మళ్ళీ మర్నాడు గణేశ్ రావు సీటు దగ్గరికి బయలుదేరాను. సెక్షనులో అడుగు పెడుతూనే
"ఏం వోయ్... ఇలారా" లక్ష్మణరావ్ పిలిచాడు.
అరగంట గడిచేపోయింది. నేను సెక్షనుకి వెళ్ళిపోయాను.
రోజూ ఇదే తంతు. గణేశ్ రావ్ దగ్గర కూర్చుని పదిరోజులు అయిపోయింది.
నేను పాపారావ్ కి నా ప్రాబ్లమ్ గురించి చెప్పాను. లక్షణరావు బారినుండి నేను బయటపడే ఉపాయమేలేదా? అని అడిగాను.
"నన్ను అడిగితే అది పెద్ద ప్రాబ్లమే కాదు... అసలైన ప్రాబ్లమ్ వేరే ఉంది."
నా గుండె దడ దడ లాడింది.
"ఏమిటి?-"
"నువ్వేమో ఆ లక్ష్మణరావుతో బాతాఖానీ వేస్కుంటూ కూర్చున్నావ్... కానీ ఆ గణేశ్ రావ్ సుబ్బలక్ష్మి తో బాగా పరిచయం ఏర్పరుచుకుంటున్నాడు.... వాళ్ళ సెక్షనువాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అదే పనిగా మాట్లాడుతూ ఉంటారట..."
నాకు ఒక్క క్షణం గుండె కడుపులోకి జారిపోయినట్టు అనిపించింది.
"ఓరి దౌర్భాగ్యుడా ... అందుకనా ఈ మధ్య నేను పలకరించినా దులపరించుకుని వెళ్ళిపోతున్నావ్?... అమ్మో అమ్మో... నా డ్రీమ్ గర్ల్ ని తన్నుకు పోవడానికి చూస్తున్నాడు."
"పాపారావ్... సుబ్బలక్ష్మి నాకు దక్కేలా చూడు..."
"అయిదయిపోయింది... మనం బయటకెళ్ళి ఎక్కడైనా కూర్చుని మాట్లాడితే బావుంటుంది."
ఎక్కడైనా కూర్చుని మాట్లాడితే బావుంటుందట. పబ్లిక్ గార్టెన్ లో కూర్చుని మాట్లాడదామంటే వస్తాడా వెధవ?
ఇద్దరం బార్ కి వెళ్ళాం. సీసాలూ, గ్లాసులూ, జీడిపప్పులూ, కోడికూర అన్నీ వచ్చేశాయ్. పాపారావ్ వాటిమీద పడ్డాడు. కొద్దిసేపటికి పాపారావ్ కి నిషా ఎక్కడం మొదలుబెట్టింది.
"నాయనా.... నువ్వు కాస్త సలహా పడేసి తరువాత తాగు..... నీ వాలకం చూస్తుంటే సలహా చెప్పకుండా ఔట్ అయ్యేలా ఉన్నావ్....-"

"ఓ తప్పకుండా ఇస్తాను. సలహాదేం ఉంది-అన్నట్టు నువ్వు నాకెప్పుడో వందరూపాయలు అప్పు ఇచ్చినట్టున్నావ్ కదూ?"
"అర్థం అయ్యింది నాయనా-ఆ వంద రూపాయలు కూడా నువ్వు ఇవ్వనక్కర లేదులే... త్వరగా చెప్పు"
"సుబ్బలక్ష్మిని నువ్వు పొందాలంటే ముందు గణేశ్ రావుకి సుబ్బలక్ష్మికి మధ్య మనస్పర్ధలు కలగాలి..."
"ఎలా...ఎలా...ఎలా....ఎలా?...."
"అంత ఆతృతైతే ఎలా?.... చెప్తాను విను. గణేశ్ రావ్ కి ఏదైనా అవమానం జరిగిందనుకో... అప్పుడు అది చూసి సుబ్బలక్ష్మి నవ్విందనుకో... మయసభ సీనులో దుర్యోధనుడికి అభిమానం దెబ్బతిన్నట్టు గణేశ్ రావ్ కి అభిమానం దెబ్బతింటుంది... అంతే వాడికథ ఫినిష్.... నీ కథ స్టార్ట్...."
"కానీ సుబ్బలక్ష్మి నవ్వాలి కదా?"
"ఓరి అక్కుపక్షి... సుబ్బలక్ష్మి కి నవ్వొచ్చేలా గణేశ్ రావ్ అవమానించబడాలి..."
"ఎలా... ఎలా... ఎలా... ఎలా...?"
"అరటిపండు తొక్క!"
"అరటిపండు తొక్కా?.... ఏమిటిది?-" నేను బుర్ర గోక్కున్నాను.
"మొన్నటినుండీ వాళ్ళు లంచ్ రూమ్ కి వెళ్ళి లంచ్ తీసుకుంటున్నారు కదా?"
"అవును"
"లంచ్ టైం కాగానే ఇద్దరూ కలిసే వస్తున్నారు కదా?"
"అవును"
"ముందు గణేశ్ రావు, వెనుక సుబ్బలక్ష్మి .. మూడు రోజులనుండి అలానే వస్తున్నారు .వాళ్ళు నీ టేబుల్ ముందు నుండే వాళ్ల సెక్షనకు వెళ్ళాలి..."
"అయితే ఏమిటి?"
"రేపు నువ్వు లంచ్ లో ఇడ్లీలు దోసలు తినవు, ఇంచక్కా అరటిపళ్ళు తింటావ్"
"ఎందుకు?!"
"ఎందుకేమీటి?అరటిపండు తొక్కని జాగ్రత్తగా దాచుకుని అల్లంత దూరంలో గణేశ్ రావ్ ని చూడగానే ఆ తొక్క జాగ్రత్తగా అతను నడిచే దారిలో వెయ్యాలి. గణేశ్ రావ్ దాని మీద కాలేసీ జర్రున జారి పడ్తాడు . అప్పుడు వెనుకగా వస్తున్న సుబ్బలక్ష్మి పక్కున నవ్వుతుంది -క్లోజ్ -"

నాకో సందేహం వచ్చింది -మళ్ళీ అడిగుతే తిడ్తాడేమోనని భయం వేసీంది అయినా దైర్యంచేసి అడిగేశాను.
"గణేశ్ రావు మరి ఆ తొక్కని తొక్కక పోతోనో ?"
