Previous Page Next Page 
దేవదాసు పేజి 5

    దేవదాసు గుణకారాలు భాగాహారాల వరకు లెక్కలు నేర్చుకొన్నాడు. పార్వతి అన్న ఈ మాట విని సంతోషించి "ఇది బాగానే వుంది" అన్నాడు.
    పార్వతి, దేవదాసు చేయి పట్టుకొని "నీవు నన్ను కొడతావు అనుకున్నాను దేవదాదా!" అన్నది.
    దేవదాసు విస్మితుడై "ఎందుకు కొడతాను?" అన్నాడు.
    "నీవు కొడతావని వైష్ణవ స్త్రీలు అన్నారు."
    ఈ మాట విని దేవదాసు చాలా సంతోషించి పార్వతి భుజాల మీద చేతులు వేసి "ఓసి పిచ్చిదానా! అపరాధం చేస్తే నేను కొడతానా?" అన్నాడు.
    పార్వతి చేసిన యీ పని అతని పీనల్ కోడ్ లోపల లేదని దేవదాసు మనసులో అనుకొని వుండవచ్చు. ఎంచేత నంటే మూడు రూ.ముగ్గురు వ్యక్తుల మధ్య సరిగానే విభజించింది. ముఖ్యంగా పాఠశాలలో గుణకారాలూ, భాగహారాలూ నేర్చుకోనటువంటి వైష్ణవ స్త్రీలకు మూడు రూపాయలకు బదులు రెండు రూపాయలు ఇవ్వడం వారిపట్ల అన్యాయం చేయడమే అవుతుంది. తరువాత అతడు పార్వతి చేయిపట్టుకుని చిన్న బజారు వైపుకు గాలిపటం కొనడానికి వెళ్ళిపోయాడు. గిలకను అక్కడే ఒక పొదలో దాచిపెట్టాడు.
                                 4
    ఇదే విధంగా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇక మాత్రం గడవదలచుకోలేదు. దేవదాసు తల్లి పోరుబడుతూ వుంది. "దేవా బొత్తిగా మూర్ఖుడై పోతున్నాడు. పూర్తిగా పశువుగా మారిపోతున్నాడు. వీణ్ని దారికి తీసుకొని రావడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి" అని భర్తను పిలిచి చెప్పింది.
    ఆయన ఆలోచించి "దేవాను కలకత్తా వెళ్ళనివ్వు. నగేంద్రుని ఇంటివద్ద వుండి వాడు చక్కగా, చాలా బాగా చదువుకోగలడు...." అన్నాడు.
    నగేంద్రబాబు దేవదాసు మేనమామ. ఈ విషయం అందరూ విన్నారు. ఇది విని పార్వతి చాలా చింతించింది. దేవదాసుని ఒంటరిగా చూసి అతడి చేయి పట్టుకుని వూపుతూ "దేవదాదా! ఇప్పుడు నీవు కలకత్తా వెళతావా?" అని అడిగింది.
    "ఎవరు చెప్పారు?"
    "పెదనాన్న అంటున్నారు."
    "లేదు, నేను ఏ విధంగానూ వెళ్ళేది లేదు."
    "మరి బలవంతంగా పంపిస్తే!"
    "బలవంతంగానా?"
    ఈ సమయంలో దేవదాసు ముఖంలో వ్యక్తపరచిన భావాన్ని చూసి అతడి చేత యీ భూమి మీద ఎవడూ బలవంతంగా పని చేయించలేడని పార్వతి బాగా అర్ధం చేసుకున్నది. ఆమె అభిలషిస్తున్నది కూడా అదే. అంచేత చాలా ఆనందంగా మరోసారి అతడి చేయి పట్టుకొని అటూ ఇటూ ఊపింది. అతడి ముఖం వైపు చూసి "చూడుడి దేవదాదా! ఎన్నటికీ వెళ్ళవద్దు" అన్నది.
    "ఎన్నటికీ వెళ్ళను."
    కాని అతడు చేసిన యీ ప్రతిజ్ఞ నిలవలేదు. అతడి తల్లి దండ్రులు అతణ్ని దబాయించి, గదమాయించి, కొట్టి, తిట్టి ధర్మదాసు వెంట కలకత్తాకు పంపించారు. వెళ్ళేరోజు దేవదాసుకు చాలా దుఃఖం కలిగింది. కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి అతడికేమీ కుతూహలంగానీ, ఆనందంగానీ కలగలేదు. పార్వతి ఆ రోజు అతణ్ని ఏవిధంగానూ వదల దలచుకోలేదు. ఎంతగానో ఏడ్చింది. కాని వినేదెవరు? మొదట అభిమానంతో కొంత సేపటి వరకూ దేవదాసుతో మాట్లాడలేదు. అయితే చివరకు దేవదాసు పిలిచి _"పత్తో! నేను త్వరగానే తిరిగి వస్తాను. ఒకవేళ రానివ్వకపోతే పారిపోయి వస్తాను" అని చెప్పినపుడు పార్వతి స్థిమితపడి తన అంతరంగంలోని అనేక విషయాలు  దేవదాసుకు చెప్పి వినిపించింది. ఆ తరువాత గుర్రం బండి మీద ఎక్కి, లగేజ్ బ్యాగ్ తీసుకుని, తల్లి ఆశీర్వాదాన్ని పొంది, కళ్ళ నుంచి రాలుతున్న అశ్రు బిందువులతో చెక్కిలి మీద బొట్టులాగా పెట్టుకొని అతను వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పార్వతికి చాలా బాధకలిగింది. కళ్ళ నుంచి ఎన్నో అశ్రుధారలు బుగ్గల మీద ప్రవహించి క్రిందికి జారిపోయాయి. ఆమె హృదయం అభిమానంతో బ్రద్ధలై పోతూ వుంది. మొదట ఎన్నో రోజులు ఈ విధంగా గడిచాయి. తరువాత ఒక రోజు ఉదయం ఆమె ఆలోచిస్తూ వుంది. రోజంతా చేసే పని యేదీ లేదు. ఇంతకు పూర్వం పాఠశాల వదిలిన తరువాత సాయంకాలం వరకు ఊరకనే ఆటపాటలతో గడిచిపోయేది. చేయడానికి ఎన్నో పనులు వుండేవి. కాని సమయమే దొరికితే కాదు. కాని ఇప్పుడు రోజంతా ఊరకనే పడి వుంటున్నది. ఎంత వెతికినా ఒక్క పని కూడా దొరకదు. ఒక రోజు ఉదయమే లేచి ఉత్తరం వ్రాయడానికి కూర్చున్నది. పది గంటలయ్యింది. తల్లి మండిపడింది. అది విని నాయనమ్మ "దాన్ని వ్రాసుకోనివ్వు. ప్రొద్దున్నే అటూ ఇటూ తిరగకుండా చదువుకుంటూ, వ్రాసుకుంటూ వుండటం మంచిది" అన్నది.
    దేవదాసు ఉత్తరం వచ్చిన రోజు పార్వతికి చాలా సంతోషం కలిగించే రోజుగా వుంటుంది. మెట్లమీద కూర్చొని కాగితం చేతిలోకి తీసికొని ఆ రోజంతా చదువుతూనే వుంటుంది. ఈ రకంగానే రెండు మాసాలు గడిచిపోయాయి. ఉత్తరం వ్రాయడంగానీ, అందుకోవడంగానీ ఇప్పుడు అంత త్వరత్వరగా జరగడం లేదు. ఉత్సాహం కూడా కొంచెం తగ్గి పోయింది.
    ఒక రోజు ఉదయం పార్వతి తల్లితో "అమ్మా! నేను మళ్ళీ పాఠశాలకు వెళతాను" అన్నది.
    "ఎందుకు?"
    పార్వతి మొదట కొంచెం ఆశ్చర్యపోయింది. తరువాత తల వూపుతూ "నేను తప్పకుండా వెళతాను" అన్నది.
    "అయితే వెళ్ళు. పాఠశాలకు వెళ్ళకుండా నేను నిన్నెప్పుడూ ఆపలేదే?"
    అదే రోజు మధ్యాహ్నం పార్వతి దాసీ చేయి పట్టుకుని, చాలా రోజుల క్రితం వదిలి పెట్టిన స్లేటూ, పెన్సిలూ వెతికి బయటికి తీసింది. ఆ పూర్వపు స్థానంలోనే శాంతంగా, గాంభీర్యంగా వెళ్ళి కూర్చున్నది.
    "గురువుగారూ, పత్తోను ఎప్పుడూ కొట్టకండి. ఆమె తనంతట తానే కావాలని చదువుకొనడానికి వచ్చింది. వుండదలచుకున్నంత సేపు వుండి చదువుకుంటుంది. ఎప్పుడు వుండ బుద్ధి కాదో అప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది" అన్నది దాసీ.
    గురువుగారు మనసులో  'తథాస్తు' అనుకున్నాడు. పైకి " అలాగే జరుగుతుంది" అన్నాడు.
    'ఒకసారి పార్వతిని కలకత్తాకు ఎందుకు పంపించలేదూ?' అని అడగాలనే కోర్కె కలిగింది. కాని విషయం అడగలేదు. అదే స్థానంలో అదే బెంచీ మీద విద్యార్ధి నాయకుడు భూలో కూర్చొని వుండటం పార్వతి చూసింది. అతణ్ని చూడగానే మొదట ఒకసారి నవ్వు వచ్చింది. కాని మరుక్షణమే ఆమె నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. తరువాత ఆమెకు భూలో మీద కోపం వచ్చింది. కేవలం అతడే దేవదాసును ఇంటినుంచి బయటికి వెళ్ళిపోయేటట్లు చేశాడు అనుకొన్నది మనసులో. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. 
    చాలా రోజుల తరువాత దేవదాసు ఇంటికి తిరిగి వచ్చాడు. గబగబా పార్వతి దగ్గరకు వచ్చాడు. అనేకరకాల ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆమె మాట్లాడవలసింది ఎక్కువగా లేదు. ఉన్నా మాట్లాడలేకపోయింది. కాని మాట్లాడవలసింది ఎక్కువగా లేదు. ఉన్నా మాట్లాడలేకపోయింది. కాని దేవదాసు చాలా విషయాలు చెప్పాడు. దాదాపు అన్నీ కలకత్తా విషయాలే. వేసవి సెలవులు గడిచిపోయాయి. దేవదాసు మళ్ళీ కలకత్తా వెళ్ళాడు. ఈ సారి కూడా ఏడ్పులూ, మొత్తుకోళ్ళూ! కాని అందులో పోయిన సారి వున్నంత గాంభీర్యం లేదు. ఈ రకంగా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ అనేక సంవత్సరాల కాలంలో దేవదాసు స్వభావంలో వచ్చిన మార్పు చూసి పార్వతి అనేక సార్లు చాటుమాటుగా కన్నీళ్ళు కార్చింది. ఇంతకు పూర్వం దేవదాసులో వున్న గ్రామీణ దోషాలు పటణంలో వుంటున్న కారణంగా అమాంతంగా అదృశ్యమై పోయాయి. ఇప్పుడు వుంటున్న కారణంగా అమాంతంగా అదృశ్యమై పోయాయి. ఇప్పుడు అతడికి బూట్లూ, మంచి కోటూ, ఫ్యాంటూ, టై, బెత్తం, బంగారపు చైన్, వాచీ, గోల్డెన్ ఫ్రేముగల కళ్ళజోడూ మొదలైనవి లేకపోతే చాలా సిగ్గు పడతాడు. గ్రామం ప్రక్కనే వున్న నదీతీరాన తిరగడం ఇప్పుడు అతనికి నచ్చడంలేదు. దానికి బదులు చేతిలోకి తుపాకిని తీసుకొని వేటాడటంలో ప్రత్యేకమైన ఆనందం కలుగుతూ వుంది. చిన్న చిన్న చేపలను పట్టుకోవడం కన్న పెద్ద పెద్ద చేపలను పట్టాలనే అభిలాష వున్నది. ఇంతేకాదు, సాంఘిక విషయాలూ, రాజకీయ చర్చలూ, సభలూ, సమితులూ, క్రికెట్, ఫుట్ బాల్ మొదలైన వాటిని గురించి పరామర్శిస్తూ వుండటం! ఆహా! పార్వతి ఎక్కడా! పల్లెటూరు ఎక్కడా! వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన నీళ్ళ చెరువు ఎక్కడా! సోనాపూర్ గ్రామం ఎక్కడా! బాల్యం కాలంనాటి ఒకటి రెండు విషయాలు ఆనందం కలిగించేవి అతడికి జ్ఞాపకం రావడంలేదని కాదు. కాని అనేక విధాలుగా కార్య భారం పెరిగిపోయిన కారణంగా విషయాలు చాలా సేపటివరకూ హృదయంలో స్థానం పొందలేవు. మళ్ళీ వేసవి సెలవులు వచ్చాయి. గత సంవత్సరపు వేసవి సెలవుల్లో దేవదాసు కొత్త ప్రదేశాలు చూడటంకోసం విహార యాత్రకు వెళ్ళాడు. అంచేత ఇంటికి రాలేదు. ఈ సారి తల్లిదండ్రులు గట్టిగా ఇంటికి రావాలని పట్టుబట్టడం, అనేక ఉత్తరాలు వ్రాయడం వలన, తనకు రావాలనే అభిలాష లేకపోయినా కూడా దేవదాసు బెడ్ తోనూ, బ్యాగ్ తోనూ సోనాపూర్ రావడం కోసం హౌరా స్టేషన్ కు వచ్చాడు. అతడు ఇంటికి వచ్చినరోజు శారీరకంగా కొంచెం అస్వస్తుడుగా వున్నాడు. అందుచేత వచ్చిన దగ్గర నుంచీ బయటికి రాలేదు. మరుసటిరోజు పార్వతి ఇంటి కెళ్ళి "పిన్నీ!" అని పిలిచాడు
    పార్వతి తల్లి ఎంతో గౌరవంగా "రా, నాయనా! ఇక్కడికి వచ్చి కూర్చో."
    పిన్నితో కొన్ని క్షణాలు మాట్లాడిన తరువాత "పత్తో ఎక్కడున్నది పిన్నీ" అని అడిగాడు.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS