"స్వామి దయ వుంటే ఈ సంవత్సరమే చేయాలనుకుంటున్నాను"
"మీ మంచిమనసుకి తగ్గ అల్లుడు రావాలండి అమ్మగారూ!"
"నీవాక్కు ఫలించితే మీ ఇంటిల్లిపాదికి బట్టలు కొని యిస్తాను."
"ఇప్పుడు వుంటున్నదీ, తింటున్నదీ కట్టుకుంటున్నదీ అంతా మీదే కద అమ్మగారూ! మా జీవితాలే మీవి. ఇంకా వేరుగా కానుకలు ఎందుకు? మా వాక్కు ఫలించడం ఏమిటి?
కర్మ సాక్షి అయిన ఆ దేవునికి తెలియదా మీ మనసు ఎంత పవిత్రమయినదో! ఎంత వుదారమయిందో! తప్పకుండా మేలు చేస్తాడు!"
"ఎక్కడయినా వెతికారా? ఒక అభిప్రాయం వుందా?" అంది యిల్లాలు.
"చూడాలి! రాసిపెట్టివున్న చోటు ఎక్కడుందో! దైవం మనల్ని అక్కడికి చేరనివ్వాలి కదా! అప్పుడు నిర్ణయిస్తాం!"
మాజీ కరణంగారు ఆ కుటుంబ సంక్షేమానికి కట్టుపడిన మనిషి.
"అమ్మగారూ! మీ అభిప్రాయం ఏమిటో తెలియక నేను ఇంతకాలం మాటాడలేదు. చాలాసార్లు చెప్తామని నోటిమీద దాకా వచ్చింది. కాని సాహసించలేకపోయాను" అన్నాడు.
"అదేమిటి లింగమూర్తిగారూ! మీకు మాత్రం బాధ్యతలు లేవా? మీరు మాత్రం మా శ్రేయోభిలాషులు కారా ఏమిటి?
మీకు తెలిసినంతలో మనకి అనుకూలం అవుతుంది. అనుకున్న సంబంధం ఏదయినా వుంటే చెప్పండి!" అంది రాణి సుమిత్ర.
కొబ్బరిబొండం త్రాగి వెళ్ళి జీపులో కూర్చుంది ఆమని!
ఇంక ఈ కరణం గారితో సుత్తి పెట్టుకున్నారంటే ఆయన అంత సులభంగా ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టడు! విసుగు ఎత్తిందాకా వాయించి మాత్రమే పంపుతాడు అనుకుంది అసహనంగా.
డ్రైవర్ని "ఇంటికి వెళ్ళి నా రూంలో హోలాల్ద్ మీద లింక్ మాగ్జయిన్ వుంటుంది పట్టుకురా" అని పంపించింది.
అతడు నడచి వెడుతుంటే "అర్జంటుగా రావాలి" అంది.
డ్రైవర్ నడక మాని పరుగుతీశాడు.
స్టీరింగ్ మీద మోచేయి వుంచి దానిమీద నుదురు ఆనించి కళ్ళు మూసుకుంది ఆమని! ఆమెకు ఇంటి లోపలి మాటలు విన్పిస్తున్నాయి.
"అవును అమ్మగారూ! మా కుటుంబం మా జీవితకాలాల్లో ఏ కొద్ది మంచి అయినా చేయగలిగితే కొంత రుణం తీరుతుంది.
చంచలరావుగారి అబ్బాయి వాల్మీకి అయితే మన అమ్మాయిగారికి దీటు అయిన సంబంధం అవుతుంది" అన్నాడు లింగమూర్తి.
గాయత్రి మొదటిసారిగా వాల్మీకి పేరు వింది. అతను ఎవరో ఎలా వుంటాడో ఆమెకు తెలియదు. చంచలరావుగారి పేరు మాత్రం మరొకరితో మాటాడుతూ వుండిన సమయంలో తల్లి నోటివెంట రావటం వింది. తనకేమీ సంబంధం లేనట్టుగా తల వంచి ఎడమ కాలి బొటన వ్రేలివంక చూచుకుంటూ కూర్చుంది.
"చంచలరావుగారు చనిపోయి సంవత్సరం దాటిందా?"
"సంవత్సరీకాలు పూర్తి అయి ఎనిమిది రోజులు అయింది అమ్మగారూ!"
"అలాగా! మాటాడేందుకు అభ్యంతరం వుండదు. ఆ అబ్బాయిని పదేళ్ళ క్రితం చిన్న కుర్రాడుగా చూచాను. ఇప్పుడు వాళ్ళు ఫారం హౌస్ లోనే వుంటున్నారా? టౌన్ కి వెళ్ళిపోయారా?" అంది.
చంచలరావుగారు ఆమెకు వేలు విడిచిన వరుసలో అన్నగారు అవుతారు. రెండు జిల్లాల అవతల వుండేవారు. వ్యాపారంలో దెబ్బతిని వస్తే తానే డబ్బు సాయం అందించి ఫాం హౌస్ కట్టుకోవటానికి ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఆయన వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు.
ఇంకా సంపాదించి టౌన్ లో బారెక్స్ లు కట్టించి అద్దెకు ఇచ్చాడు. చాలా వేగంగా పుంజుకుని కోర్టు వ్యవహారాలలో సాయం కూడా చేశాడు! ఆయన అర్ధాంగి ఆ ఊరు రాకమునుపే చనిపోయింది.
చంచలరావుతో కరణంగారికి సాన్నిహిత్యం వుండేది. అతనికి అన్నీ తెలుసు.
"లేదమ్మా! టౌన్ కి వెళ్ళలేదు. అక్కడ ఆదాయం వున్నా తండ్రి చనిపోయాక కూడ అతడు ఫాం హౌస్ నే కనిపెట్టుకుని వున్నాడు"
"ఒంటరివాడు కదా! ఎలా జరుగుతోంది?"
"మనిషి అందంగా వుంటాడు. చాలా బుద్ధిమంతుడు! ఫాంలో చాలామంది పనివాళ్ళు వున్నా తనే స్వయంగా వండుకు తింటాడు"
"అయ్యో పాపం! అలా జరుగుతోందా?" అంది సుమిత్ర సానుభూతిగా!
"వంట వచ్చిన మొగుడు భార్యకు తంటాలండీ! ఆ సంబంధం ఎందుకు? అది బాగా లేదు. ఇది బాగాలేదు. అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ సతాయిస్తూ వుంటారు. జీవితమంతా భరించాలి.మాటలా?" అంటూ కరణంగారి అర్ధాంగి మధ్యలో కల్పించుకుంది.
"నువ్వు నోరు మూసుకో! నీకేం తెలియదు. అన్ని అవకాశాలు డబ్బు హోదా వుండి కూడా స్వయంగా ఓపిగ్గా వండుకు తింటున్నాడంటే ఆ కుర్రాడు ఎంత కుదురు అయినవాడు అయుండాలి.
గొప్పలకు పోయేరకం ఈ యింటిలో పనికిరారు. పనులు అన్నీ స్వయంగా చేసుకుంటాడు. బాగా చదువుకున్నవాడు. ఒడ్డూ పొడుగూ అందంగా వుంటాడు. ఆరోగ్యంతో కండలు తిరిగిన కుర్రాడు!
నాకు తెలిసినంత వరకూ ఈ సంబంధం అమ్మాయిగారికి అన్నివిధాల తగినదే అమ్మగారూ! విచారించి చూడండి. మీరు కూడా తెలుసుకోండి!" అన్నాడు లింగమూర్తి.
"మీరు చెప్పారంటే అది అర్ధవంతమే అయుండాలి. విచారిస్తాను' అంది సుమిత్రాదేవి! మాజీ కరణం భార్య వంక గర్వంతో చూచారు.
"అచ్చగా ఆయన్ని నమ్ముకుని మీరు నిర్ణయానికి రాకండి అమ్మగారూ! వారి సమర్ధత ఏమిటో నాకు తెలుసు! మా పెద్దవాడి పెళ్ళి విషయంలో చిన్నదాని సంబంధం విషయంలో ఆయన తొందరపడ్డారు.
"మావి సాధారణ కుటుంబాలు, మామూలు పరిస్థితులు కనుక ఎలాగో సర్దుకుపోతున్నాం. మీరు అలా కాదు కదా!?"
"మన గాయత్రికి ఆ జగదీశ్వరస్వామి లాంటి భర్త లభించాలి" అంటూ మనసారా ఆశీర్వదించి హెచ్చరికలు చెప్పింది ఆ ఇంటి ఇల్లాలు.
"నేను కూడా విచారిస్తాను. తొందరపడను" అంటూ సెలవు తీసుకుంది సుమిత్రాదేవి! వారు లేచి రావడంతో లింక్ మాగ్జయిన్ ప్రక్కనుంచి "సుత్తివీరుడు అప్పుడే విడిచిపెట్టాడన్న మాట?" అనుకుంది ఆమని! తల్లి డ్రయివర్ ని ముందుకు తీసుకువచ్చే అవకాశాలు వున్నాయి కాబట్టి జీపు ముందుగానే స్టార్ట్ చేసుకుని కూర్చుంది.
ఆ తరువాత వారు ఆలయం ముందు దిగారు.
గ్రామానికి మించిన ఆలయం అది! సుమిత్రాదేవి వెనుక ముందాడకుండా డబ్బు పెట్టి పోషించకపొతే చుట్టూ వున్న పెద్ద ఆవరణలో అడవి పెరిగి శిధిలాలయంలా అయిపోయేది.
పూల మొక్కల్ని పరామర్శిస్తూ మారేడు జమ్మి రావి వృక్షాలను పరిశీలిస్తూ ముగ్గురూ ఆలయం చుట్టూ ఆవరణలో ఒక ప్రదక్షిణం పూర్తి చేశారు. ధ్వజ స్థంభం దగ్గిర నిలబడింది సుమిత్ర.
ఆలయ పూజారులు ఆమె రాకను గమనించారు. తండ్రీ కొడుకులు పెద్దాయన పరిగెత్తుకుంటూ సుమిత్ర దగ్గరకు వచ్చాడు.
"నమస్కారం అర్చన స్వామీ!"
"ఈశ్వారార్పణం తల్లీ! మీ రాకకే ఎదురు చూస్తున్నాను. యజ్ఞశాలలోకి వెడదాం రండి! ఏర్పాట్లు పూర్తి అయాయి" అంటూ పూజారి ఆ వైపుకు దారి తీశాడు! యజ్ఞశాల దగ్గరకు వచ్చారు.
గోడవారగా ఎవరి దృష్టికి పడకుండా వున్న చిన్న పల్లేరు మొక్కను వంగి పెరికివేసింది సుమిత్రాదేవి. అది చూచి పూజారి కలవర పడిపోయాడు.
"వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తూనే వుంటాం తల్లీ! ఏదో ఒకలోపం జరుగుతూనే వుంటుంది" అన్నాడు సంజాయిషీగా.
"పూజలలో మాత్రం లోపం రానివ్వకండి! ఆ స్వామి మా ఇలవేల్పు. ఆలయం కళకళలాడుతూ వుంటేనే మాకు భవిష్యత్తు!" అన్నదామె.
చెట్లు పూలమొక్కలు ఆలయం ఈ చోటు చిన్నతనం నుంచీ తెలిసిందే అయినా ఆమనికి ఆసక్తి తగ్గిపోలేదు. అక్కచెల్లెళ్ళు చిన్నప్పుడు తల్లితో వచ్చి ఆ చెట్లక్రింద గుజ్జనగూళ్ళు ఆడుకున్నారు.
ఆ ప్రదేశాలు అంటే ఇద్దరికీ ఇష్టమే!
యజ్ఞశాలలోకి ప్రవేశించారు.
లోపల మూడు హోమగుండాలు ఎర్రమట్టితో కట్టి చక్కగా ముగ్గులు వేసి తీర్చిదిద్దినట్లున్నాయి. హోమం చేసే పండితులకు చిత్రాసనాలు సిద్ధం గాబడినాయి. అవసరమయిన సంభరాలన్నీ మూటలుకట్టి ప్రక్కన వరుసగా పేర్చి వున్నాయి.
దగ్గరకు వెళ్ళి హోమగుండంలోకి తొంగిచూసింది ఆమని!
దానిలోపల ఇసుక వుంది!
"ఒకటి నలుచదరంగానూ రెండు గుండ్రంగానూ వున్నాయేమిటి?" అని పూజారివంక తిరిగి ఆసక్తిగా పలికింది!
"వైశ్య దేవము, ప్రాజాపత్యము, గార్ల నృత్యము" అన్నాడు పూజారి. నోరు తిరగని ఆ మాటలు మరిక వినడం ఎందుకులెమ్మనమని ఊరుకుంది.
ఇంతకాలం తల్లికి వారసత్వంగా ఈ సంవత్సరం తాను కూర్చొనబోయే చోటుని చూసింది గాయత్రి. ఒక వరుస ఇటుకలతో చిన్న పీట. అరుగులా నలుచదరంగా వేశారు దాన్ని.
మూడు యజ్ఞకుండాలకు మధ్యలో వుంది ఆ చోటు.
హోమం చేసే పండితులు ఎదురుగా వుంటారు. ఆ వెనుక చూసేందుకు వచ్చే వందలాది జనం కూడా అభిముఖంగా వుంటారు.
ఆవు నెయ్యి ప్రేల్చుతున్నప్పుడు హోమంలోంచి వచ్చే పొగ ఆ చోటులో కూర్చున్న వారి మీదికి క్రమ్ముతుంది.
