"భీమ మరీ కండలు తిరిగిపోయింది. రేటు కూడా యెక్కువ. దాని చెల్లిలుంది. కొత్తగా ఫీల్డులో కొచ్చింది. మాంచి నేవళంగా వుంది. యమా సెక్సీగా వుంది. మాంఛి ఫిగరు. దాని బొడ్డూ నడుమూ చూపులూ వూపులూ చాలు. పైగా అందంగానూ వుంది." అని డాన్సులకి కమలినిని ఖాయపరిచాడు.
షూటింగ్ చాలావరకు హైదరాబాద్ లోనూ, ఆ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని సీన్లు బొంబాయి కాశ్మీరు కొడైకెనాల్ మద్రాసులలోనూ, చిత్రీకరించారు.
దొంగ రసీదులు పుట్టించి తన పార్ట్నరు దగ్గిర్నుంచి, తను లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టేసరికి అతనిదగ్గిర మూడు లక్షలు గుంజేశాడు. ఆపైన, "పెట్టుబడి చాలటం లేదు. మన డిస్ట్రిబ్యూటర్ ప్రస్తుతం డబ్బు యిబ్బందిలో వున్నాడు" అని మరో లక్ష రూపాయలు పెట్టించాడు.
తను రెండు లక్షలు తన వాటాదారు నాలుగులక్షలు పెట్టుబడి పెట్టారు. ఐతే లెక్కల్లో తనూ నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినట్లు చూపించాడు అంకినీడు. "యిద్దరం సమానంగా పెట్టుబడి పెట్టాంగదా నిర్మాతలుగా ఇద్దరిపేర్లు ఒకలాగానే వేయించమని పార్ట్నర్ అడిగితే, "అన్ని ప్రింటయిపోయినయ్. యిప్పుడు మధ్యలో వీలుకాదుగా__యీసారి పిక్చరుకి నీపేరే పెడదాంలే." అన్నాడు.
ఆ డైరక్టరంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కి బాగా గురి. డైరక్టరుకి రోజూ పూటుగా తాగబోయించి, విడిగా పదివేల రూపాయలు ఇచ్చాడు.
మిగతా ఐదు లక్షలూ డిస్ట్రిబ్యూటర్లు పేమెంట్లుగా ఇచ్చారు.నేరుగా పిక్చరు హక్కులు వాళ్ళవే. వాళ్ళ డబ్బు పర్సెంటేజీతో వసూలయ్యాక నిర్మాతకి హక్కులతో ఫిలిం అప్పగిస్తారు.
అంకినీడు కంటికి వచ్చిన ఎక్స్ ట్రాని పిలిపించుకునేవాడు. హీరోయిన్ కోసం ప్రయత్నించాడుగానీ సాధ్యపడలేదు. వెనకెప్పుడో తొలి రోజుల్లోని అబ్లిగేషన్ల వల్లనో, యేదన్నా సంకటంలో పడితేనో తప్ప అందుకు చోటు పెట్టదు__ప్రఖ్యాత హీరోయిన్ నటించటానికి ఒప్పుకోవటమే మెహర్బానీ అన్నట్లుగా ఒప్పుకుంది. "యీ నటిని యెప్పుడో ఓ పట్టు పట్టకపోతే చూడు!" అని తన అసిస్టెంటు మిత్రుడితో అంటే, "అప్పటికిది డోకొచ్చేటంత డొక్కుదై పోతంది గురూ" అన్నాడతను.
కొన్ని పాటలకి 'మజా' చరణాలు తనే యిచ్చి కవిచేత పాటలు కూర్పించాడు. ట్యూన్సు మాత్రం సంగీతదర్శకుడు కూర్చి వినిపిస్తే కొన్ని మార్పులు సూచించాడు. అన్నీ దర్శకుడికి వినిపించి అతని ద్వారా డిస్ట్రిబ్యూటర్ల చేత ఓకే చేయించుకోవటం.
పాటలకి అంకినీడు అందించిన కొన్ని చరణాలు.
టైటిల్ సాంగ్_ చిక్కుల్లో చిన్నది యిది చిక్కుల్లో చిన్నది/ చుక్కల్లో చిన్నది చిక్కుల్లో పడ్డది./ చిక్కుల్లో చిన్నది కిక్కుల్లో పడ్డది/ చుక్కా గుక్కా పక్కా ముక్కా/ చిక్కుల్లో చిన్నది యిది చిక్కుల్లో చిన్నది/ ఐనా వున్నది పసందుగున్నది/ మనందరిని రమ్మన్నది రమ్మన్నది/ చిక్కుల్లో చిన్నది యిది చుక్కల్లో చిన్నది చిక్కుల్లో చిన్నది_
యింకో పాటకి _ పెట్టు పెట్టు _ గూటిలోన పెట్టు పెనసలు ముక్క అని ఒక క్లబ్ డాన్స్ కి
యట్టనో వున్నది / యెట్టెట్టనో వున్నది / యాడ / ఆడ / యాడ యాడున్నదెటెట్లా/ ఆడనున్నదట్లట్లా/ ఆడనే యేటి వొడ్డున అడవిలోన_ అని ఓ జానపదం డాన్సుకి.
కిక్కులో వున్న చిన్నదాన్ని / ఆడిపాడి దొర్లి పొర్లి - అని స్మగ్లర్ల ముందు తప్పించుకోటానికి యత్నిస్తూ హీరోయిన్ పాడేపాటకి.
మాలపల్లి పక్క కందిచేలో / కందిచేలో మాలపిల్ల కోక కట్టుకుంట చెతికంది/ కందిచేనులో - అని ఓ పల్లెటూరి డాన్సుకి చరణాలిస్తే ప్రస్తుతం సెన్సారు ఒప్పుకోడు అని కవి నచ్చజెప్పాడు.
పాటలు నలుగురు కవులచేత రాయించాడు.
మరోపాట_ ఎమర్జన్సీ టైం కదా_ ఆ దృష్టితో సందేశాత్మకంగా వుండే పాట రాసిపెట్టమని ఓ కవిచేత రాయించాడు తను చరణాలివ్వకుండా. ఆ కవే కూర్చాడు- యిందిరమ్మ సందేశం/ మన యిందిరమ్మ సందేశం / మరో ప్రపంచం మరో ప్రపంచం / యిందిరమ్మ మరో ప్రపంచం మహా ప్రపంచం / మరో ప్రపంచం మహా ప్రపంచం/ అత్యదిక పాలనేత్రంతో స్మగ్లర్లను మార్చివేసి / జగన్మాత కాళికాదేవియయ్ / భారతమాతను రక్షించగ/ ఇందిరయ్ ప్రశాంతి నెలకొల్పే / సుభిక్షం పూయించే సందేశం/ మన ఇందిరమ్మ ఆదేశం / ప్రతి భారతీయునికీ శిరోధార్యం అని.
మన పాటలూ ట్యూన్లూ డ్యాన్సులూ సీన్లూ యాక్షన్లూ సస్పెన్సూ యెట్లా వున్నయ్_ జనం వెర్రెత్తిపోయి చూస్తారు! అని అంకినీడు అంటే శతదినోత్సవం అన్నారు కూడా వున్న నలుగురూ.
"సందేశం. అందునా ఎమర్జన్సీ ఆధారంగా గొప్ప సందేశం అందిస్తున్నాం. గొప్ప సందేశాత్మక చిత్రం అని రాష్ట్రపతి బహుమతి వచ్చినా రావొచ్చు" అని అంటే - సందేహం లేకుండా, ఖాయంగా - అన్నారు కూడా వున్న నలుగురూ మందు గ్లాసులు పైకెత్తుతూ.
ఈస్ట్ మన్ కలర్. ఖర్చు పన్నెండు లక్షలదాకా దేకింది. లెక్కల్లో ఇరవై చూపెట్టారు, సెన్సారువాళ్ళు "A" సర్టిఫికెట్ ఇచ్చారు.
యెంత బతిమిలాడినా షూటింగ్ చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు నళిని. "నీ సినిమాకి లక్షమైళ్ళ దూరంలో వుండదలిచాను. ప్రివ్యూ మద్రాసులో వుంటుంది. దానికీ రాను. నా సొంత డబ్బుల్తో టిక్కెట్టు కొనుక్కుని యీ వూళ్ళో చూస్తాను." అంది. విసుక్కున్నాడు అంకినీడు. వాళ్ళ యింటినుంచి వాటా తీసుకుని సినిమా ప్రారంభించిన తరవాత నుంచి నళినిని వెనకటంత ఘనంగా చూడటంలేదు. రెండు లక్షల భాగ్యానికి మిడిసిపడక సినిమా చినవాడా__ అని హాస్యమాడింది నళిని. కాగా, అంకినీడు నళిని దగ్గిరికొచ్చి గడిపేటంత తీరికేలేదు గత ఆరునెలలనుంచి.
"రేపే ప్రివ్యూ. దీపావళికి, ప్రముఖ పంపిణీ సంస్థ ద్వారా ఆంద్రప్రదేశ్ అంతటా అన్ని ముఖ్య కేంద్రాలలోనూ విడుదల. దీపావళి టపాకాయలాగా పేలి మతాబులాగా వెలుగుతుంది. కనకవర్షం అనుకో_ అని అంకినీడు రాసిన వుత్తరం సరదాగా చదువుకుని, ఓ బాయ్ ఫ్రెండుతో సినిమాకని కారు స్టార్టు చేసింది, నళిని.
100
ఉదయం ఆలస్యంగా లేచాడు శ్రీపతి. కాలకృత్యాలు ముగించుకుని_ పేపరు తీసి చూస్తూ, "యిక అమెరికా బండిని యీ కార్టర్ లాగిస్తాడు కాబోలు_ సొంత పొలాల్లో బండే తోలి వుంటారు-అదీ పూర్వీకులు కిరాయిబండి - అందుకే కార్టర్ అని యింటిపేరు వచ్చి వుంటుంది. మనకిలాగా బళ్ళకి యెడ్లు కాదుగదా_గుర్రాలు. గుర్రాలై నా గాడిదలైనా హంసలైనా కుక్కలైనా, బండి బండే కదా....."
