Previous Page Next Page 
నయనతార పేజి 5

 

    ఫస్టుఫారం ప్యాసయి తన దగ్గర ఇంగ్లీషు సినిమా పత్రికలూ తీసుకుని ఉత్సాహంగా కూడబలుక్కుంటూ తారల చదివే సుందరి తార అయి గలగల ఇంగ్లీషు మాట్లాడేస్తుంది.
    పావలా పత్రికలూ చదవడానికి నోచుకోని సుందరి బీరువా నిండా అందమైన ఖరీదయిన ఇంగ్లీషు పుస్తకాలు! అప్పుడు సుందరిని చూసి జాలిపడిన తనని యీనాడు - పిచ్చి వెధవలా ఎలా తెల్లబోయి చూస్తున్నాడని సుందరి జాలి పడుతుంది కాబోలు. సారధికి నవ్వు వచ్చింది.
    "ఏమిటలా నీకు నువ్వే నవ్వేసుకుంటున్నావు. ఆ జోక్ ఏమిటో నాకూ చెప్పకూడదూ...." అంటున్న తార మాటలకి తలెత్తి అటు చూశాడు సారధి.
    పల్చటి నైలాన్ గులాబీ నైట్ గౌను తొడుక్కుని జుత్తు అంతా విప్పి గులాబీ రంగు రిబ్బన్ తో పోనీ టైల్ గా ఎత్తి కట్టి మొహం కడుక్కుని ఫ్రెష్ గా తయారయి వచ్చిన సుందరిని చూస్తూ మరోసారి కళ్ళు రెప్పలు అర్చడం మర్చిపోయాడు.
    "పిచ్చిమొద్దులా వుండే సుందరి కేమిటి ఈ అదృష్టం అనుకుని నవ్వుకుంటున్నావు గదూ" అంది తార చనువుగా వచ్చి అతని ప్రక్కన సోఫాలో కూర్చుంటూ "కాదనకు, నీ మొహమే చెప్తుంది నీ ఆలోచన."
    "కాదనను. ఇప్పుడు నేను నీకు పిచ్చి మొద్దులా కనిపిస్తున్నా కాబోలు అనుకుంటుంటే నవ్వు వచ్చింది." సారధి నవ్వుతూ అన్నాడు.
    "ఛా. అలా ఎందుకనుకుంటాను. ఈరోజు నాలుగు రూపాయలు సంపాదించానని అంతలో పాత సంగతులు మరచి పోయాననుకున్నావా! ఆ రోజులు అప్పటి మా కష్టాలలో ఆదుకున్న నీ సహాయం మరచి పోయానా" నొచ్చుకున్నట్టు అంది తార.
    "నేనేదో సరదాకి అంటే అంత సీరియస్ గా మాట్లాడేస్తూన్నావేమిటి?"
    "రా, భోంచెద్దాం. ఆకలేస్తుంది. తరువాత మాట్లాడుకుందాం" అంది తార లేచి నిలబడి.
    "అబ్బే, భోజనం ఎందుకు, రూముకి వెళ్ళి చేస్తాను. క్యారియర్ వచ్చి వుంటుంది."
    "అదేమిటి అన్నిటికీ అంత మొహమాట పద్తున్నావ్. ఎవరో క్రోత్తవాడిలా. ఇదివరకు ఎన్నిసార్లు మా ఇంటిలో భోజనం చెయ్యలేదు. రావోయి బాబూ, ఆకలేస్తుంది." అంటూ నడవడం ఆరంభించింది తార. సారధి ఇంకేమనకుండా వెనకాలే బయల్దేరాడు.
    నిజమే, డబ్బు అవసరం వున్నప్పుడల్లా ఎదురింటిలో వుండే సారధి దగ్గర పది, పదిహేను అప్పుగా తీసుకెళ్తుండేవాడు సుందరి తండ్రి. దానికి కృతజ్ఞతగా పండగలూ, పబ్బాలు, వచ్చినప్పుడల్లా భోజనానికి రమ్మని బలవంతం పెడ్తుండేవాడు. హోటలు మెతుకులతో నోరు చచ్చిపోయిన సారధికి వాళ్ళింటిలో పచ్చడి , చారు మెతుకులే అయినా ప్రాణం లేచి వచ్చినట్లుండేది.
    డైనింగ్ టేబిల్ దగ్గిర ఓ కుర్చీ జరిపి "రా, కూర్చో" అంది తార. తార డైనింగ్ రూములోకి రావడం చూసి వంటవాడు కునికిపాట్లు పడుతున్నవాడల్లా లేచి నిల్చున్నాడు. "పంతులు గారు, వడ్డించండి. ఈయనకి కూడా" అంది.
    నిగనిగలాడుతున్న సన్ గ్లాస్ డైనింగ్ టేబిల్ , ఎనమండుగురు కూర్చోటానికి కుర్చీలు, ఫ్రిజ్ నాలుగయిదు రకాల డిన్నర్ సెట్లు, టీ సెట్లతో గాజు బీరువాలు, కప్ బోర్డులు అన్నీ చక్కగా అమర్చి వున్నాయి. భోజనం వడ్డించాడు వంటవాడు. తార ఏవేవో మాట్లాడుతుంది అన్నింటికి పరధ్యనంగానే జవాబు చెప్తున్నాడు సారధి.
    సుందరి .....సుందరిని ఆమె కోరినప్పుడు తను పెళ్ళాడి వుంటే .....అన్న ఆలోచన తొంగిచూసింది. సారధికి ఎందుకో ఆ ఊహ వచ్చిన మరుక్షణంలోనే సారధికి నవ్వు వచ్చింది. తనను పెళ్ళాడి వుంటే సినీనటి ఎలా అయ్యేది!! మాములుగా అందరి భార్యలలాగే పిల్లల్ని కంటూ, వంట వండుతూ.... ఇంట్లో నుంచి లేచిపోవడం మంచి పనే చేసింది. కొన్నాళ్ళు కష్టపడితే పడింది. యిప్పుడు లక్షలు అర్జిస్తుంది. ఈ ఇల్లు వాకిలి, ఈ సామానంతా చూస్తుంటే సుందరి బాగా అర్జిస్తున్నట్టుంది! ఎందు కార్జించదూ? రెండు ,మూడేళ్ళుగా నయనతార లేని సినిమా లేదు. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ అవుతున్నాయి..... సంపాదన కేం లోటు!
    మొదటి సినిమాతోనే నయనతారకి బ్రహ్మాండమైన పేరొచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. జీవించింది. ఆమె పెదవి కదపకుండా, కళ్ళనీళ్ళు కార్చకుండా హాలు హలంతటిని కన్నీళ్లు కార్పించింది. ముసలివాడిని పెళ్ళి చేసుకుని మూన్నాళ్ళ ముచ్చటగా తీరిపోయిన ఆమె సుమంగళీత్వం తరువాత పరిస్థితుల కేదురీదలేక, కోరికలని అణచుకోలేక ఓ యువకుడి వలలో పడి నాశనం అయి , గత్యంతరం లేక వేశ్యగా మారిన ఆమె పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అని పత్రికలు, ప్రజలు పొగిడారు. ఆ పాత్రలో ఆమెని చూసి కంట తడి పెట్టని వారు లేరు. కేవలం కళ్ళతోనే ఎక్స్ ప్రెఫ్ చేసి చూపించిన ఆమెకి ' నయనతార' అన్న పేరు వచ్చింది. ఆ పేరే స్థిరపడింది. ఆ చిత్రం శతదినోత్సవాలు అన్నిచోట్ల చేసుకుంది. అనేక అవార్డులు గెలుచుకుంది. మరి రెండు భాషల్లో ఆమె నాయికగా తీశారు. అంతే! నయనతార ఓవర్ నైట్ బిజీ తార అయి కూర్చుంది. కాంట్రాక్స్ మీద కాంట్రాక్టు లు వచ్చి పడ్డాయి. ఆ ఏడాదిలో కనీసం ఎనిమిది చిత్రాల్లో నటించింది. అన్నీ విజయవంతమయ్యాయి. అవే ఏమిటి ఇప్పటివరకు ఆమె నటించిన ఏ చిత్రమూ ఫేల్ అవలేదు. రోజురోజుకి ఆమె డిమాండ్ పెరుగుతుంది తప్ప తరగడం లేదు ------ ఇవన్నీ నయనతార గురించిన వివరాలు ----ఏ సినిమా పత్రిక చూసిన తెలుస్తుంది కనక సారదికీ తెలిశాయి.
    అయితే సుందరే నయనతార అన్న నిజం తెల్సిన దగ్గరనించి అతనింకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాడు. అడుగడుగునా ఎన్నో సందేహాలు ---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS