Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 59


    వాడు మంచివాడు కాదు.


    వాడు ఖచ్చితంగా ఏదో అపకారం చేస్తాడని మాత్రం ఆమె అంతరాత్మ గోషిస్తోంది. మమ్మీకి కోపం ఎక్కువ. ఆవేశం ఎక్కువ. ఆమె మనసులోని సంతోషమంతా ఒక్కసారిగా బంతిలోని గాలి తీసినట్లుగా హరించింది.

    
    బోసు తప్పకుండా తల తల్లి మనసులో విషం పోస్తాడని భారతికి తెలుసు. అలా జరగక ముందే తను జాగ్రత్తపడాలి.


    కానీ కానీ


    ఎలా!


    తల్లి ఎదురుగా నిలబడి మాట్లాడగల ధైర్యం తనకిలేదు.


    అందుకే తన ప్రేమ కథ గురించి తల్లి కెదురుగా నిలబడి ఎలా చెపుతుంది. ఆమె మనసు నీరుకారిపోయింది.


    బోసుగాడి భరతం పట్టించాలి?


    అప్పుడుగానీ ఆ వెధవ దారికిరాడు.


    మనిషికోమాట - గొడ్డుకోదెబ్బ అంటారు. కానీ ఓ మాటతో మనిషి మారితే ఈ సామెతలెందుకు? "మనిషి ఈ ప్రపంచంలోని అన్ని జంతువుల కంటే ప్రమాదమైన జంతువు" అనిపించింది భారతికి. మనోహర్ చేతనే బోసుకి వార్నింగ్ ఇప్పించాలి. భయపడినట్టు తెలిస్తే వాడు మరీ పేట్రేగిపోతాడు.


    ఆమెకి నీరసం ముంచుకొచ్చింది, సోఫాలో కూలబడిపోయింది.


    బాలయ్య కాఫీ తీసుకొచ్చి అందిస్తే కప్పుని అందుకొని పెదవుల దగ్గరకి తీసుకోబోతూ కప్పుని కిందికి వదిలేసింది.


    కప్పులో కాఫీ చీరపైనా సోపాపైనా పడింది.


    "సారీ బాలయ్యా!" అంది భారతి నిలబడుతూ.


    "ఏం లేదులే" అంది చీరని కర్చీఫ్ తో తుడుచుకొంటూ భారతి.


    పగిలిపోయిన కప్పు పెంకుల్ని ఏరి పట్టుకెళ్ళిపోయాజు బాలయ్య.


    భారతి పెదవులపైన నీరసంగా చిన్న నవ్వు కదలాడింది.


    ఎంతో సరదాగా, ఆనందంగా ఇంటికొచ్చిన తనకి ఆ ఆనందంలో లక్షోవంతుగా కూడా మిగలకుండా మనసులో తుఫాను చెలరేగేలా చేశాడు రాస్కెల్. పైగా ఎంత పచ్చిగా వాగుతున్నాడు. అసలు అంతసేపువాడితో మాట్లాడ్డం తనదే తప్పు అనుకొంది.


    బాలయ్య మళ్ళీ ఓ చేత్తో కాఫీ కప్పుని మరోచేత్తో తడి గుడ్డని తీసుకొచ్చాడు.


    కాఫీని భారతికి అందించి తడిగుడ్డతో సోఫాని, కార్పెట్ ని తుడుస్తూ భారతిని అడిగాడు.


    "చెప్పమ్మా! మళ్ళీ ఆ వెధవగానీ ఏమన్నా అల్లరి చేశాడా! నాకు చెప్పమ్మా! ఒక్క వేటుకి గొర్రెని తెగేసినట్టు తెగేస్తాను" అన్నాడు.


    "అదేంకాదు బాలయ్యా!" అంది. బాలయ్య తను చెబితే నిజంగానే అన్నంత పని చేస్తాడు కానీ ఎలా చెప్పుతుంది అంత ప్రమాదాన్ని కోరి ఆహ్వానించలేదు.


    "చిన్నతనం నించీ నిన్నీ చేతులమీదుగా ఎత్తుకొని ఆడించాను నీ తండ్రిని కాకపోయినా ఆ వయసువాడిని తల్లీ. నీ మనసుకి రవ్వంత కష్టం కలిగినా నేను చూడలేను తల్లీ" అన్నాడు బాలయ్య.


    నిజమే?


    చిన్నప్పుడు తనని భుజంమీద ఉంచుకునే అన్ని పనులు చేసుకొనేవాడు బాలయ్య. ఈ రోజుకీ తన పనులన్నీ అతనే స్వయంగా చేసిపెడతాడు.


    ఉదయం కాఫీ ఇవ్వడం, స్నానానికి నీళ్ళు పెట్టడం, బట్టలు ఉతకడం, వాటిని జాగ్రత్తగా ఇస్త్రీ చేయడం, భోజనం దగ్గరే వుండివడ్డించడం, కాలేజీకి వెళుతుంటే గుమ్మంవరకు వచ్చి సాగనంపడం మొదలైన పనులన్నీ చేస్తాడు.


    అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. పెళ్ళికూడా చేసుకోలేదు. ఒంటరి మనిషి. అందుకే చిన్ననాటి నుంచీ భారతి పనులు చూడ్డంచేత ఆ అమ్మాయిని తన బిడ్డగానే మనసులో అనుకుంటాడతను.


    "బాలూ?" అని పిలిచింది భారతి.


    "చెప్పమ్మా చెప్పు?" అన్నాడు ఆతృతగా బాలయ్య.


    బాలయ్యకేసి ఓసారి చూసింది భారతి.


    అతని మొహంలో తనపట్లగల ఆప్యాయత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. తండ్రి తన కేలుసు గొడవలో ఎప్పుడు వాటితో మునిగి తేలుతుంటాడు. తల్లి వ్యాపకాలు తెలిసినవే. అందుకే ఇంట్లో తనని అంటిపెట్టుకొని తిరిగే అతనంటే ఆమెకి కూడా అభిమానం.


    ఈ సమయంలో సారధి వుంటే ఇదో సమస్య అనిపించేదికాదు అందుకే అందుకే మనసులోని ఆనందాన్ని కానీ, కష్టాన్నీ గానీ ఇప్పుడు బాలయ్యతో పంచుకోవాలనిపిస్తోంది.


    "ఏమ్మా, సందేహిస్తున్నావా, ఎందుకు పనికిరాని వంటవాడికి చెప్పేదేమిటనుకుంటున్నావా!" అన్నాడు బాలయ్య.


    "అదేంకాదు. నన్ను వాడు బెదిరిస్తున్నాడు. మమ్మీకి నాగురించేదో చెపుతాడట. ఇందాక ఫోన్ చేశాడు" అంది.


    బాలయ్య చిత్రంగా చూశాడు.


    అటు తర్వాత నవ్వేశాడు.


    "నీ గురించి చెప్పడానికేముందమ్మా" అన్నాడు.


    "ఉందో లేదో కానీ వాడు మమ్మీకోసం ఫోన్ మమ్మీకి అందకుండూ చూడు. నువ్వా మాత్రం చేస్తే చాలు" అంది.


    "అలాగే..... అలాగేనమ్మా నువ్వు నిశ్చింతగా వుండు" అన్నాడు వెళ్ళిపోతూ బాలయ్య. భారతి కాస్త ఊపిరి తీసుకొంది.


    మర్నాడు మనోహర్ కి చెప్పాలని నిశ్చయించుకొంది.


    తండ్రికోసం ఎవరో క్లయింట్స్ వచ్చారు. ఏడుగంటలవుతుండగా లక్ష్మీపతి రావడం రావడం ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు.


    స్నానం చేసి, భోజనం చేసి పుస్తకం తెరిచిందే కానీ భారతి దృష్టి పుస్తకం పైన సాగటం లేదు, ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి బిక్కిరి ఉక్కిరి చేస్తున్నాయి. నిన్నటికి, ఈ రోజుకీ తనలో వచ్చిన మార్పుని భారతి నమ్మలేకపోతోంది. ఆమె కళ్ళముందు మనోహర్ ఆరడుగుల విగ్రహం కనబడుతోంది అతను భుజంపైన చెయ్యివేసినపుడు తనలో కలిగిన మనోభావాలని జ్ఞాపకం చేసుకొంటోంది. మనోరంజకమైన ఆ స్పర్శ ఆమె గుండెలో తియ్యగా నాటుకొంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS