నోటి వెంబడి మాట రానట్లు చూస్తోంది సునయన.
"...ఎందుకంటే, వాళ్ళ సంగతులు ఇంకొన్ని నాకు తెలుసు. రండి! వెళ్దాం." అని ఆగి,
"మీకేం భయం లేదు. నన్ను నమ్మండి" అన్నాడు.
కలలోలాగా అతని వెనుకే నడిచింది సునయన.
అతను వాళ్ళని సమీపించగానే క్లుప్తంగా "ఐ ఎక్స్ పెక్ట్ నో ట్రబుల్" అన్నాడు. అది విన్నపంలాగా లేదు. ఆదేశంలాగా వుంది. ఆ తర్వాత గొంతు తగ్గించి, తమిళంలో ఏదో త్వరత్వరగా చెప్పాడు.
"కనీసం ఆ అమ్మాయిని అపాలజీ చెప్పమను" అన్నాడు ఆ ఇద్దరిలో ఒకడు, వరదరాజన్ మూలుగుతున్నట్లు అయిష్టంగా.
"ఫార్మాలిటీస్ ఫార్మలిటీస్!" అని విసుక్కున్నాడు అతను.
"తప్పయిపోయిందని చెప్పెయ్" అన్నాడు సునయతో.
"ఈ 'ఎక్టసీ' ఎక్కడ నుంచి తెస్తున్నావ్?" అన్నాడు ఆరుముగం అనే అతను.
అయోమయంగా చూసింది సునయన.
"హాంగ్ కాంగ్ నుంచేనా?"
అవునని చెప్పమన్నట్లుగా నెమ్మదిగా మోచేత్తో పొడిచాడు అతను.
"డెస్టినేషన్ ఎక్కడికి?" ఫ్రాంక్ ఫర్టేనా?"
"అవును"
"నీ పేరేమిటి?"
"సునయన"
"ఏం చేస్తుంటావు?"
"ఎయిర్ హోస్టెన్"
"పర్మనెంట్ రెసిడెన్స్?"
"బోస్టన్, మాసాఛూసెట్స్ - యూఎస్ ఏ.
"నువ్వు పాత నేరస్తురాలివి కావు. అందుకని ప్రథమ తప్పిదంగా పరిగణించి వదిలేస్తున్నాం" అన్నాడు ఆరుముగం అధికార దర్పం ఒలికిస్తూ.
"ఇకముందు జాగ్రత్తగా వుండు" అన్నాడు వరదరాజన్ ఉదారంగా.
'అతను' సునయన చేతిని గట్టిగా ఒత్తి, కన్నుగీటాడు.
ఆరుముగం, వరదరాజన్ ఇద్దరూ బ్యాగ్ తో సహా వెళ్ళిపోయారు.
"సమస్య పరిష్కారమైపోయినట్లేనా?" అన్నాడు అతను నవ్వుతూ.
"మీరు..." అంది సునయన సంశయంగా.
"నా పేరు అభిరాం"
ఇతని పేరు అభిరామా?
అసలు ఇతను ఇండియన్ లాగానే లేడే!
"రాసిపెట్టి ఉంటే - మళ్ళీ కలుస్తాం. ఎప్పుడో - ఎక్కడో! అన్నాడు 'అభిరాం' చేసి వెళ్ళిపోతూ.
పేరే కాదు.
ఫిలాసఫీ కూడా ఇండియనే!
కానీ అతను ఇండియన్ కాడు.
మరెవరు?
* * * *
"పరమాత్మా!" అని చిన్నగా మూలిగి, కళ్ళు తెరిచాడు స్వామీజీ.
ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న సునయన అభిరాం ఆలోచనలలో నుంచి బయటపడి, అప్రయత్నంగానే సూరజ్ వైపు చూసింది. పరిసరాల ధ్యాసే లేకుండా, ఇంకా యోగసమాధి స్థితిలో ఉన్నవాడిలాగే కూర్చుని వున్నాడు సూరజ్!
"ఇందాకే ఈ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసి వుంటే బాగుండేది. అప్పుడు మళ్ళీ ఇట్లా చెబితే పాసెంజర్సు ఎట్లా రియాక్ట్ అవుతారో!" అన్నాడు కో పైలట్ కొంచెం వర్రీడ్ గా.
"నిజమే! ఇందాక విమానానికి ప్రమాదం తప్పిందని చెప్పినప్పుడే ఇది కూడా చెప్పేసి వుంటేనే బాగుండేది. కానీ అప్పటికి ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కదా!" అన్నాడు పైలట్.
అని చెప్పి, 'ఇప్పుడు చెప్పబోయే న్యూస్ ఎలాంటి పదాలతో కూడి వుండాలా?' అని ఆలోచించడం మొదలెట్టాడు అతను.
* * * *
నాన్ స్టాఫ్ గా అరుణని గురించే ఆలోచిస్తూ వున్నాడు సూరజ్. అది ఒక అలవాటుగ మారిపోయింది అతనికి.
అలవాటా? కాదు కాదు.
ఒక వ్యసనంగా మారింది.
తనకి వేరే ఇంకే వ్యసనాలు లేవు - కనీసం ఇప్పటిదాకా!
అరుణ-సూరజ్.
సూర్యుడు-అరుణవర్ణం
పేర్లంటే అట్లా కలివిడిగా కలిసిపోయి ఉండాలి.
జీవితంలో కలిసే యోగం ఉందో లేదో గానీ పేర్లు మాత్రం కలిశాయి.
కలిసి ఉందామని ఎంత దీనంగా రిక్వెస్టు చేశాడు తను! అది కుదరకపోతే, కనీసం కొద్దిగా టైము ఇమ్మని ఎంతగా ప్రాధేయపడ్డాడు!
"అట్లా ఒక్కసారిగా కట్ చేసేసి నాకు దూరమైపోకు అరుణా! నిన్ను మర్చిపోవడానికి ఒక్క మూడు నెలలు టైము ఇవ్వు"
తప్పు! తప్పు! తప్పు!
తప్పు చేశాడు తను! వాక్యనిర్మాణం అట్లా ఉండి ఉండకూడదు.
మర్చిపోవడమేమిటి?
అరుణని గనుక తను మర్చిపోతే తనని తాను మర్చిపోయినట్లే!
'మర్చిపోవడానికి' అనే ఆ పదానికి బదులుగా 'ఈ షాక్ లో నుంచి కొద్దిగా కోలుకోవడానికి' అని ఉండాల్సింది తను.
అరుణని 'మర్చిపోవడం!'
ఆ ఆలోచనే ఎంత అసహజంగా ఉందీ?
సమయానికి సరైన పదాలు ఎందుకు తట్టవూ?
తన మాటలతోటీ చేతల తోటీ అరుణని ఎందుకు సరిగా ఇంప్రెస్ చేయలేకపోయాడు?
"నన్ను మర్చిపో" అని అరుణ అనేయగానే తను విషాదంగా నవ్వి "నిన్ను మర్చిపోవడమా అరుణా?" అని ఎంతో దిగులు పలికిస్తూ అని వుండాల్సింది.
కానీ తనేం అన్నాడు?
"ఏమిటీ?" అన్నాడు- ఇంకేమనాలో తోచనట్లుగా.
పోనీ-
మాటలు కాకపోతే మానె, చేతలు కూడా చేతకాకపోతే ఎట్లా?
"నన్ను మర్చిపో!" అని అరుణ అంత ఖరాఖండిగా చెప్పగానే, తను చటుక్కున ఆమె పాదాలమీద పడిపోయి వుండవలసింది.
"నాకు ప్రేమ భిక్ష పెట్టు అరుణా!" అని అడిగి ఉండవలసినది.
మరీ ఫిల్మీ డైలాగులాగా ఉండేదా?
కానీ - తను ఆమె పాదాలు పట్టుకుని ప్రసన్నురాలిగా చేసుకుని వుండవచ్చుగా.
అలా ఎందుకు చేయలేదూ?
తను మొగాడు కాబట్టా?
శ్రీకృష్ణుడంతటివాడు సత్యభామ పాదాలు పట్టుకోలేదా? కాలితాపు తినలేదా?
తను కృష్ణుడిని మించిన మొగాడా ఏం?
మొగాడంటే గుర్తొచ్చింది. చాలామంది మొగాళ్ళు మనసులో నిజమైన ప్రేమ లేకుండానే ఆడపిల్లలని మాటలతో మాయ చేసేసి వశపరుచుకుంటారుట కదా!
ఈ లోకంలో నిజమైన ప్రేమ కథలకంటే కూడా ఇట్లాంటి మాటలూ చేతల వ్యవహారాలతో ముంచేయడమే ఎక్కువ అని అంటారు కదా!
నిజం ప్రేమకు వాల్యూ లేనే లేదు! నిజంగానే!
తను కూడా అసలు సిసలైన మొగాడిలా ఆ అమ్మాయిని మొదట్లో కల్లబొల్లి కబుర్లతో వశపర్చేసుకుని, ఆ తర్వాతే తన పవిత్ర ప్రేమని ప్రకటించాల్సింది.
లేకపోతే -
