ఆ లెక్చరర్ గారు ఆమెను పరికించి చూసి ఏదో ఊహించుకొని "మీకు చేవుడా?" అన్నాడు.
"కా....కా...కాదు సార్! కా...కా....కా.....కాస్త వత్తి , మ....మ....మ.....మతి మ.మ....మరుపు కూడా ఉంది -- ది" అంది. గొల్లు మన్నారు క్లాసంతా.
'అసాధ్యురాలివి గానే ఉన్నావు' అనుకోని ' ఆ.....ఆ అయితే కూ...కూ.....కూర్చోండి" అన్నాడు.
నివ్వెర పోయాడు క్లాసులో నివారు. మొండి ఘటమేనే అనుకొన్నారు.
అటెండేన్స్ తీసుకోవడం అయిపోగానే "సార్, ఒక రిక్వస్ట్" అంటూ లేచింది వసంత.
"ఏమిటో చెప్పండి."
'మరి మా అందరినీ పరిచయం చేసుకొన్నారు. మీ పరిచయం మాకు కాలేదు."
"తెలివైన ప్రశ్నే వేశారు. నా పరిచయం అంత అవసరమా?"
'అవుననే అనుకొంటున్నాం."
"అవశ్యం" అన్నాడొక విద్యార్ధి.
"అయితే వినండి. నా పేరు. ఎన్. భాను మూర్తి . మా....."
"ఎన్ -----అంటే !' అంది ఒక కంఠం.
"అడిగే ధైర్య మున్న వారు నిర్భయంగా లేచి అడుగవచ్చు."
"అది మాకలవాటు లేదు."
"సరే. ఎన్ అంటే నందమూరి అని. మాది రాయలసీమ లోని కడప పురము. పోయిన ఏడే ఎమ్. ఎ . ఫస్ట్ క్లాసు లో పాసయ్యాను. ఇది నా మొదటి ఉద్యోగం. ఇదే మొదటిసారి క్లాసు తీసుకొంటున్నాను."
"అయితే కష్టపడతారు" అన్నాడోక విద్యార్ధి.
"ఎన్నో కష్టాల కోర్చే ఇక్కడి కొచ్చాను. ఇక ఇక్కడి కష్టా లెంత ? అయినా కష్టాల తో కొట్లాడడం మా ప్రక్క వారి కలవాటే లెండి. మికా చింత అక్కరలేదు." అని ఆ మాట అన్న విద్యార్ధి ని గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడే అతణ్ణి లేపి బయటికి పంపిద్దామనుకొన్నాడు కానీ మొదటి క్లాసు లోనే అల్లరెందుకని ఊరుకున్నాడు.
"అంటే మీ సాహస కృత్యాలు ఏమైనా వుంటే చెప్తారా , సార్!" అంది వసంత కొంటెగా.
"చెప్తే మీలాంటి వారికి అర్ధం కావు. వ్రాసి పుస్తకంగా అచ్చు వేయించి ఇస్తాను. చదువు కొందురు గాని."
"అయితే ఉపాద్యాయు లే కాక కవులు కూడ నన్నమాట" అన్నాడొక కొంటె విద్యార్ధి.
"ఇక అనవసర అధిక ప్రసంగం చాలిస్తే మంచిది."
"మావ్' అందొక గొంతు. "భౌ భౌ' అంది మరొక గొంతు. అంతవరకూ దాచి పెట్టుకోనున్న బుడగ టప్ మనిపించాడు ఒక ప్రబుద్దుడు. కాగితం చుట్టి "తూ తూ' అన్నాడొకడు. బెంచి పైన గుర్రాలు పరుగులిడే శబ్దం చేశాడోకడు. దాన్నే కిర్రు మనిపించాడు ఇంకొకడు.
"ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా?" ప్రశ్నించాడు భానుమూర్తి.
'అచ్" అన్నాడొక విద్యార్ధి.
"ఈ క్లాసు లో మనుష్యులేకే పాఠం చెప్పాలనుకొన్నాను. కానీ ఇక్కడ చూస్తె పిల్లులకు, కుక్క లకు, చిన్న చిన్న పిల్లలకు కూడా చెప్పవలసి వస్తుందను కోలేదు."
'అచ్" అంది తిరిగి అదే కంఠం.
"మిస్టర్ గోపీ, గెటప్" అన్నాడు భానుమూర్తి గంబీరంగా.
గోపీ అనే విద్యార్ధి లేచి నిలబడ్డాడు.
"జలుబు అంత ఎక్కువగా ఉందా?"
'అవును సార్" అన్నాడతడు బాధపడుతున్నట్లు నటిస్తూ.
"మరి ఒక తలనొప్పి మాత్ర ఏమైనా వేసుకొని కాఫీ తాగి రాకూడదూ?"
"డబ్బులు లేవు సార్!' గొల్లు మంది క్లాసంతా.
'పోనీ, నేనిస్తాను. వెళ్లిరా"అని పర్సు లో నుండి ఒక రూపాయి నోటు తీశాడు.
దాన్ని అందుకొని "థాంక్యూ సార్" అని గోపీ బయటికి వెళ్ళిపోయాడు.
అంత అల్లరి చేసినా తొణుకూ బెణుకూ లేకుండా కూర్చొని ఉన్నాడే అని తెల్ల మొహాలు వేశారంతా. ఓడిపోయినట్లు తమలో తామే ఒప్పేసు కున్నారు. వసంత అతని గంబీర్యాన్ని మెచ్చుకోంది. ఇంతలో గంట కొట్టేశారు.
"ఒరేయ్ ! మన నందమూరి వారు మొండి ఘటమే కాదు ధర్మాత్ములు , తెగింపు గలవారు. ఇలా అయితే జీతం డబ్బులు మిగలవు." అని వ్యాఖ్యానించాడు తిరిగొచ్చిన గోపీ. అందరూ తలోక విధంగా విమర్శించారు.
"హల్లో , మిస్టర్ మూర్తి! ఎలా వుంది మీ క్లాసు?' అడిగాడు వామనరావు అప్పుడే తిరిగి వచ్చిన భానుమూర్తి తో.
"విద్యార్ధు లంతా మంచివారే కానీ కాస్త అల్లరిగా ఉంటున్నారు."
"కాస్త అంటారేమిటండీ! అసలా క్లాసు తీసుకోవాలంటే మాకందరికీ భయంగా ఉంటుంది."
"మరీ అంత గడుసు వారు కాదులెండి."
"మీరు పొరపడ్డారు. మగవారి వరకూ ఎందుకు? ఆ అమ్మాయి ఉంది చూశారూ వసంత? వట్టి రౌడీ పిల్ల అంటే నమ్మండి. అందం తప్ప ఆమెలో మెచ్చుకో తగ్గ గుణం ఒకటి కూడా లేదు."
భానుమూర్తి మదిలో వసంత రూపం మెదిలింది. చిరునవ్వు నవ్వుకొన్నాడు. క్రమంగా అతడి మనసును ఆక్రమించు కొంది వసంత రూపం.
4
"చూడండి. మీరు యూనివర్సిటీ స్టూడెంట్లు. మీరు ఇక్కడ పాసయ్యేది ఎక్కువగా మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. అంతేకానీ మీ చదువుకు అంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. ఒకవేళ మీరు చదువులో ఫస్టు కావచ్చు. కానీ మీ నడవడి లో లోపముంటే అది మీ భవిష్యత్తు ను నాశనం చేస్తుంది. ఈ విషయం మరిచిపోకండి. ఇక్కడ క్లాసు సంపాదించు కుంటే తప్ప మీకు మంచి భవిష్యత్తు ఉండదనే విషయం సత్యం. ఆ క్లాసు రావాలంటే సత్ప్రవర్తన , క్రమశిక్షణ పాటించాలి. అదికాక ఇలా ప్రేమ లేఖలు వ్రాసి ఆడపిల్లలను అల్లరి పట్టించడం బాగుండదు. ఆరోజులు దాటిపోయాయి. నేడొక విద్యార్ధి హేమలత అనే అమ్మాయికి ప్రేమ లేఖ వ్రాశాడు. మీలో ఎవరు ఈ తప్పుడు పని చేశారో వారు వెంటనే లేచి క్షమాపణ కోరుకోండి. ఇది మీ మొదటి తప్పిదంగా ఎంచి క్షమిస్తాను."
ప్రొఫెసర్ గారి మాటలు విని ఫస్ట్ ఎమ్ . ఎ విద్యార్ధులంతా ఒకరి మొహా లొకరు చూసుకున్నారు. రాజ్ ఒకసారి కోపంగా హేమలత వైపు చూశాడు. అటువంటి క్లిష్ట పరిస్థితి తెచ్చి పెట్టింది కదా అనుకొన్నాడు. అప్పుడే అతని వైపు చూసిన హేమలత అతని భావాన్ని అర్ధం చేసుకోలేక పోయింది.
"ఎవరూ ఒప్పుకోరా?" కోపంగా అడిగారు ప్రొఫెసర్ గారు.
ఎవరూ లేవలేదు.
"మీకు ఇంకో అవకాశాన్నిస్తున్నాను. అనవసరంగా నా ఆగ్రహానికి గురి కాకండి. పట్టుబడక తప్పదు అప్పుడు డిస్మిస్ కావలసి వస్తుందని మరిచి పోకండి."
అప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
"అల్ రైట్! అందరి చేతి వ్రాతా చూస్తాను." కోపంగా ఆ మడిచిన ఉత్తరాన్ని తీసి, "దీని క్రింద సంతకం రాజు అని ఉంది. ఈ క్లాసు లో రాజశేఖర మని, రాజగోపాల్ అని, రాజారావని , క్రిష్టం రాజు అని నలుగురున్నారు. ముందు వారిని పరీక్షించి ఆ తర్వాత అందరినీ చూస్తాను" అని క్లాసంతా కలయ జూశాడు.
ఎవరికి వారు చెయ్యని నేరానికి పట్టుబడి పోతామోనని భయపడుతున్నారు. ఆ చేసిన వ్యక్తీ ఏ నిశ్చయానికి రాలేక బాధపడుతున్నాడు.
"ఎస్. మిస్టర్ రాజశేఖరం" అన్నాడు ప్రొఫెసరు.
రాజ్ నెమ్మదిగా లేచాడు.
అతన్ని చూసి ప్రొఫెసరు గారు ఓ చిరునవ్వు నవ్వి 'మిస్టర్ రాజశేఖరం, నువ్వు ఈ పని చేశావంటే నేనేకాదు, ఎవ్వరూ నమ్మరు. కానీ మనుష్యుల తత్వాలు అతి త్వరగా మారుతుంటాయి. మాకోసం కాకపోయినా ఆ అమ్మాయి తృప్తి కొరకు దీన్ని కాఫీ చెయ్యి" అని ఆ ఉత్తరాన్ని అందించాడు.
రాజ్ అయన చెప్పినట్లు చేయసాగాడు.
హేమలత అది చూసి మతి పోగొట్టుకున్నట్లయింది. ఒకవేళ రాజశేఖరమే ఆపని చేసి ఉంటె తనే అతనికి క్షమాపణ చెప్పుకొని తన హృదయాన్ని అర్పించడాని కి తాను సిద్దమే. అనవసరంగా లేనిపోని కష్టాన్ని తెచ్చి పెట్టానే అని బాధపడింది.
"నీకేమైనా అనుమానముందా అమ్మాయ్?" అడిగారు ప్రొఫెసరు గారు ఆ కాపీని హేమలత ముందు ఉంచి.
"వారు అలాంటి పని చెయ్యరని నాకు తెలుసు, సార్" అంది తలవంచుకొని హేమలత.
"ఇక మిగిలిన వారు" అంటుండగా ఒక విద్యార్ధి లేచి నిలబడ్డాడు.
అందరి కళ్ళూ అతని మీద పడ్డాయి.
"ఓ! మిస్టర్ రాజగోపాల్! ఇది నీపనేనా? నిన్ను ఇలాంటి పరిస్థితులలో చూడడానికి విచారిస్తున్నాను. ఇది నమ్మ శక్యం కాని పని. నా గదికి రండి. మిస్ హేమలతా! యూ టూ" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎంతపని చేశావురా గోపీ అనుకొన్నాడు రాజ్.
"మిస్టర్ రాజగోపాల్! ఇటువంటి పనులు చేయడం నీకు తగదు. ఏదో బుద్ది తక్కువ పని చేశావు. క్షమాపణ వ్రాసిచ్చి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పుకో."
ఆ మాటలు విని హేమలత కంగారుగా "సార్" అంది. మాట్లాడవద్దు అని సైగ చేశాడాయన.
"క్షమించండి . తప్పు చేశాను. ఒప్పుకొంటున్నాను. క్షమాపణ వ్రాసివ్వ గలను. కానీ మీరు చెప్పిన పని ఆత్మాభిమానం గల ఏ పురుషుడూ చెయ్యడు."
"అంత ఆత్మాభిమానం గలవాడిని ఇంత బుద్ది తక్కువ పని ఎందుకు చేశావు?"
"క్షమించాలి. అది మీ దృష్టి లో బుద్ది తక్కువ పనీ, తప్పుడు పనీ కావచ్చు. కానీ నా మనస్సాక్షి కి , నా అదృష్టాన్ని, భావి జీవితాన్ని పరీక్షించుకొనడానికి చేసిన చిన్న సాహసం మాత్రమే."
"అనవసరపు మాటలతో కాలయాపన చెయ్యడం నాకిష్టం లేదు. నీ నిర్ణయమేమిటో వివరంగా చెప్పు."
"చెప్పవలసిందేమిటో ఇంతకు మునుపే చెప్పే శాను."
'అంతేనా?"
"అంతకు మించి ఏమీ చెప్పలేని పరిస్థితులలో ఉన్నాను."
'అయితే నిన్ను కాలేజీ నుండి హాస్టల్ నుండి డిస్మిస్ చేస్తున్నాను."
"థాంక్యూ' అనడం కన్నా ఎక్కువగా ఏమీ చెప్పలేకపాయ్యాడు.
"మిస్ హేమలతా! ఈనాడు నా మనసు కలత పడుతోంది. ఎన్నడూ చేయగూడదనుకొన్న పని చేశాను. అది అతని తప్పో, లేక నీ తప్పో? కాక నాదే కూడా కావచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. పరిస్థితులను చక్క బెట్టుకోవడం నేర్చుకోండి. ఇక మీరు వెళ్ళవచ్చు." అని ఏదో వ్రాసుకోవడం లో నిమగ్నుడయ్యాడు.
హేమలత భయపడుతూ బయటికి వచ్చి నిలబడింది. రాజగోపాల్, ప్రొఫెసర్ గారు టేబుల్ పై పడేసిన ఉత్తరాన్ని అందుకొని "తండ్రి లాంటి వారు మీరు చేసిన మేలు మరిచి పోలేను" అని గబగబా బయటికొచ్చి అక్కడే ఉన్న హేమలత నొకసారి చూసి ముందుకు సాగిపోయాడు.
"ఏమండీ!" అనుసరించింది ;లత.
నిలిచిపోయాడు గోపీ.
"అనుకోని పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించండి" అంది బాధను వ్యక్త పరుస్తూ.
ఆమె వైపు తిరిగి 'అయిపోయిన దానికి విచారించి ప్రయోజనం లేదు. ఇది మీరు నా కిచ్చిన బహుమానం గా స్వీకరిస్తాను. అక్కడ చెప్పవలసిన మాటలు ఇక్కడ చెప్తాను. జీవితంలో మీరు తలంచె తప్పు అనే నా చిన్న సాహసాన్ని ఎన్నడూ చేయను. ఒకసారి చేసినందుకు బాగా బుద్ది చెప్పాను. సంతృప్తి గా ఉండండి."
"నన్ను క్షమించలేరా?" దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది హేమలత.
"మిమ్మల్ని క్షమించడానికి నేనంతటి వాణ్ణి! దీన్ని మీ విజయానికి చిహ్నంగా ఉంచుకోండి." అని ఆ ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. హేమలత బాధతో చేసేది లేక వెయిటింగ్ రూమ్ కేసి నడిచింది.
క్లాసంతా నిశ్శబ్దంగా ఉంది. అందరి మనసులూ ఆందోళనకరంగా ఉన్నాయి. జరగరాని విషయం జరగనున్నట్లు అందరికీ హేమలత అంటే అసహ్యం పెరుకోంది. మంచి వాడని పేరు తెచ్చుకున్న రాజగోపాల్ కు కీడు తలపెట్టి నందుకు లతను ఆమె స్నేహితురాండ్రు కూడా క్షమించలేకపోయారు.
మౌనంగా తన పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్ళిపోతున్న గోపీని చూసి "గోపీ" అంటూ రాజ్, ఆనంద్ అన్న మరొక విద్యార్ధి అతన్ని వెంబడించారు.
"ఏం జరిగిందిరా, గోపీ?" అడిగాడు రాజ్. ఏం వినవలసివస్తుందోనని భయపదుతూందతని మనసు.
"ఏం జరిగుతుంది? నేను ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ. వేడుకోవాలట. నిరాకరించాను. డిస్మిస్ చేశారు. అంతకన్నా ఏం చెయ్యగలరు?"
"ఛీ! ఈ పాడు ఆడువారి బుద్ది పోనిచ్చారు కాదు. అసలు వీళ్ళను మనతో చదువుకో నివ్వడమే పొరపాటు" అన్నాడు కోపంగా ఆనంద్. అతనిలో ఆడవారి పై జుగుప్స, అసహ్యం నిండిపోయాయి. రాజ్ బాధగా మూలిగాడు.
"సార్! ఈ ఒక్క తప్పూ క్షమించండి. ఇంకెప్పుడూ అతనలాంటి పని చేయడని నేను హామీ యిస్తాను. అనవసరంగా అతని జీవితాన్ని నాశనం చేయకండి. నడి సముద్రంలో నావికుడు లేని నావలా అతని జీవితాన్ని మార్చకండి." చేతులు జోడించి ప్రాధేయ పడ్డాడు రాజ్.
"మించిపోయింది. మిస్టర్ రాజశేఖర్! అతను కాస్త పొగరుబోతుగా ప్రవర్తించాడు నే చేయగలిగిందేమీ లేదు."
