ఆనందం గదిలోంచి హాల్లోకి వచ్చి ఓమారు సత్తెయ్య నూ,సుందరమ్మ నూ చూసి అందరి ముఖాలనూ పరిశీలించి ఒక్క నిట్టుర్పు వదిలి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
"అయితే బాబయ్యా, మన ముకుందం బాబు భార్య సరోజమ్మ, మన విశాలక్షమ్మ భర్త సూరయ్యగారూనూ సాయానా అన్నగారూ చెల్లెలేనా?' అని అడిగాడు వీరిగాడు.
"కాదు. సరోజ సూర్యనారాయణ పెత్తల్లి కూతురు. కాని సరోజ తల్లి చిన్నప్పుడే పోవడం మూలాన సూర్యనారాయణ తల్లే ఆ అమ్మాయిని పెంచింది."
"అబ్బ-- ఆరోజుల్లో ఏం పెంకితనం చేశాడండి ముకుందం బాబు , సరోజమ్మ ను తప్ప ఇంకెవర్ని పెళ్ళి చేసుకోనని?"
"ఏం లాభం? పట్టుమని రెండేళ్ళయినా కాపురం చేశాడా దానితో?"
"అయ్యబాబు! దానికి మనమేం చేస్తామండి? కర్మ అలా రాసుంది. ఆరోజున సూరయ్య బాబు గారొచ్చి మిఠాయి , సారే అంతా ఇచ్చి సరోజమ్మ ని తీసుకు వెళ్తుంటే, పండు లాంటి బిడ్డ నెత్తుకొని రాతల్లీ అన్నా. పెద్ద బాబుగారేమో 'వరద మాంచి వడిలో ఉంది. ఇప్పుడు గోదావరి దాటడం ప్రమాదం. నాలుగు రోజులాగి వెళ్ళకూడదా' అన్నారు.
'అంత వరద నేనెప్పుడూ చూడలేదండి. ఊళ్ళోకి పొలాల్లోకీ ఒకటే నీరు! రాజమంద్రమే ములిగి పొతే, ఇంక మన వూళ్ళో లెక్కా?" అన్నాడు సత్తెయ్య.
"ఎవళ్ళు చెబితే మాత్రం విన్నాడా అతడు? 'మంత్రుల కాంపు. కలెక్టరు కు కోపం వస్తుంది. ఏమైనా సరే వెళ్ళవలసిందే' అని బయలు దేరాడు. తటపటాయిస్తున్న లాంచీ వాళ్ల కింకో అయిదు రూపాయలు కూడా ఆశ చూపించాడుట " అన్నాడు వెంకట్రామయ్య.
"ఏమయితే ఏం? నిండు ప్రాణాలు గంగ లో కలిసిపోయాయి. అంతే . ఇంక మరి లేవలేదు పెద్దబాబు గారు. ఆ బెంగతోటే ఏడాది వెళ్లకుండా వెళ్ళిపోయారు." వీరిగాడు మళ్లీ కళ్ళు ఒత్తుకున్నాడు.
లోపల గడప లో నించున్న విశాలక్షమ్మ కళ్లల్లోంచి ఏకధారగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. జ్ఞాపకాలు రంపాల్లా గుండెను కోసేస్తున్నాయి.
వెంకట్రామయ్య ధైర్యవంతుడు కనుక పైకి గంబీరంగా కూచున్నాడు. జానకి మొహం లో చైతన్యం , ఉత్సాహం పోయి దిగులూ , బాధా గోచరించాయి.
ఈ స్థితిలో వాళ్లను చూసి ఆనందం భరించ లేకపోయాడు. ప్రస్తావన మార్చాలని." పొద్దున్నే ఇలా వచ్చావెం? బాబయ్య కి దణ్ణం పెట్టిద్దాం అనా?" అన్నాడు, వీరిగాడిని ఉద్దేశించి.
"మరేనండి" అన్నాడు వీరిగాడు.
కొంచెం సేపటికి తేరుకుని వెంకట్రామయ్య "అయితే పెళ్ళి ఎప్పుడు?" అన్నాడు.
"ఆకుమళ్ళ రోజులు దాకా ముహూర్తాలు లేవుట కాదండీ?' అన్నాడు వీరిగాడు.
విశాలాక్షి కళ్ళు తుడుచుకుంది.
"అవును . వైశాఖ మాసం దాకా ముహూర్తాలు లేవుట. ఏదో ఈ లోగా సంబంధాలు చూసి మా జానకికి కూడా చేసెయ్యాలి ఈ వైశాఖ మాసం లో" అంటూ వెంకట్రామయ్య నవ్వుతూ జానకి కేసి చూశాడు. జానకి కోపం నటిస్తూ "నేనేం పెళ్లి చేసుకోను" అంది.
"ఆ!.......చేసుకోదు........ఉద్యోగాలు చేసి ఊళ్ళోలుతుంది" అంది విశాలక్షమ్మ వెటకారంగా.
"ఏం? ఏలకూడదా? వచ్చే ఏడు చిన్న మావయ్య ఎమ్.ఎ. లో చేరితే, నేను ఇంటర్ లో చేరుతా.'
"ఇంకా చిన్న బాబుగారికి చదువుందా అండీ?" అన్నాడు వీరుగాడు.
"ఆ! ఈ ఏడు ధాన్యం బాగా పండింది కనక వాడిని వాల్తేరు పంపించి, ఫోర్టు ఆనర్సు లో చేర్పించాలి. ఇప్పటికే ఓ ఏడు ఆలస్యం అయి పోయింది."
"అబ్బాయి గారు పాస్ అయి, ఇంజనీరు గా వస్తారా అండి మనకి?"
'అలా రావలసిందే! అసలు ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు కాకినాడ లోనే ఇంహనీరింగ్ చదవరా అన్నా. ఉహు. వాడికి ఇష్టం లేకపోయింది. మేధామేటిక్స్ ఆనర్సు చదువుతా అన్నాడు. మూడేళ్ళూ దూరంలో వాల్తేరు లో చదవడం ఎందుకూ? ఈ రెండేళ్ళూ బి.ఎ. కాకినాడ లో చదువు. తర్వాత ఫోర్టు ఆనర్స్ లో చేర్పిస్తా అన్నా. వాడి లోటు లేకుండా మళ్ళీ ఫస్టు క్లాసు లో పాస్ అయాడు. మొన్న సరిగా కాలేజీ లో చేర్పించే టైము కు విశాలక్షమ్మ కు అంత జబ్బు చెయ్యడం, మనస్థిమితం లేకపోవడం, దానాదీనా ఈ ఏడు చేర్పించడం పడలేదు. ఇదిగో ఈ పంట అమ్మి, వచ్చే ఏడు వాడిని కాలేజీ లో చేర్పిస్తాను."
జానకి ఆనందం కేసి చూసింది. ఆనందం అప్పుడే ఆనర్సు లో క్లాసులో చేరినట్లు మెడ ఎత్తి కాలరు సర్దుకున్నాడు. జానకి ఫక్కున నవ్వింది. ఆనందం ఆకతాయి చేష్టకు విశాలాక్షి కి కూడా నవ్వు వచ్చింది. వెంకట్రామయ్య అటు తిరిగే సరికి అంతా గప్ చిప్.
"బాబయ్యా! నిన్నను కట్టెత వద్దన్నారుట ఏం? ఏదో వేళ , నేనూ సత్తేయ్యా పొలం వద్డుము కదా?" అన్నాడు వీరిగాడు.
"నీ మొహం! ఇప్పుడెం ములిగి పోయింది! రేపు చేయిద్దాం మాసూలు!" అన్నాడు వెంకట్రామయ్య.
"ఏమిటి?" అంది విశాలక్షమ్మ. ఇంతట్లోకే పడమటింట్లోంచి ఒళ్ళు విరుచుకుంటూ హాల్లోకి వచ్చిన ముకుందం, బాబయ్య ను చూసి కొంచెం వెనక్కు తగ్గాడు.
"ఆ! ఏం లేదమ్మా. చేను కోత అయిపొయిందిగా! కట్టేతేసి బల్ల కొట్టు బుధవారం పూర్తీ చేసెయ్యండిరా అన్నాను మొదట్లో. కాని నిన్ననే సత్తెయ్య కి ప్రధానం అని తెలిసింది. సరే అని, బుధవారం నుంచి రేపటికి మార్చాను. కోసిన పనలు చేలో ఇంకో రోజుంటే వచ్చే నష్టం ఏమిటి?" అన్నాడు వెంకట్రామయ్య.
"లోకాన్ని నమ్మమని లేదు బాబయ్య" అన్నాడు ముకుందం.
"నీకీ లోకంలో నమ్మకస్తులెవరైనా ఉన్నారా అని అసలు?' అన్నాడు వెంకట్రామయ్య.
"ఏదో -- నే చెప్పాను. తర్వాత నీ ఇష్టం" అంటూ పెరట్లో కి వెళ్లిపోయాడు ముకుందం.
"ఈ అపనమ్మకం ఎక్కడ పట్టుకుందోవీడికి?" అన్నాడు ఆనందం ముకుందం పోయిన దిక్కే చూస్తూ.
"వాడి జీవితమే చీకటి అయిపొయింది. ఇంక వెలుగేక్కడ కనుపిస్తుంది వాడికీ లోకంలో?" అంటూ నిట్టూర్చాడు వెంకట్రామయ్య.
"బాబయ్యా శలవు" అన్నాడు వీరిగాడు. సత్తెయ్య లేవబోయాడు. "ఉండండి, జానకీ ఇలారా" అంది విశాలాక్షి. జానకి తో పాటు ఆనందాన్ని కూడా పిలిచింది లోపలికి.
ఆనందం లోపలికి వెళ్లి వచ్చి, నెమ్మదిగా వెంకట్రామయ్య తో "అక్కయ్య , బసవలింగం మగ్గం దగ్గిరి కెళ్లి ఓ పంచల చాపూ, చీరా తెమ్మంది" అన్నాడు.
"ఓ తప్పకుండాను -- పొద్దున్నే బోణీ అంటాడేమో. సందువా పెట్లోంచి ఓ రూపాయి తీసి పట్టు కెళ్ళు."
కొత్తబట్టలూ, పసుపు , కుంకం , కొబ్బరి బొండం , పువ్వులూ సుందరమ్మ కు ఇప్పించింది. విశాలాక్షి జానకి చేత. సుందరమ్మ బరువైన కనులెత్తి కృతజ్ఞత గా విశాలాక్షి కేసి చూసింది.
"నీకంటే సుందరమ్మే బాగుంటుంది రా" అంది విశాలాక్షి నవ్వుతో సత్తేయ్యతో.
"అదేటమ్మగారూ! అలా అంటారు? అది నాకంటే ఎంత నలుపని?' అన్నాడు ఓ వాసి ఎక్కువగా ఉన్న, తన చామన చాయ ఒళ్ళు చూచుకొని. సుందరమ్మ సత్తెయ్య కేసి కొరకొరా చూసింది. అది చూసి అంతా ఫక్కున నవ్వారు.
'ఆనందం చదువు పూర్తీ చేయించి వాడి నో ఇంటి వాడిని చేసి, జానకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే నా భాద్యత కొంత తీర్చుకోన్నట్లవుతుంది. ఇంక ముకుందం సంగతా? వాడిని నెమ్మదిగా ఈ కవిత్వం పిచ్చి లోంచి తప్పించి వ్యవసాయం వేపు దృష్టి మళ్లిస్తే. వాడే నెమ్మదిగా జీవితంలో కుదురు కొని. ఆపైన మళ్లీ పెళ్ళికి ఒప్పుకోవచ్చు. చూద్దాం. పైన భగవంతుడున్నాడు ' అంటూ వెంకట్రామయ్య ఆశగా ఆలోచిస్తూ , కనిపిస్తున్న కొబ్బరి తోటలోకి చూశాడు. బాగా బారెడు పొద్దెక్కినా , దగ్గర దగ్గిరగా చేట్లుండటం మూలాన సూర్యకిరణాలు పూర్తిగా తోటలోకి చొచ్చుకొని రావడం లేదు. ఏ చీకూ చింతా లేకుండా, నిశ్చలంగా నిటారుగా నిలబడ్డ ఆ కొబ్బరి చెట్లు ప్రశాంతమైన చల్లని వాతావరణాన్ని ఆ పరిసరాలలో పరిచాయి. వాటి నీడలలో ఎదుగుతున్న నిమ్మ చెట్లూ, వాటి మధ్య ముళ్ళ లో అప్పుడే తల ఎత్తూతున్న పసుము మొక్కలూ, ఆ మొక్కల చుట్టూ ఉన్న గట్ల మీద సూదులుగా తలలెత్తిన అనాస కుదుళ్ళూ ఆ తోట అందాన్ని ద్విగుణీకృతము చేస్తున్నాయి. మంచుపడడం అప్పుడే ఆరంభం అయిందేమో, గడిచిన రాత్రి అంతా వెన్నెలలో స్నానం చేసిన మొక్కలన్నీ , ఆకుల చివరల ముత్యపు అడ్డ బాసలు అలంకరించుకొని లేత సూర్యుని వెలుగుల్లో ఇంద్రధనుస్సు లు లాగా మెరుస్తూ వింత సోయగాలు సంతరించు కొంటున్నాయి. వెంకట్రామయ్య కు అలాంటి రంగు రంగుల ఇంద్రధనుస్సు లు చూడడం అంటే ఎంతో సరదా. అందరు పిల్లలలాగే వెంకట్రామయ్య కూడా చిన్నప్పుడు ఇంద్రధనుస్సు ను చూసి తన్మయత్వం చెందేవాడు. పెద్ద అయిన కొద్దీ దాన్ని చూడాలనే ఉత్సాహం తగ్గడానికి బదులు హెచ్చవుతుంది. ఎంత పనిలో ఉన్నా, మనస్సు ఎంత వికలంగా ఉన్నా ఇంద్రధనుస్సు ను చూసేసరికి వెంకట్రామయ్య కు ఒక నూతానోత్సాహం ఒక కొత్త ఆలోచనా వచ్చి గంటల తరబడి తనను తానూ మరిచి దానిని చూస్తూ ఉండి పోతాడు. ఇప్పుడా మంచు బొట్టుల ఇంద్రధనుస్సు లు , శతాదికంగా సహస్రాదికంగా తన చుట్టూ మెరిసేటప్పటికి వెంకట్రామయ్య తనను తాను మరిచిపోయాడు.

తిరిగి తానీ లోకంలోకి వచ్చేసరికి గుమ్మానికి సరిగా ఎదురుగా ఉన్న గున్న మామిడి రాబోయే ప్రియవసంతుని కోసం అలంకరించుకోవాలని సమాయత్తం అయ్యే అందంగా లేని ఆకులను రాల్చి వేస్తూ హడావుడి గా ఉంది. నేలకు సమాంతరంగా పెరిగి, మధ్యలో వంగిన కొమ్మ మీద నవ వధువు లాగా కూచుంది ఓ ఉడుత. ముందు కాళ్ళతో జామకాయ పట్టుకొని తింటూ తింటూ, మధ్యలో హల్లో నుంచి కనిపిస్తున్న వెంకట్రామయ్య కేసి చూస్తుంది చిలిపిగా. దానిని చూస్తె వెంకట్రామయ్య కు నవ్వు వచ్చింది.
