Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 60


    నా కోసం మిమ్మల్ని పంపించాడు.


    బహుశా నేను ఇంతసేపు బ్రతికున్నాను అంటే మీ కోసమే అయ్యుంటుంది. నిజంగా నా మాట నమ్మండి.....


    బాస్ కథలా చెబుతూంటే నేనంతవరకు నోరు తెరుచుకొని విన్నాను.


    బాస్ మొహంలోని నీలి నీడలు...వాళ్ళంతా దిగజారుతున్న ముచ్చెమటలు...బలవంతాన బాధని బిగపట్టుకొంటున్న ముఖాకృతి...చూడంగానే బాస్ చెప్పింది పూర్తి నిజమని తెలిసిపోయింది.


    బాస్ ఒకనాడు నన్ను దగ్గరకి తీసినవాడు.


    ఆ తర్వాత నా ప్రాణం తియ్యబోయాడు. అది వేరే సంగతి.


    బాస్ ని ఆ స్థితిలో చూస్తుంటే నాలోని మానవత్వం మేలుకొంది.


    "చచ్చిపోతున్నావా! అయితే తొందరగా చచ్చిపో. నీకిలాంటి చావు తగిందేలే" రామ్ సింగ్ కోపంగా అన్నాడు.


    "రామ్ సింగ్! ఒక మనిషి మీద మనకెంత కోపమైనా వుండొచ్చు. ఎంత కక్ష అయినా వుండొచ్చు. అతను శత్రువైనా సరే మరణించే ముందు క్షమించటం మానవ ధర్మం" రామ్ సింగ్ తో అని బాస్ వేపు తిరిగాను.


    "బాస్! నువ్వెలాంటి వాడివి అన్నది ఇప్పుడు నాకనవసరం. నేను ఊళ్ళోకెళ్ళి డాక్టర్ ని పిలుచుకొచ్చే టైమ్ లేదు. నిన్ను నేను భుజానెత్తుకుని ఊళ్ళోకి తీసికెళతాను. మంచి హాస్పటల్ లో చేరుస్తాను...


    నా మాట పూర్తికాకముందే బాస్ గుండె పట్టుకుని వెర్రికేక వేశాడు.


    అంతే. అతని పంచప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయ్.


    నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. నేనూ మనిషినే.


    సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూపిస్తుంటారు.


    మరి కాసేపటికి ప్రాణం పోతుందన్నవాడు కూడా తన వాళ్ళని చూడటం కోసం గంటలు...రోజులు... అలా బ్రతికివుండి వాళ్ళు రాంగానే చివరి మాట చెప్పో, చివరి చూపు చూసో చనిపోతుంటారు.


    సరీగ ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. ఎంత ఆశ్చర్యం.


    "ఇప్పుడు ఏం చేద్దాం యార్!" రామ్ సింగ్ అడిగాడు.


    కొద్దిసేపు ఆలోచించాను.


    పోయిన బాస్ ఎలాగూ పోయాడు.


    కాని అతన్ని అలా వదిలి వెళ్ళిపోవటం మంచిదికాదు.


    అలా అని ఎక్కడికి మోసికెళ్ళను? ఏం చేయను? బాస్ చనిపోయినట్టు ఇటు లోకానికి అటు ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి తెలియటం చాలా అవసరం.


    బాస్ ని చివరిసారిగా చూసి పైకిలేచాను.


    "పద రాంసింగ్! మనం వెళదాం. ఊళ్ళోకి వెళ్ళి అర్జంట్ గా ఇన్ స్పెక్టర్ గారికి ఈ విషయం చెప్పాలి. ఫోన్ చేస్తాను. మిగతాది ఆయనే చూసుకొంటాడు." అన్నాను.


    "నీకేమన్నా పిచ్చిపట్టిందా? మనం ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేస్తే కొంపలు మునిగిపోవూ" రాంసింగ్ అన్నాడు.


    "ఏమీ మునిగిపోవు. నేను స్వరం మార్చి ఇన్ స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఎలా చెప్పాలో! ఏం చేయాలో నాకు తెలుసు. పద" అన్నాను.


    రాంసింగ్ మారు మాట్లాడకుండా లేచాడు. ఇరువురం కలిసి బాస్ ని అక్కడే వదిలి గుహలోంచి బయటకి వచ్చేశాం.     


                                            27


    నేను, రాంసింగ్ ఇంకా మారువేషాల్లోనే వున్నాం.


    నాల్రోజుల క్రితం బాస్ చనిపోయిం తర్వాత హుటాహుటిన ఊళ్ళోకి వెళ్ళి కంఠస్వరం మార్చి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఫోన్ చేశాను.


    "నేనొక అజ్ఞాత వ్యక్తినని అర్జంట్ గా మందీ మార్బలంతో వెళితే బాస్ ఫలానా చోట వున్నాడు. దొరుకుతాడు అని కాని అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని" చెబుతూ మరికాస్త కథ కల్పించి అప్పటికప్పుడే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు బయల్దేరేలా చేశాను.


    పాపం పిచ్చి మానవుడు! చెప్పింది నమ్మాడు. హుటాహుటిన తన మందీ మార్బలంతో బయల్దేరి వెళ్ళి బాస్ శవాన్ని ఊళ్ళోకి తరలించి పోస్ట్ మార్టమ్ వగయిరాలు...ఆ తరువాతవన్నీ కూడా సక్రమంగా జరిగిపోయాయ్.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పేరు పేపరులో ప్రముఖంగా ప్రచురించబడింది. దొంగల స్థావరం మీద ఒకనాడు రైడ్ చేస్తే తప్పించుకుపోయిన బాస్ కోసం ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వదలకుండా తన సిబ్బందితో గాలిస్తూనే వున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS