సాయంత్రం "మామ్మగారి మనవడట. మీకోస మోచ్చారు. ఆయనకి ఉద్యోగమైందా , నాన్నా?" అని అడిగింది మధుమతి వెంకట్రామయ్య గారిని.
"ఆ వేశామమ్మా! ఓ గుమస్తా పోస్టు ఖాళీ ఉంటె. తెలివైనవాడేలే," అని, "జానీ! బామ్మగారి మనవడు అంటే మన మధు బామ్మగారి మనవడు లేడూ? ఇలా డబ్బపండు లా ఉంటాడనుకో. మంచి స్పురద్రూపి. తెలివి తేటలేమిటనుకున్నావ్! అమోఘం. మంచి బుద్ది మంతుడు." అని మెచ్చుకున్నాడు. వెంకట్రామయ్య భార్య నుద్దేశించి.
మధుమతి కళ్ళు చిత్రంగా మెరిశాయి. అవును. బామ్మగారి మనవడు చాలా అందంగా ఉంటాడు. ఆమె ఎదలో యేవో తియ్యని తలపులు కదలాడజోచ్చాయి. ప్రసాదరావు చుట్టూ ఆమె ఊహలు అల్లుకున్నాయో కొన్ని క్షణాలు.
* * * *
"బామ్మగారూ!"
మృదుమధురమైన గొంతు విని. చప్పున ఇవతలి కొచ్చి కంగారుగా లోపలికి వెళ్ళిపోతూ , "అమ్మమ్మా! తాహసీల్దారు గారమ్మాయి వచ్చారు" అన్నాడు ప్రసాదరావు.
"రా, అమ్మా, దా. ప్రసాదం, ఆ కుర్చీ ఇలా వాల్చమ్మా!" అంది నర్సమ్మ గారు, అదర పూర్వకంగా.
కుర్చీ వాల్చాడు ప్రసాదరావు ఫ్యూను కన్నా ఎక్కువ వినయం ప్రదర్శిస్తూ.
"వద్దు. వెళ్ళి పోతానండి. మీరీవేళ పువ్వులకి రాలేదేమా?" అని అమ్మ చూసి రమ్మంటే!" అని అబద్ద మాడింది మధుమతి.
"మావాడు కాంపేళ్ళాలంటే రరెండిడ్డనులు పెట్టిద్దామని..... ఆలస్యమైంది. అమ్మగారు చూసి రమ్మన్నారా? ఎంతమాట! ఒక్కసారి కూర్చో, అమ్మా. వెళుదువు గాని." ముసిముసిగా నవ్వింది నర్సమ్మ.
నెమ్మదిగా కూర్చుంటూ, "ఇవిగో మ పువ్వులు తెచ్చాను. బామ్మగారూ!" అంది మధుమతి, కృష్ణ తామరాకులతో కట్టిన పొట్లం కింద పెడుతూ.
'ఆవిడకి ఫలహారం పెట్టమ్మామ్మా!" నెమ్మదిగా అన్నాడు ప్రసాదరావు.
"నాకు ఉదయం టిఫిన్ తీసుకోవడం అలవాటు లేదండీ!" అంది జవాబుగా మధుమతి.
"ఈ ఒక్క రోజు.... తీసుకోవాలి" అన్నాడు ప్రసాదరావు చనువుగా.
నర్సమ్మ గారు కూడా బలవంతం చెయ్యడంతో మొహమాట పడుతూనే టిఫిన్ తీసుకుంది మధుమతి.
వెళుతూ , "అమ్మమ్మా, తలుపెసుకో" అన్న ప్రసాదరావు గొంతు విన్న మధుమతి అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతను వెళ్ళిపోయిన వైపే ఆమె చూపులు నిలిచాయి కొన్ని క్షణాలు.
"అబ్బా! ఎంత అందంగా ఉంటారీయన! ఒకసారికి పది సార్లు అతన్ని చూడాలని పించిందామెకు. అతని గొంతు వినాలని పిస్తుంది. అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడో? ఆమె హృదయం అరాటపడింది.
"మళ్ళీ ఎప్పుడు వస్తారాయన?' అప్రయత్నంగా ప్రశ్నించింది మధుమతి.
"మావాడా! సాయంత్రానికి వచ్చేస్తాడటమ్మా" అంది నర్సమ్మ గారు.
ఎందుకో తేలిగ్గా నిట్టూర్చి, లేచి నిలుచుని, "మరి వెళతాను , బామ్మగారూ" అంది మధుమతి.
* * * *
'అమ్మా , బామ్మగారింటికి వెళుతున్నా!' వాకిట్లో కొచ్చి కేక వేస్తుంది మధుమతి.
'ఆ అబ్బాయి ఉన్నప్పుడు వెళ్ళకూడదు సుమీ!" హెచ్చరిస్తుందో జానికమ్మ.
ప్రసాదరావు ఇంటికి వచ్చేవరకూ ఉండి అతన్నొక సారి చూసి బుద్ది మంతురాలిలా నిండా పమిట కప్పుకుని పెరటి త్రోవన ఇల్లు చేరుకుంటుంది మధుమతి.
ఓరోజు ప్రసాదరావు అడిగాడు -- 'అమ్మమ్మా , తహసీల్దారు గారి అమ్మాయి రావడం లేదా?' అని.
"ఊర్లో లేదు కదా! పెద్దింటి వాళ్ళు....యేవో సంబంధాలు వచ్చాయట. పేద తండ్రి పంపమని వ్రాశాడట. ఏదన్నా తగిన సంబంధం వస్తే ఈ వైశాఖం లో పెళ్ళి చేస్తారట." అని చెప్పుతూ ఏదో పనిలో లీనమైంది నర్సమ్మ గారు.
ప్రసాదరావు వదనం వివర్నమై పోయింది. అతని మనస్సు కలుక్కుమంది. ఆమె ఎవరి భార్యో అవుతుందంటే అతను విని సహించలేక పోతున్నాడు. హృదయం లో అదేదో సున్నితమైన బాధ రేగింది. ఆమె నోసారి చూడాలనే తహతహ కలిగింది. ' ఆమెను కోరుతున్నాడా తాను! ఎంత అవివేకం! ఆమె అంతస్తేమిటి , తన అంతస్తేమిటి?' నవ్వుకున్నాడు ప్రసాదరావు.
కాని ఆమె వచ్చిందనీ, అనుకున్న సంబంధాలు ఫేయిలయ్యాయని నర్సమ్మ చెప్పేవరకూ అతని హృదయారాటం తగ్గలేదు.
* * * *
ఓరోజు ఉదయం ...." తహసీల్దారు గారు ఉన్నారా అండి?" ప్రసాదరావు గొంతు వింటూనే , "ఆ ఉన్నారు. రండి, రండి కూర్చోండి" అంది మధుమతి విప్పారిత నేత్రాలతో అతని వైపు రెప్ప వాల్చలేనన్నట్టు చూస్తూ.
అతనూ అలాగే చూశాడామే వైపు. మత్తుగా తనవైపే చూస్తున్నట్టున్న అతని వైఖరి కి కంగారు పడిపోతూ, "స్నానం చేస్తున్నారు. ఇలా కూర్చోండి" అంటూ అతనికి కుర్చీ చూపి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది మధుమతి.
తండ్రికీ, ప్రసాదరావు కీ టిఫిన్ తీసుకు వచ్చిన మధుమతి వైపు మొహమాటంగా చూస్తూ, "నాకు వద్దండీ" అన్నాడు ప్రసాదరావు.
"మీ ఇంట్లో నాకు బలవంతంగా టిఫిన్లు తినిపించడం లే? తీసుకోవాలి." చనువుగా అతని ముందర ప్లేటు పెట్టింది మధుమతి.
ఇద్దరినీ క్రీ గంట చూసి కనుబొమ లేగరేశాడు వెంకట్రామయ్య.
ప్రసాదరావు వెళ్ళేక, 'అమ్మా అతనెలా ఉంటాడు?" అన్నారు వెంకట్రామయ్య నవ్వుతూ.
"పొండి , నాన్నా!' సిగ్గుపడింది మధుమతి.
* * * *
రెండు నెలలు గడిచాయి.
ప్రసాదరావింట్లో ఉన్నా, ఇప్పుడు సిగ్గుగా వెళ్ళి పోవడం లేదు మధుమతి. నర్సమ్మ గారితో , ప్రసాదరావు తో "మరి మాట్లాడుతూ , నవ్వుతూ గంటలు గడుపుతుంది.
"ఏమండీ, మీరేం చదివారు?" అడిగాడో రోజు ప్రసాదరావు.
'స్కూలు ఫైనలవగానే మానిపించారండీ మా వాళ్ళు" అంది మధుమతి.
"ఓహో! అయితే పాటలేమన్నా వచ్చా?"
"కొంపతీసి పాడమంటారేమిటి?"
ఇద్దరూ గలగలా కలిసి నవ్వారు. మళ్ళీ అన్నాడు ప్రసాదరావామె వైపు చిలిపిగా చూస్తూ, "కుట్టు వచ్చా?' అని.
"అంటే?...." అర్ధం కానట్టు చూసిందామె.
'అంటే ఎంబ్రాయిడరీ వగైరా."
"నాకేం రావు. మీ కొచ్చునా?' పెంకేగా నవ్వుతూ అడిగింది మధుమతి.
"మరి వంట?" అన్నాడు ప్రసాదరావు ఆమె ప్రశ్న విననట్టు.
"ఎమిటండోయ్ , పెళ్ళి వారన్నా అడగలే దీ ప్రశ్నలు!" నవ్వేసింది మధుమతి.
"పెళ్లివారే అడుగుతున్నారనుకోరాదూ?' అన్నాడు ప్రసాదరావు.
"పొండి. మీరేం పెళ్ళివారు!" సిగ్గుపడింది మధుమతి.
"పెళ్ళి వారెలా ఉంటారు?" అతనిలో రెట్టించిన కొంటెతనం.
ఇంతలో నర్సమ్మ గారక్కడికి రావడంతో సంభాషణ ఆగిపోయింది.
"అమ్మమ్మా, ఆవిడ సినిమాకి వెళతారట. నువ్వేళతావా?" అన్నాడు ప్రసాదరావు.
"నే వెళతానని మీతో చెప్పానా? పొండి, అబద్దాలు!" కోపం అభినయిస్తూ అంది మధుమతి.
"మీ రెప్పుడూ సినిమాలు చూడరా?" మాట మార్చాడు ప్రసాదరావు.
"సినిమాలు చూస్తాను, పత్రికలు చదువుతాను. వంటా, కుట్టూ, పాటా అన్నీ వచ్చు. సరా? చూడండి , బామ్మగారూ , ఈయన ఈవేళ ఒకటే అట పట్టిస్తున్నారు నన్ను" అంది మధుమతి, నర్సమ్మ గారికి ఫిర్యాదు చేస్తూ.
"చిన్నతనం పోలేదురా , ప్రసాదూ! నే మందలిస్తాలే, అమ్మా" అంది నర్సమ్మ గారప్పటికి. తరవాత "పెద్దింటి పిల్ల. చనువు తీసుకుంటున్నావు. జాగ్రత్త సుమీ! నిప్పుతో చెలగాటం" అని మందలించింది నర్సమ్మ గారు ప్రసాదరావు ని.
* * * *
ఆ సంవత్సరం లో నాలుగు సంబంధాలు వచ్చాయి మధుమతి కి. ఒక్క పెళ్ళి కొడుకు నచ్చలేదనే మిషతో అవి తప్పిపోయాయి.
ప్రసాదరావునీ పిలిచారు కొందరు సంసారులు పిల్ల నిస్తామని. నర్సమ్మ గారి బలవంతం వల్ల ఆ అమ్మాయిల్ని చూసి వచ్చాడు కూడా. ఏదో పిల్లని ముడి పెడితే నా బాధ్యత తీరుతుందని ఒత్తిడి చేసింది నర్సమ్మ గారు.
"నచ్చని అమ్మాయి నెలా పెళ్ళాడమన్నావ్?" అని త్రోసి పుచ్చాడు ప్రసాదరావు.
* * * *
