"బాగానే ఉన్నామమ్మా చెప్పుగోదగ్గ అనారోగ్యమేమీ లేకున్నా మృత్యుసన్నిధికి అడుగు త్వరితంగా పడుతూనే ఉంది. అన్నారు గోపాలదేవులు గంభీర మందహాసం చేస్తూ. "అల్లుడు ఎక్కడ? ఎలా ఉందమ్మా?"
ఆయన అడిగిన దానికి చెప్పకుండా. కృష్ణవేణి అతి విచారస్వరంతో అంది "ఈ సత్యం మీ మనువడికి తెలిసి ఉంటే మమ్మల్నీదశలో వదిలి వెళ్ళేవాడు కాడు. నాన్నా! పున్నామ నరకం నుండి తప్పించేపుత్రుడు కలగాలని ముక్కోటి దేవతలను కొలిచి కన్నాను వాడిని. మనిషి రూపంలో ఒక బండను యిచ్చాడు భగవంతుడు, కన్న తల్లిదండ్రుల కష్టసుఖాలు విచారించనివాడు, మాతృఋణం పితృఋణం తీర్చుకోలేనివాడు ఉండీ, లేకా సమానమేకదా?"
"అహఁహఁ అలా అనకమ్మా. కృష్ణా! ఎంతో నొచ్చుకున్నారు గోపాలదేవులు. "పదమ్మా అల్లుడిని చూద్దాం"
మొగుడు కొట్టాడని దుఃఖం కాదట! తోడికోడలు నవ్విందని! అలావుంది కృష్ణవేణి పరిస్థితి. భర్త కాలు విరిగి మంచంలో పడ్డాడన్న విచారానికంటె యీ స్థితిలో కన్న కొడుకు దగ్గరలేడే అన్న దుఃఖమే ఎక్కువగా ఉంది.
తండ్రి వెనుక సిగ్గులకుప్పలా నిలబడ్డ దేవదాసిని చూసి కృష్ణవేణి బలవంతంగా ముఖాన నవ్వు పులుముకొని "అంత సిగ్గేమిటమ్మా, దేవతా? కొత్త పెళ్ళికూతురిలా తాతయ్య వెనుక నిలబడ్డావ్? రా, రా ఏం నాన్నా! దేవత బాగా ఎదిగిపోయింది కదూ, ఈ రెండేళ్ళకే?" అన్నది.
గోపాలదేవులు రెండు రోజులుండి తిరుగు ప్రయాణమౌతూ "అల్లుడికి కాస్త నయంచూచుకొని దేవతను పంపించేయమ్మా. ఆమెలేకపోతే దగ్గరకూర్చొని హరినామం చెవిని వేసే వాల్ళుండరునాకు" అని చెప్పారు.
"జీవుడు ఆవు తోకపట్టుకొని వైతరణి దాటినట్లు దేవత మీకిప్పుడు ఉపకరిస్తూన్నదన్నమాట!" అని నవ్వింది కృష్ణవేణి. అంతలోనే కళ్ళలో నీళ్ళు నింపుకొని "అదృష్టవంతులు, నాన్నా, మీరు! పసుపుకుంకుమతో అమ్మను మీచేతులమీదుగా సాగనంపారు. అయినా మిమ్మల్ని దైవసమంగా చూచుకొనే కొడుకూ, కోడలూ "తాతయ్యా, తాతయ్యా" అని ప్రేమాభిమానాలతో వెంట తిరిగే మనుమలూ, మనుమరాళ్ళు - వీళ్ళ మధ్య ఆత్మసంతృప్తికి లోటులేకుండా కాలం వెళ్ళబుచ్చుకొని కన్నుమూసేవేళ గొంతులో శ్రీపాదతీర్థంపోసి, చెవిలో హరినామం వేయగల దేవతను కూడా మీకిచ్చాడు భగవంతుడు.
"నా దౌర్భాగ్యం కాలిపోను! ఒక బండను కన్నాను నేను, దిక్కులేని పక్షుల్లా కన్నుమూయడమే ప్రాప్తముంది మాకు. వాడిచేతిలో తృప్తిగా పోయే రాత తెచ్చుకోలేదు" అన్నది రుద్ధకంఠంతో.
"చిన్నవాడా? పాతికేళ్ళు. మావయసా వృద్ధాప్యంలో పడింది. కన్నకొడుకు దగ్గరుండి మా కష్టసుఖాలు విచారించాలని అనుకోవడం దురాశ కాదుకదా?"
బండిలో ఎక్కికూర్చున్న గోపాలదేవుడు ఓదార్పుగా అన్నారు. భార్గవుడు మూర్ఖుడుకాదు. అజ్ఞాని అంతకంటేకాదు. అతడింకా విద్యార్థిదశలోనే ఉన్నాడు. మనసు ఒకేచోట కేంద్రీకృతమై వుంది. అందుకే, అమ్మానాన్నల విషయం అంతయిదిగా పట్టించుకోవడంలేదు. అతడొచ్చాక ఎలాగో ఒకింటివాణ్ణి చెయ్యి. మనసు సంసారంలో పడుతుంది. అప్పుడు మిమ్మల్ని ఆలక్ష్యం చేయడం ఎంతమాత్రం జరుగదు."
"అయ్యో! అంతరాతకూడానా? ఆ బండకు ఒక పెళ్ళి కూడా చేయగలనా? నాన్నా?" విరక్తిగా నిట్టూర్చింది కృష్ణవేణి.
2
అలవాటు పడినచోట పనీపాట లేకపోయినా తోచకపోవడమంటూ అంతగా వుండదు. కొత్తచోట కాస్తోకూస్తో పనీ, బాధ్యత అంటూ ఉన్నా చిరాకుగా ఉంది దేవదాసికి. కృష్ణవేణి ఎప్పుడూ భర్త దగ్గరనుండి కదిలేదికాదు తిండీ తిప్పలు కూడా ఆమెకు సహించడంలేదు. భర్త మంచంలో పడ్డప్పటినుండి కంటికి నిద్రనుకూడా దూరం చేసుకొంది. మీ కష్టసుఖాలు పంచుకొనే అర్ధాంగిని నేను అని రుజువు చేసుకొంటున్నాదామె. ఉదయం స్నానం చేసి, దేవుడి పూజచేసుకొని తులసి తీర్థం తీసుకొని వచ్చి కూర్చొన్నదంటే మరి లేచే ప్రయత్నమంటూ ఉండదు.
"బాబుగారికి ఈరోజు కాకపోతే రేపు నయమౌతుంది. అమ్మా బాబుగారి విచారంలోపడి మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి" అని ప్రాధేయపడేవాళ్ళు గోవిందస్వామి, ఇతర నౌకర్లూ.
రావుగారి కాలు యింకా స్వాధీనం కాలేదు. కాకలు, కట్లు, వేణ్ణీళ్ళ ధారలు, తోమడాలు ఇవన్నీ కాగా కూడా ఫలితం కనిపించక మంత్రగాళ్ళను కూడా తీసుకువస్తున్నాడు గోవిందస్వామి.
"క్రిందపడితే తగిలిన దెబ్బకు మంత్రాలేమిటి?" అంది కృష్ణవేణి. వచ్చిన మంత్రగాడు చెప్పాడు. "క్రిందపడితే తగిలిన దెబ్బే. కాని, గుర్రం బెదిరి రాళ్ళల్లోకి రప్పల్లోకి తీసుకుపోయి బాబుగారిని క్రిందపడేసిందంటే అసలు జరిగిందేమిటో గ్రహించాలి. దొరసానీ! ఎన్ని వైద్యాలయినా బాబుగారికాలు స్వాధీనం కాలేదంటే సంగతేమిటో తెలియడంలా! గాలిచేష్ట తప్ప మరొకటికాదు. బాబుగారిని నాకప్పగించండి. నామీద నమ్మకముంచితే బాబుగారు ఈ పొద్దుకల్లా ఇంట్లో కర్రపుచ్చుకొని తిరిగేటట్లు చేయాలి?"
అలా వచ్చేవాళ్ళు మంత్రగాళ్ళు "దీని సంగతి నాకు చెబుతారా? యిలాంటివెన్నో చూశాను. ఎన్నో చేశాను. అంటూ బీరాలు పలికేవాళ్ళు. ఒకళ్ళనుండీ కాలేదు రెండు మూడురోజులు వంట బ్రాహ్మణుడు వడ్డించిన భోజనంసుష్టుగా పట్టించి "ఇదేమిటో కొత్తరకంగా ఉందంటూ చల్లగా జారుకొనేవారు.
రావుగారి కాలినొప్పిని భూతవైద్యులూ కుదర్చలేకపోయారు, నాటు వైద్యులూ కుదర్చలేకపోయారు. కాలు చక్కగా చాపడానికి రాదు. దగ్గరికి ముడుచుకోడానికీ రాదు. మంచంలో యమయాతన అనుభవిస్తున్నారు ఆయన.
మంచం దగ్గరనుండి కదలకుండా కూర్చొనే కృష్ణవేణికి ఇంట్లో జరిగే సంగతులేవీ తెలియవు. ఇంటినిండా నౌకర్లు తిరుగుతుంటారు. ఎవడు ఏది పట్టుకుపోయినా అడిగే దిక్కుండదు.
