Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 60


    తను తొందరపాటుతోనూ, పెంకితనంతోనూ ప్రవర్తించి వుంటే అతను తనకి కాకుండా పోయేవాడు. అసలా ఆలోచనే ఆమెకి బాధని కలిగిస్తోంది.


    మనోహర్


    మనోహర్


    ఆమె మనసునిండా, గుండెనిండా, ఆలోచనలోనూ పూర్తిగా నిండిపోయాడు మనోహర్.


    ప్రతిక్షణం అతని సమక్షంలో వుండిపోవాలనే కోరిక క్షణక్షణానికీ పెరిగిపోతోంది ఆమెకి.


    ప్రేమంటే అదే?


    ప్రేమకున్న శక్తి అదే?


    ఇప్పుడు కేవలం అతను తప్పితే ఈ ప్రపంచంలేదన్న స్థితిలో ఉంది భారతి.


    అలాంటి భారతికి పెద్ద హార్డిల్ లా బోసుబాబు దాపురించాడు. కిటికీ లోంచి చల్లని గాలి దూసుకొచ్చి వంటిని తాకుతూ వుంటే మత్తుగా కళ్ళు మూసుకొంది భారతి. ఆమెకి చదవాలనిపించడంలేదు.


    అలాగే నిద్రలోకి జారిపోయింది.


    మర్నాడు ఉదయం ఎక్స్ పెక్ట్ చేసింది భారతి బోసు మళ్ళీ ఫోన్ చేస్తాడని. టెలిఫోన్ మోగితే చాలు ఆమెచాలా కంగారుగా పరుగెత్తింది. కానీ అతను చేయలేదు. దానితో ఊపిరి తీసుకుంది. తను ఇంటిదగ్గర లేనప్పుడు కనిపెట్టి చూడమని బాలయ్యకి చెప్పింది.


    భారతి మనోహర్ని ఇంచుమించుగా ప్రతిరోజూ కలుసుకుంటోంది. క్లాసులకు కూడా వెళ్ళడం మానేసి గంటల తరబరి లాండ్ స్కేప్ గార్డెన్లోనో పిక్చర్ కో వెళ్ళి కూర్చుంటుంది. ప్రేమించిన మగాడితో అలా తిరగడంలో ఎంతో థ్రిల్ వుందని భారతికి అనిపిస్తోంది. ఇంచుమించుగా తిరిగి ఆమెని ఇంటికి సమీపంలో డ్రాప్ చేసి వెళుతున్నాడు బోసుబాబు తనని గమనిస్తున్నాడని భారతికి తెలుసు కానీ అతనేమీ మాట్లాడ్డం లేదు. ఎందుకంట సైలెంట్ గా అయిపోయాడో ఆమెకి అర్థం కాలేదు. బహుశా తన మాటలకి గానీ భయపడ్డాడేమో అనుకొంది. కానీ భారతికి తెలీదు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఆ తర్వాత తుఫాను తాకిడి మొదలవుతుంది.


    బోసు తనని దెబ్బ తీయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడని మాత్రం ఆమెకా క్షణంలో తెలీదు. యూనివర్శిటీలో కొంతమంది ఫ్రెండ్స్ తనని జోక్ చేస్తున్నా నవ్వి వూరుకుంటోంది భారతి.


    "పెద్ద బడాయిపోయేదానివిగా, ఇప్పుడు దాన్నేమంటారే!" అంది వేద.


    "ఎట్టకేలకి మన కథానాయికకి రాకుమారుడు దొరికాడు పాపం?" కిరణ్ అంది.


    "మాకు మంచి పార్టీకొట్టించు. లేకపోతే గోడలనిండా నీ ప్రేమాయణాన్ని రచిస్తాను?" అంది ధనలక్ష్మి.


    "పార్టీ ఇవ్వకపోతే గోడలన్నీ పాడు చేస్తావన్నమాట?" అంది వేదవతి.


    "తప్పేముంది. పాపం పెళ్ళికెలాగు ఇస్తుందిగా పార్టీ?" కిరణ్ అంది.


    "అలా వీల్లేదు. అడ్వాన్స్ గా ఇవ్వాల్సిందే" అంది ధనలక్ష్మి.


    "ఎందుకివ్వాలి అడ్వాన్స్ గా" అంది భారతి చిరుకోపంతో.


    "చెప్పనా?" అంది ధనలక్ష్మి


    "ఊ?" అంది భారతి. వాళ్ళ మాటలు సరదాగా వున్నాయి భారతికి.


    ధనలక్ష్మి తియ్యగా నవ్వింది. భారతి చెంపల్ని తన చేతులతో సున్నితంగా రాస్తూ అంది.


    "అచ్చటా, ముచ్చటా తీరేది పెళ్ళి అయ్యాకనే కదా? అలాంటిది కొన్ని చిన్న చిన్న ముచ్చటలని అడ్వాన్స్ గా తీర్చుకోవడం లేదా?"


    అంటే?" అంది వేద.


    "ఓ తియ్యని ముద్దని, ఓ మత్తయిన కౌగిలనీ....." అంది ధనలక్ష్మి.


    ఛీ పోండి. సిగ్గులేని వాళ్ళయిపోతున్నారు" అంది భారతి సిగ్గుతో.


    భుజంపైన చెయ్యి పడేవరకనే సిగ్గు, ఆ తర్వాత సిగ్గుండదు. అంతా ఫ్రీ. ఇప్పుడు మేం కొన్ని ప్రశ్నలేస్తాము, నువ్వు సమాధానం చెప్పాలి" అంది ధనలక్ష్మి.


    "పోవే పాపం అదలా సిగ్గుపడుతోంటే దాన్నెందుకు చంపుతావు. పోనీ ఆ అడిగేదేదో నన్నడుగు నేను చెబుతాను" అంది వేదవతి.


    "నువ్వు చెబుతావా! కొంపదీసి దాని ప్రియుడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడా" అంది ధనలక్ష్మి.


    ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు.


    "ఛీ పాడుముండా, ఏమిటే ఆ మాటలు" అంది వేదవతి.


    "ఇప్పుడు చెప్పు. నీ ప్రియుడు నిన్ను ముద్దుపెట్టుకున్నాడా లేదా?" ధనలక్ష్మి.


    "అతను నిన్ను మొదటిసారి ముద్దుపెట్టుకున్నప్పుడు నీకెలాంటి ఫీలింగ్ కలిగింది!" కిరణ్.


    "అంతవరకేనా, లేక బిగి కౌగిలిలోకి తీసుకున్నాడా?" వేదవతి.


    వాళ్ళు ఏదో వాగేస్తున్నారు. భారతి చెంపలు ఎర్రబడుతున్నాయి.


    "ఏమిటే అది. పాపం మెడమీద గీసుకొందే!" అడిగింది ఆశ్చర్యంగా కిరణ్.


    "ముద్దు పెట్టుకున్నప్పుడు అతని గోరు గీసుకొని ఉంటుంది" వేదవతి నవ్వుతూ అంది.


    భారతి అప్రయత్నంగా చేత్తో మెడని తడువుకుంది. అది చూసి వాళ్ళు నవ్వుతుంటే భారతికి కోపం వచ్చింది.


    "మీ మాటలన్నీ విన్నాక, ఈ విషయాల్లో మీ అందరికి బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది" అంది భారతి చిరుకోపంతో.


    "నువ్వేం తిట్టినా ఓ.కె. మాకు కోపం రాదు. అడ్వాన్స్ గా పుచ్చుకున్న మొదటి ముద్దు ఎలా వుందో చెప్పు" అంది వేదవతి.


    "నేనే ముద్దు పుచ్చుకోలేదు. పిచ్చిమాటలు మరోసారి మాట్లాడితే, అలాంటి ఏర్పాటు మీ అందరికి చేస్తాను?" అంది .


    "బాబ్బాబు..... మా అయ్య ఎలాగూ కట్నం ఇచ్చుకోలేడు. ఆ పుణ్యం ఏదో కట్టుకో, లేకపోతే నీ ప్రియుడ్ని మేం కొట్టేస్తాం" అంది కిరణ్.


    అంతలో కారు వచ్చి ఆగింది.


    "అదుగో నీ ప్రియుడొచ్చాడు?" అంది ధనలక్ష్మి.


    భారతి సిగ్గుతో వాళ్ళని చూసి గబగబ కారు దగ్గరికి నడిచింది.


    భారతి కారెక్కగానే మనోహర్ కారు స్టార్ట్ చేశాడు. ఆమె ఫ్రెండ్స్ అక్కడే కూర్చుని నవ్వుతున్నారు. ఆమె చెంపలు గులాబీరంగులోకి మారుతున్నాయి. మనోహర్ నవ్వుతూ చూశాడు భారతిని. అతను ఆమె భుజంపైన మెడవెనకనుంచి చేతిని వేసి దగ్గరగా లాక్కున్నాడు. భారతి గువ్వలా జరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS