ఆఫీసుకు వెళుతూ వాకిట్లోంచి "బై" అని వెళ్ళింది ధనలక్ష్మి.
"అరె యింత టైం అయిపోయిందా" అని వాచీవంక చూసుకుని, "చచ్చాం. గిటార్ గ్లామర్ బోయ్ వచ్చేవేళై పోయింది_" అని అమాంతం లేచి__ ప్యాంటు ప్లాకూ తగిలించుకున్నాడు శ్రీపతి.
చకచకా నడిచి వీథి దాటి, మెయిన్ రోడ్డులో ఖాళీ ఆటో కనపడగానే ఆపికూచుని కాచీగూడా స్టేషను ముందు దిగాడు.
వెంకటాద్రి రైలు రావటానికి యింకా ఐదునిమిషాల వ్యవధి వుందని తెలుసుకుని_ ఒకసారి ప్లాట్ ఫాం వంక కలియజూసి 'స్వప్న యింకా రాలేదేం' అనుకుని బుక్ స్టాల్ దగ్గిరికి అడుగులు వేసి పుస్తకాల వంక చూస్తున్నాడు.
__ఖీరియో ఛీరియో? వాత్సాయనా వేస్టాయనా, ఛేజ్, బూన్స్ మూన్స్, సులోచనారాణి కలోచనారాణి, యిల్లస్ట్రేటెడ్ వాక్లి, టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్_ ఎక్స్ ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బెంగుళూరు ఎక్స్ ప్రెస్ _ గోయంకా ఎక్స్ ప్రెస్ పీకలదాకా తెచ్చుకుంది ఇందిరమ్మతో....
రైలు వచ్చేసి ప్లాట్ ఫాం పక్కన చక్కా ఆగింది.
ఫస్ట్ క్లాస్ బోగీల వైపు నడుస్తున్నాడు శ్రీపతి. టూ టైర్ స్లీపర్ లోంచి దిగి, శ్రీపతిని గమనించి - అటు అడుగులు వేశాడు అనంతరెడ్డి. చేతుల్లో బుల్లి సూట్ కేస్.
నాలుగు రోజులైంది అతను అమెరికా నుండి వచ్చి. బొంబాయి నుంచి మద్రాసు _ బెంగుళూరు వాళ్ళ వూరు ఉరవకొండ వెళ్ళి యివాళ యిటు ప్రయాణం.
"హలో శ్రీపతి."
వెనక్కి తిరిగి "హలో మైడియర్ గ్లామర్ బోయ్" అని పరిశీలనగా చూసి, "చలి దేశానికి మరింత రంగు వచ్చావు. ఏమిటి లగేజీ ఏంలేదా?" అన్నాడు శ్రీపతి.
"యిదే" అని చేతులోని సూట్ కేస్ వూగించి "పద" అన్నాడు అనంతరెడ్డి.
శ్రీపతి అటూ యిటూ చూసి, "అనుకోని ఆలస్యం ఐవుంటుంది. కాసేపు చూడొద్దూ? రిసీవ్ చేసుకోవటానికి ఒక పురుషుణ్ని వచ్చాను. ఒక స్త్రీ కూడా రావొద్దూ!" అన్నాడు.
చిన్నగా నవ్వి, "దీన్లో వస్తున్నట్లు తెలియదు. సాయంత్రం యింటికి వచ్చి కలుస్తానని రాసినాను" అన్నాడు అనంత్ రెడ్డి.
"పెర్ హాప్స్ దట్ యీజ్ ది రైట్ వే ఆఫ్ ట్రీటింగ్ ది సబైమ్" అని బయటికి నడిచాడు.
ఆటోలో కొంపకి చేరుకున్నాడు.
"కొన్నాళ్ళుగా యీ గూట్లో నివాసం. రాశానుగా" అంటూ తలుపు తాళం తీశాడు శ్రీపతి.
"యింత చిన్న బంగళాకి చాలా యాంగిల్స్ వున్నట్లున్నవి?" అన్నాడు అనంత్ రెడ్డి బంగళావంక చూస్తూ.
"నేననుకోవటం - యీ యింటి అతను యీ స్థలం మధ్యలో ఒక గది కట్టివుంటాడు ఆదిలో. ఆ తరవాత ఒక్కొక్క గది చొప్పున వాటాలుగా మలుచుకుంటూ డజనో డజన్నరో సంసారాలకి నీడ కల్పించాడు. వీడికి అధమం పద్మశ్రీ ఇవ్వొచ్చు. మంగలి పనికీ, మంత్రసాని పనికీ ఇవ్వగా లేనిది" అని నవ్వాడు శ్రీపతి.
అనంత్ రెడ్డి కుర్చీలో కూచోబోతుంటే, "పదపద ముందు స్నానిం చు" అని లోనికి కదలదీశాడు. సూట్ కేస్ తనే చేత్తో పట్టుకుని.
మధ్యగదిలో అడుగుపెట్టి "పెయింటింగ్ మొదలెట్టావా?" అన్నాడు అనంత్ రెడ్డి.
"లేదు అనంత్ ఎమర్జన్సీలో యే పనీ చెయ్యకూడదు కాబట్టి అప్పుడప్పుడు నాలుగు రంగు మరకలో చారలో గీస్తున్నాను. చెత్త కాగితాలు తప్ప కంటికి చూడతాగింది యేవీ వుండదు"
తను పూర్తిచేసిన పెయింటింగ్స్ అన్నీ చుట్టచుట్టి బట్టల స్టాండు వెనక కనపడకుండా పడేస్తాడు శ్రీపతి. యిలా యెవరినన్నా లోనకి తీసుకొచ్చినా, చూడతగినవేమీ కనిపించవు.
"మరి యిన్ని రగులూ బ్రష్ లూ__"
"చాతకాక అడ్డదిడ్డంగా పులమటానికి" అని నవ్వి, "పద స్నానిద్దువు" అని ఖాళీగా వున్న వంటగదిలోంచి బాత్ రూంలోకి తీసుకెళ్ళాడు. అన్నీ చూపెట్టి గదిలోకి వచ్చి, దినపత్రిక తీసి చూస్తున్నాడు శ్రీపతి.
పావుగంట.
అనంత్ రెడ్డి__సూట్ కేస్ తెరిచి తెల్లని పైజామా లాల్చి తగిలించుకున్నాడు.
అక్కడ అందుబాటులో వుండే పని కుర్రాణ్ణి పిలిచి ధెర్మోస్ యిచ్చి టిఫినూ కాఫీకి యేర్పాటు చేశాడు శ్రీపతి.
"వూఁ యేఁవిఁటి అమెరికా సంగతులు? యెలక్ట్రో మేగ్నెటిక్ ఫీల్డ్ థియరీలో నీ వర్కు, నువ్వు పబ్లిష్ చేసిన పేపర్లు చాలా బాగున్నాయని, నీ రిసెర్చి వర్క్ చాలా విశిష్టంగా వుంటుందని యిక్కడ మీ ప్రొఫెసర్ అన్నాడు ఒకసారి నేను అటు వెళ్ళి కలిస్తే." అన్నాడు శ్రీపతి.
"ఆ వర్క్ తోటే తీరికలేకుండా వుండిపోయినాను ఇన్ని సంవత్సరాలూ అక్కడ."
"యేఁవేం ప్రదేశాలు చూశావు?"
"యేం చూడలేదు. తీరికే లేదు. స్వప్న కోరిక ననుసరించి _మిసిసిపీ నదీ ప్రాంతం, నయాగరా, డిస్నీలాండ్, హాలివుడ్, కొన్ని నైట్ క్లబ్బులు, పసిఫిక్ సముద్రతీరం వంటివి కొన్ని__అంతే."
"తరవాత యేఁవిఁటి?"
"వుద్యోగం ఇస్తే ఉస్మానియాలో చేరతాను. కానీ నా వర్క్ ముందుకి సాగాలంటే రెండు లక్షల రూపాయల ఎక్విప్ మెంట్ అవసరం. యు.జి.సి. వాళ్ళతో ప్రొఫెసర్ దారి యిప్పించితే మాట__
"నువ్వు అభిలషించితే అదేమంత సమస్యకాదు. యేవఁన్నా మెలికలుంటే__మీ ఫాదర్ కి చెప్పు. ఆయన చూసుకుంటారు" అన్నాడు శ్రీపతి.
"వూఁ మన మిత్రులంతా యెట్లా వున్నారు? ప్రసాద్ కబుర్లేమిటి?"
"యేఁవుంది. పేకాట__వ్యాపారం__సంసారం__సాలిడ్ అండ్ సౌండ్ యాజ్ రాక్. పెళ్ళి సంగతి తెలియదా?"
"శుభలేఖ పంపి వుత్తరం రాసినాడులే__"
"సూట్ కేస్ లో నాలుగు జతల బట్టలతో వచ్చావు. స్వప్నకేం తెచ్చావు" అన్నాడు శ్రీపతి.
