Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 5


    చిన్న బ్యాగుమాత్రం పట్టుకుని బస్సెక్కింది వాణి అంతకంటే తీసికెళ్ళడానికి అసలు ఏమున్నాయి? - యింట్లో కట్టుకోడానికి రెండు చీరలు, సంగీతపాఠాలు చెప్పడానికి బయటికి కట్టుకునేందుకు రెండు చీరలతో కాలక్షేపం చేస్తుంది వాణి-బొత్తిగా రెండుచీరలతో వూరెలా వెడ్తుంది. అందులో కాబోయే అత్తవారింటికి-తమ సంగతి ఎంత తెల్సినా బొత్తిగా యింత దైన్యస్థితిలో వున్నట్టు ఎలా తెలియనీయడం- నాల్గుచీరలు కొనుక్కోవే అతనిచ్చిన డబ్బుతో. మన దరిద్రం ఎప్పుడూ వుండేదే- అంత పెద్దింటికి వెడుతూ బొత్తిగా ఆ చీరలతో ఎలా వెడ్తావు" అంది సత్యవతమ్మ. ఆ మాట నిజమే ముందు ఖర్చుందన్న సంగతి తెల్సినా యిది తప్పనిసరి ఖర్చు-అంచేత వాణి అప్పటి కప్పుడు బజారుకెళ్ళి రెండు చీరలు, రెండు రెడీమేడ్ జాకట్లు-పరికిణీ -తువ్వాలు-కొనక తప్పలేదు- బ్యాగులో బట్టలు సర్దుకుని చేతిలో ఏభైరూపాయలు పట్టుకుని బస్సెక్కింది వాణి.
    బస్సులో ఓ మూల కూర్చుంది- ఆమెకీ ప్రయాణం ఉత్సాహంగా మాత్రంలేదు. కొత్తవూరు, కొత్త చోట, పెళ్ళి కాకుండా అత్తవారింట్లో పదిరోజులు గడపాలంటే, అందులో రాజారావూ లేకుండా అంటే ఆమెకి బిడియంగా ఇబ్బందిగా వుంది. ఎవరన్నా బస్సుస్టాండుకి వస్తారోలేదొ, రాకపోతే ఎడ్రసువుంది యిల్లు  తెలుసు కోలేదా ఆమాత్రం? అనుమానాలు, సందేహాలతో ఆలోచిస్తూ- పరధ్యానంగా కళ్ళు మూసుకుని దిగులుగా పరధ్యానంగా కూర్చుంది వాణి.
    బస్సు-బుర్ బుర్ మంటూ ఆగింది-అప్పటికి మధ్య దారిలో రెండు వూర్లలో ఆగింది. దిగినప్పుడల్లా పాకటీ హోటల్లో డ్రైవరు కండక్టరు టీలు తాగారు- ప్రయాణీకులు దిగిన వాళ్ళు దిగారు-కొందరు ఎక్కారు-ఈసారి మరోవూరు గాబోలు అనుకుంటూ కళ్ళు విప్పింది వాణి-అప్పటికే గాబోలు అనుకుంటూ కళ్ళు విప్పింది వాణి-అప్పటికే పొద్దుబాగా ఏటవాలింది-శీతాకాలం ఏమో ఐదుగంటలకే సాయంత్రం అయిపోతూంది-రోడ్డువార ఆగిన బస్సునుచూసి వూరేంకాదే ఎందుకాగింది చెప్మా అనుకుంటూ చుట్టూ చూసింది వాణి-డ్రైవరు దిగి బస్సు బోనెట్ ఎత్తి చూస్తూన్నాడు. కండక్టర్ దిగాడు. ప్రయాణీకులు ఏమయింది ఏమయింది అంటూ బద్దకంగా వళ్ళువిరుచుకుని కిందకి దిగసాగారు- డ్రైవరు కండక్టరు కలిసిచావుకబురు చల్లగా చెప్పినట్లు ఫేన్ బెల్ట్ తెగిందన్న కబురుచెప్పారు-ప్రయాణీకులు కలవరపడ్డారు. ప్రయాణీకులందరూ కలిసి దులిపారు యిప్పుడేం చేస్తారు అంటూ-డ్రైవరు, కండక్టరు నిర్విచారంగా బీడీ వెలిగించుకుని చేసేదేం వుంది. ఏ లారీ అన్నా వస్తే స్పేరుంటే అడగాల- లేదంటే డిపోకి కబురెట్టి మరో బండి తెప్పించాల అన్నారు- "ఎవరిచేత కబురెడతారు"- అన్నారు పాసింజర్లు-"ఏ లారీవాడన్నా వస్తే కబురెట్టాల-లేదంటే ఇట్నించి ఎల్లేబస్సు ఆరుగంటలకి వస్తది. ఆడితో సెప్పి ఎంటనే బండి పంపమనాల" అన్నారు. ప్రయాణీకుల గుండెల్లో రాయిపడింది. అదన్నా ఎన్నిగంటలవుతుందో. లేదంటే డిపోకి కబురెళ్ళి అట్నించి బస్సు రావడం అంటే కనీసం మరోమూడు గంటలు అంటే రాత్రి తొమ్మిదో పదో అవుతుంది అన్నమాట.
    వాణి గుండెల్లో రాయిపడింది. ఏ రాత్రి పదిగంటలకో వూరు చేరితే చీకట్లో ఒక్కర్తీ యిల్లు వెతుక్కుని వెళ్ళాలా-అంతవరకు యిక్కడ పడిగాపులు పడాలా-యిదేం అవస్థ వచ్చిపడింది. అసలే యీ ప్రయణం అంటే బెంగగా వున్న వాణికి యీ గొడవతో పెద్ద ఆపద నెత్తిన పడినట్టు బెంబేలు పడిపోయింది. అందరితోపాటు తనూ అనుకొని కాసేపటికి ధైర్యం తెచ్చుకుంది- చీకటి పడడం ఆరంభించింది. ఈ చీకట్లో యిక్కడ కూర్చునేకంటే మరో అరమైలు దూరంలో పల్లెటూరుందని అక్కడ రెండుమూడు టీ దుకాణాలు వున్నాయని డ్రైవరు చెప్పిన కబురువిని కొందరు నడిచి అక్కడికి వెళ్ళడానికి తయారు అయ్యారు.
    ఆడవాళ్ళూ కొందరు బయలుదేరడం చూసి వాణి తన బ్యాగుపుచ్చుకుని వాళ్ళతో నడవడం ఆరంభించింది మాటల్లో తను వెళ్ళవలసిన వూరు అక్కడికి ఐదుమైళ్ళు మాత్రం వుందని తెలుసుకుంది. పోనీ ఐదుమైళ్ళే గనకఏదన్నా బండిదొరికితే వెళ్ళిపోవచ్చు అనుకుంది- కబుర్లుచెప్పుకుంటూ పదినిమిషాలలో ఆ పల్లెచేరారు అందరూ. రోడ్డుమీదకీ రెండు పాకటీ దుకాణాలు- ఒక సోడా కిళ్ళీషాపు వగైరాలున్నాయి- అంతాకల్సి హోటలుమీద పడి తలా కప్పు టీ తాగారు.
    వాణి ఏదన్నా బండి కనిపిస్తుందేమోనని యిటు అటు చూసింది- కనుచూపుమెర ఎక్కడ బండిలాంటిది ఏమీలేదు. "ఇదిగో అబ్బాయ్- ఇక్కడేం బండి దొరకదా" హోటలు వాడిని అడిగింది. ఆ కుర్రాడు అదోలాచూసి తలాడించాడు.
    "ఇక్కడేం దొరుకుతాయి- రెండ్లెడ్ల బళ్ళు స్వంతానికుంటాయి" అన్నాడు.
    "పోనీ అవన్నా ఎక్కడుంటాయి" ఎవరినైనా అడిగితే దింపరా అని ఆశ వాణికి.
    "అయి వూర్లో వుంటాయి-అదిగో అక్కడ లైటెలుగు లేదూ అలా ఎల్లండి" అని ఓ సందు చూపాడు.
    దూరంగా ఓ పెట్రోమాక్సు లైటు వెలుగు కనపడుతూంది- "అక్కడ రామాలయం కాడ హరికథ సెప్తుండారు అక్కడికెళ్ళి ఓరి నన్నా అడిగితే దొరకచ్చు" అన్నాడు ఆ కుర్రాడు- వాణి ఒక్కక్షణం ఆలోచించి వెళ్ళడానికే నిశ్చయించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS