Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 5

 

    "దానికేం, అలాగే తీసుకో" రెడ్డి ఆ అవసరమేమిటో అడగనూ లేదు. వనజ చెప్పనూ లేదు. సూట్ కేస్ లోంచి డబ్బు తీసి వనజ కిచ్చాడు.
    "చాలా థాంక్స్. మీ బాకీ ఎప్పుడు తీర్చు కొంటానో ఏమో" అన్నది వనజ కృతజ్ఞతా దృక్కులతో.
    రెడ్డి ,మెల్లిగా వనజ చేతిని తన చేతిలోకి తీసుకొంటూ "ఏం, ఆమాత్రం నాకు ఋణగ్రస్తురాలవై ఉండకూడదా ఏమిటి?" అన్నాడు.
    వనజ లజ్జితయై తన విశాల నయనాలను  అవసరం చేసుకుంటూ మెల్లగా నవ్వి "ఎందుకుండకూడదు? మనిద్దరి మధ్యా బాకీలు తీరేవా పెట్టేవా?' అన్నది.
    రెడ్డి మాట్లాడలేదు. వివశుడై పరిణితములైన ఆమె సర్వాంగాలను నిర్ని మేష దృష్టి తో చూడసాగాడు. ఆమెను చూసినప్పుడల్లా తనెందు కంత వ్యామోహానికి లోనౌతాడో అతనికే అర్ధం కాదు. ఆమె సౌందర్యం లో అంత అపురూపమైనదేమీ లేదు. మనిషిలో కాని, మాటల్లో కాని అపూర్వత అంతకన్నా లేదు. మామూలు బట్టలు, నగలు లేవు. మరేమిటో ఆమెలో ఉన్న ఆకర్షణ : రెడ్డికి చాలా రోజుల్నుంచీ ఆ ప్రశ్నకు సమాధానం చిక్కలేదు. వనజ కన్నా అందమైన వాళ్ళను  చాలామందిని చూశాడు. కొంతమంది తో సన్నిహితమైన సంబంధం కూడా ఉన్నది, కాని వారిని చూస్తె కలగని చిత్రమైన అనుభూతి   ఏదో వనజ ను చూడగానే కలుగుతుంది.
    "ఏమిటలా చూస్తారు? నేనేం కొత్తదాన్ని కాదుగా.
    "ఎందుక్కాదు? నువ్వు నా కళ్ళ కెప్పుడూ కొత్తగానే కనిపిస్తావ్"
    "అది నా అదృష్టం. కాని తమరు సెలవు దయ చేస్తే ఇవాళ కిక వెళ్తాను. ఇంట్లో అక్కయ్య కూడా లేదు.' అన్నది సున్నితంగా అతని చేతిని తొలగించు కుంటూ.
    "అదేమిటి ? చాలా రోజులకు వచ్చావ్, అప్పుడే ఎలా వెళ్ళ నిస్తాను?' అన్నాడు రెడ్డి.
    'అలా కాదు. ఇవ్వాళ కు వదలండి. ఈసారి వచ్చినప్పుడు మీ ఇష్టమొచ్చినంతసేపు వుంటానుగా" అన్నది లాలనగా.
    రెడ్డి చిన్న పిల్ల వాడిలా మారం చేస్తూ "ఉహూ అలా వీల్లేదు. ఇవ్వాళ నిన్ను వెళ్ళ నివ్వను అంటూ మరింత వాంఛ తో ఆమెను ఆక్రమించుకోసాగాడు. వనజ ఇక వ్యర్ధ ప్రయత్నమేమీ చెయ్యలేదు. 'సరే కానివ్వండి. మీరెప్పుడు విడిచి పెట్టారు గనుక" ఆన్నది నిస్పృహతో.
    రెడ్డి ప్రసన్న చిత్తుడై "దటీజ్ ఏ గుడ్ గర్ల్" అంటూ వనజను దగ్గరకు లాక్కున్నాడు.

                          *    *    *    *
    "చాలా పొద్దు పోయిందనుకుంటాను?"
    "పన్నెండు? ఈ రాత్రి కిక ఇక్కడే ఉండి పో కూడదు?"
    "అమ్మో ఇంటి దగ్గర ప్రకాశం నాకోసం చూస్తూ వుంటాడు. వెళ్తాను రిక్షా పిలవండి." వనజ మంచం మీది నుంచి లేచి చెదరిపోయిన తల వెంట్రుకలను సవరించు కొంటూ అడ్డం ముందు నిలబడింది. తన ఆకారం తనకే తృప్తి కలించలేదు. చెదిరిపోయిన జుట్టూ, నలిగిపోయిన చీరె - ఎవరి  కళ్ళు,  కప్పగలవు? ముఖంలో కృత్రిమమైన ఏవగింపు కనపరుస్తూ , అద్దంలో తన ప్రతి బింబాన్ని చూసి వెక్కిరిస్తూ, దువ్వేనొకటి తీసుకుని చకచకా తల దువ్వుకోసాగింది. మరొకసారి అద్దంలో చూసుకొని, కొంచెం పౌడరు ముఖానికి అడ్డుకుంది. బద్దకంగా పడుకొని, అరమోడ్పు కన్నులతో ఆమె వేపే చూస్తున్న రెడ్డి "లాభం లేదులే వనజా. తల దువ్వుకొని పౌడరు రాసుకోన్నంత మాత్రాన మాసిపోయేది కాదు . అది కనుపించెది నీ కళ్ళలో సుమా" అన్నాడు.
    "ఏమిటో అది?"
    'అదే, నువ్వు దాచి పెట్టాలని ప్రయత్నించేది"
    "ఛీ మీకు మరీ సిగ్గు లేకుండా పోతోంది."
    "సిగ్గే సింగార మనేది ఆడవాళ్ళ కేనని విన్నాను."
    వనజ చీరే మడతలు సరి చేసుకుని, దగ్గిరగా వచ్చి అతని రెండు బుగ్గలు పట్టుకొని సాగదీస్తూ "ఇప్పుడు చెప్పండి. ఏం కనుపిస్తుందో" అన్నది.
    "నాకు చాలా కన్పిస్తుంది. కాబట్టి నాకు కనిపించేదంతా దృష్టి లోపం లేని వాడి కేవడి కైనా కనిపిస్తుందనటం లో సందేహమేమీ లేదు. చక్కగా దువ్వుకున్న తలకూ, నలిగి పోయిన చీరెకు పొందిక కుదరదు. అందులోనూ నీలాంటి అమ్మాయి విషయంలో.... ఎవరైనా ఇట్టే కనుక్కోగలరు."
    వనజ నిర్లక్ష్యం సూచకంగా తల ఎగురవేసి "కనుక్కుంటే కనుక్కోనివ్వండి. మనిద్దరం పెళ్ళి చేసుకో బోతున్నాం గా?" ఇంకా ఒకరి కెందుకు భయపడాలి?" అన్నది.
    వనజ మాటలకు అతని ముఖంలో రంగు మారింది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా ఉన్న అతను క్షణంలో గంబీర్యం వహించాడు' ఒక్క క్షణం క్రితం పరిహసోక్తులతో నిండిన ఆ వాతారవణమంతా హటాత్తుగా బరువెక్కి పోయింది. వనజ మనస్సులో భయం అనుమానం కూడుకున్నాయి. ఐనా తెచ్చి పెట్టుకొన్న ఉత్సాహంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి "చెప్పండి మన మెందుకు భయపడాలి?" అన్నది.
    రెడ్డి మెల్లగా ఆమె కౌగిలి లోంచి తప్పించుకొని "టేబులువద్ద కెళ్ళి సిగరెట్టు వెలిగించాడు. ఇటువంటి భయంకర క్షణం ఎప్పుడో ఒకప్పుడు రాకపోదని అతనికి తెలుసు.
    "మాట్లాడరేం? మీరు అలా మౌనంగా ఉంటె నాకు భయమేస్తుందండీ"
    రెడ్డి వనజ చూపులను తప్పించుకుంటూ మెల్లగా అన్నాడు "క్షమించు వనజా. నేను ఎన్నాళ్ళ నుంచో నీతో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కాని చెప్పలేక పోతున్నాను. మధురమైన ఈ కల ఎక్కడ చేదిరిపోతుందో నని నా భయం. అదీగాక నేను మన .....మన స్నేహాన్ని ఆ దృష్టి తో చూడలేదు. కేవలం...."
    వనజ ఎంతో కష్టంతో తనను తాను సంభాళించుకొంటూ "మీరనేదేమిటో నాకు అర్ధం కావటం లేదు. కాస్త వివరంగా చెప్పండి" అన్నది.
    "అనవసరంగా ఉద్రేక పడవద్దు వనజా. నేను చెప్పేది కాస్త శాంతంగా విను. ఇందులో నా తప్పు చాలా ఉందని నేను ఒప్పుకుంటాను. నేను స్వార్ధ పరుణ్ణి. కాని పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నేను నిస్సహాయుణ్ణి . ఇప్పుడు-- ఈ పరిస్థితిలో -- మన వివాహం సాధ్యం కాదు."
    వనజ ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. చాలాసేపటి వరకూ నోటంట మాట రాలేదు. అతి ప్రయత్నం మీద కుర్చీ పట్టుకొని, అందులో కూలబడింది చివరకు "ఎందుకు సాధ్యం కాదో తెలుసుకో వచ్చునా?" అన్నది మెల్లగా!
    "నా కిదివరకే వివాహమై పోయింది?"

                                      4
    చెప్పుకోదగినంత అపూర్వ విషయాలేమీ లేకపోయినా, పంతులమ్మ వాళ్ళ పూర్వ చరిత్ర కొంత తెలుసుకొనటం ఇక్కడ అప్రస్తుత మేమీ కాదు. వారి పూర్వులు ఎక్కడ పుట్టారో యేమో ఎవరికీ తెలియదు. వారికీ స్వగ్రామంటూ ఏదీ లేదు. చారెడు భూమి గాని, బెత్తెడు ఇల్లు గాని సంపాదించిన పాపాన పోలేదు. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటూ పొట్ట చేత బట్టుకొని ఊరూరూ తిరుగుతూ వచ్చారు.
    పంతులమ్మకు కొంచెం జ్ఞాన మోచ్చేసరికి పశ్చిమ గోదావరి కిల్లాలో ఓ కుగ్రామం లో ఉంటుండే వారు. తండ్రి బడి పంతులు. తల్లి అంతకు ముందే - అంటే వనజ పుట్టిన కొద్ది నెలలకే - మరణించింది. ఇప్పుడా మాతృమూర్తి రూపం , పంతులమ్మ కూడా ఎంత ప్రయత్నించినా జ్ఞాపక మొచ్చెది కాదు. ప్రస్తుతం పంతులమ్మ కు స్పష్టా స్పష్టంగా జ్ఞాపకమున్న భూత కాలపు దృశ్యాలల్లా - రోగాలకూ, బురదకు లోటు లేని ఓ పల్లెటూరు ....ఊరి చివర శిధిలావస్థలో నున్న ఒక బడి ....దానికి దగ్గర్లోనే సగం కప్పు పడిపోయిన ఓ మట్టి ఇల్లూ! ఆ ఇంట్లోనే వారు కాపురముండేవారు! ఆ బళ్ళో తండ్రి పనిచేస్తుండేవాడు. అప్పటికా సంసారం లోని వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. వృద్ధాప్యపు పొలిమేరలో అడుగిడబోతున్న పంతులు గారు, బాల్యావస్థలో నున్న జయమ్మా , వనజా ను ప్రతి రోజూ ఉదయం పంతులుగారే నాలుగు మెతుకులు వండి, పిల్లలిద్ద్రకూ తినిపించి తన వెంటనే బడికి తీసు కెళ్ళేవారు. స్కూల్లో జయమ్మ కు చడువేమీ సాగేది కాదు. వనజ మరీ చిన్న పిల్ల కావటం వల్ల ఆ పిల్లను ఆడించటమే సరిపోయేది. ఎలాగో తంటాలు పడి పంతులుగారే జయమ్మ కు అక్షరాభ్యాసం చేయించాడు. ఇంటి కొచ్చాక జయమ్మ చిన్న చిన్న పనుల్లో తండ్రికి సాయపడుతుండేది. వనజ చిన్నప్పట్నుంచీ అస్తమానం ఏడుస్తూ ముసలి తండ్రిని, పదేళ్ళు కూడా నిండని అక్కనూ నానా అవస్థా పెడుతూండేది.
    ఉన్నట్టుండీ ఒకరోజు పంతులుగారు తనకు తెలిసిన ముసలావిడ్ని ఒకామెను ఇంటికి తీసుకొచ్చి పిల్లలిద్దర్నీ ఆమెకు అప్పగించి , రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. "మీ నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకోటానికి పోయాడే పిచ్చి తల్లీ" అన్నది ముసలమ్మ. అందులో ఉండే చిక్కులేమీ తెలియని జయమ్మ ఎందుకో సంతోషంతో గంతులేసింది.
    పంతులుగారు ఇంటి కొచ్చేసరికి అయన వెంట మరొక కొత్త స్త్రీ వున్నది. వనజ ను చంక నెత్తుకొని -- ఆ బరువు మోయలేక -- పరికిణీ కాళ్ళకు అడ్డం పడుతుండగా -- ఎదురొచ్చిన జయమ్మ కు దగ్గరకు తీసుకుని "మీకొక కొత్త అమ్మను తీసుకోచ్చానమ్మా. దేవుడి దయవల్ల ఇక నుంచైనా మీకు కాస్త ఆలనా పాలనా జరుగుతుందమ్మా" అన్నాడు పంతులుగారు. ఆ కొత్తమ్మ వనజ ను జయమ్మ చేతుల్లోంచి తీసుకొన్నది. కొత్త ముఖం చూట్టం  తోనే వనజ యేడుపు ఆపివేసి చక్రాల్లాంటి తన కళ్ళతో  కొత్తమ్మ కేసి చూసి నవ్వింది. ఆరోజు కొత్తమ్మ పిల్లలిద్దరికీ నీళ్ళు పోసి చక్కగా తల దువ్వి ఉతికిన బట్టలు తొడిగింది. ఎన్నో రోజులకు గాను ఆ వేళ పిల్లలిద్దరూ పెందరాళే వేడి వేడి అన్నం తిన్నారు. రాత్రి చాలాసేపటి వరకూ కొత్తమ్మ తో కబుర్లు చెప్తూ ఆనందంతో గడిపివేశారు.
    చాలారోజులు అలాగే సంతోషంతో గడిచి పోయాయి. జయమ్మ కు బాగా చదువు వస్తోంది.    వేళ కింత తిండి. శుభ్రమైన బట్టలతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారు. తరువాత కొత్తమ్మ కు ప్రకాశం పుట్టాడు. చిట్టి తమ్ముడ్ని చూసి జయమ్మా, వనజ ఏంతో సంబరపడి పోయారు. వాణ్ని కింద దింపకుండా ఎత్తుకోనే వాళ్ళు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS