భలె భలే మగాడివోయ్
"జానకీ... జానకీ..."
హాల్లోంచి గట్టిగా అరిచాడు తొట్టిపొట్టి శర్మ... జానకి ఇంట్లోంచి హడావిడిగా పరిగెత్తుకు వచ్చింది.
"ఏంటండీ...ఏమైంది?..." అడిగింది జానకి
"నాకో మంచిఐడియా వచ్చింది!" సంతోషంగా అన్నాడు తొట్టిపొట్టి శర్మ...
"అదేంటో నాకు తెల్సులెండి..." అంది జానకి తొట్టిపొట్టి శర్మ వంక చిలిపిగా చూస్తూ.
"అయితే చెప్పుమరి!..." కులాసాగా నవ్వుతూ భార్యవంక ప్రేమగా చూస్తూ అన్నాడు.
"గుండు కొట్టింగ్స్ హోమం చేస్తాననీ... అది చేయిస్తే మీకున్న సమస్యలన్నీ తీర్తాయ్... పైగా మీ యింట్లో లక్ష్మీదేవి ధిమితక... తకధిమి అంటూ తాండవం చేస్తుందని కొంతమంది బక్రాగాళ్లని పోగేసి నమ్మింది... వాళ్ల దగ్గర్నుండి లక్షలు గుంజి ఆ "గుండు కొట్టింగ్స్ హోమం చేయించాలని అనుకుంటున్నారు... అవునా?..."
"నువ్వు నాలాగే పొట్టి దానివిగానీ... నీ బుర్ర మాత్రం నా బుర్రకాయ్ లాగా గట్టిది మాత్రం కాదు... ఆ హోమాలవీ ఎప్పుడో ఒక్కసారి మాత్రం చేస్తాం ఎవరో బక్రాగాళ్లు దొరికినప్పుడు... ఇప్పుడు నేనేసిన ప్లాన్ తో మనకి రోజూ ఇన్ కమే ఇన్ కం... ఇన్ కమే - ఇన్ కమ్..." అన్నాడు తొట్టి శర్మ గర్వంగా.
అవునా?... ఏంటది... చెప్పరా?... చెప్పరా?... చెప్పరా????...
తొట్టిపొట్టి శర్మ జట్టుపట్టి లాగి లాగి ఊపుతూ ఉత్సాహంగా అంది.
తొట్టిపొట్టి శర్మ ఆమె చేతుల్లోంచి తన జుట్టుని విడిపించుకున్నాడు."అబ్బా... ఎవరైనా భుజాలు పట్టి ఊపుతారు... నువ్వేంటీ నా జుట్టు పట్టుకుని ఊపేస్తున్నావ్?...."విసుగ్గా అన్నాడు శర్మ.
జానకి నాలుక కర్చుకుని కిలకిలా నవ్వేస్తూ "పోనీ ఇప్పుడు మీ భుజాలు పట్టి ఊపనా?... అని అడిగింది.
"వద్దు... వద్దు... నీ ఊపుడుకి నా తలపండు రాలి నేలమీద పడేలా ఉంది... నేనే చెప్పేస్తా... కాస్త దూరంగా ఉండు" విసుగ్గా చూస్తూ అన్నాడు తొట్టిపొట్టి శర్మ.
"చెప్పండి... చెప్పండి" ఉత్సాహంగా అంది జానకి.
"అందరూ నా గురించి ఏమనుకుంటారు?" భార్యని ఉత్సాహంగా అడిగాడు తొట్టిపొట్టి శర్మ.
"మీతో పూజలూ... హోమాలూ చేయించుకోని వారైతే మీరు గొప్ప పండితులనీ.... అని చేయించుయున్న వారైతే మీరు మహా దగుల్బాజీ అనీ అనుకుంటారు... హిహిహి..." నవ్వుతూ అంది జానకి.తొట్టిపొట్టి శర్మ బాధగా నొసలు మీద అరచేత్తో ఠపాఠపామని కొట్టుకున్నాడు.
"నన్ను సరస్వతీ ఉపాసకుడని అంటారు!..."పళ్లు కొరుకుతూ అన్నాడు.
"అయితే?" జానకి కుతూహలంగా అడిగింది.
"నేను సరస్వతీ ఉపాసకుడిని కాబట్టి నేను జ్ఞాపకశక్తికోసం ఏదైనా లేహ్యం తయారుచేసి మార్కెట్లో అమ్మననుకో... దానిని జనం తమ పిల్లలకోసం విరగబడికొంటారు!"
"మరి ఆ జ్ఞాపకశక్తి లేహ్యం తయారు చెయ్యడం మీకొచ్చా?..." ఆశ్చర్యంగా అడిగింది జానకి.
"ఏముందీ... చింతపండులోని గింజలు తీసేసి... దానిని ముద్దగా దంచి... దాంట్లో తేనె కలిపి సీసాల్లో పట్టిస్తే తియ్యతియ్యగా పుల్లపుల్లగా జ్ఞాపకశక్తి లేహ్యం తయార్... నాలాంటి సరస్వతీ పుత్రుడు తయారుచేసిన లేహ్యం కాబట్టి... దానినే మహాప్రసాదంగా తలచి ఎంత డబ్బయినా పోసి కొంటారు వెర్రినాయాళ్లు...హిహిహి..." అన్నాడు తొట్టిపొట్టి శర్మ.
హేవండీ... నాకో మంచి ఆలోచన వచ్చింది!" సిగ్గుపడ్తూ అంది జానకి...
"అవునా...ఏంటది?"
"తేనె అయితే కాస్ట్ లీ... దాని బదులు
చింతపండుగుజ్జులో బెల్లంపాకం కలుపుదాం!" అంది.
దాంతో పొట్టి శర్మ ఎగిరి గంతేశాడు.
"ఓరి ఓరి ఓరి.... నీ బుర్రకాయ్ కూడా నా బుర్రకాయ్ లాగే పని చేస్తుంది... ఇకనేం... చింతపండుగుజ్జు తయారుచేసి దాంట్లో బెల్లంపాకం కలిపెయ్... మన జ్ఞాపకశక్తి లేహ్యం పేరు "మొద్దు రాచ్చిప్పాస్ లేహ్యం...."
ఇద్దరూ ఆనందంతో గంతులు వేశారు.
వాళ్లు అందులోంచి బయటపడేసరికి వాళ్ల ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉండడం ఇద్దరూ గమనించారు.
"ఆహా.... మీరు సహస్రావధాని అనే అనుకున్నా గానీ... మీరు మంచి డాన్సర్ కూడా అని ఇప్పుడే తెల్సుకున్నాను." అన్నాడా వ్యక్తి.
"అసలు ఎవరు మీరు?...." అడిగాడు తొట్టిపొట్టి శర్మ ఊడిన పంచని సరిగా కట్టుకుంటూ.
"మీతో పనుండి వచ్చాను.... నాపేరు రంగనాధం....." అన్నాడా వ్యక్తి.
జానకి సిగ్గుతో లోపలికి వెళ్లిపోయింది.
తొట్టిపొట్టి శర్మా, రంగనాధం హాల్లో సోఫాల్లో కూర్చున్నారు.
"చెప్పండి...." అన్నాడు శర్మ.
"అమెరికాలో మా చుట్టూలామె వాళ్ల ఊళ్లో మీ అవధానం కార్యక్రమం పెట్టాలని అనుకుంటున్నారు... ఈ విషయమై మిమ్మల్ని కలుసుకుని మాట్లాడమన్నారు! ఎలాగూ జూలైలో అమెరికాలో జరిగే తెలుగు సభలకి మీరు వస్తున్నారట కదా... అప్పుడే మీ ప్రోగ్రాం పెడ్డామని అనుకుంటున్నారు!" అన్నాడు రంగనాధం.
"హెయ్య..." అని సంతోషంతో పైకి ఎగిరాడు తొట్టిపొట్టి శర్మ.
ఆ అరుపుకి బెదిరిన రంగనాధం తన చొక్కా కాలరు దగ్గర చేత్తోపట్టి ముందుకి లాగి నోటితో "థూ... థూ..." అన్నాడు
"బెదిరిపోయారా... హిహిహి... నేనంతే.... ఆనందం వస్తే తట్టుకోలేను" అన్నాడు తొట్టిపొట్టి శర్మ.
"మీకిష్టమే కదా?..." అడిగాడు రంగనాధం.
"అంటే... డబ్బులు ఏమైనా ఇస్తారా?" అడిగాడు తొట్టిపొట్టి శర్మ.
రంగనాధం చటుక్కున లేచి తొట్టిపొట్టి శర్మ భుజాలు పట్టి నొక్కుతూ"ఓ పదివేలు ఇస్తామని అన్నారు!" అని చెప్పాడు.
"అది సరేగానీ... నా గూళ్లు బద్దలయ్యేలా ఎందుకలా నొక్కుతున్నావు?" చికాకుగా చూస్తూ అడిగాడు తొట్టిపొట్టి శర్మ.
"అంటే... డబ్బు విషయం వినగానే మళ్లీ ఆనందంతో ఎక్కడికో ఎగిరి పోతారనీ..."
"చాల్లేవయ్యా... పదివేలకే నేను జంపింగులు చేస్తానని అనుకున్నావా?... నా విద్వత్తు చూసి ఎక్స్ ఛీఫ్ మినిస్టరు సూర్యబాబురాయుడు హైటెక్ సిటీలో ఎకరం భూమి ఇచ్చాడు తెల్సా?... అయినా అతనో యూస్ లెస్ ఫెలోలే!...."
"అదేంటండీ... మీకు కోట్ల విలువ చేసే భూమిని ఇస్తే మీరు ఆయన్ని యూస్ లెస్ ఫెలో అంటున్నారు?..." ఆశ్చర్యంగా అడిగాడు రంగనాధం.
"నేను అంతే... అలానే మాట్లాడ్తా!... మరి నాకు ఆయన అవసరం ఇప్పుడు లేదు కదా.... ఆ మూల చూడండి... అదేంటి?..." అడిగాడు తొట్టిపొట్టి శర్మ.
రంగనాధం తొట్టిపొట్టి శర్మ చూపించిన దిక్కుకి చూసి"అది సన్నాయి.... మీరు సన్నాయి కూడా ఊదుతారా?..." ఆశ్చర్యంగా అడిగాడు.
