"అలా అనకండి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఇప్పుడు మీరు అతని జీవితాన్ని తప్పుడు మార్గం లోనే ప్రయాణించమని శపించారు. ఆ శాపాన్ని ఉపసంహరించుకొని అతణ్ణి రక్షించండి."
"త్రోసి పుచ్చలేని అభ్యర్ధనా, కలత పెట్టె దీనత్వమూ, కనికరించాలనే కోరికా మసలుతుండగా ఉద్యోగ ధర్మం , అభిమానం అడ్డు వచ్చి నిరాకరించక తప్పలేదు.
"ప్రయోజనం లేదు. నీకెలాంటి సహాయమూ చెయ్యలేను. నీ మిత్రుడి కి అన్యాయం జరిగిందని నువ్వు బాధపడుతున్నావు . నా శిష్యుడికి అపకారం చేశావని నేను కూడా చింతిస్తున్నాను. లాభం లేదు. నువ్వు వెళ్ళవచ్చు."
నిస్సహాయుడై మానని గాయంతో బయట పడ్డాడు రాజ్. సహాయం చేసే శక్తి ఉన్నా చెయ్యలేని మానవత్వం . ఇతరులు లొంగ లేదనే ఆత్మాభిమానం అనర్ధాలకు దారి తీసినా అడ్డుకోలేని విచిత్రపు స్వభావం.
* * * *
"నిన్న రాలేదేం?"
"ఏమిటీ దౌర్జన్యం!" ఆశ్చర్యపోయాడు రాజ్. ఇంతలోనే ఇంత చనువూ, అధికారం ఇవ్వడం ప్రమాదమే.
"అత్యవసరమైన పని ఉండి రాలేక పోయాను."
"మేం తెలుసు కోకూడని పనా?"
ఈ చొరవను ఖండించాలను కొన్నాడు. కానీ అప్పటికే ఆ శక్తి తన నుండి దాటిపోయిందని గ్రహించాడు. ఆ విషయం చెప్పవలసిన అవసరం ఏమిటి? కానీ చెప్పకుండా ఉండలేక పోయాడు.
"అతడితో మాట్లాడుతూ వాళ్ళ ఊరికి పంపించడంతో ఆలస్యమయింది." అంతా చెప్పేశాడు, నిరుత్సాహం కూడిన గొంతుతో.
బాధను కలిగించే విషయం. బాధపడి చేయగలిగిందీ ఏమీ లేదు. కానీ అలా బాధపడకుండా ఉండలేడు. అదే మానవ తత్వం . దాన్ని అధిగమించే శక్తి అతనిలో లేదు. అలా సృష్టించబడ్డాడు.
చాలా బాధపడుతున్నాడని గ్రహించింది రజియా. లత ఎవరో తెలియక పోయినా అసహ్యించుకొన్నా ఆమె చేసిన పనికి జాలిపడగలిగింది.
"మీ మిత్రుడు మంచి వాడేనా?"
అర్ధం లేని ప్రశ్న. మంచికీ, చెడుకూ సంబంధ ముంది. మంచిని కానీ,చెడును కానీ శిక్షించవలసిన విధం అది కాదు. అందుకే ఈ బాధ.
"మీ కెందు కొచ్చిందా సందేహం?"
"ఏం లేదు లెండి. ఊరికినే అడిగాను."
"అసలు వాడికిది స్వతహాగా పుట్టిన బుద్ది కాదు. ఎవరి ప్రేరేపణవల్లనో ఆపని చేశాడు."
"అయితే తప్పంతా లతదేనంటారా?"
"తప్పు ఒకరిదని చెప్పడానికి వీల్లేదు."
"పోనీలెండి. జరిగిపోయినదానికి విచారించి ప్రయోజనమేమిటి?"
"జరిగినదానికి కాదు విచారం. జరుగబోయే దాన్ని గురించే నా బాధ. ఈ విషయం ఆ తల్లి తండ్రులు తెలుసుకొని ఎంతగా బాధపడతారో!
కొడుకు పెద్ద చదువులు చదివి తమను ఉద్దరిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకొని జీవించే వారి మనస్సులు ఎంతగా క్షోభిస్తాయో! జీవితంలో ఏదో చెయ్యాలని, దేన్నో సాధించాలని కలలు గన్న వాడి భవిష్యత్తు అంధకార బందర మై పోయిందే అని చింతిస్తున్నాను."
"అతడు ముఖాముఖి ఆమెతో మాట్లాడేసి వుంటే ఇంత చిక్కు వచ్చేది కాదు."
"వాడికంత ధైర్యం ఎన్నటికీ రాదు."
"అసలు మీ మగవారికి ఏ పని చెయ్యడానికి ధైర్యం చాలదు. అన్నీ దాక్కొనే చేస్తుంటారు."
'అంటే?" ఆమె మొహం లోని భావాన్నీ చదవడానికి ప్రయత్నించాడు. ఏదో రహస్యం దాగి ఉంది. ఏదో ఎత్తి పొడుపు గా కూడా తోచింది.
"ఏమీ లేదు. మా క్లాసు లో ఒక అబ్బాయి మంచి వాడని గౌరవించాను. చనువు గానే మాట్లాడుతున్నాను. నిన్న ఒక పుస్తకం తీసుకొని దానితో బాటు ఈ దినం ఒక ప్రేమ లేఖను కూడా బహూకరించాడు" అని తాను యింట్లో చదివిన ఉత్తరాన్ని తీసి క్రింద పడేసింది. గర్వం ఉట్టిపడుతూందా చూపులో.
చిన్నగా నవ్వుకొన్నాడు రాజ్.
"చదవండి" అంది రజియా.
"పరాయివాళ్ళ ఉత్తరాలు చదువ కూడదంటారు."
"నేను పరాయిదాన్నా!" అంది చిరు కోపంతో రజియా. అధికారం కొట్టవచ్చినట్లయింది.
'అబ్బే! ఊరికే అన్నాను" అని ఆ ఉత్తరం తీసుకొని చదివాడు.
"రజియా గారికి,'
వివరంగా వ్రాయలేను. ఎందుకు వ్రాస్తున్నదీ చెప్పనక్కరలేదను కుంటాను. నా హృదయాన్ని మీముందు పరిచాను. కనికరిస్తారో , తిరస్కరిస్తారో మీ యిష్టం. సాహాసం చేసి వుంటే క్షమించండి.
ఇట్లు
ముకుందం."
"ఏం చేద్దామను కున్నారు?"
"మామూలే. చించివేసి గాలికి వదిలెద్దామనుకుంటున్నాను."
"మీ ప్రిన్సిపాల్ గారికిచ్చి డిస్మిస్ చేయించరా?"
"నేనేం హేమలతను కాదు. మేమంతా అలా చేస్తే ఇప్పటికి మాతో చదువుకునే విద్యార్ధులు సగం మంది ఇళ్ళకు పోయేవారు."
"అయితే ఒక్కరినైనా ప్రేమించలేక పోయారా?" కొంటెగా చూస్తూ అడిగాడు రాజ్.
అది చూసి చిరునవ్వు ఒలకబోస్తూ "ఈ ముకుందాన్ని ప్రేమించి ఉండేదాన్నే కానీ...." అన్నది.
"ఊ. అతడలా ఉత్తరం వ్రాశాడని విరమించు కొన్నారా?"
"అదేం కాదు. కొద్ది రోజుల క్రిందటే మరొకరికి నా హృదయాన్ని అర్పించాను."
"స్వీకరించాడా?"
"అది తెలియకనే ఈ బాధ."
"పోనీ, ఆడవారు చాలా ధైర్య వంతులుగదా, అతన్ని కలుసుకొని అడగలేక పోయ్యారా?"
"అలా చెప్తే అనర్ధాలు దాపురిస్తాయని భయం."
"ఎందుకో అంత భయం?"
"అతడు సామాన్యంగా అందరికీ అందేవాడు కాదు. తొందరపడితే తర్వాత విచారించవలసి ఉంటుంది."
"మీ ఆడవారిలో రకరకాల మనస్తత్వాలు గలవారున్నారు."
"మీ మగవారిలో లేరా? ఆడదంటే అట బొమ్మలా భావించే సువిశాల హృదయులు , సమయ మోస్తే ఆడవారిని కబళించి ఆనందించే చమత్కారాలు , బలవంతంగా ఆడదాన్ని అనుభవించే అపత్పరాయణులు; వీరు గాక ఆడదంటే అసహ్యించు కొనేవారు, వారిని లెక్కలోకి తీసుకోకుండా వారు మనుష్యులే నన్న విషయం విస్మరించే మహానుభావులు హృదయమర్పించినా తెలుసుకోలేని అమాయకులు, పొరపాటు నైనా ఆడవారిని కన్నెత్తి చూడని సద్గుణవంతులు , ఆస్థలిత బ్రహ్మచారులు వీరందరినీ ఏమంటారు?"
"ఏమంటాను? లోకో భిన్నరుచి అన్నట్లు వారి వారి మనస్తత్వాలు వివిధాలుగా ఉంటాయి. అయినా మీకు చాల అనుభవమున్నట్లుందే."
"ఇప్పుడిప్పుడే మీ వద్ద నుండి నేర్చు కొంటున్నాను."
"ఊ" అన్నాడు రాజ్ ఆశ్చర్యంగా.
"ఆ" అంది నవ్వుతూ రజియా.
తృప్తిగా నవ్వుకొన్నారు వారు. అది చూసి ప్రకృతి కూడా నవ్వింది. చెల్టు ఆనందంతో ఊగిసలాడాయి. దూరంగా కోయిల ఆనందంగా పాడింది. సముద్రుడు సంతోషంతో పొంగి పోయాడు.
5
జీవితంలో ఒకోసారి మానవులకు పరిచయం కొన్ని విచిత్ర పరిస్థితులలో ఎర్పడుతుంటుంది. అలా ఏర్పడిన ఆ పరిచయం చాలా గట్టి బంధంగా తయారు కావచ్చు. లేదా మధ్యలోనే కొన్ని అవాంతరాల వల్ల రాలిపోనూ వచ్చు. కాని, చదువు కొని విజ్ఞాన మలవరచు కొన్నవారి మధ్య కానీ, చదువు లేకపోయినా సంస్కార వంతులైన వారి మధ్య కానీ ఈ స్నేహ బంధం సాధ్య మైనంత వరకూ జీవితాంతం ఉంటుంది. అప్పుడే అ స్నేహానికి ఒక సార్ధక్యం అంటూ ఉంటుంది. అలా కాక మధ్యలోనే మానవ సహజమైన క్రోధ, లోభ, మాత్ర్సర్యాలకు లోనై పవిత్రమైన బంధాన్ని వదులుకొని, పగ ప్రతీకారాలకు లోబడి ఏదో సాధించాలనే మూర్ఖులు ఉంటారు. స్నేహం కోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి, నిస్వార్ధ పరులై కేవలం పరుల సౌఖ్యం కొరకు తమ జీవితాలనే నాశనం చేసుకొని, లోకంలో మానవాతీతులై దేవతా మూర్తులుగా నిలిచి పోయే మహాత్ములూ, ఉంటారు. మొదటి రకం వారిని చూసి గర్హించాలా? జాలి పడాలా? రెండవ రకం వారిని హర్షిస్తుందా? అరాదిస్తుందా? లోక నిర్ణయం ఎలా ఉందొ?
"లాస్టు అవరు క్లాసు' లేకపోవడంతో లైబ్రరీ లో కూర్చొని చదువు కుంటున్నాడు రాజ్. లైబ్రరీ హాలు చాలా పెద్దది. ఇరువైపుల పెద్ద పెద్ద అద్దాల బీరువాలు , అందులో అమర్చ బడిన పెద్ద పెద్ద వివిధములైన పుస్తకాలు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది లైబ్రరీ . మధ్యలో బల్లలు, వాటికి యిరు వైపులా కుర్చీలు, ఆ బల్లల పై వార, పక్ష పత్రికలు ఎన్నో ఉన్నాయి. విద్యార్ధులంతా తమకు నచ్చిన వాటిని వెతుక్కుని చదువు కుంటున్నారు. అంతమంది విద్యార్దులున్నా ఎవ్వరూ లేనట్లే నిశ్శబ్దంగా ఉంది.

లత మెల్లిగా లైబ్రరీ హాల్లోకి ప్రవేశించింది. దూరంగా ఒంటరిగా కూర్చొనున్న రాజ్ ను చూసింది. విద్యార్ధులందరి దృష్టీ ఆమె పై పడింది. కొందరు అసహ్యంగా తలలు వంచుకున్నారు. మరికొందరు క్రూరంగా కొరకొరా చూశారు. ఒక విద్యార్ధి కోపం పట్టలేక "ఈ మహాతల్లి చదువు కోవడానికొచ్చిందో లేక విద్యార్ధుల భవిష్యత్తు పాడు చేయడాని కొచ్చిందో!" అన్నాడు.
"ఒరేయ్! ఊరు కోరా. లేకుంటే నీపైన కూడా రిపోర్టిస్తుంది" అన్నాడు ఇంకొక విద్యార్ధి.
