Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 5

                                      

    "లేదు...నువ్వు సరిగానే విన్నావ్... నేను రాణిని ప్రేమగా చూసుకోవాలి. రాణీ అందంగా ఉంటుంది" వాడి చెవిలో అన్నాను.

    "ఓరేయ్...నీ గదికి నేను కూడా రోజూ అప్పుడప్పుడూ రావొచ్చు?" వాడు నా చెవిలో అడిగాడు.

    "రావొచ్చు" నేను వాడి చెవిలో-

    "యాహూ!...!

    ఈసారి అరిచింది వాడు - సెవెన్టీ యమ్మెం థియేటరులో స్టీరియో ఫోనిక్ సౌండ్ కి దాదాపు తొమ్మిదిన్నర రెట్లుంది వాడి గొంతు. వాళ్ళిద్దరూ మళ్ళీ సోఫామీంచి పడిపోయారు.

    "అమ్మ...అమ్మ..." అంటూ ఆప సోపాలు పడ్తూ లేచి కూర్చుంది ఆవిడ.

    ఆయన లేచి మళ్ళీ బనీసు ముందుకు లాగి గుండెలమీద ఉమ్మూసుకున్నాడు.

    "అద్గదీ. మా రాణీ అంటే ఇంత ఇంట్రస్టు చూపించేవాళ్ళకే నేను గది అద్దె కివ్వాలని అనుకుంటున్నాను" ఆవిడ మా వైపు సంతృప్తిగా చూస్తూ అంది.

    "ఉండండి... మా రాణిని పిలుస్తాను. దానికి నచ్చితే మీకు గది అద్దెకు దొరికి నట్టే... రాణీ" అంటూ లోపలికి చూస్తూ పిలిచింది.

    నేను,చంచల్రావు ఆత్రంగా గుమ్మం వైపు చూశాము.

    రాణి రాలేదు.

    సిగ్గుపడ్తుందేమో!

    "కొంపతీసి కట్నం లేకుండా అల్లుడిని ట్రాప్ చెయ్యడానికి బ్రహ్మచారులకని ఈ గది అట్టే పెట్టిందేమో?" చంచల్రావు నా చెవిలో గొణిగాడు.

    "పోనిద్దూ... అందంగా వుండాలిగాని, వెధవకట్నం డబ్బులకి చూసు కుంటామా?" అన్నాను వాడి చెవిలో.

    "రాణీ!" ఆవిడ మళ్ళీ పిలిచింది.

    లోపలనుండి సమాధానం వచ్చింది.

    "భౌ..."

    నాకు అనుమానం వచ్చింది.

    "మీ అమ్మాయి మిమిక్రీ లాంటిది ఏదైనా చేస్తుందా?'

    నా మాట ఇంకా పూర్తికాలేదు. లోపల్నుండి తోకూపుకుంటూ కుక్క ఒకటి వచ్చింది. ఎగిరి ఆవిడ ఒళ్ళో కూర్చుంది.

    "ఇదేబాబూ మా రాణి"

    నాకు కళ్ళు బైర్లుక్రమ్మాయి. క్రింద పడిపోకుండా ఆసరాగా చంచల్రావుని పట్టుకున్నాను. వాడి పరిస్థితి కూడా అలానే ఉంది.

    కొన్ని క్షణాల తరువాత తడారిపోయిన పెదాల్ని నాలుకతో తడుపుకుంటూ నీరసంగా అడిగాను. "ఇందాక రాణీ అంటే అమ్మాయి అన్నారు?"

    "ఆవిడకు ఇదంటే ఎంతో ప్రాణం. ఎవరన్నా దీన్ని కుక్క అంటే సహించలేదు..." ఆవిడ భర్త చెప్పాడు.

    "కుక్కని కుక్క అనికాక పిల్లి అంటారండీ  ఎవరైనా?ఆ? హహహ..." చంచల్రావు నవ్వాడు.

                                

    ఆవిడ ముఖం చూస్తే "గదీలేదు గిదీలేదు గెటౌట్" అనేలా ఉంది.

    "అబ్బే అది కుక్క ఎందుకైందీ? అది రాణి...రాహాణి" అన్నాను వాడి తొడమీద గట్టిగా గిల్లేస్తూ.

    "పూర్వజన్మలో ఏం పాపం చేశామో గానీ, మాకు ఈ జన్మలో పిల్లలు కలగలేదు నాయనా... అందుకే దీన్ని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను" అందావిడ కుడిచేత్తో రాణీ తల నిమురుతూ, ఎడమచేత్తో చెంగుతో కళ్ళు తుడుచు కుంటూ.

    మేమిద్దరం కూడా కళ్ళు వొత్తుకున్నాం. నిముషంలో మేం కన్నకలలన్నీ అరనిమిషం లో భాగ్నమైనందుకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS