"ఓబులూ చెపుతున్నా విను. కొండవీటి తల్లి శతా కోటి ఓషధుల్ని భరిస్తోందా? అందులో సంజీవని కూడా వుందిరా సన్నాసి. అదేదో మనకు తెలియదు. అందుకని కనపడ్డ ప్రతి క్రొత్త మొక్కనీ ఒక ఆకును త్రుంచుకుని తిను. అది కూడా పూర్ణిమనాడు రాత్రి పది గంటల తర్వాత, కోడి కూతకు ముందు జరిగిపోవాల! అంటూ ముగించాడు సన్యాసి.
ఆ సలహాతో ఏనుగెక్కినంత బలమొచ్చింది వోబులుకి. ఖర్చులేని వైద్యం. కాని అడవిలో (కొండవీటి కొండలలో ఉన్న రిజర్వ్ ఫారెస్టు) అర్ధరాత్రుళ్ళు తిరగటమంటే భయమేసింది.
అయినా తప్పదు కనక అలా ప్రతి పూర్ణిమనాటి రాత్రి తిరగటం ప్రారంభించాడు.
ఆరునెలల్లో అతని ఉబ్బస వ్యాధి నిమ్మళించింది. ఇది ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో అద్భుత రసంతో కూడిన కథగా వ్యాపించింది.
అక్కడనుండీ ఓబులు జీవితంలో ఊహించని ఔన్నత్యం కనబడింది.
తన వాటా క్రింద వచ్చిన ఎకరం ఎర్రనేలలో ఉన్న మామిడి చెట్ల క్రింద ఓ కుటీరాన్ని నిర్మించాడు. ఓ నాగ శిలను స్థాపించి పసుపూ కుంకుమా పూశాడు. పూజలు చేయటం ప్రారంభించాడు.
దాంతో వోబులు ఆశ్రమ వాసియయిన మునీశ్వరుడుగా పేరు పొందటం ప్రారంభించాడు.
ఒక సంవత్సరం గడిచేసరికి అతని గడ్డాలు, మీసాలతోపాటు పేరుకూడ ధారాళంగా పెరిగిపోయింది.
ఓబయ్య విభూది అంటే అన్ని రోగాలకు మందుగా చలామణి కావటం మొదలెట్టింది.
నేనెరిగినవాళ్ళు దూరప్రాంతాలవాళ్ళు ఆ విభూతిని తెచ్చుకుని భక్తిగా ఉపయోగించటం చూచాను. అత్యద్భుతమయిన యోగశక్తులూ, విచిత్రమయిన మనస్తత్వాలూ వున్న భారతదేశంలో ఏది జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు కనుక నేను దాన్ని గురించి అంతగా ఆలోచించలేదు.
అయితే ఓసారి ఓబులుతో మాట్లాడడం పడింది. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నాడు మధ్యాహ్నంపూట. మధ్యాహ్నం వేళ అక్కడ ఇతరులెవరూ ఉండరాదన్న నియమం ఉండేది. ఆ పరిసరాలను, వాటిని స్వర్గ సౌందర్యాన్ని చూడటానికి అదే సరైన సమయం. ఓ పూట వెళ్ళాను. విద్యాసంస్కారం ఇసుమంతయినా లేని ఓబులు బిళ్ళగోచీ పోసి వైష్ణంచు ధోవతి కట్టాడు. పండిత శాలువా పల్లెవాటు వేశాడు. తెగ బారెడు విభూతి పట్టులమీద కుంకుమబొట్టు రూపాయి బిళ్ళంతకన్నా పెద్దది పెట్టాడు.
"రా సామీ!" అన్నాడు లోగడ మా కుటుంబంతో అతనికున్న సాన్నిహిత్యాన్ని గుర్తుతెచ్చుకుని కాబోలు. ఈ సామీ అనేది అరవదేశంలో ఉపయోగించేది కాదు. తెలుగుదేశంలో విద్యాసంస్కారంలేనివారు స్వామీ అనేదానికి బదులు వాడేది. మరోమాట సాములూ అని.
వెళ్ళి కూర్చున్నాను ఓ రాయి మీద. దగ్గరలో నేలమీద చతికిలబడేందుకు సిద్ధమయ్యాడు ఓబులు.
"ఆ రాయి మీద కూర్చో ఓబులూ" అన్నాను. అతను ఇప్పుడున్న పరిస్థితిని మర్చిపోకుండా.
"ఫరవాలేదు బాబయ్యా! అప్పుడూ, ఇప్పుడూ బాపనోల్లే మా కులగురువులు. గురువు దైవంతో సమానం గదా!" అన్నాడు ఓబులు వినయంగా.
"ఓబులూ బాగా నేర్చావోయ్. నీవిచ్చే మందు గురించి నేనూ విన్నాను. ఎలా సంపాదించావో కాని అది గొప్ప విశేషమే!" అన్నాను ప్రశంసగా.
"చెపుతాను గాని బాబయ్యా! నాకు మొదటినుండీ ఒక సందేహముండేది. అది మీరే చెప్పాల. మీరు ఉపనిషత్తులూ, పురాణాలూ సదివినోళ్ళు గదా!" అన్నాడు.
"అదేమిటో చెప్పు" అన్నాను.
"త్రిమూర్తుల్లో ఎవరు గొప్పోల్లు?" అంటూ ఓ ఆటంబాంబు నా నెత్తిన పడవేశాడు.
నేను తల వొంచుకుని ఆలోచించటం ప్రారంభించాను. ఇలాంటి ప్రశ్న నాకెప్పుడూ ఉదయించలేదు. ఓబులుకి యీ సందేహమెందుక్కలిగిందో! విచిత్రం.
"నన్ను సూచేందుకొచ్చిన ఓ బత్తురాలడిగితే త్రిమూర్తులు ముగ్గురూ మూలగూరమ్మ శత్తి కడుపున పుట్టినోల్లే గనక ముగ్గురూ సమానమే అని చెప్పారు. రైటా తప్పా బాబయ్యా" అంటూ శలవిచ్చాడు నన్ను వొడ్డున పడేస్తూ.
