ఒంటరి వాడినయిన నేను ఈ మారుమూల బ్రతికే వుండి కొన్నాళ్ళు ఆగి చేజారిన వజ్రాలని మళ్ళీ సంపాదించాలని అనుకున్నాను.
కాలి బాధ ఎక్కువయింది. ఊళ్ళోకి వెళ్ళలేను. ఇలా వుండగా శరీరంలో మరికొన్ని రుగ్మతలు ప్రవేశించాయి.
తాటి తోపు దగ్గరకొచ్చి 'ఎలా?' అని ఆలోచిస్తూండంగా 'పచ్చ బొట్టు పొడిచే వాళ్ళ'మంటూ ఇద్దరటుగా వచ్చారు. వాళ్ళిద్దరికీ ఉదయం యాభై, సాయంత్రం యాభై చొప్పున డబ్బులు ఆశ జూపుతూ నాక్కావాల్సినవి ఊళ్ళోంచి తెప్పించుకొంటూ ఇక్కడ వున్నాను.
నీవు చెప్పిందాకా వాళ్ళిద్దరూ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు, హెడ్ కానిస్టేబుల్ అహోబిలం అని నాకు తెలీదు.
మరణించేముందు నిజం చెబుతున్నాను.
బ్రౌన్ కలర్ గల ఆ టోపీని మీరు సంపాదించగలిగితే కోటీ యాభై లక్షలు మీ పరమౌతాయ్.
నేను జీవితంలో అన్నీ పాపపు పనులే చేశాను.
ఆ పాప పరిహారార్థం ఈ నిజం చెబుతున్నాను. నా మాట నమ్ము" అంటూ బాస్ గాడు నా చేయి పట్టుకున్నాడు.
"ఆ టోపీ కనపడి ఆ వజ్రాలు దొరికిననాడు నీ మాట నమ్ముతాను. అది సరే! మాటకు ముందు ఛస్తున్నాను...ఛస్తున్నాను అంటున్నావ్! ఇప్పటికిప్పుడు ఏం రోగం వచ్చింది చావటానికి?" బాస్ గాడి మీద ఇంకా నా కోపం తీరలేదు. అందుకే కోపంగానే అడిగాను.
నాకు చాలా రకాల వ్యాధులున్నాయ్.
నేను మీకు బాస్ నయివుండి నా రోగాల సంగతి చెబితే మీముందు లూజవుతానని ఎప్పుడూ చెప్పేవాడిని కాదు.
అఖండ బలశాలినన్నట్టుగా పైకి నాటకం ఆడే వాడిని. లోలోపల మాత్రం తెగ మందులు మింగుతుండేవాడిని. నాకు షుగర్ వుంది... బి.పి.వుంది...కిడ్నీ ట్రబుల్ వుంది...దానికెప్పుడూ మాత్రలు వేసుకుంటుంటాను.
ఈ ఉన్న జబ్బులు చాలక ఆర్నెల్లక్రితం హార్ట్ ఎటాక్ లాంటిది వచ్చింది.
రహస్యంగా డాక్టర్ కి చూపించుకొన్నాను.
"మీరు బాగా రెస్ట్ తీసుకుంటేగాని ఆపరేషన్ చేయటానికి లేదు. మీకిప్పుడున్న వ్యాధులు తగ్గుమొహం పట్టాలి. అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఈలోపల హార్ట్ కేమన్నా పెయిన్ వస్తే ఒక మాత్ర రాసిస్తాను. అవెప్పుడూ దగ్గర వుంచుకుని పెయిన్ వచ్చినప్పుడు మాత్ర నాలిక కింద పెట్టుకోండి. బాధ ఉపశమిస్తుంది. అప్పటికీ పెయిన్ తగ్గకపోతే యమర్జన్సీ ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది."
ఇవన్నీ డాక్టర్ నాతో వివరంగా చెప్పటం వల్ల ఆ మాత్రల్ని నా దగ్గర పెట్టుకొనేవాణ్ణి.
పోలీస్ రైడ్ జరిగి నా నాయకత్వం పోయిన తర్వాత తరచూ గుండెలో నెప్పి రావటంవల్ల మాత్రలన్నీ వాడేశాను.
మొన్నటిరోజు మారువేషంలోవున్న ఆ కానిస్టేబుల్ కి సీసా ఇచ్చి పంపించాను 'ఆ సీసామీద పేరున్న టాబ్లెట్స్ మాత్రమే తెమ్మని'
తెచ్చిన అన్ని వస్తువులతోపాటు టాబ్లెట్ల సీసాకూడా వుంది.
వెంటనే సీసాని ప్యాంట్ జేబులో భద్రపరచుకొన్నాను.
ఈ ఉదయం నించి నా శరీరంలో కొన్ని బాధలేర్పడ్డాయి.
షుగర్ వుండటం వల్ల కాలిగాయం నయం కాకపోగా బాగా చీము పట్టి చాలా నెప్పి చేసింది.
దాంతోపాటు కిడ్నీ ట్రబుల్ ఇచ్చిందో ఏం పాడో! యూరిన్ రావడం ఆగిపోయింది.
ప్రాణం మీదకి వచ్చేట్టుంది. చాటుగా రాత్రిపూట ఊరులోకి వెళ్ళి ఎవరైనా డాక్టర్ ని చూపించుకుందాం అనుకొన్నాను.
కాని ఈ సాయంత్రం తాటితోపులదాకా వెళ్ళి వాళ్ళని కలుసుకుని మళ్ళీ ఇక్కడి కొచ్చేసరికి నా ప్రాణం పూర్తిగా నీరస పడింది.
అసలు లేవలేకపోయాను.
సరీగా గంటక్రితం హార్ట్ పెయిన్ వచ్చింది.
టాబ్లెట్ తీసి నాలిక కింద పెట్టుకొందామని సీసా మూత తెరిచాను.
కాని లోపలున్నది హార్ట్ పెయిన్ సంబంధించిన టాబ్లెట్లు కాదు. వేరే రకంవి. పైన లేబుల్ ఒకటే లోపలి టాబ్లెట్లు మాత్రం వేరేవి. అక్కడికీ ఆ టాబ్లెట్ నే నాలిక్కింద పెట్టి చూసుకున్నాను.
కించిత్ కూడా ఫలితం కనిపించలేదు.
నా పని అయిపోయినట్టు గ్రహించుకున్నాను.
దైవం మీద భారం వేసి మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఈ చివరి క్షణాల్లో భగవంతుని ప్రార్థించాను.
"భగవంతుడా! నేను చేసినవన్నీ తప్పులే. కనీసం నా ఈ బాధని ఎవరితోనన్నా చెప్పుకోటానికి ఒక మనిషిని నా దగ్గరకి పంపించు. ఒంటరిగా మృత్యువుతో పోరాడుతూంటే భయమేస్తోంది. పక్కనే ఒక మనిషి తోడుంటే కాస్త...ధైర్యంగా ఉంటుంది" అని ప్రార్థించాను.
ఆ భగవంతుడు అప్పుడప్పుడు దుష్టుల మొరకూడా ఆలకిస్తాడల్లే వుంది.
