం రోజులు శలవు పెట్టింది .ఆ రోజు లంచ్ లో అరటిపళ్ళు తిన్నది నేనేనని ఆమెకి తెలిసిపోయింది.
"...నవ్వించే ప్రేమకథలుంటాయా అని ఒకసారి నన్ను అడిగావ్ గుర్తుందా ?నీదే ...హ...హ ..."పాపారావ్ కర్చీఫ్ మూతికి అడ్డుపెట్టుకున్నాడు.
నాది పకపకా నవ్వు తెప్పించే ప్రేమకధ ఎందుకౌతుంది ?
***
దర్శకుడు దైవాదీనం
సుల్తాన్ బజార్ లో నడుస్తున్న సంభులింగం వీపు విమానం మోత మ్రోగింది శంభులింగం కళ్ళద్దాలు ముక్కుని ముద్దుపెట్టుకుని తనివి తీరక నేలనుకూడా ముద్దు పెట్టుకోబోతే ఈలోగా కధాకళి, భరతనాట్యం, కూచిపూడి తదితర నృత్యం భంగిమలన్నీతృటిలో ప్రదర్శించి ,అలా అవి విడిపోకుండా పట్టేసుకుని , వాటిని యధాస్థానంలో పెట్టేసుకుని తన వీపు విమానం మోత మోగడానికి కారణభూతుడైన వాడిని బూతులు తిట్టుకుంటూ వెనక్కు తిరగబోయాడు శంభులింగం .కానీ అంతలోనే వీపు మళ్ళీ బోయింగ్ 747 మోత మ్రోగింది .మళ్ళీ కళ్ళద్దాలు ముక్కుని ముద్దుపెట్టుకోవడం వగైరా జరిగిపోయాయి. ఈసారి వీపు విమానం మోత మోగకుండా ఉండేందుకు మిల్కాసింగులా ముందుకురికి, అక్కడనుండి వెనక్కి తిరిగి కళ్ళ ద్దాలు పెట్టుకుని చూశాడు ఆ శాల్తీని శంభులింగం .
"వహ్వహ్వ...(ఇది ఆ శాల్తీ నవ్వుకు సంబంధించిన ధ్వని విశేషం) అదేంటోయ్ వీపుతట్టి పిలవాలని అనుకునేలోగా అంతదూరం పారిపోయి చూస్తున్నావ్? అప్పులు చేసే అలవాటు నీకింకా పోలేనట్టుంది. నేనోయ్-కాబూలోడిని కాను-వహ్వహ్వ."
"ఓరి నువ్వటోయ్ కైలాసం?" ఆ శాల్తీవైపు కరచాలనంకోసం చెయ్యి చాచి ముందుకు అడుగులు వేశాడు శంభులింగం.
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన ఆనందంలో కరచాలనంతో తృప్తిపడని కైలాసం శంభులింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. శంభులింగం పక్కటెముకలు పటపట మన్నాయి. పాత చొక్కా సర్రుమంది ముక్కు కూడా చెమట వాసనకి బద్దలయింది. భోజనం చెయ్యకుండా ఉంటే నిరాహార దీక్ష అని అంటారు. స్నానం చెయ్యకుండా ఉంటే దాన్నేమనాలబ్బా అని కొన్ని క్షణాలు ఆలోచించి, మళ్ళీ వూపిరాడక కైలాసం కౌగిలి విడిపించుకుని వైకుంఠం వెళ్ళే అదృష్టం వదులు కుని ఒక్కసారి చొక్కా పైకెత్తి పళ్ళతో కరచి పట్టుకుని తన పక్కటెముకలు లెక్కబెట్టుకుని ఘొల్లుమన్నాడు శంభులింగం.
