రోజులు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. గోవింద కి విష్ణుమూర్తి సమక్షంలో అన్నా వదినలు తనని చూడాలని రాసినా అతడిని ఒంటరిగా వదిలి వెళ్ళిందుకు మనస్కరించెది కాదు. విష్ణుమూర్తి తల్లిదండ్రుల ప్రస్తావనే తీసుకువచ్చే వాడు కాదు. నిమిషానికో చీర, గంటకో వాస్తువు అమర్చి పెట్టి గోవిందని తృప్తి పరచేవాడు . వస్తు వాహనాల మీద అంతగా అపేక్ష లేని గోవింద అతని యెదుట సంబరంగానే తీసుకునేది.
గోవింద నెల తప్పిన దగ్గర్నుండీ విష్ణుమూర్తి దశ మళ్ళింది. అతను ముట్టుకున్నది బంగారం అవడం ప్రారంభించింది. సంగతి విని విశ్వనాధం మీనాక్షి ఆనంద పడ్డారు. అనుకోకుండా విశ్వనాధాన్ని బాంక్ వాళ్ళు హైదరాబాదు ట్రాన్స్ ఫర్ చేశారు.
గోవింద కి నెలలు గడుస్తుంటే అతను పనులు తగ్గించుకుని యింటి పట్టునే వుండడం ప్రారంభించేడు. పుట్టబోయే పిల్లాడికి కావలసిన వస్తువుల్ని ముందరే సమకూర్చి పెట్టాడు. అతను డబ్బుని విరివిగా ఖర్చు పెడుతుంటే గోవింద వారించేది. అయినా విష్ణుమూర్తి నవ్వి 'మనం ఇద్దరం మరొకరు పుట్టగానే ముగ్గురం అవుతాం. యింత సంపాదన యెవరి కోసం అంటావు. మనకి వున్నది దర్జాగా ఖర్చు పెట్టడం లోనే వుందోయ్ ఆనందం.' అనేవాడు.
మీనాక్షి ఏడవ నెల రాగానే గోవింద ని పూలు ముడిపించి గాజులు వేయించి తనతో తీసుకు వెడతానని అన్నది.
విష్ణుమూర్తి దిక్కులు చూస్తుండి పోయాడు.
విశ్వనాధం అతని వైపు చూసి చిన్నగా నవ్వుకుని ' మీరూ రండి బావగారూ మోటార్ సైకిల్ ఉండనే వుంది . ఆఫీసుకు వెళ్ళడం పెద్ద సమస్య కాదు.' అన్నాడు.
గోవింద భర్త వైపు అర్ధిస్తూ చూడగానే అతను ఒప్పుకున్నాడు. చార్ మీనార్ కి దగ్గరగా వున్న విశ్వనాధం యిల్లు విష్ణుమూర్తి మెడలో సగ భాగం వుంది. అయినా అతను భార్య సమక్షం కోసం సర్దుకు పోయాడు.
పార్వతి అప్పుడప్పుడు వచ్చి చూసి వెడుతుండేది. గోవింద కి చూస్తుండగానే తొమ్మిదవ నెల వచ్చింది. మీనాక్షి భోజనాలు వడ్డిస్తూ విష్ణుమూర్తి తో అంది 'చూడు తమ్ముడూ మా గోవింద కి మగపిల్లాడు పుడితే మాకు యిచ్చేయండి. మీకు దేవుడు మేలు చేస్తే వెంటనే మరో పిల్లాడు పుడతాడు. యింత యింట్లో ఒక్కదానికి తోచడం లేదోయ్.'
విశ్వనాధం భార్య వైపు జాలిగా చూశాడు.
విష్ణుమూర్తి నోటికి అందిస్తున్న ముద్ద సంగతే మరిచి పోయాడు. గోవింద ముసిముసి నవ్వుకుంది. అతని పితృ హృదయం ఆ క్షణం లోనే రెపరెప లాడటం అన్నా చెల్లెళ్ళ తో బాటు మీనాక్షి కూడా గమనించింది.
"వొద్దు లేవోయ్ ఊరికే అన్నాను. ఖంగారు పడకు. గోవింద పురుడు అయేక. పిల్లాడితో సహా పంపెస్తాను.' అన్నది నవ్వేస్తూ.
విష్ణుమూర్తి చిన్నగా నవ్వుకున్నాడు.
3
మనిషి భవిష్యత్ ని గురించి కనే కలలు యదార్ధ రూపంలోకి వచ్చేసరికి ఒక్కోసారి హాస్యాస్పదంగాను, మరికొన్ని సార్లు భయంకర రూపంలోకి దారి తీసి ఫలితాన్ని తారుమారు చేసి మనిషినే తల క్రిందులు చేస్తాయి. రేపటి మీద మనిషి కెంత ఆశ? యెన్ని పునాదులు వేస్తాడు? నడిపించేది, నడిచేది మరో అదృశ్య శక్తి ద్వారా అని తెలిసి కూడా యెందుకో తప్పటడుగులు వేస్తాడు. బంగారు కలల్లో తేలి పోతుంటాడు. చిత్రం. భగవంతుడి ధోరణి యెవరికీ అర్ధం కాదు. సామాన్యుడి కెంత?
విష్ణుమూర్తి కన్న కలలు ఫలితాల కోసం యెదురు చూస్తూ భార్యని అపురూపంగా చూడసాగాడు. ఆటను పేరు పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్. వైద్యుడు రోగిని చూడగానే మస్తిష్కాన్ని తిరగ వేస్తాడు. లాయరు కేసుల్ని గురించి ఆలోచిస్తాడు. చదువుకున్న చదువుతో పైకి వచ్చిన ప్రతి వ్యక్తీ తమతమ పనులకి ప్రాముఖ్యతని యిస్తూ వుద్రిక్తతకి లోబడి పోతారు. ఖర్మ తోసుకు వస్తుంటే మూడుడై పోతాడు ఆ క్షణంలో.
ఇల్లంతా కటిక చీకటి తో గడాంధకారాన్ని అవరించుకుంది. వీధి దీపాలు వెలుగుతూనే వున్నాయి. యింటి ఎదురుగా పాతిన స్తంభానికి మాత్రం కరెంటు లేదు. ఆ కారణం వల్లనే విశ్వనాధం యింటికి అనుకుని వున్న మరి నాలుగైదు యిళ్ళల్లో కూడా లైట్లు లేకుండా పోయాయి. విష్ణుమూర్తి మోటారు సైకిల్ ఆపి చికాకు పడ్డాడు. విష్ణుమూర్తి యిన్నేళ్ళ సర్వీసు లోనూ యెన్నో పనులు విద్యుత్తూ కు సంబంధించినవి చేశాడు. అతను బట్టలు విప్పి హంగర్ కి తగిలించి డ్రాయర్ తో బయటికి వెడుతుంటే అప్పుడు చూసింది గోవింద. కిరసనాయిల్ దీపాల కాంతి భర్తకి తృప్తి నివ్వడం లేదని గ్రహించింది. గుమ్మం వరకూ అతని వెనుకే వెళ్ళి భుజం మీద చేయి వేసి అన్నది 'అన్నయ్య వెళ్ళాడు కదండీ . పది నిమిషాల్లో వచ్చేస్తుంది కరెంటు. దీనికింత గాబరా దేనికి చెప్పండి. నా మాట వినండి. మీకు కాని పనుల జోలికి దేనికి వెళ్ళడం.'
అతను చురుగ్గా చూశాడు. చేతిలో పని ముట్లతోనే స్తంభం యెక్కి రిపేర్ చేయడం ప్రారంభించాడు. ఐదు నిమిషాలు గడవక మునుపే దేదీప్యమానంగా వెలిగి పోతూ అన్ని యిళ్ళూ కళ కళలాడసాగాయి. గోవింద గుమ్మంలోంచి వెనక్కి తిరిగి లోపలికి వస్తూ తలెత్తింది. అంతే ....విష్ణుమూర్తి ఎలక్ట్రిక్ స్తంభం మీంచి పడిపోయాడు. అన్ని యిళ్ళల్లోనూ దీపాలు వెలిగించిన విష్ణుమూర్తి పడడం పడడం తోనే గోవింద యింటి దీపాన్ని శాశ్వతంగా అర్పేశాడు. చుట్టూ జనం ముగిపోయారు. విశ్వనాధం, మీనాక్షి గుండెలు బాదుకుంటూ విలపించసాగారు. గోవింద గుమ్మంలోనే స్పృహతప్పి పడిపోయింది.
మృత్యువు కౌగిలి లోకి రమ్మని బలవంతం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి అసహాయుడై పోయాడు. కాకపొతే అతను చదివిన చదువుకి తగిన దర్పాన్ని ఆ క్షణం లోనే యెలా పోగొట్టుకోగలిగాడు. సామాన్య ఎలక్ట్రిషియన్ చేయాల్సిన పనికి అంతనేందుకు పురి కోల్పబడ్డాడు? నూరేళ్ళ జీవితం ముప్పై ఏళ్ళకే తెల్లవారి పోవడం దైవ సంకల్పితం కాక మరేమిటి?
దింపుడు కళ్ళం ఆశ మాదిరిగా జనం అతని శరీరాన్ని యింట్లో కి చేర్చారు కాదు. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళి డాక్టర్ల చేత రూడీ చేయించారు.
గోవింద హృదయం ముక్కలయ్యే లా యేడ్చింది. అన్నావదినలు గోవిందని వోదార్చే ప్రయత్నం లో డిలా పడిపోయాడు. మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకి గానీ విష్ణుమూర్తి శవాన్ని యివ్వలేదు. అయిన వాళ్ళందరికీ టెలిగ్రాం లు యిచ్చారు. దీక్షితులు భార్యతో సహా గుమ్మం దిగాడు. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దంపతుల కంటికి గోవింద కాలభైరవిలా కనిపించసాగింది.

సమస్త శాస్త్రాల తో బాటు జ్యోతిష శాస్త్రాన్ని కూడా కూలం కుషంగా చదివి తన పుత్రుడి జాతక చక్రం వేయించిన దీక్షితులకి అతని ఆయు ష్ప్రమాణ మెంత కాలమో తెలిసి కూడా అరని పగ పడగ విప్పగా గోవిందని నిందితురాల్ని చేసి నలుగురి లో తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. అతని కోపోద్రేకం యింకా చల్లారలేదు. పది రోజులు గడుస్తుండగానే ఆ యింటి చుట్టూ పోలీసులు మూగడం విశ్వనాధాన్ని ఆశ్చర్య చకితుడిని చేసింది. పెద్దమనుష్యులు కూర్చుని వుండగా దీక్షితులు అన్నాడు: 'నేను లక్షలకి అధికార్ని. నా తదనంతరం ఆస్తి యావత్తూ నా ఒక్కగా నొక్క కొడుకైన విష్ణుమూర్తికే దక్కేది. అన్నా చెల్లెళ్ళ అంతర్నాటకంలో నా బిడ్డని కావాలనే వాళ్ళు హత్య చేసినట్లు తోస్తోంది. డబ్బు ముందు యీ రోజుల్లో దేనికి విలువ లేనప్పుడు పసుపు కుంకాలకి విలువ వుంటుందని నేను మాత్రం అనుకోను.'
అవాక్కయి నిలబడి పోయారు మీనాక్షి విశ్వనాధం. కొంతసేపు తర్జన భర్జనలు జరిగిన మీదట వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోగానే ముఖ్యుల్ని కూర్చో బెట్టుకుని దీక్షితులు మనసులో మాట అప్పుడు బయట పెట్టాడు.
'నేను నా కోడల్ని యిక యిక్కడ వుంచదలుచు కోలేదు. పదవరోజు రేపు. కర్మకాండ లో ఎటువంటి లోపమూ వచ్చేందుకు వీలు లేదు. నాగరికత కి నేనంత ప్రాముఖ్యతని యివ్వను. కర్మకాండ జరిపి తీరాల్సిందే.'
విశ్వనాధం అరుగు మీద మోకాళ్ళ మధ్యన తల వుంచుకుని కూర్చున్న వాడల్లా యీ మాట విని దిగ్గున లేచాడు. అతను పెద్ద మనుష్యులనబడే వాళ్ళందరితోనూ ఖచ్చితంగా చెప్పాడు. 'ఈయన దీక్షితులు గారు పెళ్లిలో చేసిన రాభసే నా చెల్లెలి పాలిట శాపంలా తగిలింది. నాగరికత అంటూ యీయన యేమిటో అంటున్నాడు. పెద్దవాడనీ, వియ్యంకుడనీ యింత రభస చేస్తున్నప్పటికీ నేను నోరు మెదపలేదు. పరువు ప్రతిష్టలు రెండూ కాని పనులు చేసేవరకూ మాత్రమే.'
